కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)

నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)

 టీనేజ్‌లో ఉన్నవాళ్లు సాధారణంగా మంచి ఆరోగ్యంతో, చలాకీగా, అసలు అలుపే రాదనట్టుగా ఉంటారు. అయితే కొంతమంది యౌవనులు మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్య వల్ల అలా ఉండలేరు. మీ పరిస్థితి కూడా అదేనా? అలాగైతే లోరియా, జస్టిన్‌, నిస చెప్పే మాటలు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వాళ్లు ముగ్గురూ యెహోవాసాక్షులే. కృంగదీసే అనారోగ్యంతో వాళ్లు ఎలా పోరాడగలిగారో మీరే వినండి.

 లోరియా

 నాకు పధ్నాలుగు ఏళ్లు ఉన్నప్పుడు ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి వచ్చింది. 20 ఏళ్లు వచ్చేసరికి నాకు ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు), లూపస్‌, లైమ్‌ వ్యాధులు కూడా వచ్చాయి. ఎప్పుడూ నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తే ఏ పనీ చేయలేము. కొన్నిసార్లైతే నా నడుము నుండి కింద భాగాలు అసలు పని చేయవు. అప్పుడు నేను చక్రాల కుర్చీలోనే ఉండాలి.

 నేను చేత్తో రాయలేను, కనీసం సీసా మూత కూడా తీయలేను. దాంతో అనారోగ్యం వల్ల కలిగే శారీరక బాధకన్నా చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోతున్నాను అనే మానసిక హింసే ఎక్కువగా ఉండేది. నడుస్తున్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు నేనెందుకు వాళ్లలా నడవలేకపోతున్నానని బాధపడేదాన్ని. నేను ఎందుకూ పనికిరానిదాన్నని నాకు అనిపించేది.

 అయితే మా కుటుంబ సభ్యులతో పాటు మా సంఘంలోని యెహోవాసాక్షులు కూడా నాకు సహాయం చేశారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా సంఘంలోని వాళ్లు తరచూ నన్ను చూడడానికి వచ్చేవాళ్లు. దాంతో నేను ఒంటరిదాన్ని అనే ఫీలింగ్‌ తగ్గిపోయింది. కొంతమందైతే సరదాగా చేసుకునే పార్టీలకు కూడా నన్ను పిలిచేవాళ్లు. చక్రాల కుర్చీలో నుండి నన్ను ఎత్తడం, కారులోకి ఎక్కించడం, దించడం ఇవన్నీ కష్టమైనాసరే వాళ్లు నన్ను పిలిచేవాళ్లు.

 ప్రత్యేకించి సంఘంలోని వృద్ధులు నాకు చాలా సహాయకరంగా ఉండేవాళ్లు. ఎందుకంటే అనారోగ్యం ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్లకు బాగా తెలుసు. నేను అందరిలా అన్ని పనులూ చేయలేకపోతున్నానని బాధపడడం మానేసి, నా పరిస్థితిని అర్థంచేసుకుని దానికి అలవాటు పడడానికి వాళ్లు నాకు సాయం చేశారు. కూటాల్లో ఉన్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఈ రెండు సందర్భాల్లోనే నేను చాలా సంతోషంగా ఉంటాను. (హెబ్రీయులు 10:24, 25) ఆ సందర్భాల్లో, నాకెంత అనారోగ్యం ఉన్నాసరే, నేనూ అందరిలాంటిదాన్నే అని నాకు అనిపిస్తుంది.

 మనం సహించడానికి కావాల్సినదేదైనా యెహోవా మనకు ఇస్తాడని నేను గుర్తుంచుకుంటాను. ఉదాహరణకు, బయట మన శరీరం కృశించిపోతున్నా, లోపల మన మనసు రోజురోజుకీ కొత్తగా అవ్వగలదని బైబిలు చెప్తోంది. (2 కొరింథీయులు 4:16) నాకు సరిగ్గా అలానే అనిపిస్తోంది.

 ఆలోచించండి: మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం? మీరు ఆరోగ్యంగా ఉంటే, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు మీరు ఎలా సహాయం చేయవచ్చు?—సామెతలు 17:17.

 జస్టిన్‌

 నేను ఉన్నట్టుండి కింద పడిపోయాను, లేవలేకపోయాను. నా ఛాతి పట్టేసింది, కదల్లేకపోయాను. నన్ను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. నాకు ఏం జరిగిందో డాక్టర్లు మొదట్లో కనిపెట్టలేకపోయారు. కానీ అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత, నాకు లైమ్‌ వ్యాధి వచ్చిందని వాళ్లు నిర్ధారించారు.

 లైమ్‌ వ్యాధి నా నాడీవ్యవస్థను పాడుచేసింది. నిజానికి నాకు లైమ్‌ వ్యాధి ఉందని తెలిసి సంవత్సరాలవుతున్నా, నా శరీరం ఇప్పటికీ వణుకుతుంది, ఆపలేనంతగా కదిలిపోతుంది. ఒక్కోరోజు నా శరీరం లేదా నా వేళ్లు కనీసం కదపడానికి వీల్లేనంతగా నొప్పిపెడతాయి. నా కీళ్లన్నీ తుప్పు పట్టేశాయేమో అనిపిస్తుంది.

