కంటెంట్‌కు వెళ్లు

మా అమ్మానాన్నలు నన్ను ఎందుకు ఎంజాయ్‌ చెయ్యనివ్వరు?

మా అమ్మానాన్నలు నన్ను ఎందుకు ఎంజాయ్‌ చెయ్యనివ్వరు?

ఈ సన్నివేశాన్ని ఊహించండి:

మీరు ఓ పార్టీకి వెళ్లాలని అనుకుంటున్నారు కానీ మీ అమ్మానాన్నలు మిమ్మల్ని వెళ్లనిస్తారో లేదో ఖచ్చితంగా తెలియదు. అప్పుడు మీరు కిందున్న ఏ పనిని చేయాలనుకుంటారు?

  1.  అడగకుండా—వెళ్లిపోతాను

  2.  అడగను—వెళ్లను

  3.  అడిగి—చూస్తాను

 1. అడగకుండా—వెళ్లిపోతాను

 ఇలా చేయాలని మీరు ఎందుకు అనుకుంటారంటే: మీరు ఎంత స్వతంత్రంగా ఉన్నారో చూపించి మీ స్నేహితులకు గొప్పగా కనబడాలని అనుకుంటారు. మీ తల్లిదండ్రుల కంటే మీకే ఎక్కువ తెలుసని మీకు అనిపిస్తుంది లేదా వాళ్ల నిర్ణయాలపై మీకు గౌరవం ఉండదు.—సామెతలు 14:18.

 ఫలితాలు ఇలా ఉంటాయి: మీ స్నేహితులకు మీరు గొప్పగా కనబడవచ్చు కానీ వాళ్లు మీ గురించి మరో విషయం కూడా తెలుసుకుంటారు, అదేంటంటే—మీరు మోసం చేసే వ్యక్తని. మీరు మీ తల్లిదండ్రులనే మోసం చేస్తే, మీ స్నేహితులను కూడా మోసం చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ విషయం మీ అమ్మానాన్నలకు తెలిస్తే మీరు వాళ్లని మోసం చేసినందుకు బాధపడతారు, తర్వాత మీ మీద మీకే గౌరవం పోతుంది.—సామెతలు 12:15.

 2. అడగను—వెళ్లను

 ఇలా చేయాలని మీరు ఎందుకు అనుకుంటారంటే: మీకు వచ్చిన ఆహ్వానం గురించి ఆలోచించి, అది మీ స్థాయికి తగినట్టుగా లేదని అనుకోవచ్చు లేదా మిమ్మల్ని ఆహ్వానించిన వారితో కలిసి అందులో పాల్గొనాలని మీకు అనిపించకపోవచ్చు. (1 కొరింథీయులు 15:33; ఫిలిప్పీయులు 4:8) మరోవైపు, మీకు వెళ్లాలని ఉన్నా తల్లిదండ్రులను అడిగే ధైర్యం ఉండదు.

 ఫలితాలు ఇలా ఉంటాయి: వెళ్లకూడదని మీరనుకుంటే, మీ స్నేహితులకు బలమైన విశ్వాసంతో సమాధానం చెప్తారు. కానీ ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులను అడగడానికి భయపడి వెళ్లలేకపోతే, మీరు ఇంట్లోనే కూర్చొని, మీరొక్కరే ఎంజాయ్‌ చెయ్యలేకపోతున్నారని బాధపడతారు.

 3. అడిగి—చూస్తాను

 ఇలా చేయాలని మీరు ఎందుకు అనుకుంటారంటే: మీపై మీ తల్లిదండ్రుల అధికారాన్ని గుర్తించి వాళ్ల నిర్ణయాలను గౌరవిస్తారు. (కొలొస్సయులు 3:20) వాళ్లను ప్రేమిస్తున్నారు కాబట్టే వాళ్లకు తెలియకుండా రహస్యంగా ఏదైనా చేసి వాళ్లను బాధపెట్టాలనుకోరు. (సామెతలు 10:1) మీ యథార్థతను నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది.

 ఫలితాలు ఇలా ఉంటాయి: మీరు వాళ్లను ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మీ తల్లిదండ్రులు తెలుసుకుంటారు. మీరు అడిగేవి మంచివేనని వాళ్లకు అనిపిస్తే సరే అని కూడా చెప్పవచ్చు.

మా అమ్మానాన్నలు వద్దని ఎందుకు అంటారు

బీచ్‌లో ఉండే లైఫ్‌ గార్డుల్లాగే (సముద్రం దగ్గర ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేవారు), మీ తల్లిదండ్రులు కూడా ప్రమాదాన్ని దూరం నుంచే ముందుగా చూడగలుగుతారు

 ఒక కారణాన్ని ఈ విధంగా వివరించవచ్చు: మీకు అవకాశం వస్తే లైఫ్‌ గార్డులు (సముద్రం దగ్గర ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేవారు) అందుబాటులో ఉండే బీచ్‌లో ఈతకొట్టాలని కోరుకుంటారు కదా! ఎందుకు? ఎందుకంటే మీరు నీళ్లల్లో ఈతకొడుతూ ఆహ్లాదాన్ని పొందేటప్పుడు ప్రమాదాలను అంతగా పసిగట్టలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని గమనిస్తున్న లైఫ్‌ గార్డులకు మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నారా? లేదా? అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా, మీ తల్లిదండ్రులు కూడా వాళ్లకున్న అవగాహన, అనుభవం కారణంగా మీరు చూడలేని కొన్ని ప్రమాదాలను చూడగలుగుతారు. బీచ్‌లో ఉండే లైఫ్‌ గార్డుల్లాగే, మీ తల్లిదండ్రుల లక్ష్యం కూడా మీ ఆహ్లాదాన్ని పాడుచేయడం కాదుగానీ, మీ జీవితంలోని సంతోషాన్ని పాడుచేసే ప్రమాదాల నుండి తప్పించుకునేలా మీకు సహాయం చేయడమే.

