రెండో పేతురు 1:1-21

  • శుభాకాంక్షలు (1)

  • మీ పిలుపును కాపాడుకోవడానికి శాయశక్తులా కృషిచేయండి (2-15)

    • విశ్వాసానికి జోడించాల్సిన లక్షణాలు (5-9)

  • ప్రవచన వాక్యం మీద నమ్మకం మరింత ​బలపర్చబడింది (16-21)

1  మన దేవుని నీతిని బట్టి, రక్షకుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి మా లాంటి అమూల్యమైన విశ్వాసాన్ని సంపాదించుకున్న వాళ్లకు, యేసుక్రీస్తు దాసుడూ అపొస్తలుడూ అయిన సీమోను పేతురు రాస్తున్న ఉత్తరం.  దేవుని గురించిన, మన ప్రభువైన యేసు గురించిన సరైన జ్ఞానం ద్వారా మీరు దేవుని అపారదయను, శాంతిని ఇంకా ఎక్కువగా పొందాలని కోరుకుంటున్నాను.  దైవభక్తితో జీవించడానికి కావాల్సినవన్నీ దేవుడు తన శక్తితో మనకు అనుగ్రహించాడు.* తన గురించిన సరైన జ్ఞానం ద్వారా అలా అనుగ్రహించాడు.+ తన మహిమను బట్టి, మంచితనాన్ని బట్టి ఆయనే మనల్ని పిలిచాడు.  వాటి ద్వారా ఆయన అమూల్యమైన, ఎంతో గొప్పవైన వాగ్దానాల్ని+ మనకు అనుగ్రహించాడు.* మనం తప్పుడు కోరికల* వల్ల కలిగే ఈ లోక కల్మషం నుండి తప్పించుకున్నాం కాబట్టి, ఆ వాగ్దానాల ద్వారా మనం తనలాంటి పరలోక సంబంధమైన శరీరాన్ని పొందాలని+ దేవుడు అలా చేశాడు.  అందుకే, మీరు శాయశక్తులా కృషిచేస్తూ+ మీ విశ్వాసానికి మంచితనాన్ని,+ మీ మంచితనానికి జ్ఞానాన్ని,+  మీ జ్ఞానానికి ఆత్మనిగ్రహాన్ని, మీ ఆత్మనిగ్రహానికి+ సహనాన్ని, మీ సహనానికి దైవభక్తిని,+  మీ దైవభక్తికి సహోదర అనురాగాన్ని, మీ సహోదర అనురాగానికి ప్రేమను జోడించండి.+  ఈ లక్షణాలు మీలో సమృద్ధిగా ఉంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సరైన జ్ఞానం విషయంలో మీరు సోమరులుగా ఉండరు, ప్రగతి సాధించకుండా* ఉండరు.+  ఎవరికైనా ఈ లక్షణాలు లేకపోతే అతను గుడ్డివాడు, వెలుగును చూడకుండా అతను తన కళ్లు మూసుకున్నాడు,*+ అతను గతంలో చేసిన పాపాల్ని దేవుడు కడిగేశాడనే+ విషయాన్ని అతను మర్చిపోయాడు. 10  సహోదరులారా, మిమ్మల్ని దేవుడు పిలిచాడు,+ ఎంచుకున్నాడు కాబట్టి ఆ అర్హతను కాపాడుకోవడానికి శాయశక్తులా కృషిచేయండి; మీరు ఆ లక్షణాల్ని అలవర్చుకుంటూ ఉంటే, అసలెన్నడూ విఫలం కారు.+ 11  నిజానికి ఈ విధంగా మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు శాశ్వత రాజ్యంలోకి+ మీకు ఘనస్వాగతం లభిస్తుంది.+ 12  అందుకే, మీకు ఈ విషయాలు తెలిసినా సరే, మీరు నేర్చుకున్న సత్యంలో మీరు దృఢంగా ఉన్నా సరే, వాటిని మీకు గుర్తుచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. 13  నేను ఈ శరీరంలో*+ ఉన్నంతకాలం మీకు జ్ఞాపికలు ఇస్తూ+ మిమ్మల్ని పురికొల్పడం సరైనదని అనుకుంటున్నాను. 14  ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నాకు స్పష్టం చేసినట్టు,+ ఈ శరీరం* నాకు ఇంక కొంతకాలమే ఉంటుందని నాకు తెలుసు. 15  నేను వెళ్లిపోయిన తర్వాత మీ అంతట మీరే ఈ విషయాలు గుర్తుచేసుకునేలా, నేను ఎల్లప్పుడూ చేయగలిగినదంతా చేస్తాను. 16  మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గురించి, ప్రత్యక్షత గురించి మేము మీకు చెప్పినప్పుడు, తెలివిగా అల్లిన కట్టుకథల ఆధారంగా దాన్ని మీకు తెలియజేయలేదు. కానీ ఆయన గొప్ప మహిమను మేము కళ్లారా చూశాం,+ దాని ఆధారంగానే మీకు తెలియజేశాం. 17  గొప్ప మహిమగల దేవుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను”*+ అని ఆయనకు చెప్పినప్పుడు తండ్రైన దేవుని నుండి ఆయన ఘనతను, మహిమను పొందాడు. 18  అవును, మేము ఆయనతో పాటు పవిత్రమైన కొండ మీద ఉన్నప్పుడు ఆకాశం నుండి ఆ మాటలు రావడం విన్నాం. 19  కాబట్టి ప్రవచన వాక్యం మీద మనకున్న నమ్మకం మరింత బలపర్చబడింది. మీరు ఆ వాక్యం మీద మనసుపెట్టి మంచిపని చేస్తున్నారు. ఎందుకంటే (తెల్లవారి, వేకువ చుక్క+ ఉదయించే వరకు) చీకటిగా ఉన్న చోట వెలిగే దీపంలా+ ఆ వాక్యం మీ హృదయాల్లో వెలుగుతోంది. 20  లేఖనాల్లో ఏ ప్రవచనం సొంత ఆలోచనల నుండి పుట్టదని మీకు తెలుసు. 21  ఎందుకంటే ప్రవచనం ఎప్పుడూ మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు+ కానీ మనుషులు పవిత్రశక్తితో ప్రేరేపించబడి,+ దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.

అధస్సూచీలు

లేదా “ఉచితంగా ఇచ్చాడు.”
లేదా “ఉచితంగా ఇచ్చాడు.”
లేదా “వాంఛల.”
లేదా “నిష్ఫలులుగా.”
లేదా “గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు” అయ్యుంటుంది.
లేదా “డేరాలో.”
లేదా “డేరా.”
అక్ష., “ఈయన్ని నేను ఆమోదించాను.”