కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఇష్టమైనవాళ్లు చనిపోతే కలిగే గుండెకోతను నేనెలా తట్టుకోవచ్చు?

ఇష్టమైనవాళ్లు చనిపోతే కలిగే గుండెకోతను నేనెలా తట్టుకోవచ్చు?

 మీ ఫ్రెండ్‌ గానీ, ఇంట్లోవాళ్లు గానీ ఈమధ్య చనిపోయారా? అలాగైతే, ఆ గుండెకోతను తట్టుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

ఈ ఆర్టికల్‌లో …

 నేను మరీ ఎక్కువ బాధపడుతున్నానా?

 చాలామంది, వాళ్లకు ఇష్టమైనవాళ్లు చనిపోతే ఎక్కువ బాధపడతారు, చాలాకాలం బాధపడతారు.

 “నాకు ప్రతీరోజు మా తాతయ్య గుర్తొస్తాడు. ఆయన చనిపోయి రెండు సంవత్సరాలైంది. అయినా, ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది.”—ఒలీవియా.

 “నా లక్ష్యాల్ని చేరుకోమని మా నానమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించేది, తీరా వాటిని చేరుకునే సమయానికి ఆమె లేదు. నా జీవితంలో ఒక్కో మైలురాయి చేరుకుంటున్నప్పుడల్లా, ఆమె లేదన్న బాధ నన్ను తొలిచేస్తుంది.”—అలిసన్‌.

 మీకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు రకరకాల ఫీలింగ్స్‌ కలగొచ్చు. ఉదాహరణకు:

 “మా మామయ్య చనిపోయినప్పుడు నేను షాక్‌లోకి వెళ్లాను, అందులోనే చాలాకాలం ఉండిపోయాను. నాకు బాగా కావల్సినవాళ్లు చనిపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో ఒక పెద్ద ట్రైన్‌ వచ్చి నన్ను గుద్దినట్టుగా నాకు అనిపించింది.”—నదీన్‌.

 “మా తాతయ్య చనిపోయినప్పుడు నాకు ఆయన మీద కాస్త కోపం వచ్చింది. ఎందుకంటే, మేమెంత మొత్తుకున్నా ఆయన తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు.”—కార్లోస్‌.

 “మా తాతయ్య చనిపోయినప్పుడు నేను, మా అక్క తప్ప మా చుట్టాలందరూ వెళ్లారు. ఆయన్ని చివరిచూపు చూడడానికి వెళ్లలేకపోయినందుకు నాకేదో తప్పు చేసినట్టు అనిపించింది.”—ఎడ్రియానా.

 “మా ఫ్యామిలీకి బాగా కావల్సిన ఒక అంకుల్‌-ఆంటీ కార్‌ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ తర్వాత నుండి, మా ఇంట్లో ఎవరు బయటికి వెళ్తున్నా, వాళ్లకు కూడా యాక్సిడెంట్‌ అవుతుందేమో అనే భయం నాకు పట్టుకుంది.”—జేరెడ్‌.

 “మూడు సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ చనిపోయింది. బ్రతికున్నప్పుడే ఆమెతో ఎక్కువ సమయం ఎందుకు గడపలేకపోయానా అని చాలా బాధపడ్డాను.”—జూలియానా.

 కావల్సినవాళ్లు చనిపోతే షాక్‌కు గురవ్వడం, కోపం రావడం, తప్పు చేశామని బాధపడడం, భయం కలగడం, ఎక్కువ సమయం గడపలేకపోయామని బాధపడడం సహజమే. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఫీలింగ్‌ ఏదైనా ఉంటే, అది రానురాను తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. అయితే, ఈలోపు ఆ బాధ నుండి బయటపడడానికి మీరేం చేయవచ్చో చూద్దాం.

 బాధ నుండి ఎలా బయటపడవచ్చు?

 మీ ఫ్రెండ్‌తో మాట్లాడండి. నిజమైన స్నేహితుడు “కష్టకాలంలో … సహోదరుడిలా ఉంటాడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 17:17) మీకు ఏమనిపిస్తుందో ఎవరో ఒకరికి చెప్పడం ద్వారా కావల్సిన హెల్ప్‌ దొరుకుతుంది.

 “బాధపడడం మామూలే. కొన్నిసార్లు మీరు ఒంటరిగా బాధపడొచ్చు, కానీ ఎవ్వరితో మాట్లాడకుండా ఉంటే బాధ చిమ్మచీకటిలా మిమ్మల్ని కప్పేస్తుంది. కాబట్టి ఎవరో ఒకరితో మాట్లాడడం మంచిది.”—ఇవెట్‌.

