యోహాను సువార్త 18:1-40

  • యూదా యేసును అప్పగించడం (1-9)

  • పేతురు కత్తి దూయడం (10, 11)

  • అన్న దగ్గరికి యేసును తీసుకెళ్లడం (12-14)

  • యేసు తెలీదని పేతురు మొదటిసారి అనడం (15-18)

  • అన్న ముందు యేసు (19-24)

  • యేసు తెలీదని పేతురు రెండోసారి, మూడోసారి అనడం (25-27)

  • పిలాతు ముందు యేసు (28-40)

    • “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” (36)

18  యేసు ఈ విషయాలు చెప్పాక, తన శిష్యులతో పాటు కిద్రోను లోయ*+ దాటి, తోట ఉన్న చోటికి వెళ్లాడు. యేసు, ఆయన శిష్యులు ఆ తోటలోకి వెళ్లారు.+  యేసు తరచూ తన శిష్యులతో అక్కడికి వెళ్తుండేవాడు కాబట్టి ఆయన్ని అప్పగించబోయే యూదాకు కూడా ఆ చోటు తెలుసు.  కాబట్టి యూదా సైనికుల గుంపును, ముఖ్య యాజకులు-పరిసయ్యులు పంపించిన అధికారుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. వాళ్ల చేతుల్లో దివిటీలు, దీపాలు, ఆయుధాలు ఉన్నాయి.+  తనకు జరగబోతున్నవన్నీ యేసుకు తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చి, “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని వాళ్లను అడిగాడు.  వాళ్లు, “నజరేయుడైన యేసు+ కోసం” అని అన్నారు. అప్పుడు యేసు వాళ్లతో, “నేనే ఆయన్ని” అని చెప్పాడు. ఆయన్ని అప్పగించబోతున్న యూదా కూడా వాళ్లతోపాటు నిలబడివున్నాడు.+  యేసు, “నేనే ఆయన్ని” అని చెప్పినప్పుడు వాళ్లు వెనక్కి తగ్గి, నేలమీద పడిపోయారు.+  కాబట్టి ఆయన, “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని వాళ్లను మళ్లీ అడిగాడు. వాళ్లు, “నజరేయుడైన యేసు కోసం” అన్నారు.  అప్పుడు యేసు వాళ్లతో, “నేనే ఆయన్ని అని మీతో చెప్పాను కదా. మీరు వెదుకుతున్నది నా కోసమే అయితే వీళ్లను వెళ్లనివ్వండి” అన్నాడు.  “నువ్వు నాకు ఇచ్చిన వాళ్లలో ఏ ఒక్కర్నీ నేను పోగొట్టుకోలేదు”+ అని తాను చెప్పిన మాట నెరవేరడానికే ఆయన అలా చేశాడు. 10  సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉంది. అతను ఆ కత్తి దూసి ప్రధానయాజకుని దాసుడి కుడిచెవి తెగనరికాడు.+ ఆ దాసుని పేరు మల్కు. 11  అయితే యేసు పేతురుతో, “ఆ కత్తిని ఒరలో పెట్టు.+ తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగవద్దా?”+ అని అన్నాడు. 12  అప్పుడు ఆ సైనికులు, సహస్రాధిపతి,* యూదుల అధికారులు యేసును పట్టుకుని బంధించారు. 13  వాళ్లు యేసును ముందుగా అన్న అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు, అతను ఆ సంవత్సరం ప్రధానయాజకుడిగా ఉన్న కయపకు+ మామ. 14  దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మంచిదని అంతకుముందు యూదులకు సలహా ఇచ్చింది ఈ కయపే.+ 15  సీమోను పేతురు, ఇంకో శిష్యుడు యేసు వెనక వెళ్తున్నారు.+ ఆ శిష్యుడు ప్రధానయాజకుడికి తెలుసు కాబట్టి అతను యేసుతోపాటు ప్రధానయాజకుడి ఇంటి ప్రాంగణం లోపలికి వెళ్లాడు. 16  కానీ పేతురు బయటే ద్వారం దగ్గర నిలబడివున్నాడు. దాంతో ప్రధానయాజకుడికి తెలిసిన ఆ శిష్యుడు బయటికి వచ్చి, అక్కడ కాపలా ఉన్న అమ్మాయితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు. 17  అప్పుడు, కాపలా ఉన్న పనమ్మాయి పేతురును, “నువ్వూ ఈయన శిష్యుల్లో ఒకడివి కాదు కదా?” అని అడిగింది. దానికి పేతురు, “కాదు” అన్నాడు.+ 18  చలిగా ఉండడంతో దాసులు, అధికారులు చలిమంట వేసుకుని, దాని చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వాళ్లతో నిలబడి చలి కాచుకుంటున్నాడు. 19  అప్పుడు ఆ ముఖ్య యాజకుడు* యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి ప్రశ్నించాడు. 20  యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు: “నేను ప్రజలందరి ముందు మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులందరూ వచ్చే సమాజమందిరాల్లో, ఆలయంలో బోధించాను.