కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మా అమ్మానాన్నల నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి?

మా అమ్మానాన్నల నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి?

 మీరు తెలుసుకోవాల్సినవి

 మీరు ఎంత నమ్మకంగా ఉంటే అంత నమ్మకాన్ని సంపాదించుకుంటారు. మీ అమ్మానాన్నలు పెట్టే నియమాలకు లోబడడాన్ని అప్పు తీర్చడంతో పోల్చవచ్చు. విధేయత చూపించే విషయంలో మీరు మీ అమ్మానాన్నలకు అప్పు ఉన్నారు. మీరు ఎంత నమ్మకంగా దాన్ని ‘చెల్లిస్తే’ మీరు వాళ్లనుండి అంత ఎక్కువ ‘రుణాన్ని’ (లేదా స్వేచ్ఛను) పొందే అవకాశం ఉంటుంది. కానీ వాళ్లు పెట్టిన నియమాల్ని మీరు పాటించకపోతే, వాళ్లు మీకిచ్చే స్వేచ్ఛను తగ్గించవచ్చు.

 నమ్మకం సంపాదించుకోవడానికి సమయం పడుతుంది. మీ అమ్మానాన్నలు మీకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలంటే మీరు బాధ్యతగా ప్రవర్తించాలి.

 నిజజీవిత అనుభవం: “టీనేజీలో ఉన్న నేను ఎలా ఉండాలని మా అమ్మానాన్నలు కోరుకుంటారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ల ముందేమో వాళ్లు కోరుకుంటున్నట్టు ఉంటూ, వాళ్లు లేనప్పుడేమో నాకు నచ్చినట్టు ఉండేవాడిని. అందుకే వాళ్లు నన్ను పెద్దగా నమ్మేవాళ్లు కాదు. అయితే వాళ్లను మోసం చేస్తూ ఎక్కువ స్వేచ్ఛను సంపాదించలేనని కొంతకాలానికి నాకు అర్థమైంది. నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే మీరు ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి.”—క్రేగ్‌.

 మీరు ఏమి చేయవచ్చు?

 బాధపడాల్సి వచ్చినా నిజమే చెప్పండి. ప్రతీఒక్కరు పొరపాట్లు చేస్తారు, కానీ వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్తే (లేదా నిజం బయటికి రాకుండా కొన్ని విషయాలు దాచిపెడితే) మీ అమ్మానాన్నలకు మీపై ఉన్న నమ్మకం పోతుంది. అదే గనుక, ఎట్టి పరిస్థితుల్లో మీరు అబద్ధం చెప్పరనే పేరు సంపాదించుకుంటే, చేసిన పొరపాట్లను ఒప్పుకునేంత పరిణతి మీకుందని మీ అమ్మానాన్నలు గుర్తిస్తారు. అలాంటివాళ్లే నమ్మకాన్ని సంపాదించుకుంటారు.

 “పొరపాట్లు చేసినంత మాత్రాన మీపై ఉన్న నమ్మకం పోదు. వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నించిన ప్రతీసారి మీపై నమ్మకాన్ని పోగొట్టుకుంటారు.”—ఆనా.

 బైబిలు ఇలా చెప్తోంది: “మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం.”—హెబ్రీయులు 13:18.

  •   ఆలోచించండి: మీరు ఎక్కడికి వెళ్తున్నారని, ఎందుకు వెళ్తున్నారని మీ అమ్మానాన్న అడిగితే ఏమీ దాచకుండా అంతా నిజమే చెప్తారా? లేదా ఎక్కడికి వెళ్లారని, ఎందుకు వెళ్లారని మీ అమ్మానాన్న అడిగితే వాళ్లకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెడతారా?

 బాధ్యతగా ఉండండి. ఇంట్లో పెట్టే నియమాలన్నీ పాటించండి. మీ పనులు వెంటనే పూర్తిచేయండి. టైం పాటించండి. మీ హోమ్‌వర్క్‌లు గుర్తుంచుకొని పూర్తిచేయండి. చెప్పిన టైంకల్లా ఇంటికి రండి.

 “స్నేహితులతో కలిసి బయటికి వెళ్లడానికి మీ అమ్మానాన్న అనుమతి ఇచ్చి, రాత్రి 9:00 కల్లా ఇంట్లో ఉండమని చెప్తే, 10:30కి ఇంటికొచ్చి ఇంకోసారి కూడా మీ స్నేహితులతో బయటికి వెళ్లడానికి మీ అమ్మానాన్న అనుమతి ఇవ్వాలని ఆశించకండి.”—రైయన్‌.

 బైబిలు ఇలా చెప్తోంది: “ప్రతీ వ్యక్తి తన బాధ్యత అనే బరువు తానే మోసుకోవాలి.”—గలతీయులు 6:5, అధస్సూచి.

  •   ఆలోచించండి: టైం పాటించడంలో, పనులు పూర్తి చేయడంలో, నచ్చినా నచ్చకపోయినా నియమాల్ని పాటించడంలో మీకు ఎలాంటి పేరు ఉంది?

 ఓపిగ్గా ఉండండి. ఒకవేళ మీ అమ్మానాన్నల నమ్మకాన్ని మీరు పాడు చేసుంటే, దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి సమయం పడుతుంది. ఓపిగ్గా ఎదురుచూడండి.

 “నాకు ఒక వయసు వచ్చాక కూడా అమ్మానాన్న నాకు ఎక్కువ బాధ్యతలు అప్పగించనప్పుడు చిరాకు అనిపించింది. వయసు పెరిగినంత మాత్రాన పెద్దవాళ్లం అయిపోయినట్లు కాదని నేను గుర్తించలేకపోయాను. నాకు నిరూపించుకునే అవకాశం ఇవ్వమని మా అమ్మానాన్నల్ని అడిగాను. సమయం పట్టినా వాళ్ల నమ్మకాన్ని పొందగలిగాను. వయసుతో పాటు నమ్మకం పెరగదు, మన పనులే మనపై నమ్మకాన్ని పెంచుతాయని తెలుసుకున్నాను.”—రేచల్‌.

 బైబిలు ఇలా చెప్తోంది: “మీరేమిటో రుజువు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి.”—2 కొరింథీయులు 13:5.

  •   ఆలోచించండి: మీ అమ్మానాన్నల నమ్మకాన్ని సంపాదించుకునేలా (లేదా పోగొట్టుకున్నదాన్ని తిరిగి సంపాదించుకునేలా) మిమ్మల్ని మీరు “రుజువు చేసుకోవడానికి” ఏమేమి చేయవచ్చు?

 టిప్‌: లక్ష్యం పెట్టుకోండి. అది టైం పాటించడం గురించి కావచ్చు, లేదా పనుల్ని పూర్తిచేయడం, చెప్పిన టైంకల్లా ఇంట్లో ఉండడం, ఇంకేదైనా కావచ్చు. మీరు ఏ విషయం పాటించాలని నిర్ణయించుకున్నారో మీ అమ్మానాన్నలకు చెప్పి, వాళ్ల నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అడగండి. ఆ తర్వాత, బైబిల్లోని ఈ సలహాను పాటించడానికి తీవ్రంగా కృషిచేయండి: ‘మీ పాత వ్యక్తిత్వాన్ని వదిలేయండి. ఆ వ్యక్తిత్వం మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉంది.’ (ఎఫెసీయులు 4:​22) రోజులు గడిచేకొద్దీ మీలో వస్తున్న మార్పును మీ అమ్మానాన్న ఖచ్చితంగా గుర్తిస్తారు!