యోహాను సువార్త 8:12-59

  • యేసు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తాడు (12-30)

    • యేసు, “లోకానికి వెలుగు” (12)

  • అబ్రాహాము పిల్లలు (31-41)

    • “సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది” (32)

  • అపవాది పిల్లలు (42-47)

  • యేసు, అబ్రాహాము (48-59)

8  12  అప్పుడు యేసు వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును.+ నన్ను అనుసరించేవాళ్లు చీకట్లో నడవనే నడవరు, కానీ జీవాన్నిచ్చే వెలుగు+ వాళ్ల దగ్గర ఉంటుంది.” 13  అందుకు పరిసయ్యులు, “నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం చెల్లదు” అని ఆయనతో అన్నారు. 14  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకున్నా, నా సాక్ష్యం చెల్లుతుంది. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు.+ మీకు మాత్రం నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. 15  మీరు మనుషుల ఆలోచన* ప్రకారం తీర్పు తీరుస్తారు; నేను అసలు ఎవ్వరికీ తీర్పు తీర్చను. 16  ఒకవేళ నేను తీర్పు తీర్చినా, నా తీర్పు సరైనదే. ఎందుకంటే నేను ఒంటరిగా లేను, నన్ను పంపించిన తండ్రి నాకు తోడుగా ఉన్నాడు.+ 17  ‘ఇద్దరు మనుషుల సాక్ష్యం చెల్లుతుంది’ అని మీ ధర్మశాస్త్రంలో కూడా రాయబడివుంది కదా.+ 18  నా గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యమిస్తున్నాడు.”+ 19  అప్పుడు వాళ్లు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని ఆయన్ని అడిగారు. అందుకు యేసు ఇలా అన్నాడు: “మీకు నేను తెలీదు, నా తండ్రి తెలీదు.+ మీకు నేనెవరో తెలిసి ఉంటే, నా తండ్రి ఎవరో కూడా తెలిసుండేది.”+ 20  ఆయన ఆలయంలో బోధిస్తున్నప్పుడు, కానుకలు వేసే చోట ఆ మాటలు అన్నాడు.+ కానీ ఎవ్వరూ ఆయన్ని పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు. 21  ఆయన వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు: “నేను వెళ్లిపోతున్నాను, మీరు నాకోసం వెదుకుతారు; అయినా మీరు మీ పాపంలోనే చనిపోతారు.+ నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.”+ 22  అప్పుడు యూదులు, “ ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి?” అని చెప్పుకున్నారు. 23  ఆయన వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “మీరు కింద నుండి వచ్చారు, నేను పై నుండి వచ్చాను.+ మీరు ఈ లోకం వాళ్లు, నేను ఈ లోకం వాణ్ణి కాదు. 24  అందుకే, మీరు మీ పాపంలోనే చనిపోతారని నేను అన్నాను. ఎందుకంటే, రావాల్సిన వాణ్ణి నేనే అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలోనే చనిపోతారు.” 25  అప్పుడు వాళ్లు, “నువ్వు ఎవరు?” అని ఆయన్ని అడిగారు. అందుకు యేసు ఇలా అన్నాడు: “అసలు నేను ఇప్పటిదాకా మీతో ఎందుకు మాట్లాడుతున్నాను? 26  మీ గురించి మాట్లాడడానికి, తీర్పు తీర్చడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే, నన్ను పంపించిన వ్యక్తి సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలే లోకంలో మాట్లాడుతున్నాను.”+ 27  ఆయన మాట్లాడుతున్నది తండ్రి గురించి అని వాళ్లకు అర్థం కాలేదు. 28  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు మానవ కుమారుణ్ణి కొయ్యకు వేలాడదీసిన తర్వాత+ నేనే ఆయన్ని అని,+ నా అంతట నేనే ఏమీ చేయనని మీరు తెలుసుకుంటారు.+ తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను. 29  నన్ను పంపించిన వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను,+ కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” 30  ఆయన ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచారు. 31  తన మీద నమ్మకం ఉంచిన యూదులతో యేసు ఇంకా ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే,* మీరు నిజంగా నా శిష్యులు. 32  అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు,+ ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని* చేస్తుంది.”+ 33  అప్పుడు కొందరు ఇలా అన్నారు: “మేము అబ్రాహాము పిల్లలం, మేము ఎప్పుడూ ఎవ్వరికీ దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు నువ్వు, ‘మీరు స్వతంత్రులౌతారు’ అని ఎలా అంటున్నావు?” 34  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, పాపం చేసే ప్రతీ వ్యక్తి పాపానికి దాసుడు.