“అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు.”—లూకా 14:13, 14.
శ్రద్ధ చూపించే యౌవనులు
ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే యౌవనులు ప్రతీచోట ఉన్నారు. ఈ ఉదాహరణలను గమనించండి:
కాసే ఇలా చెప్తుంది, “నేను సోఫాలో కూర్చొని టీవీ చూడాలనుకుంటాను, కానీ మా అమ్మానాన్నలు ఉద్యోగం నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎంతగా అలసిపోయుంటారో ఆలోచించి గిన్నెలు కడుగుతాను, గదులన్ని శుభ్రం చేస్తాను. అంతేకాకుండా మా అమ్మానాన్నల కోసం కాఫీ కూడా చేస్తాను, ఎందుకంటే కాఫీ వాళ్లకు చాలా ఇష్టం. మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు, ‘వావ్ చూడటానికి ఇది చాలా బాగుంది!మంచి వాసన కూడా వస్తుంది. చాలా థ్యాంక్స్ స్వీటి’అంటుంది. అలా అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా అమ్మానాన్నల కోసం ఇలాంటి మంచి పనులు ఎప్పుడూ చేయాలనిపిస్తుంది.”
హోలీ ఇలా అంటుంది, “నాకు అవసరమైన ప్రతీది ఇస్తూ నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. గత సంవత్సరం వాళ్ల కారుకు ఏదో పెద్ద సమస్య వచ్చినప్పుడు, దాన్ని బాగు చేయటానికి నేను దాచుకున్నవాటిలో పెద్ద మొత్తాన్ని వాళ్లకిచ్చాను. వాళ్లు నేనిచ్చిన డబ్బులు తీసుకోనన్నారు కానీ బలవంతంగా అవి వాళ్లకు ఇచ్చాను. వాళ్లు చేసిన దానితో పోలిస్తే నేనిచ్చింది చాలా తక్కువే. నేను ఉదార స్వభావంతో వాళ్లకు ఏదో ఒకటి చేసినందుకు ఎంతో గొప్పగా అనిపించింది.”
మీకు తెలుసా? యెహోవాసాక్షులలో చాలామంది యౌవనస్థులు బైబిలును బోధించే పని ద్వారా ఇతరులకు సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించారు. అవసరం ఉన్న చోట బైబిలును బోధించడం కోసం కొంతమంది విదేశాలకు కూడా వెళ్లారు.
ఇవాన్ ఇలా అంటున్నాడు, “బైబిలును బోధించే పనిలో సహాయం చేయడానికి నేను అమెరికా నుండి మెక్సికోకి వెళ్లాను. డబ్బును లేదా ఇతర వస్తువులను ఇతరులకు ఇవ్వడం కొన్నిసార్లు నాకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నాదగ్గర అవి ఎక్కువ ఉండవు. కానీ వస్తుసంపదలే కాదు నా సమయాన్ని, శక్తిని పరిచర్యలో ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ ఆనందాన్ని పొందగలనని నేను గ్రహించాను.”
నేను ఇతరులకు ఎలా సహాయం చేయగలను?
ఇతరులకు సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందాన్ని మీరెప్పుడైనా అనుభవించారా? ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి.
మీ కుటుంబానికి సహాయం చేయండి:
దుమ్ము దులపండి, గిన్నెలు తోమండి, లేదా గదిని శుభ్రం చేయండి. అడగకుండానే వంట చేయండి
ఒక పూట వంట చేయండి
మీ తల్లిదండ్రులను మెచ్చుకుంటూ ఒక కార్డును ఇవ్వండి
మీ తమ్ముడికి లేదా చెల్లికి స్కూల్‌వర్క్‌లో సహాయం చేయండి
మీ కుటుంబసభ్యులు కానివాళ్లకు సహాయం చేయండి:
అనారోగ్యంతో ఉన్నవాళ్ళకి ఒక కార్డును పంపించండి
మీ పొరుగునున్న వృద్ధులకు తోటపనిలో సహాయం చేయండి
ఇంటినుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నవాళ్లను వెళ్లి కలవండి
కష్టకాలాల్లో జీవిస్తున్న వారికి ఒక గిఫ్ట్‌ను కొనివ్వండి
సలహా: మీకై మీరు సొంతగా ఆలోచించి కొన్ని పనులు చేయండి. ఈ వారంలో ఒక్కరికన్నా సహాయం చేయాలనే లక్ష్యం పెట్టుకొని దాన్ని చేసి చూడండి. మీకొచ్చిన ఆనందాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.
అలానా ఇలా అంటుంది, “ఇతరులకు సహాయం చేస్తే, మీరూ ఆనందాన్ని అనుభవిస్తారు. ఏదో సాధించామనే భావన మనలో వస్తుంది, ఇతరులు కూడా మెచ్చుకుంటారు. అది మీకు ఆనందాన్నిస్తుందని మొదట్లో మీరు అనుకోకపోయినా తర్వాత అది మీకెంతో ఆనందాన్ని ఇవ్వవచ్చు. మీరు ఏదో త్యాగం చేయాల్సి వచ్చిందని మీకు అనిపించదు ఎందుకంటే చివరకు మీరు ఎంతో పొందుతారు.”
చాలామంది సంతోషాన్ని ఆస్తిపాస్తులతో డబ్బులతో పోలుస్తారు. కానీ నిజంగా డబ్బు, ఆస్తిపాస్తులు శాశ్వతంగా ఉండే సంతోషాన్ని తెస్తాయా? రుజువులు ఏమి చూపిస్తున్నాయి?