యోహాను సువార్త 7:1-52

  • గుడారాల పండుగలో యేసు (1-13)

  • పండుగలో యేసు బోధించడం (14-24)

  • క్రీస్తు గురించి వేర్వేరు అభిప్రాయాలు (25-52)

7  తర్వాత, యేసు గలిలయలోనే తిరుగుతూ ప్రకటించాడు. యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తుండడం వల్ల ఆయన యూదయలో ప్రకటించడానికి ఇష్టపడలేదు.+  అయితే, యూదుల గుడారాల* పండుగ+ దగ్గరపడింది.  కాబట్టి ఆయన తమ్ముళ్లు+ ఆయనతో ఇలా అన్నారు: “నువ్వు ఇక్కడి నుండి బయల్దేరి యూదయకు వెళ్లు, అప్పుడు నువ్వు చేస్తున్న పనుల్ని నీ శిష్యులు కూడా చూడగలుగుతారు.  అందరూ తనను తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తి ఏ పనినీ రహస్యంగా చేయడు. నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, నిన్ను నువ్వు లోకానికి చూపించుకో.”  నిజానికి ఆయన తమ్ముళ్లు ఆయనమీద విశ్వాసం ఉంచలేదు.+  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నా సమయం ఇంకా రాలేదు,+ కానీ మీకైతే ఏ సమయమైనా సరైనదే.  లోకం మిమ్మల్ని ద్వేషించడానికి ఏ కారణమూ లేదు. అయితే లోకం నన్ను ద్వేషిస్తుంది, ఎందుకంటే దాని పనులు చెడ్డగా ఉన్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను.+  మీరు పండుగకి వెళ్లండి. నేను ఇప్పుడే రావట్లేదు, నా సమయం ఇంకా రాలేదు.”+  ఆయన వాళ్లకు ఈ విషయాలు చెప్పిన తర్వాత గలిలయలోనే ఉండిపోయాడు. 10  అయితే ఆయన తమ్ముళ్లు పండుగకి వెళ్లిన తర్వాత, ఆయన కూడా రహస్యంగా పండుగకి వెళ్లాడు. 11  పండుగలో యూదులు, “ఆయన ఎక్కడున్నాడు?” అంటూ ఆయన కోసం వెదకడం మొదలుపెట్టారు. 12  చాలామంది ఆయన గురించి రహస్యంగా మాట్లాడుకున్నారు. కొంతమంది, “ఆయన మంచివాడు” అని అంటే ఇంకొంతమంది, “ఆయన మంచివాడు కాదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు” అన్నారు.+ 13  అయితే యూదులకు భయపడి ఎవ్వరూ ఆయన గురించి బయటికి మాట్లాడేవాళ్లు కాదు.+ 14  పండుగ సగం అయిపోయాక యేసు ఆలయంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు. 15  అప్పుడు యూదులు ఎంతో ఆశ్చర్యపోయి, “పాఠశాలల్లో* చదువుకోని ఈయనకు లేఖనాలు* ఇంత బాగా ఎలా తెలుసు?”+ అన్నారు.+ 16  దానికి యేసు ఇలా అన్నాడు: “నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన వ్యక్తిదే.+ 17  ఎవరైనా దేవుని ఇష్టాన్ని చేయాలని కోరుకుంటే, నేను చేసే బోధ దేవుని నుండి వచ్చిందో, నా అంతట నేనే బోధిస్తున్నానో అతనికి తెలుస్తుంది.+ 18  సొంత ఆలోచనల్ని బోధించే ప్రతీ వ్యక్తి సొంత మహిమ కోసం చూసుకుంటాడు. అయితే తనను పంపిన వ్యక్తికి మహిమ తేవాలని కోరుకునే వ్యక్తి+ సత్యవంతుడు, అతనిలో ఏ అబద్ధమూ లేదు. 19  మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు+ కదా? కానీ మీలో ఒక్కరు కూడా దాన్ని పాటించట్లేదు. మీరెందుకు నన్ను చంపాలని చూస్తున్నారు?”