కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే మీకూ ఉందా?

పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే మీకూ ఉందా?

పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే మీకూ ఉందా?

“మీలో ఎవడైనను . . . భ్రష్టుడైనను [‘పవిత్ర విషయాలను విలువైనవిగా ఎంచనివాడైనను,’ NW] వ్యభిచారియైనను ఉండునేమో అనియు, . . . జాగ్రత్తగా చూచుకొనుడి.”​—⁠హెబ్రీయులు 12:​15, 16.

లోకంలోని ప్రజలు సాధారణంగా పవిత్ర విషయాలకు అంతకంతకూ చాలా తక్కువ అవధానమిస్తున్నారు. ఫ్రెంచ్‌ సామాజికవేత్త ఎడ్గర్‌ ఇలా అన్నాడు: “నైతిక విలువలు ఆధారపడిన పునాదులన్నీ అంటే దేవుడు, సృష్టి, మాతృభూమి, చరిత్ర, తర్కం అనేవి తమ సహజ పట్టును కోల్పోయాయి. . . . ప్రజలే ప్రమాణాలను ఎంచుకుని ఏర్పరచుకుంటున్నారు.” ఇలాంటి పరిస్థితి “లౌకికాత్మ”ను లేదా “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి”ని ప్రతిబింబిస్తోంది. (1 కొరింథీయులు 2:​12; ఎఫెసీయులు 2:⁠2) అయితే యెహోవాకు సమర్పించుకుని, న్యాయబద్ధమైన ఆయన సర్వాధిపత్యానికి ఇష్టపూర్వకంగా లోబడేవారు అలాంటి అమర్యాదకర స్వభావాన్ని ఆమోదించరు. (రోమీయులు 12:​1, 2) బదులుగా, దేవుని సేవకులు యెహోవాకు తాముచేసే ఆరాధనలో పవిత్రతకు, పరిశుద్ధతకున్న ప్రముఖ స్థానమేమిటో గ్రహిస్తారు. మన జీవితంలో ఏ విషయాలు పవిత్రమైనవిగా ఉండాలి? ఈ ఆర్టికల్‌, దేవుని సేవకులందరూ పరిశుద్ధమని పరిగణించే ఐదు విషయాలను చర్చిస్తుంది. తర్వాతి ఆర్టికల్‌, మన క్రైస్తవ కూటాల పవిత్రత గురించి చర్చిస్తుంది. అసలు “పరిశుద్ధత” అంటే ఏమిటి?

2 బైబిలు సంబంధిత హీబ్రూ భాషలో “పరిశుద్ధత” అనే పదం ప్రత్యేకంగా ఉండడమనే అర్థాన్నిస్తోంది. ఆరాధనలో, “పరిశుద్ధత” అనే పదం సాధారణంగా ఉపయోగించే వాటినుండి ప్రత్యేకంగా ఉంచబడినదానికి లేదా పవిత్రంగా పరిగణించబడినదానికి అన్వయిస్తుంది. యెహోవా సంపూర్ణ భావంలో పరిశుద్ధుడు. ఆయన “[‘అతి,’ NW]పరిశుద్ధ దేవుడు” అని పిలవబడ్డాడు. (సామెతలు 9:​10; 30:⁠3) ప్రాచీన ఇశ్రాయేలీయులలో, ప్రధానయాజకుడు బంగారు రేకుపై “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు చెక్కబడిన తలపాగాను ధరించేవాడు. (నిర్గమకాండము 28:​36, 37) పరలోకంలో యెహోవా సింహాసనం చుట్టూ నిలబడిన కెరూబులు, సెరాపులు, “యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” అని ప్రకటిస్తున్నట్లు లేఖనాల్లో వర్ణించబడ్డారు. (యెషయా 6:​2, 3; ప్రకటన 4:6-8) అలా మూడుసార్లు చెప్పడం యెహోవా సర్వోన్నత స్థాయిలో పరిశుద్ధుడని, నిర్మలుడని, పవిత్రుడని నొక్కిచెబుతోంది. వాస్తవానికి, సమస్త పరిశుద్ధతకు ఆయనే మూలాధారం.

