యోహాను సువార్త 4:1-54

  • యేసు, సమరయ స్త్రీ (1-38)

    • “పవిత్రశక్తితో, సత్యంతో” దేవుణ్ణి ఆరాధించాలి (23, 24)

  • చాలామంది సమరయులు యేసుమీద విశ్వాసం ఉంచడం (39-42)

  • రాజసేవకుడి కుమారుణ్ణి యేసు బాగు​చేయడం (43-54)

4  యోహాను కన్నా యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, వాళ్లకు బాప్తిస్మం ఇస్తున్నాడని+ పరిసయ్యులు విన్నారు. ఆ విషయం ప్రభువుకు తెలిసింది.  (అయితే యేసే స్వయంగా బాప్తిస్మం ఇవ్వలేదు గానీ ఆయన శిష్యులు ఇచ్చారు.)  అప్పుడు ఆయన యూదయ నుండి మళ్లీ గలిలయకు బయల్దేరాడు.  ఆయన సమరయ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది.  అలా ప్రయాణిస్తూ ఆయన సమరయలోని సుఖారు అనే నగరానికి వచ్చాడు. అది యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన పొలానికి+ దగ్గర్లో ఉంది.  అక్కడ యాకోబు బావి కూడా ఉంది.+ ప్రయాణం వల్ల అలసిపోయి యేసు ఆ బావి* దగ్గర కూర్చున్నాడు, అప్పుడు దాదాపు మధ్యాహ్నం 12 గంటలు* అయింది.  ఆ సమయంలో ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. యేసు ఆమెను, “తాగడానికి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అని అడిగాడు.  (ఆయన శిష్యులు ఆహారం కొనుక్కురావడానికి నగరంలోకి వెళ్లారు.)  అప్పుడు ఆ సమరయ స్త్రీ ఆయనతో ఇలా అంది: “నువ్వు యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, మరి నువ్వెలా నన్ను నీళ్లు అడుగుతున్నావు?” (ఎందుకంటే యూదులు సమరయులతో మాట్లాడరు.)+ 10  అందుకు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతి+ ఏమిటో, ‘నాకు నీళ్లివ్వు’ అని నిన్ను అడుగుతున్నది ఎవరో నీకు తెలిసివుంటే, నువ్వు ఆయన్ని నీళ్లు అడిగేదానివి, ఆయన నీకు జీవజలం ఇచ్చేవాడు.”+ 11  అప్పుడు ఆమె యేసుతో ఇలా అంది: “అయ్యా, నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు. పైగా ఈ బావి లోతుగా ఉంది. మరి ఈ జీవజలాన్ని నువ్వు ఎక్కడి నుండి తెచ్చిస్తావు? 12  మన పూర్వీకుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. అతను, అతని కుమారులు, అతని పశువులు తాగింది ఈ బావి నీళ్లే. నువ్వు అతని కన్నా గొప్పవాడివా?” 13  అందుకు యేసు ఇలా అన్నాడు: “ఈ బావి నీళ్లు తాగే ప్రతీ ఒక్కరికి మళ్లీ దాహం వేస్తుంది. 14  కానీ నేను ఇచ్చే నీళ్లు తాగే ఏ వ్యక్తికీ ఎప్పుడూ దాహం వేయదు.+ నేనిచ్చే నీళ్లు అతనిలో నీటి ఊటలా మారతాయి. ఆ ఊట అతనికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి అతనిలో ఉబుకుతూ ఉంటుంది.”+ 15  అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నేను నీళ్లు చేదుకోవడానికి పదేపదే ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు” అని అడిగింది. 16  యేసు ఆమెతో, “నువ్వు వెళ్లి నీ భర్తను పిలుచుకొని రా” అన్నాడు. 17  అప్పుడు ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అని చెప్పింది. అందుకు యేసు ఇలా అన్నాడు: “ ‘నాకు భర్త లేడు’ అని నువ్వు సరిగ్గానే చెప్పావు. 18  నీకు ఐదుగురు భర్తలు ఉండేవాళ్లు, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటున్నావో అతను నీ భర్త కాదు. నువ్వు చెప్పింది నిజమే.” 19  దానికి ఆ స్త్రీ ఆయనతో ఇలా అంది: “అయ్యా, నువ్వు ప్రవక్తవని నాకనిపిస్తుంది.+ 20  మా పూర్వీకులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ మీరు యెరూషలేములోనే ఆరాధించాలని చెప్తారు.”+ 21  అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా, నీతో నిజంగా చెప్తున్నాను. ఒక సమయం రాబోతుంది, అప్పుడు మీరు ఈ పర్వతం మీద గానీ, యెరూషలేములో గానీ తండ్రిని ఆరాధించరు. 22  మీరు ఏం ఆరాధిస్తున్నారో మీకు తెలీదు;+ మేము ఏం ఆరాధిస్తున్నామో మాకు తెలుసు, ఎందుకంటే రక్షణ యూదులతోనే మొదలౌతుంది.+ 23  అయినప్పటికీ, తండ్రిని సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో,* సత్యంతో ఆరాధించే సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది. నిజానికి తనను అలా ఆరాధించే వాళ్ల కోసమే తండ్రి చూస్తున్నాడు.+ 24  దేవుడు అదృశ్య వ్యక్తి,+ ఆయన్ని ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో,* సత్యంతో ఆరాధించాలి.”+ 25  అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలవబడే మెస్సీయ రాబోతున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు వివరంగా చెప్తాడు” అంది. 