యోహాను సువార్త 11:1-57

  • లాజరు చనిపోవడం (1-16)

  • యేసు మార్తను, మరియను ఓదార్చడం (17-37)

  • యేసు లాజరును పునరుత్థానం చేయడం (38-44)

  • యేసును చంపడానికి కుట్ర (45-57)

11  బేతనియలో లాజరు అనే ఒకతను ఉండేవాడు, అతనికి జబ్బు చేసింది; మరియ, ఆమె సహోదరి మార్త+ కూడా ఆ గ్రామంలోనే ఉండేవాళ్లు.  ప్రభువు పాదాల మీద అత్తరు పోసి, వాటిని తన తలవెంట్రుకలతో తుడిచింది ఈ మరియే;+ జబ్బుపడిన లాజరు ఆమె సహోదరుడు.  కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, ఇదిగో! నువ్వు ప్రేమించే అతనికి జబ్బు చేసింది” అంటూ యేసుకు కబురు పంపించారు.  అయితే అది విన్నప్పుడు యేసు, “ఈ జబ్బు అతను చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది.+ దాని ద్వారా దేవుని కుమారుడు మహిమపర్చబడడానికి వచ్చింది” అని అన్నాడు.  యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు.  అయితే లాజరు జబ్బుపడ్డాడని విన్నప్పుడు యేసు ఇంకో రెండు రోజులు తానున్న చోటే ఉండిపోయాడు.  ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్లీ యూదయకు వెళ్దాం” అన్నాడు.  శిష్యులు ఆయనతో, “రబ్బీ,+ ఈమధ్యే యూదయవాళ్లు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు.+ నువ్వు మళ్లీ అక్కడికి వెళ్తావా?” అన్నారు.  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “పగలు 12 గంటలు ఉన్నాయి కదా?+ ఎవరైనా పగటిపూట నడిస్తే, వాళ్లు ఈ లోకపు వెలుగును చూస్తారు కాబట్టి దేనివల్లా తడబడరు. 10  కానీ ఎవరైనా రాత్రిపూట నడిస్తే, అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తడబడతాడు.” 11  ఈ విషయాలు చెప్పాక యేసు ఇంకా ఇలా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు,+ అతన్ని లేపడానికి వెళ్తున్నాను.” 12  అప్పుడు శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతను నిద్రపోతుంటే బాగౌతాడు” అన్నారు. 13  నిజానికి యేసు లాజరు చనిపోయాడని చెప్తున్నాడు. కానీ వాళ్లేమో అతను నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడం గురించి యేసు మాట్లాడుతున్నాడని అనుకున్నారు. 14  అప్పుడు యేసు వాళ్లతో స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయాడు,+ 15  అయితే నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను చేయబోయే పని మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. మనం అతని దగ్గరికి వెళ్దాం పదండి.” 16  అప్పుడు, దిదుమ అని పిలవబడిన తోమా తన తోటి శిష్యులతో, “మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం” అని అన్నాడు.+ 17  యేసు బేతనియకు చేరుకున్నప్పుడు, లాజరు అప్పటికే నాలుగు రోజులుగా సమాధిలో* ఉన్నాడని తెలుసుకున్నాడు. 18  బేతనియ యెరూషలేముకు దాదాపు రెండు మైళ్ల* దూరంలో ఉంది. 19  తమ సహోదరుణ్ణి పోగొట్టుకున్న మార్తను, మరియను ఓదార్చడానికి చాలామంది యూదులు వాళ్ల దగ్గరికి వచ్చారు. 20  యేసు వస్తున్నాడని విన్నప్పుడు మార్త ఆయన్ని కలుసుకోవడానికి వెళ్లింది, మరియ+ మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. 21  మార్త యేసుతో ఇలా అంది: “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. 22  ఇప్పటికీ నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది.” 23  అప్పుడు యేసు ఆమెతో, “నీ సహోదరుడు లేస్తాడు” అన్నాడు. 24  అందుకు మార్త, “చివరి రోజున, చనిపోయినవాళ్లు బ్రతికించబడినప్పుడు* అతను లేస్తాడని నాకు తెలుసు” అంది.+ 25  అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే.*+ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు; 26  అంతేకాదు, ఇప్పుడు జీవిస్తూ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు.+ నువ్వు దీన్ని నమ్ముతున్నావా?” 27  అందుకు ఆమె, “అవును ప్రభువా, నువ్వు దేవుని కుమారుడివైన క్రీస్తువు అని, లోకంలోకి రావాల్సిన వ్యక్తివి అని నేను నమ్ముతున్నాను” అంది. 28  ఆమె ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె తన సహోదరి మరియను పక్కకు పిలిచి, “బోధకుడు+ వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది. 29  మరియ ఆ మాట వినగానే వెంటనే లేచి, ఆయన దగ్గరికి వెళ్లింది. 30  యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు, మార్త ఆయన్ని కలిసిన చోటే ఉన్నాడు. 31  ఆ సమయంలో కొంతమంది యూదులు మరియను ఓదార్చడానికి ఆమె ఇంట్లో ఉన్నారు. ఆమె వెంటనే లేచి బయటికి వెళ్లడం చూసి వాళ్లు, ఆమె ఏడవడానికి సమాధి*+ దగ్గరికి వెళ్తోందని అనుకుని ఆమె వెనకే వెళ్లారు. 