 చనిపోయినవాళ్ల తీపి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకోండి. ‘మంచిమనిషి తన హృదయంలో మంచివాటిని’ పోగుచేసుకుంటాడు అని బైబిలు చెప్తుంది. (లూకా 6:45, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మీకు ఇష్టమైనవాళ్లతో గడిపిన మధుర క్షణాల్ని డైరీలో రాసుకోవచ్చు, లేదా వాళ్ల ఫోటోలన్నీ కలిపి ఆల్బమ్‌లా తయారుచేయవచ్చు.

 “నా ఫ్రెండ్‌ బ్రతికున్నప్పుడు నాకు నేర్పిన విషయాలన్నీ రాసుకోవాలనుకున్నాను. అలా రాసుకోవడం వల్ల, తను లేకపోయినా తను నేర్పించిన పాఠాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. దానివల్ల నేను నా బాధను తట్టుకోగలిగాను.”—జెఫ్రీ.

 మీ ఆరోగ్యం జాగ్రత్త! వ్యాయామం చేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయని బైబిలే చెప్తుంది. (1 తిమోతి 4:8, అధస్సూచి) మంచి ఆహారం తినండి, ఎక్సర్‌సైజ్‌ చేయండి, కావల్సినంత రెస్ట్‌ తీసుకోండి.

 “బాధలో ఉన్నప్పుడు సరిగా ఆలోచించలేకపోవచ్చు. అందుకే ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. దానికోసం టైంకి తినండి, కంటినిండా నిద్రపోండి.”—మారియా.

 వేరేవాళ్లకు సహాయం చేయండి. “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని బైబిలు చెప్తుంది.—అపొస్తలుల కార్యాలు 20:35.

 “వేరేవాళ్లకు, ముఖ్యంగా మీలాగే కావల్సినవాళ్లను పోగొట్టుకున్న వాళ్లకు ఏదోక సహాయం చేయండి. అలా చేస్తే, మీరే కాదు వేరేవాళ్లకు కూడా బాధలు ఉన్నాయనే సంగతి మీకు గుర్తుంటుంది.”—కార్లోస్‌.

 మీకు ఏమనిపిస్తుందో ప్రార్థనలో చెప్పండి. యెహోవా “ప్రార్థనలు వినే” దేవుడని బైబిలు చెప్తుంది. (కీర్తన 65:2) అలాగే “విరిగిన హృదయంగల వాళ్లను ఆయన బాగుచేస్తాడు; వాళ్ల గాయాలకు కట్టుకడతాడు” అని కూడా చెప్తుంది.—కీర్తన 147:3.

 “మీకు కావల్సిన ప్రోత్సాహాన్ని, మద్దతును ఇవ్వమని యెహోవాను అడగండి. అన్ని రోజులూ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ యెహోవా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు.”—జానెట్‌.

 టైం పడుతుంది, కాబట్టి ఓపిగ్గా ఉండండి. అందరూ ఒకేలా బాధపడరని గుర్తుంచుకోండి. బైబిల్లో యాకోబు అనే అతను, తన కొడుకు చనిపోయాడనుకుని ఏడుస్తూ ఉంటాడు. ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా ‘అతను ఓదార్పు పొందడానికి ఇష్టపడలేదు.’ (ఆదికాండం 37:35) యాకోబులాగే మీకు కూడా బాధ ఎక్కువకాలం ఉంటే, ఆశ్చర్యపోకండి.

 “మా పెద్ద అమ్మమ్మ చనిపోయి 15 సంవత్సరాలైంది. కానీ ఇప్పటికీ, కొన్నికొన్ని విషయాలు చూడగానే ఆమె గుర్తొస్తుంది.”—టేలర్‌.

 మీ చెయ్యి గానీ కాలు గానీ ఫ్రాక్చర్‌ అయిందనుకోండి. అప్పుడు మీకు బాగా నొప్పిగా ఉంటుంది, అంతేకాదు అది బాగవ్వడానికి సమయం పడుతుంది. అయితే ఈలోపు ఆ గాయం మానడానికి ఏం చేయాలో డాక్టర్‌ మీకు సలహా ఇస్తాడు.

 అదేవిధంగా, కావల్సినవాళ్లు చనిపోయినప్పుడు మన మనసుకు తగిలే “గాయం” కూడా మానడానికి టైం పడుతుంది. కాబట్టి ఓపిగ్గా ఉండండి. ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలు పరిశీలించి, వీటిలో ఏవి మీకు బాగా ఉపయోగపడతాయో ఆలోచించండి.