మత్తయి సువార్త 25:1-46

  • క్రీస్తు ప్రత్యక్షత సూచన (1-46)

    • పదిమంది కన్యల ఉదాహరణ (1-13)

    • తలాంతుల ఉదాహరణ (14-30)

    • గొర్రెలు, మేకలు (31-46)

25  “అంతేకాదు పరలోక రాజ్యాన్ని, దీపాలు పట్టుకొని+ పెళ్లికుమారుణ్ణి కలవడానికి వెళ్లిన పదిమంది కన్యలతో పోల్చవచ్చు.+  వాళ్లలో ఐదుగురు బుద్ధిలేని వాళ్లు, ఐదుగురు బుద్ధిగల* వాళ్లు.+  బుద్ధిలేని కన్యలు దీపాలు తీసుకెళ్లారు కానీ అదనంగా నూనె తీసుకెళ్లలేదు.  అయితే బుద్ధిగల కన్యలు దీపాలతో పాటు బుడ్డీల్లో నూనె కూడా తీసుకెళ్లారు.  పెళ్లికుమారుడు ఆలస్యం చేసేసరికి ఆ కన్యలందరూ కునికిపాట్లు పడి, నిద్రపోయారు.  సరిగ్గా మధ్యరాత్రి, ‘పెళ్లికుమారుడు వచ్చేస్తున్నాడు! ఆయన్ని కలవడానికి వెళ్లండి’ అనే కేక వినిపించింది.  అప్పుడు కన్యలందరూ లేచి తమ దీపాలు సిద్ధం చేసుకున్నారు.+  బుద్ధిలేని కన్యలు, ‘మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి, మీ దగ్గరున్న నూనెలో కొంచెం మాకు ఇవ్వండి’ అని బుద్ధిగల కన్యల్ని అడిగారు.  అప్పుడు బుద్ధిగల కన్యలు, ‘ఈ నూనె మనందరికీ సరిపోదేమో. మీరు నూనె అమ్మేవాళ్ల దగ్గరికి వెళ్లి కొనుక్కోండి’ అన్నారు. 10  వాళ్లు కొనుక్కోవడానికి వెళ్తుండగా పెళ్లికుమారుడు వచ్చేశాడు. సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లారు,+ తర్వాత తలుపులు మూయబడ్డాయి. 11  ఆ తర్వాత మిగతా ఐదుగురు కన్యలు కూడా వచ్చి, ‘అయ్యా, అయ్యా, మా కోసం తలుపు తెరువు!’ అన్నారు.+ 12  అప్పుడు పెళ్లికుమారుడు, ‘నిజం చెప్తున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. 13  “కాబట్టి అప్రమత్తంగా ఉండండి.+ ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు.+ 14  “అంతేకాదు పరలోక రాజ్యాన్ని, దూర దేశానికి వెళ్లబోయే ముందు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని అప్పగించిన వ్యక్తితో పోల్చవచ్చు.+ 15  అతను వాళ్లవాళ్ల సామర్థ్యాలకు తగ్గట్టుగా ఒక దాసునికి ఐదు తలాంతులు,* ఇంకో దాసునికి రెండు తలాంతులు, మరో దాసునికి ఒక తలాంతు ఇచ్చి వెళ్లిపోయాడు. 16  వెంటనే, ఐదు తలాంతులు పొందిన దాసుడు వెళ్లి, వాటితో వ్యాపారం చేసి ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. 17  అలాగే, రెండు తలాంతులు పొందిన దాసుడు ఇంకో రెండు తలాంతులు సంపాదించాడు. 18  అయితే ఒక్క తలాంతు మాత్రమే పొందిన దాసుడు వెళ్లి, గుంట తవ్వి, తన యజమాని డబ్బును* అందులో దాచిపెట్టాడు. 19  “చాలాకాలం తర్వాత యజమాని వచ్చి, ఆ దాసులు తన డబ్బుతో ఏమి చేశారో పరిశీలించాడు.+ 20  ఐదు తలాంతులు పొందిన దాసుడు ముందుకొచ్చి ఇంకో ఐదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా, నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావు; ఇదిగో, నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అన్నాడు.+ 21  అప్పుడు యజమాని అతనితో, ‘శభాష్‌​, నమ్మకమైన మంచి దాసుడా! నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను చాలావాటి మీద నియమిస్తాను.+ నీ యజమానితో కలిసి సంతోషించు’ అన్నాడు.+ 22  ఆ తర్వాత రెండు తలాంతులు పొందిన దాసుడు ముందుకొచ్చి, ‘అయ్యా, నువ్వు నాకు రెండు తలాంతులు ఇచ్చావు; ఇదిగో, నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అన్నాడు.+ 23  అప్పుడు యజమాని అతనితో, ‘శభాష్‌​, నమ్మకమైన మంచి దాసుడా! నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను చాలావాటి మీద నియమిస్తాను. నీ యజమానితో కలిసి సంతోషించు’ అన్నాడు. 24  “చివరికి, ఒక తలాంతు పొందిన దాసుడు ముందుకొచ్చి ఇలా అన్నాడు: ‘అయ్యా, నువ్వు చాలా కఠినుడివని, విత్తనిదాన్ని కోస్తావని, తూర్పారబట్టని దాన్ని పోగుచేస్తావని నాకు తెలుసు.+ 25  అందుకే నాకు భయమేసి, వెళ్లి నీ తలాంతును ఒక గుంటలో దాచిపెట్టాను. ఇదిగో, నీ తలాంతు నువ్వు తీసుకో.’ 26  అప్పుడు యజమాని అతనితో, ‘సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తనిదాన్ని కోస్తానని, తూర్పారబట్టని దాన్ని పోగుచేస్తానని నీకు తెలుసు కదా? 