+ 20  అప్పుడు ఆ ప్రజలు, “నీకు చెడ్డదూత* పట్టాడు. నిన్ను ఎవరు చంపాలని చూస్తున్నారు?” అన్నారు. 21  దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చేసిన* ఒక్క పనికి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. 22  దీని గురించి ఆలోచించండి: మోషే మీకు సున్నతి గురించిన నియమం ఇచ్చాడు+ (నిజానికి అది మోషే కాలంలో కాదు అతని పూర్వీకుల కాలంలోనే వచ్చింది).+ విశ్రాంతి రోజున మీరు ఒక వ్యక్తికి సున్నతి చేస్తారు. 23  మోషే ధర్మశాస్త్రాన్ని మీరకూడదని ఒక వ్యక్తి విశ్రాంతి రోజున సున్నతి పొందుతాడు కదా, అలాంటిది నేను విశ్రాంతి రోజున ఒక వ్యక్తిని పూర్తిగా బాగుచేశానని+ నామీద ఎందుకు కోపంతో మండిపడుతున్నారు? 24  పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయంగా తీర్పు తీర్చండి.”+ 25  అప్పుడు కొంతమంది యెరూషలేము నివాసులు ఇలా చెప్పుకోవడం మొదలుపెట్టారు: “వాళ్లు చంపాలని చూస్తున్నది ఈయన్నే కదా?+ 26  అయినా చూడండి! ఈయన అందరిముందు మాట్లాడుతున్నా వాళ్లు ఈయన్ని ఏమీ అనట్లేదు. ఈయనే క్రీస్తు అని మన నాయకులకు నిజంగా తెలిసిపోయిందా ఏంటి? 27  ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు;+ అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలీదు.” 28  యేసు ఆలయంలో బోధిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “నేను ఎవర్నో, ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు.+ నన్ను పంపిన వ్యక్తి నిజమైనవాడు,* ఆయన మీకు తెలీదు.+ 29  కానీ నాకు ఆయన తెలుసు,+ ఎందుకంటే నేను ఆయన దగ్గర నుండి* వచ్చాను; ఆయనే నన్ను పంపించాడు.” 30  అప్పుడు వాళ్లు ఆయన్ని పట్టుకోవాలని చూశారు,+ కానీ ఎవ్వరూ ఆయనమీద చెయ్యి వేయలేకపోయారు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు.+ 31  అయినా ప్రజల్లో చాలామంది ఆయనమీద విశ్వాసం ఉంచారు.+ వాళ్లు, “క్రీస్తు వచ్చినప్పుడు, ఈయన చేసిన అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాడా?” అని అనుకున్నారు. 32  ప్రజలు యేసు గురించి ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్నారని పరిసయ్యులు విన్నారు, దాంతో ముఖ్య యాజకులు, పరిసయ్యులు ఆయన్ని పట్టుకోవడానికి* భటుల్ని పంపించారు. 33  అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నేను ఇంకా కొంతకాలమే మీతో ఉంటాను, తర్వాత నన్ను పంపిన తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను.+ 34  మీరు నాకోసం వెదుకుతారు కానీ నన్ను కనుక్కోలేరు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.”+ 35  దాంతో యూదులు తమలో తాము ఇలా అనుకున్నారు: “మనం కనుక్కోకుండా ఉండేలా ఈయన ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాడు? గ్రీకువాళ్ల మధ్య చెదిరిపోయిన యూదుల దగ్గరికి వెళ్లి గ్రీకువాళ్లకు ప్రకటించాలని అనుకుంటున్నాడా? 