యోహాను సువార్త 9:1-41
9 యేసు దారిలో వెళ్తున్నప్పుడు, పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక వ్యక్తిని చూశాడు.
2 అప్పుడు శిష్యులు ఆయన్ని, “రబ్బీ,+ ఎవరు పాపం చేయడం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టాడు? ఇతనా, ఇతని తల్లిదండ్రులా?” అని అడిగారు.
3 యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతను పాపం చేయడం వల్లో, ఇతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్లో ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు. కానీ ఇతని ద్వారా ప్రజలు దేవుని పనులు చూడగలిగేలా ఇది అవకాశం కల్పించింది.+
4 మనం పగటిపూట నన్ను పంపించిన తండ్రి పనులు చేయాలి.+ రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవ్వరూ పనిచేయలేరు.
5 నేను లోకంలో ఉన్నంతకాలం నేనే లోకానికి వెలుగును.”+
6 యేసు ఈ మాటలు చెప్పాక, నేలమీద ఉమ్మి వేసి దానితో బురద చేసి, దాన్ని అతని కళ్ల మీద పూశాడు.+
7 తర్వాత అతనితో, “వెళ్లి, సిలోయము (ఆ మాటను అనువదిస్తే, “పంపబడిన” అని అర్థం) కోనేరులో కడుక్కో” అని చెప్పాడు. అతను వెళ్లి కడుక్కొని చూపుతో తిరిగొచ్చాడు.+
8 అప్పుడు ఇరుగుపొరుగువాళ్లు, అంతకుముందు అతను అడుక్కోవడం చూసినవాళ్లు, “ఇతను అడుక్కునేవాడు కదా?” అని మాట్లాడుకున్నారు.
9 “అవును, అతనే” అని కొంతమంది, “అతను కాదు, అతనిలా ఉన్నాడంతే” అని ఇంకొంతమంది అన్నారు. అతను మాత్రం, “నేను అతన్నే” అని అంటూ ఉన్నాడు.
10 అప్పుడు వాళ్లు, “మరి నీకు చూపు ఎలా వచ్చింది?” అని అతన్ని అడిగారు.
11 దానికి అతను, “యేసు అనే ఒకాయన బురద చేసి, దాన్ని నా కళ్ల మీద పూసి, ‘సిలోయము దగ్గరికి వెళ్లి కడుక్కో’+ అని చెప్పాడు. నేను వెళ్లి కడుక్కున్నప్పుడు నాకు చూపు వచ్చింది” అని చెప్పాడు.
12 అప్పుడు వాళ్లు, “ఆయన ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. అతను, “నాకు తెలీదు” అని చెప్పాడు.
13 అంతకుముందు చూపులేని ఆ వ్యక్తిని వాళ్లు పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్లారు.
14 యేసు బురద చేసి అతనికి చూపు తెప్పించిన+ రోజు, అనుకోకుండా విశ్రాంతి రోజు.+
15 దాంతో పరిసయ్యులు కూడా అతనికి చూపు ఎలా వచ్చిందని అడగడం మొదలుపెట్టారు. అప్పుడు అతను, “ఆయన నా కళ్ల మీద బురద పూశాడు. నేను కడుక్కున్నాను, చూడగలుగుతున్నాను” అని వాళ్లకు చెప్పాడు.
16 కొంతమంది పరిసయ్యులు, “ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాదు, ఎందుకంటే ఈయన విశ్రాంతి రోజును పాటించట్లేదు”+ అన్నారు. ఇంకొంతమంది, “ఒక పాపి ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలడు?”+ అన్నారు. దాంతో వాళ్ల మధ్య అభిప్రాయభేదం తలెత్తింది.+
17 వాళ్లు మళ్లీ ఆ గుడ్డివాణ్ణి, “ఆయన చూపు తెప్పించింది నీకే కదా, ఇంతకీ ఆయన గురించి నువ్వు ఏమంటావు?” అని అడిగారు. అతను, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18 అయితే ఆ యూదులు అతను ఒకప్పుడు గుడ్డివాడని, తర్వాత అతనికి చూపు వచ్చిందని నమ్మలేదు. కాబట్టి వాళ్లు అతని తల్లిదండ్రుల్ని పిలిపించి,
19 “ఇతను మీ అబ్బాయేనా? ఇతను పుట్టుకతోనే గుడ్డివాడా? మరి ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.