+ 35  అంతేకాదు, దాసుడు తన యజమాని ఇంట్లో శాశ్వతంగా ఉండిపోడు; కుమారుడు మాత్రం ఉంటాడు. 36  కాబట్టి కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు. 37  మీరు అబ్రాహాము పిల్లలని నాకు తెలుసు. అయినా మీరు నన్ను చంపాలని చూస్తున్నారు, ఎందుకంటే మీరు నా బోధల్ని అంగీకరించట్లేదు. 38  నేను నా తండ్రి దగ్గర చూసిన విషయాలే మాట్లాడుతున్నాను.+ కానీ మీరు మీ తండ్రి దగ్గర విన్నవాటిని చేస్తున్నారు.” 39  అందుకు వాళ్లు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు అబ్రాహాము పిల్లలైతే,+ అబ్రాహాము చేసిన పనులే చేస్తూ ఉండేవాళ్లు. 40  కానీ ఇప్పుడు మీరు, దేవుని దగ్గర విన్న సత్యాన్ని మీకు చెప్పిన నన్ను+ చంపాలని చూస్తున్నారు. అబ్రాహాము ఎప్పటికీ అలా చేసేవాడు కాదు. 41  మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు.” అప్పుడు వాళ్లు, “మేము అక్రమ సంతానం* కాదు. మాకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు” అన్నారు. 42  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుడే మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించేవాళ్లు.+ ఎందుకంటే నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. నా అంతట నేనే రాలేదు, ఆయనే నన్ను పంపించాడు.+ 43  మీకు నా బోధను అంగీకరించడం ఇష్టంలేదు, అందుకే నా మాటలు మీకు అర్థం కావట్లేదు. 44  మీ తండ్రి అపవాది. మీరు మీ తండ్రి కోరికల్నే నెరవేర్చాలని కోరుకుంటున్నారు.+ మొదటి నుండి అతను హంతకుడు.+ అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు, ఎందుకంటే అతనిలో సత్యం లేదు. అతను అబద్ధం చెప్పేటప్పుడు తన స్వభావం ప్రకారమే మాట్లాడతాడు; ఎందుకంటే అతను అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి.+ 45  కానీ నేను నిజం మాట్లాడుతున్నాను, కాబట్టి మీరు నన్ను నమ్మట్లేదు. 46  నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం మాట్లాడుతుంటే మీరెందుకు నన్ను నమ్మట్లేదు? 47  దేవునికి చెందిన వ్యక్తి దేవుని మాటలు వింటాడు.+ కానీ మీరు దేవునికి చెందినవాళ్లు కాదు కాబట్టే నా మాటలు వినట్లేదు.”+ 48  అప్పుడు యూదులు యేసుతో, “ ‘నువ్వు సమరయుడివి,+ నీకు చెడ్డదూత* పట్టాడు’+ అని మేము అన్న మాట నిజం కాదా?” అన్నారు. 49  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నాకు చెడ్డదూత పట్టలేదు కానీ నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను, మీరు నన్ను అవమానిస్తున్నారు. 50  నేను నాకు మహిమ రావాలని కోరుకోవట్లేదు;+ నాకు మహిమ రావాలని కోరుకునే వ్యక్తి వేరే ఉన్నాడు; తీర్పు తీర్చేది ఆయనే. 51  నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు.”+ 52  అప్పుడు యూదులు ఆయనతో ఇలా అన్నారు: “నీకు చెడ్డదూత పట్టాడని మాకు ఇప్పుడు అర్థమైంది. అబ్రాహాము చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నువ్వేమో, ‘ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు’ అంటున్నావు. 53  నువ్వు మా తండ్రైన అబ్రాహాము కన్నా గొప్పవాడివా? అతను చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. ఇంతకీ నువ్వు ఎవరు?” 54  దానికి యేసు ఇలా అన్నాడు: “నన్ను నేనే మహిమపర్చుకుంటే, నా మహిమకు అర్థంలేదు. నా తండ్రే నన్ను మహిమపరుస్తున్నాడు,+ ఆయన్నే మీరు మీ దేవుడని చెప్పుకుంటున్నారు. 55  అయినా మీరు ఆయన్ని తెలుసుకోలేదు,+ కానీ నాకు ఆయన తెలుసు.+ ఒకవేళ ఆయన నాకు తెలీదని నేను చెప్తే, మీలాగే నేను కూడా అబద్ధాలకోరును అవుతాను. కానీ ఆయన నాకు తెలుసు, ఆయన వాక్యాన్ని నేను పాటిస్తున్నాను. 56  మీ తండ్రి అబ్రాహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు. అతను దాన్ని చూశాడు, సంతోషించాడు.”+ 57  అప్పుడు యూదులు ఆయనతో, “నీకు 50 ఏళ్లు కూడా లేవు, నువ్వు అబ్రాహామును చూశావా?” అన్నారు. 58  యేసు వాళ్లతో, “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, అబ్రాహాము పుట్టకముందే నేను ఉన్నాను”+ అన్నాడు. 59  దాంతో వాళ్లు ఆయన మీద విసరడానికి రాళ్లు తీసుకున్నారు. కానీ యేసు దాక్కొని, ఆలయంలో నుండి బయటికి వెళ్లిపోయాడు.

అధస్సూచీలు

లేదా “ప్రమాణాల.”
అక్ష., “నా వాక్యంలో నిలిచివుంటేనే.”
లేదా “విడుదల.”
అక్ష., “లైంగిక పాపాల వల్ల పుట్టిన సంతానం.” గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
పదకోశం చూడండి.