3 యెహోవా నామము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కీర్తనకర్త ఎలుగెత్తి ఇలా చెప్పాడు: “భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు.” (కీర్తన 99:⁠3) “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని ప్రార్థించమని యేసు మనకు నేర్పించాడు. (మత్తయి 6:⁠9) యేసు భూసంబంధ తల్లియైన మరియ ఇలా ప్రకటించింది: “నా ప్రాణము ప్రభువును [‘యెహోవాను,’ NW]ఘనపరచుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను . . . ఆయన నామము పరిశుద్ధము.” (లూకా 1:​46, 49) యెహోవా సేవకులుగా మనం ఆయన నామాన్ని పరిశుద్ధంగా దృష్టిస్తూ, ఆ నామానికి కళంకం తీసుకురాగల ఎలాంటి పనీ చేయం. అంతేగాక, పవిత్రతపట్ల యెహోవాకున్న దృక్కోణాన్నే మనమూ కలిగివుంటాం, అంటే ఆయన పవిత్రమని పరిగణించే విషయాలను మనం కూడా పవిత్రమైన విషయాలుగానే పరిగణిస్తాం.​—⁠ఆమోసు 5:​14, 15.

యేసుపట్ల మనకెందుకు ప్రగాఢ గౌరవముంది?

4 పరిశుద్ధుడైన యెహోవా దేవుని “అద్వితీయ కుమారుని”గా యేసు పరిశుద్ధునిగా సృష్టించబడ్డాడు. (యోహాను 1:​14; కొలొస్సయులు 1:​15; హెబ్రీయులు 1:​1-3) అందుకే ఆయన ‘దేవుని పరిశుద్ధుడు’ అని పిలవబడ్డాడు. (యోహాను 6:​69) మరియ పరిశుద్ధాత్మ మూలంగా యేసుకు జన్మనిచ్చింది కాబట్టి, ఆయన జీవం పరలోకం నుండి భూమ్మీదికి మార్చబడినప్పుడు కూడా ఆయన పరిశుద్ధునిగానే ఉన్నాడు. దేవదూత ఆమెకిలా చెప్పాడు: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును . . . పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” (లూకా 1:​35) యెహోవాకు చేసిన ప్రార్థనలో, యెరూషలేములోని క్రైస్తవులు దేవుని కుమారుణ్ణి “నీ పరిశుద్ధ సేవకుడైన యేసు” అని రెండుసార్లు సంబోధించారు.​—⁠అపొస్తలుల కార్యములు 4:​27, 30.

5 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఒక పవిత్ర కార్యం నెరవేర్చవలసి ఉంది. యేసు సా.శ. 29లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి ప్రధానయాజకునిగా అభిషేకించబడ్డాడు. (లూకా 3:​21, 22; హెబ్రీయులు 7:​26; 8:​1, 2) అంతేగాక, ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాలి. ఆయన చిందించిన రక్తం పాపులైన మానవులు రక్షించబడేలా విమోచనను అందిస్తుంది. (మత్తయి 20:​28; హెబ్రీయులు 9:​14) అందుకే మనం యేసు రక్తాన్ని పవిత్రమైనదిగా, ‘అమూల్యమైనదిగా’ పరిగణిస్తాం.​—⁠1 పేతురు 1:​19.

6 మన రాజు, ప్రధానయాజకుడైన క్రీస్తుయేసును మనం ప్రగాఢంగా గౌరవిస్తామని చూపిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను [తన కుమారుణ్ణి] అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:​9-11) మన నాయకుడు, పరిపాలిస్తున్న రాజు, క్రైస్తవ సంఘానికి శిరస్సైన క్రీస్తుయేసుకు సంతోషంగా లోబడడం ద్వారా పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే మనకూ ఉందని చూపిస్తాం.​—⁠మత్తయి 23:​10; కొలొస్సయులు 1:​18.

7 క్రీస్తుకు విధేయత చూపించడంలో, ఆయనిప్పుడు నిర్దేశిస్తున్న పనిలో సారథ్యం వహించేందుకు ఆయన ఉపయోగిస్తున్న పురుషులపట్ల సరైన గౌరవం చూపించడం కూడా ఇమిడివుంది. పరిపాలక సభగా ఏర్పడే అభిషిక్త క్రైస్తవుల పాత్రను, వారు బ్రాంచి కార్యాలయాల్లో, జిల్లాల్లో, సర్క్యూట్లలో, సంఘాల్లో నియమించే పైవిచారణకర్తల పాత్రను పవిత్రమైన బాధ్యతగా గుర్తించాలి. కాబట్టి, ఈ ఏర్పాటుపట్ల మనం ప్రగాఢ గౌరవాన్ని, విధేయతను చూపించాలి.​—⁠హెబ్రీయులు 13:​7, 17.