32  మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూడగానే ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అని అంది. 33  ఆమె ఏడుస్తూ ఉండడం, ఆమెతోపాటు వచ్చిన యూదులు ఏడుస్తూ ఉండడం చూసినప్పుడు యేసు లోలోపల మూలిగాడు, చాలా బాధపడ్డాడు. 34  ఆయన, “మీరు అతన్ని ఎక్కడ ఉంచారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “ప్రభువా, వచ్చి చూడు” అన్నారు. 35  యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు.+ 36  అది చూసి యూదులు, “ఈయన అతన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు. 37  కానీ వాళ్లలో కొంతమంది, “గుడ్డివాడికి చూపు తెప్పించిన ఈయన+ అతన్ని చనిపోకుండా ఆపలేకపోయేవాడా?” అన్నారు. 38  అప్పుడు యేసు మళ్లీ లోలోపల మూలిగి, సమాధి* దగ్గరికి వచ్చాడు. నిజానికి అది ఒక గుహ. దానికి అడ్డంగా ఒక రాయి పెట్టబడి ఉంది. 39  యేసు, “ఆ రాయిని తీసేయండి” అని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి సహోదరి మార్త యేసుతో, “ప్రభువా, అతను చనిపోయి నాలుగు రోజులైంది, ఇప్పటికి శరీరం వాసన వస్తుంటుంది” అని అంది. 40  అప్పుడు యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని+ నేను నీకు చెప్పలేదా?” అన్నాడు. 41  దాంతో వాళ్లు ఆ రాయిని తీసేశారు. అప్పుడు యేసు ఆకాశం వైపు చూసి+ ఇలా అన్నాడు: “తండ్రీ, నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. 42  నువ్వు నా ప్రార్థనను ఎప్పుడూ వింటావని నాకు తెలుసు; అయితే నా చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మేలా+ వాళ్ల గురించే నేను ఈ మాట అన్నాను.” 43  ఆయన ఈ మాటలు అన్న తర్వాత, “లాజరూ, బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.+ 44  దాంతో చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చాడు. అతని కాళ్లకు, చేతులకు వస్త్రాలు చుట్టివున్నాయి, అతని ముఖానికి గుడ్డ చుట్టివుంది. యేసు వాళ్లతో, “అతని కట్లు విప్పి, అతన్ని వెళ్లనివ్వండి” అన్నాడు. 45  కాబట్టి, మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసిన పనిని చూసి ఆయనమీద విశ్వాసం ఉంచారు.+ 46  కొంతమంది మాత్రం పరిసయ్యుల దగ్గరికి వెళ్లి యేసు చేసినదాని గురించి వాళ్లకు చెప్పారు. 47  అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు మహాసభను సమావేశపర్చి ఇలా అన్నారు: “మనం ఏంచేద్దాం? ఈ మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు.+ 48  ఆయన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఆయనమీద విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని,* మన దేశాన్ని లాక్కుంటారు.” 49  వాళ్లలో ఆ సంవత్సరం ప్రధానయాజకుడిగా ఉన్న కయప+ కూడా ఉన్నాడు. అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీకు అసలేమీ తెలీదు, 50  దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మీకు మంచిదని అనిపించట్లేదా?” 51  అతను తనంతట తాను ఈ మాట చెప్పలేదు గానీ, ఆ సంవత్సరం అతను ప్రధానయాజకుడిగా ఉన్నాడు కాబట్టి, యేసు తన ప్రజల కోసం చనిపోవాల్సి ఉందని ప్రవచించాడు. 52  తన ప్రజల కోసమే కాదు, చెదిరివున్న దేవుని పిల్లల్ని ఒకటిగా సమకూర్చడానికి కూడా ఆయన చనిపోవాల్సి ఉందని అతను ప్రవచించాడు. 53  ఆ రోజు నుండి వాళ్లు ఆయన్ని చంపడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. 54  అందుకే యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగడం మానేశాడు. ఆయన అక్కడి నుండి ఎడారికి దగ్గర్లో ఉన్న ఎఫ్రాయిము+ అనే నగరానికి వెళ్లి, తన శిష్యులతో పాటు అక్కడే ఉన్నాడు. 55  యూదుల పస్కా పండుగ+ దగ్గరపడింది. కాబట్టి, దేశమంతటా ఉన్న చాలామంది ప్రజలు ఆచార ప్రకారం శుద్ధి చేసుకోవడానికి పస్కా పండుగకు ముందే యెరూషలేముకు వెళ్లారు. 56  వాళ్లు అక్కడ యేసు కోసం వెతుకుతూ, ఆలయంలో నిలబడి, “మీకు ఏమనిపిస్తుంది? ఆయన పండుగకు అసలు రాడా?” అని మాట్లాడుకున్నారు. 57  అయితే ముఖ్య యాజకులు, పరిసయ్యులు యేసును పట్టుకోవడం* కోసం, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు.

అధస్సూచీలు

లేదా “స్మారక సమాధిలో.”
దాదాపు మూడు కిలోమీటర్లు. అక్ష., “దాదాపు 15 స్టేడియా.” అనుబంధం B14 చూడండి.
లేదా “పునరుత్థానమప్పుడు.”
అక్ష., “పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే.”
లేదా “స్మారక సమాధి.”
లేదా “స్మారక సమాధి.”
అంటే, ఆలయాన్ని.
లేదా “బంధించడం.”