రెండో పేతురు 2:1-22
2 అయితే, ఇశ్రాయేలు ప్రజల మధ్య అబద్ధ ప్రవక్తలు కూడా బయల్దేరారు. అలాగే మీ మధ్య కూడా అబద్ధ బోధకులు ఉంటారు.+ వీళ్లు రహస్యంగా విభజనలు* సృష్టిస్తారు, అవి మీ విశ్వాసాన్ని పాడుచేస్తాయి. అంతేకాదు వాళ్లు తమను కొన్న యజమానిని+ కూడా వదిలేస్తారు. అలా తమ మీదికి తాము వేగంగా నాశనాన్ని కొనితెచ్చుకుంటారు.
2 వాళ్ల లెక్కలేనితనాన్ని*+ చాలామంది అనుసరిస్తారు, వాళ్ల కారణంగా ప్రజలు సత్యమార్గం గురించి చెడుగా మాట్లాడుకుంటారు.+
3 అంతేకాదు, వాళ్లు అత్యాశపరులు కాబట్టి మోసపూరిత మాటలతో మిమ్మల్ని తమ స్వార్థానికి వాడుకుంటారు. అయితే, ఎంతోకాలం క్రితమే వాళ్లకోసం నిర్ణయించబడిన తీర్పు+ ఆలస్యం కాదు, వాళ్లు తప్పక నాశనమౌతారు.+
4 పాపం చేసిన దేవదూతల్ని+ దేవుడు శిక్షించకుండా వదిలేయలేదు, వాళ్లను టార్టరస్‌లో* పడేశాడు.+ తీర్పు కోసం వాళ్లను కటిక చీకట్లో సంకెళ్లతో* బంధించాడు.+
5 అలాగే, ప్రాచీన లోకాన్ని కూడా ఆయన శిక్షించకుండా విడిచిపెట్టలేదు.+ బదులుగా, భక్తిహీన లోకం మీదికి జలప్రళయాన్ని తీసుకొచ్చాడు;+ నీతిని ప్రకటించిన నోవహును,+ మరో ఏడుగుర్ని రక్షించాడు.+
6 అంతేకాదు దేవుడు సొదొమ, గొమొర్రా నగరాల్ని బూడిద చేసి వాటిని శిక్షించాడు.+ ఇది భక్తిహీనులకు జరగబోయేదానికి ఒక నమూనాగా ఉంది.+
7 అలాగే, దుష్టుల లెక్కలేనితనాన్ని* చూసి చాలా బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించాడు.+
8 ఎందుకంటే, ఆ నీతిమంతుడు దుష్టుల మధ్య నివసిస్తున్నప్పుడు వాళ్లు చేస్తున్న చెడ్డపనుల్ని చూసి, వాటి గురించి విని ప్రతీరోజు చాలా బాధపడేవాడు.
9 కాబట్టి, దైవభక్తిగల ప్రజల్ని కష్టాల* నుండి ఎలా తప్పించాలో, తీర్పు రోజున జరిగే నాశనం కోసం అనీతిమంతుల్ని+ ఎలా వేరుగా ఉంచాలో యెహోవాకు* తెలుసు.+
10 ముఖ్యంగా, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇతరుల్ని అపవిత్రం చేయాలని చూసేవాళ్లను,+ అధికారాన్ని ధిక్కరించేవాళ్లను+ ఎలా వేరుగా ఉంచాలో దేవునికి తెలుసు.
వాళ్లు తెగింపుతో, గర్వంతో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ల గురించి అమర్యాదగా మాట్లాడడానికి భయపడరు.
11 కానీ దేవదూతల విషయానికొస్తే, వాళ్లకు ఈ అబద్ధ బోధకుల కన్నా ఎక్కువ బలం, శక్తి ఉన్నప్పటికీ యెహోవా* మీద గౌరవంవల్ల వాళ్లు అవమానకరమైన మాటలతో ఆ బోధకుల్ని నిందించరు.+
12 అయితే ఈ అబద్ధ బోధకులు మాత్రం, సహజ ప్రవృత్తి ప్రకారం ప్రవర్తించే విచక్షణలేని జంతువుల్లా, పట్టబడి నాశనం చేయబడడానికే పుట్టే జంతువుల్లా తమకు తెలియనివాటి గురించి అవమానకరంగా మాట్లాడతారు.+ వాళ్లు తమ నాశనకరమైన ప్రవర్తన వల్ల తామే నాశనమౌతారు,
13 వాళ్ల హానికరమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా వాళ్లకే హాని జరుగుతుంది.