పరిశుద్ధ ప్రజలు

8 యెహోవా ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన చేశాడు. ఈ సంబంధం ఆ కొత్త జనాంగానికి ఒక ప్రత్యేక హోదానిచ్చింది. అలా వారు పవిత్రపరచబడ్డారు లేదా ప్రత్యేకించబడ్డారు. యెహోవాయే వారికిలా చెప్పాడు: “మీరు నాకు పరిశుద్ధులైయుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.”​—⁠లేవీయకాండము 19:⁠2; 20:​25, 26.

9 ఇశ్రాయేలు జనాంగం ఆవిర్భవించినప్పుడే యెహోవా వారికి పవిత్రతకు సంబంధించిన సూత్రాన్ని నొక్కిచెప్పాడు. వారికి ప్రాణాపాయం కలగకుండా ఉండాలంటే, వారు తమకు పది ఆజ్ఞలు ఇవ్వబడిన పర్వతాన్ని సహితం ముట్టుకోకూడదు. కాబట్టి ఒక విధంగా ఆ కాలంలో సీనాయి పర్వతాన్ని పవిత్రంగా చూసేవారు. (నిర్గమకాండము 19:​12, 23) యాజకత్వాన్ని, ఆలయ గుడారాన్ని, దాని సంబంధిత ఉపకరణాల్ని కూడా పవిత్రంగా ఎంచాలి. (నిర్గమకాండము 30:⁠26-30) మరి క్రైస్తవ సంఘం మాటేమిటి?

10 యెహోవా దృష్టిలో అభిషిక్త క్రైస్తవ సంఘం పవిత్రమైనది. (1 కొరింథీయులు 1:⁠2) నిజానికి, భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవులు యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో భాగం కాకపోయినా, వారు భూమ్మీద ఏ కాలంలో జీవించినా ఒక గుంపుగా పరిశుద్ధ ఆలయంతో పోల్చబడ్డారు. పరిశుద్ధాత్మ మూలంగా యెహోవా ఆ ఆలయంలో నివసిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతి కట్టడమును ఆయనలో [క్రీస్తుయేసులో] చక్కగా అమర్చబడి, ప్రభువునందు [యెహోవాయందు] పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.”​—⁠ఎఫెసీయులు 2:​21, 22; 1 పేతురు 2:⁠5, 9.

11 అభిషిక్తులకు పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? . . . దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.” (1 కొరింథీయులు 3:​16, 17) యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా అభిషిక్తుల మధ్య ‘నివసిస్తాడు,’ ‘సంచరిస్తాడు.’ (2 కొరింథీయులు 6:​16-18) ఆయన తన నమ్మకమైన ‘దాసుణ్ణి’ ఎల్లప్పుడూ నడిపిస్తాడు. (మత్తయి 24:​45-47) “వేరే గొఱ్ఱెలు” ఆ “ఆలయ” తరగతి వారితో సహవసించేందుకు తమకున్న ఆధిక్యతను గౌరవిస్తారు.​—⁠యోహాను 10:​16; మత్తయి 25:​37-40.

మన క్రైస్తవ జీవితంలోని పవిత్రమైన విషయాలు

12 క్రైస్తవ సంఘానికి చెందిన అభిషిక్త సభ్యుల, వారి సహవాసుల జీవితాలకు సంబంధించిన అనేక విషయాలు పవిత్రంగా పరిగణించబడతాయనడంలో ఆశ్చర్యం లేదు. యెహోవాతో మనకున్న సంబంధం పవిత్రమైంది. (1 దినవృత్తాంతములు 28:⁠9; కీర్తన 36:⁠7) ఆ సంబంధం మనకెంత అమూల్యమైనదంటే మన దేవుడైన యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలహీనపర్చేలా దేనినీ, ఎవరినీ అనుమతించం. (2 దినవృత్తాంతములు 15:⁠2; యాకోబు 4:​7, 8) యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోవడంలో ప్రార్థన ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రవక్తయైన దానియేలు ప్రార్థనను ఎంత పవిత్రంగా పరిగణించాడంటే, ఆయన తన ప్రాణాలకు ముప్పువున్నా తన అలవాటు ప్రకారం ప్రార్థన చేయడం మానలేదు. (దానియేలు 6:​7-11) అభిషిక్త క్రైస్తవుల లేదా “పరిశుద్ధుల ప్రార్థనలు” దేవాలయ ఆరాధనలో ఉపయోగించబడిన ధూపంతో పోల్చబడింది. (ప్రకటన 5:⁠8; 8:​3, 4; లేవీయకాండము 16:​12, 13) ఈ సూచనార్థక పోలిక ప్రార్థనకున్న పవిత్రతను నొక్కిచెబుతోంది. విశ్వసర్వాధిపతితో సంభాషించగలగడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా! కాబట్టి, మన జీవితంలో ప్రార్థనకు పవిత్రస్థానముందనడంలో ఆశ్చర్యమే లేదు!