36  ‘మీరు నాకోసం వెదుకుతారు కానీ నన్ను కనుక్కోలేరు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని అనడంలో ఈయన ఉద్దేశం ఏంటి?” 37  పండుగలో చివరి రోజు మిగతా రోజులకన్నా చాలా ముఖ్యమైనది.+ ఆ రోజున యేసు నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “ఎవరికైనా దాహంగా ఉంటే, నా దగ్గరికి రావాలి. నేను అతనికి నీళ్లు ఇస్తాను.+ 38  ఎవరైనా నామీద విశ్వాసం ఉంచితే, లేఖనం చెప్తున్నట్టుగా ‘అతని హృదయంలో నుండి జీవజలాల ధారలు ప్రవహిస్తాయి.’ ”+ 39  అయితే, తనమీద విశ్వాసం ఉంచేవాళ్లు పొందబోతున్న పవిత్రశక్తి గురించి యేసు ఆ మాట చెప్పాడు. అప్పటికి వాళ్లు ఇంకా పవిత్రశక్తిని పొందలేదు,+ ఎందుకంటే యేసు ఇంకా మహిమపర్చబడలేదు.+ 40  ఆ మాటలు విన్నప్పుడు ప్రజల్లో కొంతమంది, “రావాల్సిన ఆ ప్రవక్త నిజంగా ఈయనే” అని అనడం మొదలుపెట్టారు.+ 41  కొంతమంది, “ఈయనే క్రీస్తు”+ అని అన్నారు. కానీ ఇంకొంతమంది ఇలా అన్నారు: “క్రీస్తు గలిలయ నుండి రాడు కదా?+ 42  క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ,+ దావీదు ఊరైన బేత్లెహేము+ నుండే వస్తాడనీ లేఖనం చెప్పట్లేదా?” 43  దాంతో ఆయన గురించి ప్రజల్లో అభిప్రాయభేదం తలెత్తింది. 44  అయితే కొంతమంది ఆయన్ని పట్టుకోవాలని* అనుకున్నారు, కానీ ఎవ్వరూ ఆయనమీద చెయ్యి వేయలేకపోయారు. 45  ఆ భటులు ముఖ్య యాజకుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి తిరిగెళ్లినప్పుడు వాళ్లు, “మీరు ఆయన్ని ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు. 46  దానికి ఆ భటులు, “ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు”+ అని చెప్పారు. 47  అప్పుడు పరిసయ్యులు వాళ్లతో ఇలా అన్నారు: “మీరు కూడా మోసపోయారా ఏంటి? 48  నాయకుల్లో, పరిసయ్యుల్లో ఒక్కరైనా ఆయనమీద విశ్వాసం ఉంచారా, లేదు కదా?+ 49  అయితే ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజలు శపించబడిన వాళ్లు.” 50  ఆ పరిసయ్యుల్లో, అంతకుముందు యేసు దగ్గరికి వచ్చిన నీకొదేము కూడా ఉన్నాడు. అతను వాళ్లతో ఇలా అన్నాడు: 51  “మన ధర్మశాస్త్రం ప్రకారం, ముందు ఒక వ్యక్తి చెప్పేది విని, అతను ఏంచేస్తున్నాడో తెలుసుకోకుండా అతనికి తీర్పు తీర్చలేం కదా?”+ 52  దానికి వాళ్లు అతనితో, “నువ్వు కూడా గలిలయ నుండే వచ్చావా ఏంటి? లేఖనాల్ని పరిశీలించి చూడు, గలిలయలో నుండి ఏ ప్రవక్తా రాడు” అన్నారు.*

అధస్సూచీలు

లేదా “పర్ణశాలల.”
అంటే, రబ్బీల పాఠశాలల్లో.
అక్ష., “రాతలు.”
పదకోశం చూడండి.
లేదా “విశ్రాంతి రోజున చేసిన.”
లేదా “నిజంగా ఉన్నాడు.”
లేదా “ప్రతినిధిగా.”
లేదా “బంధించడానికి.”
లేదా “బంధించాలని.”
ఎన్నో ముఖ్యమైన ప్రాచీన అధికారిక రాతప్రతుల్లో యోహాను 7:53–8:11 వచనాలు లేవు.