వాళ్లు పట్టపగలే శరీర కోరికల్ని తీర్చుకుంటూ అదే సంతోషం అనుకుంటారు.+ వాళ్లు మీ మధ్య మచ్చ లాంటివాళ్లు, మురికి లాంటివాళ్లు. వాళ్లు విందుల్లో మీతో కలిసివుంటూనే, తమ మోసపూరిత బోధల్ని వ్యాప్తిచేస్తూ ఇతరుల్ని తప్పుదోవ పట్టించడంలో ఎక్కడలేని ఆనందం పొందుతారు.+
14 వాళ్ల కళ్లు కామంతో నిండివుంటాయి;+ వాళ్లు పాపం చేయడం మానుకోలేరు; వాళ్లు విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్లను బుట్టలో వేసుకుంటారు. వాళ్ల హృదయం నిండా అత్యాశే.* వాళ్లు శపించబడిన పిల్లలు.
15 వాళ్లు తిన్నని దారిని విడిచిపెట్టి తప్పుదోవ పట్టారు, బహుమతిని పొందాలనే విపరీతమైన కోరికతో+ తప్పు చేసిన బెయోరు కుమారుడైన బిలాము బాటలో నడిచారు.+
16 అతను తాను చేసిన తప్పు వల్ల గద్దించబడ్డాడు.+ నోరులేని గాడిద మనిషి స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త చేయబోతున్న వెర్రి పనిని అడ్డుకుంది.+
17 ఆ అబద్ధ బోధకులు నీళ్లులేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు. వాళ్ల కోసం కటిక చీకటి సిద్ధం చేయబడి ఉంది.+
18 వాళ్లు ఇతరుల్ని ముగ్ధుల్ని చేసే విషయాలు మాట్లాడతారు, కానీ వాటిలో ఏమీ ఉండదు. శరీర కోరికల్ని రేపడం ద్వారా,+ లెక్కలేనట్టు* ప్రవర్తించడం ద్వారా వాళ్లు, తప్పుదారిలో నడిచే ప్రజల నుండి ఇప్పుడిప్పుడే తప్పించుకున్నవాళ్లను బుట్టలో వేసుకుంటారు.+
19 తాము చెప్పినట్టు చేస్తే స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు ఇతరులకు వాగ్దానం చేస్తారు, కానీ వాళ్లే భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నారు;+ ఎందుకంటే ఒక వ్యక్తి దేనికైనా లొంగిపోయాడంటే అతను దానికి దాసుడైనట్టే.*+
20 ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు గురించిన సరైన జ్ఞానం ద్వారా ఈ లోకంలోని పాపపు బురద నుండి బయటపడిన తర్వాత+ మళ్లీ అవే చెడ్డపనులు చేస్తూ వాటికి దాసులైతే, వాళ్ల చివరి స్థితి వాళ్ల మొదటి స్థితి కన్నా ఘోరంగా ఉంటుంది.+
21 వాళ్లు నీతిమార్గం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత పవిత్రమైన ఆజ్ఞల్ని విడిచిపెట్టడం కన్నా, అసలు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఉంటేనే బాగుండేది.+
22 వాళ్ల విషయంలో ఈ సామెత నిజమైంది: “కుక్క తన వాంతి దగ్గరికి తిరిగెళ్లింది; కడగబడిన పంది మళ్లీ బురదలో దొర్లడానికి వెళ్లింది.”+
అధస్సూచీలు
^ అక్ష., “నాశనకరమైన తెగలు.”
^ లేదా “కటిక చీకటి ఉన్న అగాధాల్లో” అయ్యుంటుంది.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “పరీక్షల.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “అత్యాశ చూపించే విషయంలో వాళ్ల హృదయం ఆరితేరింది.”
^ లేదా “ఎవరికైనా లొంగిపోయాడంటే అతనికి దాసుడైనట్టే.”