13 అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులు పవిత్రమని పరిగణించే ఒక శక్తి వారి జీవితాల్లోవుంది, అదే పరిశుద్ధాత్మ. అది యెహోవా చురుకైన శక్తి, అది ఎల్లప్పుడూ పరిశుద్ధ దేవుని చిత్తానికి అనుగుణంగా పనిచేస్తుంది కాబట్టి, అది “పరిశుద్ధాత్మ” లేదా “పరిశుద్ధమైన ఆత్మ” అని సరిగానే పిలువబడుతోంది. (యోహాను 14:​26; రోమీయులు 1:⁠1-4) పరిశుద్ధాత్మ ద్వారా, యెహోవా సువార్తను ప్రకటించే శక్తిని తన సేవకులకు ఇస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 1:⁠8; 4:​31) యెహోవా తన పరిశుద్ధాత్మను “తనకు విధేయులైనవారికి,” శరీరేచ్ఛలనుబట్టి కాక ‘ఆత్మానుసారంగా నడుచుకునే’ వారికి ఇస్తాడు. (అపొస్తలుల కార్యములు 5:​32; గలతీయులు 5:​16, 25; రోమీయులు 8:​5-8) ఈ బలమైన శక్తి “ఆత్మ ఫలాల” వంటి చక్కటి లక్షణాలను, “పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తిని” ప్రదర్శించేలా క్రైస్తవులకు శక్తినిస్తుంది. (గలతీయులు 5:​22; 2 పేతురు 3:​11) పరిశుద్ధాత్మను మనం పవిత్రమైనదిగా దృష్టిస్తే, ఆ ఆత్మను దుఃఖపరిచే లేదా మన జీవితాల్లో దాని క్రియను అడ్డుకొనే ఏ పనీ చేయం.​—⁠ఎఫెసీయులు 4:​30.

14పరిశుద్ధ దేవుడైన యెహోవా నామాన్ని ధరించి, ఆయనకు సాక్షులుగా ఉండే ఆధిక్యతను మనం పవిత్రంగా దృష్టిస్తాము. (యెషయా 43:​10-12, 15) ‘క్రొత్త నిబంధనకు పరిచారకులుగా’ ఉండేందుకు యెహోవా అభిషిక్త క్రైస్తవులను అర్హులుగా చేశాడు. (2 కొరింథీయులు 3:​5, 6) ఆ అర్హతనుబట్టి వారు, “ఈ రాజ్య సువార్తను” ప్రకటించి “సమస్త జనులను శిష్యులనుగా” చేయాలని ఆదేశించబడ్డారు. (మత్తయి 24:​14; 28:​19, 20) వారు తమకు అప్పగించబడిన పనిని నమ్మకంగా నెరవేరుస్తుండగా, లక్షలాదిమంది గొఱ్ఱెల్లాంటివారు స్పందిస్తూ, అభిషిక్తులతో సూచనార్థకంగా ఇలా అంటున్నారు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము.” (జెకర్యా 8:​23) వీరు ఆధ్యాత్మిక భావంలో, ‘మన దేవుని పరిచారకులైన’ అభిషిక్తుల కోసం “వ్యవసాయకులు”గా “ద్రాక్షతోట కాపరులు”గా ఆనందంగా సేవచేస్తారు. ఆ విధంగా, వేరే గొఱ్ఱెలు ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిచర్యను నెరవేర్చడంలో అభిషిక్తులకు చాలా సహాయం చేస్తున్నారు.​—⁠యెషయా 61:​5, 6.

