కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

సెక్స్‌లో పాల్గొనమని తోటివాళ్లు ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?

సెక్స్‌లో పాల్గొనమని తోటివాళ్లు ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?

 “నేను స్కూల్లో ఉన్నప్పుడు, క్లాస్‌లో ఎవరైనా సెక్స్‌ చేశామని చెప్తే మిగతావాళ్లు కూడా అలానే చేయాలని అనుకునేవాళ్లు. ఎందుకంటే, ఎవ్వరూ వేరుగా ఉండాలని కోరుకోరు కదా.”—ఇలేన్‌, 21.

 కేవలం అందరూ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా సెక్స్‌ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా?

 మీ బాయ్‌ఫ్రెండ్‌ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ బలవంతం చేస్తున్నందుకు సెక్స్‌లో పాల్గొనాలని మీకు అనిపించిందా?

 అలాగైతే, వేరేవాళ్ల వల్ల లేదా మీ సొంత కోరికల వల్ల కలిగే ఒత్తిడిని ఎదిరించి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

 అపోహలు, నిజాలు

 అపోహ: అందరూ సెక్స్‌లో పాల్గొంటున్నారు (నేను తప్ప).

 నిజం: ఒక సర్వేలో, 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో దాదాపు 70 శాతం మంది సెక్స్‌ చేశామని చెప్పారు. అంటే దానర్థం, 30 శాతం కన్నా ఎక్కువ మంది సెక్స్‌లో పాల్గొనలేదు. అది ఏమంత చిన్న సంఖ్య కాదు. కాబట్టి “అందరూ” సెక్స్‌ చేస్తున్నారు అనుకోవడం అపోహ.

 అపోహ: సెక్స్‌లో పాల్గొంటే ప్రేమ పెరుగుతుంది.

 నిజం: కొంతమంది అబ్బాయిలు ఇలా చెప్పే, అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొంటారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత, చాలావరకు అబ్బాయిలు అమ్మాయిలకు బ్రేకప్‌ చెప్పేస్తున్నారు. దాంతో, అప్పటిదాకా అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడు, తనను వదిలేయడు అని ఆశలు పెట్టుకున్న అమ్మాయి షాక్‌కు గురౌతుంది. a

 అపోహ: సెక్స్‌ తప్పు అని బైబిలు చెప్తుంది.

 నిజం: సెక్స్‌ దేవుడు ఇచ్చిన బహుమతి అని, కాకపోతే అది పెళ్లి చేసుకున్న పురుషునికి-స్త్రీకి మధ్య మాత్రమే ఉండాలని బైబిలు చెప్తుంది.—ఆదికాండం 1:28; 1 కొరింథీయులు 7:3.

 అపోహ: బైబిలు చెప్పినవి పాటిస్తే, నా జీవితంలో సంతోషం ఉండదు.

 నిజం: మీరు పెళ్లయ్యేంత వరకు సెక్స్‌లో పాల్గొనకుండా ఆగితే, సంతోషంగా ఉంటారు. ఎందుకంటే, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నవాళ్లకు ఉండే ఆందోళన, తప్పు చేశామనే బాధ, భయాలు మీకు ఉండవు.

 ఒక్కమాటలో: పెళ్లయ్యేంత వరకు సెక్స్‌లో పాల్గొనకుండా ఆగడం వల్ల ఎవరి జీవితాలూ నాశనం కాలేదు. కానీ, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనడం వల్లే నాశనం అయ్యాయి.

 సెక్స్‌ చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

 •   తప్పొప్పుల విషయంలో స్థిరంగా ఉండండి. మెచ్యూరిటీ ఉన్నవాళ్లు “తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ … తప్పొప్పులను గుర్తించగలుగుతారు” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 5:14) వాళ్లు తప్పొప్పుల విషయంలో స్థిరంగా ఉంటారు కాబట్టి, అంత తేలిగ్గా ఒత్తిడికి లొంగిపోరు.

   “నేను సరైనది చేయడానికి చాలా కష్టపడతాను, దానివల్ల నాకు మంచి పేరు ఉంది. నా పేరు పాడయ్యే ఎలాంటి పనీ నేను చేయను.—అలీషియా, 16.

   ఒకసారి ఆలోచించండి: మీకు ఎలాంటి పేరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎవరినో సంతోషపెట్టడం కోసం ఆ పేరు చెడగొట్టుకుంటారా?

 •   నష్టాల గురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు.” (గలతీయులు 6:7) ఒకవేళ సెక్స్‌ చేయాలనే ఒత్తిడికి లొంగిపోతే, మీ జీవితం అలాగే అవతలివాళ్ల జీవితం ఎలా మారిపోవచ్చో ఫాస్ట్‌-ఫార్వర్డ్‌ చేసుకొని ఆలోచించండి. b

   “పెళ్లి కాకుండానే సెక్స్‌లో పాల్గొనడం వల్ల తప్పు చేశామనే బాధ, మిమ్మల్ని ఎవరూ ప్రేమించట్లేదనే భావన కలుగుతాయి. ఇవేకాక గర్భం రావచ్చు, సుఖవ్యాధులు రావచ్చు.”—సియానా, 16.

   ఒకసారి ఆలోచించండి: సెక్స్‌ స్మార్ట్‌ అనే పుస్తకం ఇలా అడుగుతుంది: “మీకు లేనిపోని తలనొప్పి తెచ్చే పనులు చేయమని మీ ఫ్రెండ్స్‌ బలవంతం చేస్తున్నారా? మరి అలాంటివాళ్లతో సమయం గడపడం, ముఖ్యమైన విషయాల గురించి వాళ్ల దగ్గర సలహా తీసుకోవడం అవసరమా?”

 •   సరైన అభిప్రాయంతో ఉండండి. సెక్స్‌ తప్పు కాదు. నిజం చెప్పాలంటే, భార్యాభర్తలు దీన్ని ఆనందించాలని బైబిలు చెప్తుంది.—సామెతలు 5:18, 19.

   “సెక్స్‌ అనేది సృష్టిలో దేవుడు చేసిన అందమైన ఏర్పాటు. మనం దాన్ని ఆనందించాలని, అయితే దాన్ని పెళ్లి అనే ఏర్పాటులో మాత్రమే ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు.”—జెరెమీ, 17.

   ఒకసారి ఆలోచించండి: ఏదోకరోజు మీకు పెళ్లి అవుతుంది, అప్పుడు మీరు సెక్స్‌ని ఆనందించగలుగుతారు. అలాగే పైన చెప్పిన నష్టాలేవీ లేకుండా దాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.

a అన్నిసార్లూ అబ్బాయిలే బలవంతం చేయరు. చాలా సందర్భాల్లో, అమ్మాయిలు కూడా బలవంతం చేస్తారు.

b కొన్ని నష్టాలు ఏంటంటే, పెళ్లి కాకుండానే గర్భం రావచ్చు. అలాగే సెక్స్‌లో పాల్గొన్నవాళ్ల వయసును బట్టి, వాళ్లలో ఒకరు కానీ, ఇద్దరు కానీ మైనర్లైతే చట్టపరమైన సమస్యల్లో కూడా చిక్కుకోవచ్చు.