యాకోబు రాసిన ఉత్తరం 4:1-17

  • లోకంతో స్నేహం చేయకండి (1-12)

    • అపవాదిని ఎదిరించండి (7)

    • దేవునికి దగ్గరవ్వండి (8)

  • అహంకారం చూపించే విషయంలో హెచ్చరిక (13-17)

    • “యెహోవాకు ఇష్టమైతే” (15)

4  మీ మధ్య గొడవలకు, కొట్లాటలకు కారణం ఏమిటి? మీ లోపల పోరాటం చేస్తున్న శరీర కోరికలే కదా?+ 2  మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు హత్యలు చేస్తున్నారు, పరాయివాళ్లది ఆశిస్తున్నారు; అయినాసరే, మీరు కోరుకున్నవి పొందలేకపోతున్నారు. మీరు కొట్లాడుతూ, గొడవలుపడుతూ ఉన్నారు.+ అయినా మీకు దొరకట్లేదు, ఎందుకంటే మీరు దేవుణ్ణి అడగట్లేదు. 3  ఒకవేళ మీరు అడిగినా, మీరు వాటిని పొందట్లేదు. ఎందుకంటే, మీరు శరీర కోరికలు తీర్చుకోవాలనే దురుద్దేశంతో అడుగుతున్నారు. 4  వ్యభిచారులారా,* ఈ లోకంతో స్నేహం దేవునితో శత్రుత్వమని మీకు తెలీదా? ఈ లోకానికి స్నేహితుడిగా ఉండాలనుకునే వ్యక్తి తనను తాను దేవునికి శత్రువుగా చేసుకుంటున్నాడు.+ 5  “మన లోపల గూడు కట్టుకున్న ఈర్ష్య ఏవేవో కావాలని ఆరాటపడుతూ ఉంటుంది” అని లేఖనం ఊరికే చెప్తుందని మీరు అనుకుంటున్నారా?+ 6  అయితే, దేవుడు అనుగ్రహించే అపారదయ ఇంకా గొప్పది. అందుకే లేఖనం ఇలా చెప్తుంది: “దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు+ కానీ వినయస్థులకు అపారదయను అనుగ్రహిస్తాడు.”+ 7  కాబట్టి మీరు దేవునికి లోబడివుండండి;+ అపవాదిని ఎదిరించండి,+ అప్పుడు అతను మీ దగ్గర నుండి పారిపోతాడు.+ 8  దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.+ పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి;+ చంచల స్వభావం గలవాళ్లారా, మీ హృదయాల్ని శుద్ధి చేసుకోండి. 9  విచారపడండి, దుఃఖించండి, ఏడ్వండి.+ మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి. 10  యెహోవా* దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి,+ అప్పుడు ఆయన మిమ్మల్ని గొప్ప చేస్తాడు.+ 11  సహోదరులారా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడడం మానేయండి.+ తన సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి, అతనికి తీర్పు తీర్చే వ్యక్తి దేవుని నియమానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, దానికి తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు నియమానికి తీర్పు తీరిస్తే నువ్వు దాన్ని పాటించేవాడివి అవ్వవు కానీ న్యాయమూర్తివి అవుతావు. 12  నిజానికి, నియమాలు ఇచ్చే వ్యక్తి,* తీర్పు తీర్చే వ్యక్తి ఒక్కడే.+ ఆయన రక్షించగలడు, నాశనం కూడా చేయగలడు. అలాంటప్పుడు, సాటిమనిషికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?+ 13  “ఇవాళో రేపో ఈ నగరానికి వెళ్లి, ఒక సంవత్సరం అక్కడ ఉండి, వ్యాపారం చేసి డబ్బు సంపాదిద్దాం” అని చెప్పుకునేవాళ్లారా, వినండి.+ 14  రేపు మీకు ఏమౌతుందో మీకు తెలీదు.+ మీరు, కాసేపు కనబడి మాయమైపోయే ఆవిరి లాంటివాళ్లు.+ 15  కాబట్టి మీరు, “యెహోవాకు* ఇష్టమైతే+ మనం ప్రాణాలతో ఉండి అదో ఇదో చేద్దాం” అని అనుకోవాలి. 16  ఇప్పుడైతే మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటూ గర్వపడుతున్నారు. అలా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది. 17  కాబట్టి, ఎవరైనా సరైనది చేయడం తెలిసి కూడా దాన్ని చేయకపోతే, అతను పాపం చేస్తున్నట్టే.+

అధస్సూచీలు

లేదా “నమ్మకద్రోహులారా.”
అనుబంధం A5 చూడండి.
లేదా “శాసనకర్త.”
అనుబంధం A5 చూడండి.