15బహిరంగ పరిచర్యను పవిత్రమైనదిగా లేదా పరిశుద్ధమైనదిగా దృష్టించినవారిలో ఒకరు అపొస్తలుడైన పౌలు. ఆయన తన గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “దేవునిచేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.” (రోమీయులు 15:​15) పౌలు కొరింథులోని క్రైస్తవులకు వ్రాస్తూ తన పరిచర్యను “ఐశ్వర్యము”తో పోల్చాడు. (2 కొరింథీయులు 4:​1, 7) మనం మన బహిరంగ పరిచర్య ద్వారా “దేవోక్తులను” తెలియజేస్తాం. (1 పేతురు 4:​11) కాబట్టి మనం అభిషిక్తులమైనా లేక వేరేగొఱ్ఱెలమైనా సాక్ష్యమిచ్చే పనిని పవిత్రమైన ఆధిక్యతగా పరిగణిస్తాం.

‘దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం’

16 ‘భ్రష్టులుగా [“పవిత్ర విషయాలను విలువైనవిగా ఎంచనివారిగా,” NW]’మారవద్దని అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను హెచ్చరించాడు. బదులుగా ‘పరిశుద్ధతను కలిగివుండమని,’ “చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో . . . జాగ్రత్తగా చూచుకొనుడి” అని ఆయన వారికి ఉపదేశించాడు. (హెబ్రీయులు 12:​14-16) ఇక్కడ “చేదైన వేరు” అనే మాట క్రైస్తవ సంఘం యొక్క కార్యనిర్వాహణ విధానాన్ని విమర్శించే కొందరిని సూచిస్తుంది. ఉదాహరణకు, వివాహ పవిత్రత లేదా నైతికంగా పరిశుభ్రంగా ఉండే విషయంలో యెహోవా దృక్కోణంతో వారు విభేదించవచ్చు. (1 థెస్సలొనీకయులు 4:​3-7; హెబ్రీయులు 13:⁠4) లేదా వారు ‘సత్యము విషయములో తప్పిపోయిన’ వ్యక్తులు మాట్లాడే ‘అపవిత్రమైన వట్టి మాటలను’ మతభ్రష్ట తలంపులను చర్చిస్తూ, వాటిని వ్యాప్తిచేయవచ్చు.​—⁠2 తిమోతి 2:​16-18.

17 పౌలు తన అభిషిక్త సహోదరులకు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:⁠1) “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన” అభిషిక్త క్రైస్తవులు తమ జీవితంలోని ప్రతీ అంశంలో పరిశుద్ధత విషయంలో యెహోవా దృక్కోణాన్ని తాము ప్రతిబింబిస్తున్నామని నిరూపించుకునేలా ఎల్లప్పుడూ కృషిచేయాలని ఈ మాటలు చూపిస్తున్నాయి. (హెబ్రీయులు 3:⁠1) అదేవిధంగా, అపొస్తలుడైన పేతురు ఆత్మజనితులైన తన సహోదరులను ఇలా పురికొల్పాడు: “మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”​—⁠1 పేతురు 1:​14, 15.

18 “మహాశ్రమలను” తప్పించుకునే “గొప్పసమూహము”లోని సభ్యుల విషయమేమిటి? పవిత్ర విషయాలపట్ల తమకు కూడా యెహోవాకున్న దృక్కోణమే ఉందని వారు నిరూపించాలి. ప్రకటన గ్రంథములో వారు యెహోవా ఆధ్యాత్మిక ఆలయ భూసంబంధ ఆవరణలో ఆయనను పవిత్రంగా ‘సేవిస్తున్నారని’ సూచించబడింది. సూచనార్థకంగా వారు ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసుకొని’ క్రీస్తు విమోచన క్రయధన బలిపట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నారు. (ప్రకటన 7:⁠9, 14, 15) ఇది వారికి యెహోవా ఎదుట పవిత్రమైన స్థానాన్నిచ్చి, ‘దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి [వారు] పవిత్రులుగా’ ఉండాలనే బాధ్యతను వారిపై మోపుతోంది.

19 అభిషిక్త క్రైస్తవుల, వారి సహవాసుల జీవితంలోని ప్రాముఖ్యమైన అంశమేమిటంటే, వారు క్రమంగా ఆరాధనకు సమకూడతారు, ఆయన వాక్యాన్ని అధ్యయనం చేస్తారు. యెహోవా తన ప్రజల కూటాలను పవిత్రమైనవిగా పరిగణిస్తాడు. ఈ ప్రాముఖ్యమైన రంగంలో పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణాన్ని మనమెలా కనబరచాలి ఎందుకు కనబరచాలి అనే అంశాలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

పునఃసమీక్ష

• లోకంలోవున్న ఎలాంటి దృక్కోణాన్ని యెహోవా సేవకులు ఆమోదించరు?