27  అలాంటప్పుడు నువ్వు నా డబ్బును* షావుకారుల దగ్గర జమ చేసి ఉండాల్సింది. అలా చేసివుంటే, నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా దాన్ని తీసుకునేవాడిని. 28  “ ‘కాబట్టి, ఆ తలాంతును అతని దగ్గర నుండి తీసేసి పది తలాంతులు ఉన్న అతనికి ఇవ్వండి.+ 29  ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది, వాళ్ల దగ్గర సమృద్ధిగా ఉంటుంది. కానీ ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది.+ 30  ఆ పనికిరాని దాసుణ్ణి బయట చీకట్లో పారేయండి. అక్కడే అతను ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటాడు.’ 31  “మానవ కుమారుడు+ తన తేజస్సుతో దేవదూతలందరితో కలిసి+ వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుంటాడు. 32  అప్పుడు అన్నిదేశాల వాళ్లు ఆయన ముందు సమకూర్చబడతారు. గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెల్ని వేరుచేసినట్టు ఆయన, ప్రజల్ని రెండు గుంపులుగా వేరుచేస్తాడు. 33  గొర్రెల్ని*+ తన కుడివైపున, మేకల్ని* తన ఎడమవైపున ఉంచుతాడు.+ 34  “అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాళ్లతో ఇలా అంటాడు: ‘నా తండ్రి దీవించినవాళ్లారా, రండి. ప్రపంచం పుట్టిన* దగ్గర నుండి మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యానికి వారసులు అవ్వండి. 35  ఎందుకంటే, నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టారు; నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇచ్చారు. నేను పరాయివాడిగా ఉన్నప్పుడు నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించారు;+ 36  బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు.+ నాకు ఆరోగ్యం బాలేనప్పుడు మీరు నా బాగోగులు చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు.’+ 37  అప్పుడు నీతిమంతులు ఆయనతో ఇలా అంటారు: ‘ప్రభువా, నీకు ఆకలేయడం చూసి మేము ఎప్పుడు ఆహారం పెట్టాం? నీకు దాహమేయడం చూసి ఎప్పుడు నీళ్లు ఇచ్చాం?+ 38  నువ్వు పరాయివాడిగా ఉండడం చూసి ఎప్పుడు నిన్ను ఇంట్లోకి ఆహ్వానించాం? బట్టలు లేకపోవడం చూసి ఎప్పుడు బట్టలు ఇచ్చాం? 39  నీకు ఆరోగ్యం బాలేకపోవడం, నువ్వు చెరసాలలో ఉండడం చూసి ఎప్పుడు నిన్ను చూడడానికి వచ్చాం?’ 40  అప్పుడు రాజు వాళ్లతో ఇలా అంటాడు: ‘నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఈ నా సహోదరుల్లో అందరికన్నా తక్కువవాడికి మీరు చేసిందేదైనా నాకు చేసినట్టే.’+ 41  “తర్వాత ఆయన తన ఎడమవైపున ఉన్నవాళ్లతో ఇలా అంటాడు: ‘శపించబడినవాళ్లారా, నా దగ్గర నుండి వెళ్లిపోండి.+ అపవాదికి, అతని చెడ్డదూతలకు* సిద్ధం చేయబడిన+ నిత్యాగ్నిలోకి*+ వెళ్లండి. 42  ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టలేదు; నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇవ్వలేదు. 43  నేను పరాయివాడిగా ఉన్నప్పుడు మీరు నన్ను ఇంట్లోకి ఆహ్వానించలేదు; నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వలేదు; నాకు ఆరోగ్యం బాలేనప్పుడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకోలేదు.’ 44  అప్పుడు వాళ్లు కూడా ఇలా అంటారు: ‘ప్రభువా, నువ్వు ఆకలిగా ఉండడం గానీ, దాహంతో ఉండడం గానీ, పరాయివాడిగా ఉండడం గానీ, బట్టలు లేకుండా ఉండడం గానీ, అనారోగ్యంగా ఉండడం గానీ, చెరసాలలో ఉండడం గానీ చూసి మేము ఎప్పుడు నీకు సహాయం చేయలేదు?’ 45  అందుకు ఆయన వాళ్లతో ఇలా అంటాడు: ‘నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఈ నా సహోదరుల్లో అందరికన్నా తక్కువవాడికి మీరు చేయలేదు కాబట్టి నాకూ చేయనట్టే.’+ 46  వీళ్లు శాశ్వతంగా నాశనమౌతారు,*+ కానీ నీతిమంతులు శాశ్వత జీవితాన్ని పొందుతారు.”+

అధస్సూచీలు

లేదా “తెలివిగల.”
అప్పట్లో ఒక గ్రీకు తలాంతు 20.4 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “వెండిని.”
అక్ష., “వెండిని.”
లేదా “గొర్రెల్లాంటి వాళ్లను.”
లేదా “మేకల్లాంటి వాళ్లను.”
అక్ష., “(విత్తనం) పడిన,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టిన.
పదకోశం చూడండి.
ఇది శాశ్వత నాశనాన్ని సూచిస్తోంది. పదకోశంలో “గెహెన్నా” చూడండి.
అక్ష., “శాశ్వతంగా నరికేయబడతారు.” అంటే చెట్టు నుండి కొమ్మ నరికేయబడినట్టుగా.