 ‘ఈ చిన్న వయసులోనే నేను అనారోగ్యం పాలైపోయానేంటి?’ అని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి. దాంతో నాకు కోపం వచ్చేసేది. నేను రోజూ ఏడుస్తూ, “నాకు ఎందుకిలా జరిగింది?” అని దేవుడ్ని అడిగేవాడిని. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని కూడా నాకు అనిపించింది. కానీ, అప్పుడు బైబిల్లోని యోబు గురించి ఆలోచించాను. తనకు అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో యోబుకు పూర్తిగా తెలియదు, అయినా అతను దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అన్ని సమస్యలు అనుభవించిన యోబు, దేవునికి నమ్మకంగా ఉన్నాడంటే, నేను కూడా ఉండగలనని అనుకున్నాను.

 మా సంఘంలోని పెద్దలు నాకు చాలా సహాయం చేశారు. వాళ్లు నన్ను ఎల్లప్పుడూ పట్టించుకునేవాళ్లు, నా ఆరోగ్యం గురించి నన్ను అడిగేవాళ్లు. ఒక పెద్ద, నాకు తనతో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా, ఏ టైం అయినాసరే తనకు ఫోన్‌ చేయమని చెప్పారు. అలాంటి స్నేహితులను నాకు ఇచ్చినందుకు నేను ప్రతీరోజు యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.—యెషయా 32:1, 2.

 మనం తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కొన్నిసార్లు ఒక వాస్తవాన్ని మర్చిపోతాం. అదేమిటంటే, మనం పడుతున్న బాధను యెహోవా చూస్తున్నాడు! “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును” అని బైబిలు చెప్తోంది. (కీర్తన 55:22) నేను అలా చేయడానికే ప్రతీరోజు ప్రయత్నిస్తున్నాను.

 ఆలోచించండి: మీ ఆరోగ్య సమస్యను సహించడానికి మిమ్మల్ని ప్రేమించేవాళ్లు మీకెలా సహాయం చేయగలరు?—సామెతలు 24:10; 1 థెస్సలొనీకయులు 5:11.

 నిస

 నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు, నాకు మార్ఫన్‌ సిండ్రోమ్‌ ఉందని తెలిసింది. అది కీళ్ల మీద ప్రభావం చూపి వాటిని బలహీనం చేసే ఒక వ్యాధి. ఈ వ్యాధి వల్ల గుండె, కళ్లు, మరితర ముఖ్య భాగాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. నాకు నొప్పి రోజూ ఉండదు, కానీ వచ్చిందంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.

 నాకు ఈ వ్యాధి ఉందని తెలిసినప్పుడు, నేను చాలా ఏడ్చాను. నేను ఆనందంగా చేస్తున్నవేవీ ఇక చేయలేనని చాలా బాధపడ్డాను. ఉదాహరణకు, నాకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. కానీ డాన్స్‌ చేస్తే చాలా నొప్పి వస్తుందని, కనీసం నడవడం కూడా కష్టంగా ఉంటుందని తెలిసినప్పుడు నాకు భవిష్యత్తు గురించి చాలా భయమేసింది.

 మా అక్క నాకు అండగా నిలబడింది. ఆందోళనలో నుండి బయటపడడానికి తను నాకు సాయం చేసింది. నేను భయపడుతూ బ్రతకకూడదని, లేదంటే ఆ భయమే నా జీవితాన్ని మింగేస్తుందని తను చెప్పింది. పట్టుదలగా ప్రార్థించమని కూడా తను నన్ను ప్రోత్సహించింది, ఎందుకంటే నా బాధ గురించి పూర్తిగా తెలిసినవాడు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలవాడు యెహోవా ఒక్కడే అని చెప్పింది.—1 పేతురు 5:7.

 నాకు నిజంగా ప్రోత్సాహాన్నిచ్చిన లేఖనం, కీర్తన 18:6. ఆ వచనంలో, “నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను, నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను” అని ఉంది. నేను యెహోవాకు ప్రార్థించినప్పుడు, బాధను తట్టుకోవడానికి సహాయం చేయమని అడిగినప్పుడు, ఆయన వింటాడని, సహాయం చేస్తాడని నేను నమ్మడానికి ఆ వచనం నాకు సహాయం చేసింది. ఆయన నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు.

 బాధపడడం గానీ, ఏదైనా విషాదకర పరిస్థితి ఎదురైనప్పడు నిరుత్సాహం చెందడం గానీ తప్పుకాదని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అది సహజమే. అయితే మన జీవితం లేదా దేవునితో మనకున్న స్నేహం పాడయ్యేంతగా మనం బాధపడకూడదు. మన సమస్యలకు కారణం దేవుడు కాదు, మన జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చినంత వరకు ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు.—యాకోబు 4:8.

 ఆలోచించండి: మన బాధలకు కారణం దేవుడా?—యాకోబు 1:13.