యువత అడిగే ప్రశ్నలు
నేను ఎంత బాధ్యతగా ఉన్నాను?
మీకు మీరే పరిశీలించుకోండి!
నాకు ఈ కింద లక్షణాలు ఎప్పుడూ ఉంటాయి, ఎక్కువసేపు ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటాయి, అస్సలు ఉండవు.
నిజాయితీ
ఆధారపడదగిన వ్యక్తిగా ఉండడం
సమయపాలన
కష్టపడే గుణం
క్రమబద్ధంగా జీవించడం
సహాయం చేయడం
న్యాయంగా ఉండడం
గౌరవప్రదంగా ఉండడం
శ్రద్ధ
వీటిలో ఏ లక్షణాల్ని మీరు బాగా చూపిస్తారు?
ఆ లక్షణాల్ని అలానే మంచిగా చూపిస్తూ ఉండండి.—ఫిలిప్పీయులు 3:16.
ఏ లక్షణాల కోసం మీరు బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది?
ఆ లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి ఈ కింద సమాచారం మీకు సహాయం చేస్తుంది.
బాధ్యతగా ఉండటం అంటే ఏమిటి?
బాధ్యత గల ప్రజలు ఇంట్లో, స్కూల్లో, సమాజంలో తమ పనులను చక్కగా చేస్తారు. తాము చేసే పనులకు తర్వాత తామే బాధ్యత వహించాలని వాళ్లకు తెలుసు. అందువల్ల వాళ్లు ఏదైనా తప్పు చేస్తే, దాన్ని ఒప్పుకుంటారు. అంతేకాకుండా క్షమాపణ అడిగి ఆ తప్పును సరిచేసుకోవడానికి కృషి చేస్తారు.
బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.” —గలతీయులు 6:5.
నేనెందుకు బాధ్యతగా ఉండాలి?
బాధ్యతగల వ్యక్తి అతను లేదా ఆమెకున్న సామర్థ్యాలను తెలివిగా ఉపయోగిస్తారు. అందుకే ఇతరులు వాళ్లను గౌరవిస్తూ, పెద్దవాళ్లలా చూస్తూ, స్వేచ్ఛను మరెన్నో విలువైన అవకాశాలను ఇస్తారు.
బైబిలు ఇలా చెప్తుంది: “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? వాడు రాజుల యెదుటనే నిలుచును.”—సామెతలు 22:29.
బాధ్యతగల వ్యక్తి ఉదారంగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి మంచి స్నేహితులు దొరుకుతారు. ఆ స్నేహాలు చాలా సంతృప్తిని ఇచ్చేవిగా కూడా ఉంటాయి.
బైబిలు ఇలా చెప్తుంది: “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును.” —లూకా 6:38.
బాధ్యతగల వ్యక్తుల్లో ఏదైనా సాధించామనే సంతృప్తి, సరైన గర్వం ఉంటాయి. దానివల్ల వాళ్లకు చక్కని ఆత్మ విశ్వాసం వస్తుంది.
బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” —గలతీయులు 6:4.
నేను మరింత బాధ్యతగా ఎలా ఉండొచ్చు?
ఈ కిందున్న మాటలు ఈ ప్రశ్నకు జవాబును ఇవ్వడానికి సహాయం చేస్తాయి. ఇక్కడ చెప్తున్న ఎవరి మాటలతో మీ భావాలు సరిగ్గా సరిపోతాయి?
“నన్నింకా చిన్నపిల్లలా చూడటం నాకు చాలా చిరాకుగా ఉంటుంది, ఎందుకంటే గంటకొకసారి నేనెక్కడ ఉన్నానో, ఏమి చేస్తున్నానో మా అమ్మనాన్నలు తెలుసుకుంటారు.”—కెర్రి.
“నేను నా స్నేహితులతో బయటకు వెళ్లడానికి నా తల్లిదండ్రులు అస్సలు అడ్డుచెప్పరు.” —రిచర్డ్.
“నా వయసులో ఉన్న తోటి పిల్లలు చేసే పనులు చూసినప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు అలా చేయనివ్వరని ఆలోచిస్తాను.”—యాన్.
“నాకు ఇష్టం వచ్చిన పని చేయడానికి నా తల్లిదండ్రులు ఏమాత్రం అడ్డుచెప్పరు. నాకు ఇంత స్వేచ్ఛను ఇచ్చినందుకు వాళ్లకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.”—మారినా.
ఒక్క మాటలో: కొంతమంది యౌవనస్థులకు ఇతరులకన్నా ఎక్కువ స్వేచ్ఛ ఉంది. ఎందుకీ తేడా?