26  యేసు ఆమెతో, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు.+ 27  సరిగ్గా అప్పుడే ఆయన శిష్యులు వచ్చారు. ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతుండడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే, “నీకేం కావాలి?” అని గానీ, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గానీ ఎవ్వరూ ఆయన్ని అడగలేదు. 28  అప్పుడు ఆ స్త్రీ తన కుండను అక్కడే విడిచిపెట్టి, నగరంలోకి వెళ్లి ప్రజలతో ఇలా అంది: 29  “ఒకాయన నేను చేసినవన్నీ చెప్పాడు, మీరు కూడా వచ్చి చూడండి. ఆయనే క్రీస్తు అయ్యుంటాడా?” 30  దాంతో వాళ్లు నగరం నుండి బయల్దేరి ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. 31  ఈలోగా శిష్యులు, “రబ్బీ,+ భోంచేయి” అని ఆయన్ని వేడుకుంటూ ఉన్నారు. 32  అయితే ఆయన వాళ్లతో, “మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అన్నాడు. 33  అప్పుడు శిష్యులు, “ఆయన కోసం ఎవరు ఆహారం తెచ్చివుంటారు?” అని మాట్లాడుకున్నారు. 34  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడం,+ ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.+ 35  పంట కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉందని మీరు చెప్తున్నారు కదా? ఇదిగో! నేను మీతో చెప్తున్నాను: మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి.*+ 36  కోత కోసేవాడు ఇప్పటికే తన జీతం తీసుకుంటూ శాశ్వత జీవితం కోసం పంటను సమకూరుస్తున్నాడు. దానివల్ల విత్తేవాడు, కోసేవాడు కలిసి సంతోషిస్తారు.+ 37  ఈ విషయంలో, ‘విత్తేవాడు ఒకడు, కోసేవాడు ఒకడు’ అనే మాట నిజం. 38  మీరు కష్టపడని పంటను కోయడానికి మిమ్మల్ని పంపించాను. వేరేవాళ్లు కష్టపడ్డారు, మీరు వాళ్ల కష్టం నుండి ప్రయోజనం పొందారు.” 39  ఆ స్త్రీ, “నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు” అని ఇచ్చిన సాక్ష్యంవల్ల+ ఆ నగరంలోని చాలామంది సమరయులు ఆయనమీద విశ్వాసం ఉంచారు. 40  వాళ్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన్ని తమతోపాటు ఉండమని అడిగారు. ఆయన రెండురోజులు అక్కడే ఉన్నాడు. 41  దానివల్ల, ఆయన బోధించిన వాటిని విని ఇంకా చాలామంది నమ్మకం ఉంచారు. 42  వాళ్లు ఆ స్త్రీతో, “మేము ఇప్పటినుండి కేవలం నీ మాటల్ని బట్టే నమ్మట్లేదు; మేమే స్వయంగా ఆయన మాటలు విన్నాం, ఆయన నిజంగా లోక రక్షకుడని+ మాకు అర్థమైంది” అన్నారు. 43  ఆ రెండు రోజుల తర్వాత ఆయన అక్కడి నుండి గలిలయకు బయల్దేరాడు. 44  అయితే, ప్రవక్తకు తన సొంత దేశంలో గౌరవం ఉండదని యేసే స్వయంగా చెప్పాడు.+ 45  ఆయన గలిలయకు వచ్చినప్పుడు, అక్కడివాళ్లు ఆయన్ని స్వాగతించారు; ఎందుకంటే పండుగ సమయంలో ఆయన యెరూషలేములో చేసిన వాటన్నిటినీ వాళ్లు చూశారు.+ వాళ్లు కూడా ఆ పండుగకు వెళ్లారు.+ 46  తర్వాత ఆయన మళ్లీ గలిలయలోని కానాకు వచ్చాడు, ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది అక్కడే.+ అప్పుడు కపెర్నహూములోని ఒక రాజసేవకుడి కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 47  యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతను విని, యేసు దగ్గరికి వెళ్లి, తన కుమారుణ్ణి బాగుచేయడానికి కపెర్నహూముకు రమ్మని వేడుకున్నాడు. అతని కుమారుడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. 48  అయితే యేసు అతనితో, “సూచనలు, అద్భుతాలు చూస్తేనే గానీ మీరు అస్సలు నమ్మరు” అన్నాడు.+ 49  అప్పుడు రాజసేవకుడు, “ప్రభువా, మా అబ్బాయి చనిపోకముందే నాతో రా” అని యేసును వేడుకున్నాడు. 50  యేసు అతనితో, “వెళ్లు, మీ అబ్బాయి బాగయ్యాడు”+ అని చెప్పాడు. అతను యేసు చెప్పిన మాటను నమ్మి వెళ్లిపోయాడు. 51  అతను వెళ్తుండగా దారిలో అతని దాసులు ఎదురొచ్చి, మీ అబ్బాయి బాగయ్యాడని చెప్పారు. 52  అతను వాళ్లను ఎన్నింటికి బాగయ్యాడని అడిగాడు. వాళ్లు, “నిన్న దాదాపు మధ్యాహ్నం ఒంటిగంటకు* జ్వరం తగ్గిపోయింది” అని చెప్పారు. 53  “మీ అబ్బాయి బాగయ్యాడు” అని యేసు చెప్పింది సరిగ్గా అప్పుడే అని ఆ తండ్రికి అర్థమైంది.+ దాంతో అతను, అతని ఇంటివాళ్లందరూ విశ్వాసులయ్యారు. 54  ఇది, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాక చేసిన రెండో అద్భుతం.+

అధస్సూచీలు

లేదా “ఊట; బుగ్గ.”
అక్ష., “దాదాపు ఆరో గంట.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “తెల్లబారి ఉన్నాయి.”
అక్ష., “ఏడో గంటకు.”