 మరో కారణాన్ని గమనించండి: మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడాలనే బలమైన కోరిక మీ తల్లిదండ్రులకు ఉంటుంది. మీకు మేలు జరిగే పనులకు సరే అని, హాని కలిగించే వాటిని వద్దని చెప్పేది మీ మీద ఉన్న ప్రేమ వల్లే. ఏదైనా ఓ పని చేయాలా? వద్దా? అని వాళ్లను అడిగినప్పుడు, మీరు ఆ పని చేస్తే ఆ తర్వాత దాని వల్ల వచ్చే పరిణామాలను తట్టుకోగలరో లేదో ఆలోచిస్తారు. అందులో మీకు ఏ ప్రమాదం లేదని నమ్మకం కుదిరితే—మీరు ఆ పని చేయడానికి ఒప్పుకుంటారు.

సరే అని చెప్పే అవకాశాలను ఎలా మెరుగుపర్చుకోవచ్చు

మీరు ఇలా చేయవచ్చు

 నిజాయితీ: మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘అసలు నేను ఎందుకు వెళ్లాలనుకుంటున్నాను? ముఖ్యంగా ఇది నేను ఆనందించడానికి చేసే పనా లేక నేనూ అందరిలానే ఉన్నానని నా తోటివారు అనుకునేందుకు చేస్తున్నానా? నేను ఇష్టపడే ఓ వ్యక్తి అక్కడ ఉంటున్నారనా?’ ఇప్పుడు మీ తల్లిదండ్రులకు నిజాయితీగా చెప్పండి. వాళ్లూ ఒకప్పుడు మీలా యవ్వనంలో ఉన్నవారే. అంతేకాకుండా మీరేంటో వాళ్లకు బాగా తెలుసు. కాబట్టి మీరు నిజంగా ఏ ఉద్దేశంతో చేస్తున్నారో వాళ్లు తప్పకుండా అర్థంచేసుకుంటారు. మీ నిజాయితీకి వాళ్లు సంతోషపడతారు, అలాగే వాళ్ల జ్ఞానం నుండి మీరు కూడా ప్రయోజనం పొందుతారు. (సామెతలు 7:1, 2) ఒకవేళ మీరు నిజాయితీగా లేకపోతే, మీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుని, ఒప్పుకునే అవకాశాలను కోల్పోతారు.

 సరైన సమయంలో అడగండి: మీ తల్లిదండ్రులు రోజంతా పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే గానీ, ఇతర పనులు చేయడంలో మునిగి ఉన్నప్పుడుగానీ మీరు అడగాలనుకునే విషయాలను పదేపదే చెప్తూ వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయకండి. వాళ్లు తీరికగా ఉన్న సమయం చూసుకొని మాట్లాడండి. అలాగని ఆఖరి నిమిషంలో చెప్పి జవాబు కోసం వాళ్లను ఒత్తిడి చేయకండి. ఆఖరి నిమిషంలో త్వరపడి నిర్ణయం తీసుకోవడాన్ని మీ తల్లిదండ్రులు ఇష్టపడరు. వీలైనంత ముందుగా అడిగి, వాళ్లు ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వండి.

 విషయాన్ని స్పష్టంగా చెప్పండి: మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. అస్పష్టంగా చెప్పొద్దు. మీ నుండి “నాకు తెలీదు” అనే జవాబు వినడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. మరిముఖ్యంగా: “అక్కడ ఎవరుంటారు?,” “బాధ్యతగల పెద్దవాళ్లెవరైనా ఉంటారా?” లేక “ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తావు?” లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు “నాకు తెలీదు” అంటే అస్సలు ఒప్పుకోరు.

 మంచి మనోవైఖరి కలిగి ఉండండి: మీ తల్లిదండ్రులను మీ శత్రువులుగా చూడకండి. వాళ్లు మీ కుటుంబ సభ్యులని గుర్తుంచుకోండి—ఎందుకంటే, వాళ్లు మీ కోసం ఎన్నో చేశారు. మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేసేవారని గుర్తిస్తే, మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీకు నచ్చింది చేయడానికి ప్రయత్నిస్తారు.

 మీరు వాళ్ల నిర్ణయాన్ని అంగీకరించి, దాన్ని గౌరవించే పరిణతి (మానసికంగా చక్కగా ఎదగడం) చెందిన వ్యక్తని మీ తల్లిదండ్రులకు చూపించండి. అలాచేస్తే వాళ్లు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మరోసారి అలాంటి సందర్భం వచ్చినప్పుడు, ఒప్పుకునేందుకు సహాయపడే మార్గాలు వెతకడానికి మొగ్గుచూపిస్తారు.