వాస్తవం: మీరు ఎంత నమ్మకం సంపాదించుకుంటే మీకంత స్వేచ్ఛ దొరుకుతుంది.
ఉదాహరణకు, పైన చెప్పిన యౌవనస్థుల్లో ఇద్దరు ఏమి చెప్పారో గమనించండి.
రిచర్డ్: “నాకున్న స్వేచ్ఛను నేను సరిగ్గా ఉపయోగించుకుంటానో, లేదో అని మొదట్లో నా తల్లిదండ్రులు భయపడేవాళ్లు. కాని నాకున్న స్వేచ్ఛను బాధ్యతగా ఉపయోగించడం చూసి ఇప్పుడు వాళ్లు నన్ను నమ్ముతున్నారు. నేను ఎక్కడున్నాను, నేను ఎవరితో వెళ్తున్నాను అనే విషయాల్లో నా తల్లిదండ్రులతో అబద్ధం చెప్పను. నిజానికి, వాళ్లు నన్ను అడగకపోయినా నేనేమి చేయాలనుకుంటున్నానో నా తల్లిదండ్రులతో మాట్లాడతాను.”
మారినా: “నా జీవితమంతటిలో నేను రెండుసార్లే అబద్ధం చెప్పాను. అయితే రెండుసార్లు దొరికిపోయాను. అప్పటినుండి నా తల్లిదండ్రులతో నిజాయితీగా ఉంటున్నాను. ఉదాహరణకు నేను ఎప్పుడు బయటకు వెళ్లినా, ఏమి చేస్తున్నానో, ఎవరితో ఉన్నానో ఇలాంటి వివరాలు నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు వాళ్లు నన్ను ఎంతో నమ్ముతున్నారు.”
మీకు కూడా రిచర్డ్, మారినాలులాగే ఉండాలనుందా? అయితే ఈ కింది విషయాల్లో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి:
మీ ఇంట్లో
ఇంట్లో మీకప్పగించిన పనులను నమ్మకంగా పూర్తి చేస్తున్నారా?
మీ తల్లిదండ్రులు చెప్పిన సమయానికల్లా ఇంట్లో ఉంటున్నారా?
మీ తల్లిదండ్రుల్ని, అక్కచెల్లెల్ని లేదా అన్నదమ్ముల్ని గౌరవిస్తున్నారా?
పైన చెప్పిన విషయాల్లో దేని కోసం మీరు ఇంకా కృషి చేయాలి?
బైబిలు ఇలా చెప్తుంది: “మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి.” —ఎఫెసీయులు 6:1.
మీ చదువులో
మీకిచ్చిన హోమ్‌వర్క్‌ను సమయానికల్లా పూర్తిచేస్తున్నారా?
మంచి మార్కులు సంపాదించడానికి కృషి చేస్తున్నారా?
చక్కగా చదువుకోవడానికి మీకు క్రమమైన మంచి అలవాట్లు ఉన్నాయా?
పైన చెప్పిన విషయాల్లో దేని కోసం మీరు ఇంకా కృషి చేయాలి?
బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానము ఆశ్రయాస్పదము.” (ప్రసంగి 7:12) జ్ఞానం సంపాదించుకోవడానికి చదువు ఎంతగానో సహాయం చేస్తుంది.
మీ పేరు
మీ తల్లిదండ్రులతో, ఇతరులతో నిజాయితీగా ఉంటున్నారా?
డబ్బును జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తున్నారా?
మిమ్మల్ని నమ్మవచ్చు అనే పేరు మీకు ఉందా?
పైన చెప్పిన విషయాల్లో దేన్ని మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంది?
బైబిలు ఇలా చెప్తుంది: “నవీనస్వభావమును ధరించుకొనవలెను.” (ఎఫెసీయులు 4:24) మీ అలవాట్లను మీరు చక్కగా మెరుగుపర్చుకుంటే మీ గౌరవం పెరుగుతుంది.
సలహా: మీరు ఏ రంగంలో మెరుగుపర్చుకోవాలో దాన్ని ఎంపిక చేసుకోండి. ఆ రంగంలో బాగా రాణించిన వాళ్లతో మాట్లాడి సలహా తీసుకోండి. మీరు ఆ లక్షణాల్ని మెరుగుపర్చుకోవడానికి ఏమేమి చేయాలనుకుంటున్నారో రాసుకోండి. ఒక నెలలో ఎంత అభివృద్ధి సాధించారో చూసుకోండి. మీరు సాధించిన వాటిని, చేయలేకపోయిన వాటిని డైరీలో రాసి పెట్టుకోండి. నెల చివర్లో మీరెంత చేయగలిగారో గమనించండి.