+ రహస్యంగా ఏదీ మాట్లాడలేదు. 21  మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? నేను వాళ్లకు ఏమి చెప్పానో విన్నవాళ్లనే అడగండి. ఇదిగో! నేనేమి మాట్లాడానో వాళ్లకు తెలుసు.” 22  యేసు ఈ మాటలు అన్నప్పుడు, ఆయన దగ్గర నిలబడివున్న ఒక అధికారి యేసును చెంపమీద కొట్టి,+ “ముఖ్య యాజకుడితో ఇలాగేనా మాట్లాడేది?” అన్నాడు. 23  అప్పుడు యేసు అతనితో, “నేను ఏదైనా తప్పు మాట్లాడివుంటే, ఆ తప్పేంటో చెప్పు. కానీ నేను మాట్లాడింది సరిగ్గా ఉంటే నన్ను ఎందుకు కొడుతున్నావు?” అని అన్నాడు. 24  తర్వాత అన్న, బంధించబడివున్న యేసును ప్రధానయాజకుడైన కయప దగ్గరికి పంపించాడు.+ 25  సీమోను పేతురు ఇంకా మంట దగ్గరే నిలబడి చలి కాచుకుంటున్నాడు. అక్కడున్న వాళ్లు అతన్ని, “నువ్వూ ఈయన శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు. దానికి పేతురు ఒప్పుకోలేదు, “నేను కాదు” అన్నాడు.+ 26  ప్రధానయాజకుడి దాసుల్లో, పేతురు ఎవరి చెవి నరికాడో అతని+ బంధువు కూడా ఉన్నాడు. అతను పేతురుతో, “నువ్వు ఆయనతోపాటు తోటలో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27  అయితే పేతురు మళ్లీ ఒప్పుకోలేదు, వెంటనే కోడి కూసింది.+ 28  అప్పుడు వాళ్లు యేసును కయప ఇంటి నుండి అధిపతి భవనానికి తీసుకెళ్లారు.+ అప్పటికి తెల్లవారింది. అయితే యూదులు మాత్రం అధిపతి భవనం లోపలికి వెళ్లలేదు, ఎందుకంటే వాళ్లు పస్కా భోజనాన్ని తినగలిగేలా అపవిత్రులు కాకూడదని+ అనుకున్నారు. 29  కాబట్టి పిలాతు బయటికి వచ్చి, “ఇతని మీద మీరు మోపుతున్న నేరమేమిటి?” అని వాళ్లను అడిగాడు. 30  అప్పుడు వాళ్లు, “ఇతను తప్పు చేయకపోయుంటే* ఇతన్ని నీకు అప్పగించేవాళ్లం కాదు” అన్నారు. 31  దానికి పిలాతు వాళ్లతో, “ఇతన్ని తీసుకెళ్లి మీరే మీ చట్టప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. అప్పుడు యూదులు, “చట్టప్రకారం ఎవరికీ మరణశిక్ష వేసే అధికారం మాకు లేదు” అన్నారు.+ 32  తాను ఏ విధంగా చనిపోతాడో సూచించడానికి యేసు చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.+ 33  కాబట్టి పిలాతు మళ్లీ అధిపతి భవనంలోకి వెళ్లి, యేసును పిలిపించి, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు.+ 34  అప్పుడు యేసు, “నీ అంతట నువ్వే ఇలా అడుగుతున్నావా? లేక వేరేవాళ్లు నా గురించి చెప్పారా?” అని అడిగాడు. 35  దానికి పిలాతు, “నేనేమైనా యూదుడినా? నీ సొంత ప్రజలూ ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. ఇంతకీ నువ్వు ఏంచేశావు?” అని అడిగాడు. 36  అప్పుడు యేసు ఇలా అన్నాడు:+ “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.+ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు.+ కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” 37  కాబట్టి పిలాతు యేసును, “అయితే నువ్వు రాజువా?” అని అడిగాడు. దానికి యేసు, “నేను రాజునని నువ్వే స్వయంగా అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, అందుకే ఈ లోకంలోకి వచ్చాను.+ సత్యానికి లోబడే ప్రతీ ఒక్కరు నేను చెప్పేది వింటారు” అన్నాడు. 38  అప్పుడు పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. ఆ మాట అన్న తర్వాత పిలాతు మళ్లీ బయటికి వెళ్లి యూదులతో ఇలా అన్నాడు: “అతనిలో నాకు ఏ తప్పూ కనిపించలేదు.+ 39  అంతేకాదు, పస్కా పండుగప్పుడు మీకోసం నేను ఒకర్ని విడుదల చేసే ఆచారం మీకు ఉంది కదా.+ మరి మీకోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?” 40  వాళ్లు, “ఇతన్ని వద్దు, బరబ్బను విడుదల చేయి” అని అరిచారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.+

అధస్సూచీలు

లేదా “చలికాలంలో ప్రవహించే కిద్రోను వాగు.”
ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.
అంటే, అన్న.
లేదా “నేరస్తుడు కాకపోతే.”