యోహాను సువార్త 2:1-25

  • కానాలో పెళ్లి; నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం (1-12)

  • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (13-22)

  • మనుషుల స్వభావం యేసుకు తెలుసు (23-25)

2  రెండు రోజుల తర్వాత, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక పెళ్లివిందు జరిగింది, యేసు తల్లి అక్కడే ఉంది. 2  ఆ పెళ్లివిందుకు యేసును, ఆయన శిష్యుల్ని కూడా ఆహ్వానించారు. 3  ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు యేసు తల్లి ఆయనతో, “వాళ్ల దగ్గర ద్రాక్షారసం లేదు” అని చెప్పింది. 4  అయితే యేసు ఆమెతో, “అమ్మా, దానికి మనమేం చేస్తాం?* నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5  అప్పుడు వాళ్లమ్మ పనివాళ్లతో, “ఆయన మీకు ఏంచెప్తే అది చేయండి” అంది. 6  యూదుల శుద్ధీకరణ ఆచారం+ కోసం అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కోదానిలో రెండు లేదా మూడు కుండల* నీళ్లు పడతాయి. 7  యేసు ఆ పనివాళ్లతో, “ఆ బానల్ని నీళ్లతో నింపండి” అన్నాడు. వాళ్లు అంచుల దాకా నింపారు. 8  తర్వాత ఆయన, “ఇప్పుడు మీరు వాటిలో కొంచెం విందు నిర్వాహకుడి దగ్గరికి తీసుకెళ్లండి” అని వాళ్లకు చెప్పాడు. వాళ్లు ఆయన చెప్పినట్టే చేశారు. 9  విందు నిర్వాహకుడు ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్లను రుచి చూశాడు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ పనివాళ్లకు మాత్రమే తెలుసు కానీ అతనికి తెలీదు, కాబట్టి అతను పెళ్లికుమారుణ్ణి పిలిచి, 10  “అందరూ మొదట మంచి ద్రాక్షారసం పోసి, ప్రజలు మత్తులో ఉన్నప్పుడు తక్కువ రకం ద్రాక్షారసం పోస్తారు. నువ్వు మాత్రం ఇప్పుడు మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు” అన్నాడు. 11  గలిలయలోని కానాలో యేసు చేసిన ఈ అద్భుతం ఆయన అద్భుతాల్లో మొదటిది. దాని ద్వారా ఆయన తన మహిమను అందరికీ వెల్లడిచేశాడు,+ ఆయన శిష్యులు ఆయనమీద విశ్వాసం ఉంచారు. 12  తర్వాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్లు,+ ఆయన శిష్యులు కపెర్నహూముకు వెళ్లారు.+ అయితే వాళ్లు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు. 13  యూదుల పస్కా పండుగ+ దగ్గరపడింది కాబట్టి యేసు యెరూషలేముకు వెళ్లాడు. 14  ఆయన ఆలయంలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రజలు పశువుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అమ్మడం,+ డబ్బులు మార్చేవాళ్లు తమ స్థానాల్లో కూర్చొని ఉండడం చూశాడు. 15  అప్పుడు యేసు తాళ్లతో ఒక కొరడా చేసి వాళ్లందర్ని, వాళ్ల గొర్రెల్ని, పశువుల్ని ఆలయంలో నుండి వెళ్లగొట్టాడు. డబ్బు మార్చేవాళ్ల నాణేల్ని, బల్లల్ని కింద పడేశాడు.+ 16  పావురాల్ని అమ్మేవాళ్లతో, “వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి! నా తండ్రి మందిరాన్ని వ్యాపార స్థలంగా* మార్చకండి!” అన్నాడు.+ 17  అప్పుడు ఆయన శిష్యులు, “నీ మందిరం* విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంటుంది”+ అని రాయబడి ఉందని గుర్తుతెచ్చుకున్నారు. 18  అది చూసి యూదులు, “నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, వీటిని చేసే హక్కు నీకుందని నిరూపించుకోవడానికి ఏ అద్భుతం చేస్తావు?”+ అని యేసును అడిగారు. 19  అప్పుడు యేసు వాళ్లతో, “ఈ ఆలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతాను” అని అన్నాడు.+ 20  దానికి యూదులు, “ఈ ఆలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు మూడు రోజుల్లో దాన్ని లేపుతావా?” అన్నారు. 21  కానీ, ఆయన తన శరీరం అనే ఆలయం గురించి ఆ మాట అన్నాడు.+ 22  అయితే ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడినప్పుడు, ఆయన శిష్యులు యేసు ఈ మాట తరచూ చెప్పేవాడని గుర్తుచేసుకుని లేఖనాల్ని, యేసు మాటల్ని నమ్మారు. 23  యేసు పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాల్ని చూసి చాలామంది ఆయన పేరుమీద విశ్వాసం ఉంచారు. 24  కానీ యేసు వాళ్లను పూర్తిగా నమ్మలేదు, ఎందుకంటే మనుషుల హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. 25  అంతేకాదు, మనుషుల గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనుషుల స్వభావం ఆయనకు తెలుసు.+

అధస్సూచీలు

అక్ష., “ఓ స్త్రీ, నాకేంటి? నీకేంటి?” ఏదైనా విషయంలో అభ్యంతరం తెలపడానికి ఈ నానుడి ఉపయోగిస్తారు. “స్త్రీ” అనడం గౌరవం లేకపోవడం కాదు.
బహుశా 22 లీటర్లతో సమానమైన బాత్‌ కొలతలు. అనుబంధం B14 చూడండి.
లేదా “సంతలా.”
అక్ష., “ఇంటి.”