20 అప్పుడు అతని తల్లిదండ్రులు ఇలా చెప్పారు: “ఇతను మా అబ్బాయే, ఇతను పుట్టుకతోనే గుడ్డివాడు.
21 అయితే ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడో మాకు తెలీదు, ఇతనికి ఎవరు చూపు తెప్పించారో కూడా తెలీదు. ఇతన్నే అడగండి. ఇతను పెద్దవాడయ్యాడు, ఇతనే సమాధానం చెప్పుకుంటాడు.”
22 వాళ్లు యూదులకు భయపడి అలా చెప్పారు.+ ఎందుకంటే, ఎవరైనా యేసును క్రీస్తు అని ఒప్పుకుంటే అతన్ని సమాజమందిరం నుండి వెలివేయాలని+ యూదులు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.
23 అందుకే అతని తల్లిదండ్రులు, “ఇతను పెద్దవాడయ్యాడు, ఇతన్నే అడగండి” అన్నారు.
24 దాంతో యూదులు, అంతకుముందు గుడ్డివాడిగా ఉన్న అతన్ని మళ్లీ పిలిచి, “దేవుణ్ణి మహిమపర్చు; ఆ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అన్నారు.
25 అప్పుడు అతను, “ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలీదు. కానీ ఒక విషయం తెలుసు. ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూడగలుగుతున్నాను” అన్నాడు.
26 అప్పుడు వాళ్లు, “ఆయన నీకు ఏంచేశాడు? ఎలా చూపు తెప్పించాడు?” అని అడిగారు.
27 అతను, “నేను ఇంతకుముందే చెప్పాను, అయినా మీరు వినలేదు. మీరు మళ్లీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా ఏంటి?” అని అన్నాడు.
28 దాంతో వాళ్లు అతన్ని చులకన చేసి మాట్లాడుతూ ఇలా అన్నారు: “నువ్వు ఆయన శిష్యుడివి. మేము మోషే శిష్యులం.
29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. అయితే ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలీదు.”
30 అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన్ని ఎవరు పంపించారో మీకు తెలీదు, అయినా ఆయన నాకు చూపు తెప్పించాడు.
31 దేవుడు పాపుల ప్రార్థన వినడని+ మనకు తెలుసు. ఎవరైనా దేవునికి భయపడుతూ ఆయన ఇష్టాన్ని చేస్తే, అతని ప్రార్థన దేవుడు వింటాడు.+
32 పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి ఎవరైనా చూపు తెప్పించినట్టు ప్రాచీనకాలం నుండి ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు.
33 ఆయన దేవుని దగ్గర నుండి రాకపోయుంటే ఏమీ చేయలేడు.”+
34 అప్పుడు వాళ్లు అతనితో, “నువ్వు పుట్టుకతోనే పాపివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అంటూ అతన్ని గెంటేశారు.+
35 వాళ్లు అతన్ని గెంటేశారని యేసు విని, అతను కనిపించినప్పుడు, “నువ్వు మానవ కుమారుడి మీద విశ్వాసం ఉంచుతున్నావా?” అని అడిగాడు.
36 అప్పుడతను, “అయ్యా, నేను ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరో నాకు చెప్పు” అన్నాడు.
37 దానికి యేసు, “నువ్వు ఆయన్ని చూశావు, నిజానికి నీతో మాట్లాడుతున్నది ఆయనే” అన్నాడు.
38 అప్పుడతను, “ప్రభువా, నేను ఆయనమీద విశ్వాసం ఉంచుతున్నాను” అంటూ యేసుకు వంగి నమస్కారం చేశాడు.
39 అప్పుడు యేసు, “ఈ తీర్పు కోసమే, అంటే చూడలేనివాళ్లు చూడగలిగేలా,+ చూడగలిగేవాళ్లు గుడ్డివాళ్లయ్యేలా+ నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు.
40 అక్కడున్న పరిసయ్యులు ఆ మాటలు విని, “మేము కూడా గుడ్డివాళ్లమా?” అని అన్నారు.
41 అందుకు యేసు, “మీరు గుడ్డివాళ్లు అయ్యుంటే, మీరు దోషులు కాకపోయేవాళ్లు. కానీ మీరు, ‘మేము చూస్తున్నాం’ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం మీమీదే ఉంటుంది”+ అన్నాడు.