• పరిశుద్ధమైన ప్రతీదానికి యెహోవాయే ఎందుకు మూలాధారం?

• క్రీస్తు పరిశుద్ధతను మనం గౌరవిస్తున్నామని ఎలా చూపిస్తాం?

• మన జీవితంలో ఏ విషయాలను మనం పవిత్రంగా ఎంచాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. ప్రస్తుతం ప్రజల్లోవున్న ఎలాంటి దృక్పథాన్ని యెహోవా సేవకులు ఆమోదించరు?

2, 3. (ఎ) యెహోవా పరిశుద్ధతను లేఖనాలు ఎలా నొక్కి చెబుతున్నాయి? (బి) యెహోవా నామాన్ని మనమెలా పరిశుద్ధమైనదిగా దృష్టిస్తాం?

4. యేసును ‘దేవుని పరిశుద్ధుడు’ అని బైబిలు ఎందుకు వర్ణిస్తుంది?

5. యేసు భూమ్మీద ఏ పవిత్ర కార్యాన్ని నెరవేర్చాడు, ఆయన రక్తం ఎందుకు అమూల్యమైనది?

6. క్రీస్తుయేసుపట్ల మనకు ఎలాంటి దృక్పథం ఉండాలి, ఎందుకు?

7. క్రీస్తుకు మన విధేయతను ఎలా చూపిస్తాం?

8, 9. (ఎ) ఇశ్రాయేలీయులు ఏ విధంగా పరిశుద్ధ ప్రజలుగా ఉన్నారు? (బి) పవిత్రతకు సంబంధించిన సూత్రాన్ని యెహోవా ఇశ్రాయేలీయులకు ఎలా నొక్కిచెప్పాడు?

10, 11. అభిషిక్త క్రైస్తవ సంఘం పవిత్రమైనదని ఎందుకు చెప్పవచ్చు, అది “వేరే గొఱ్ఱెల”పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

12. మన జీవితంలో ఏ విషయాలు పవిత్రమైనవి, ఎందుకు?

13. ఏ శక్తి పరిశుద్ధమైనది, మన జీవితాల్లో పనిచేసేలా దానిని మనమెలా అనుమతించాలి?

14. అభిషిక్తులు ఏ ఆధిక్యతను పవిత్రమైనదిగా దృష్టిస్తున్నారు, ఈ ఆధిక్యతను వేరేగొఱ్ఱెలు ఎలా పంచుకుంటున్నారు?

15. అపొస్తలుడైన పౌలు ఏ పనిని పవిత్రమైనదిగా దృష్టించాడు, మనకూ అలాంటి దృక్కోణమే ఎందుకుంది?

16. ‘పవిత్ర విషయాలను విలువైనవిగా ఎంచని’ వ్యక్తులుగా మారకుండా ఉండేందుకు మనకేది సహాయం చేస్తుంది?

17. పరిశుద్ధత విషయంలో యెహోవా దృక్కోణాన్ని ప్రతిబింబించేందుకు అభిషిక్త క్రైస్తవులు ఎందుకు ఎల్లప్పుడూ కృషిచేయాలి?

18, 19. (ఎ) పవిత్ర విషయాలపట్ల యెహోవాకున్న దృక్కోణమే తమకూ ఉందని ‘గొప్ప సమూహములోని’ సభ్యులు ఎలా చూపిస్తారు? (బి) మన క్రైస్తవ జీవితంలోని ఏ ఇతర పవిత్రమైన అంశాలు తర్వాత ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి?

[23వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలులో యాజకత్వం, ఆలయ గుడారం, దానిలోని ఉపకరణాలు పవిత్రంగా పరిగణించబడ్డాయి

[24వ పేజీలోని చిత్రం]

భూమ్మీది అభిషిక్త క్రైస్తవులు పరిశుద్ధ ఆలయంగా ఉన్నారు

[25వ పేజీలోని చిత్రాలు]

ప్రార్థన, మన పరిచర్య పవిత్రమైన ఆధిక్యతలు