రెండో కొరింథీయులు 7:1-16

  • కళంకం లేకుండా శుభ్రపర్చుకుందాం (1)

  • కొరింథీయుల విషయంలో పౌలు ఆనందం (2-4)

  • తీతు సంతోషకరమైన వార్త తెచ్చాడు (5-7)

  • దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉన్న దుఃఖం, పశ్చాత్తాపం (8-16)

7  ప్రియ సహోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి+ కాబట్టి శరీరానికి, మనసుకు* ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం;+ దైవభయంతో పూర్తిస్థాయిలో పవిత్రులమవ్వడానికి కృషిచేద్దాం.  మీ హృదయాల్లో మాకు చోటివ్వండి.+ మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవ్వర్నీ తప్పుదారి పట్టించలేదు, ఎవ్వర్నీ స్వార్థానికి వాడుకోలేదు.+  నేను మీ మీద నేరం మోపాలని అలా అనట్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టు, మేము చనిపోయినా, బ్రతికున్నా మీరు మా హృదయాల్లో ఉంటారు.  నేను మీతో ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మీ విషయంలో నేను చాలా గొప్పలు చెప్పుకుంటున్నాను. నేను ఎంతో ఊరట పొందుతున్నాను, మా బాధలన్నిట్లో ఎంతో సంతోషిస్తున్నాను.+  నిజానికి, మేము మాసిదోనియకు వచ్చినప్పుడు+ మాకు ఏ రకంగానూ ఉపశమనం దొరకలేదు. బయట చాలా వ్యతిరేకత, లోపల భయం, ఇలా అన్నివైపులా కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి.  అయితే, కృంగిపోయిన వాళ్లకు ఊరటనిచ్చే దేవుడు+ తీతు సందర్శనం ద్వారా మాకు ఊరటనిచ్చాడు;  అతను మాతో ఉన్నందుకే కాదు, మీ వల్ల అతను పొందిన ఊరటను బట్టి కూడా మేము ఊరట పొందాం. అతను తిరిగొచ్చినప్పుడు, మీరు నన్ను చూడాలని ఎంతో కోరుకుంటున్నారని, చాలా దుఃఖపడుతున్నారని, మీకు నా మీద నిజమైన శ్రద్ధ* ఉందని మాకు చెప్పాడు; అది విని నేను ఇంకా ఎక్కువ సంతోషించాను.  నా ఉత్తరం ఒకవేళ మిమ్మల్ని దుఃఖపెట్టినా,+ దాని గురించి నేను బాధపడను. (నా ఉత్తరం వల్ల మీకు కొంతకాలంపాటు దుఃఖం కలిగిందని తెలిసి) నేను మొదట్లో కాస్త బాధపడినా,  ఇప్పుడైతే సంతోషిస్తున్నాను. మీకు దుఃఖం కలిగినందుకే కాదు, ఆ దుఃఖం మీలో పశ్చాత్తాపం కలిగించినందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే, మీకు కలిగిన దుఃఖం దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉంది. కాబట్టి, మా వల్ల మీకు ఏ నష్టం జరగలేదు. 10  దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్న దుఃఖం పశ్చాత్తాపాన్ని కలిగించి రక్షణకు నడిపిస్తుంది, ఇక బాధపడాల్సిన అవసరం ఉండదు;+ కానీ లోక సంబంధమైన దుఃఖం మరణానికి నడిపిస్తుంది. 11  దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్న దుఃఖం మీలో ఎంత పట్టుదలను కలిగించిందో చూడండి. అది, మీ మీద పడిన నిందను తీసేసుకోవడానికి మీకు సహాయం చేసింది; తప్పు విషయంలో ఆగ్రహాన్ని, దైవభయాన్ని, పశ్చాత్తాపపడాలనే బలమైన కోరికను కలిగించింది; తప్పు దిద్దే విషయంలో ఆసక్తిని నింపింది.+ ఈ విషయంలో మీరు అన్నివిధాలా స్వచ్ఛంగా* ఉన్నట్టు చూపించుకున్నారు. 12  నేను మీకు ఉత్తరం రాసింది తప్పు చేసిన వ్యక్తి కోసమో, ఆ తప్పు వల్ల గాయపడిన వ్యక్తి కోసమో కాదు.+ బదులుగా మా మాట వినడానికి మీరు ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారో దేవుని ముందు స్పష్టమవ్వాలని రాశాను. 13  దానివల్లే మేము ఊరట పొందాం. అయితే మేము ఊరట పొందడమే కాదు, తీతు ఆనందాన్ని చూసి ఇంకా ఎక్కువగా సంతోషించాం. ఎందుకంటే మీరందరూ అతని మనసుకు* ఎంతో సేదదీర్పును ఇచ్చారు. 14  నేను తీతు ముందు మీ గురించి గొప్పలు చెప్పినా, దానివల్ల నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి రాలేదు; అయితే, మేము మీకు చెప్పినవన్నీ ఎంత నిజమో, తీతు ముందు మీ గురించి గొప్పగా మాట్లాడినవి కూడా అంతే నిజం. 15  అంతేకాదు, మీరందరు ఎలా విధేయత చూపించారో,+ తనను ఎంత గౌరవంతో చేర్చుకున్నారో గుర్తుచేసుకుంటున్నప్పుడు మీ మీద అతనికి ఉన్న ప్రేమ* ఇంకా పెరుగుతోంది. 16  నేను అన్ని విషయాల్లో మీ మీద నమ్మకం పెట్టుకోవచ్చని* సంతోషిస్తున్నాను.

అధస్సూచీలు

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “ఆసక్తి.”
లేదా “పవిత్రంగా; నిర్దోషంగా.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “వాత్సల్యం.”
లేదా “మీ వల్ల నేను మంచి ధైర్యంతో ఉండవచ్చని” అయ్యుంటుంది.