అపొస్తలుల కార్యాలు 1:1-26
1 ఓ థెయొఫిలా, నేను నీకు రాసిన మొదటి పుస్తకంలో యేసు చేసిన, బోధించిన వాటన్నిటి గురించి వివరించాను.+
2 అంటే, యేసు తాను ఎంచుకున్న అపొస్తలులకు* పవిత్రశక్తి ద్వారా నిర్దేశాలు ఇచ్చి, పరలోకానికి ఎత్తబడిన+ రోజు వరకు చేసిన, బోధించిన వాటన్నిటి గురించి వివరించాను.
3 ఆయన బాధలు పడిన తర్వాత, తాను బ్రతికి ఉన్నానని ఎన్నో ఒప్పింపజేసే రుజువులతో వాళ్లకు చూపించుకున్నాడు.+ 40 రోజులపాటు ఆయన వాళ్లకు చాలాసార్లు కనిపించి, దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు.
4 ఆయన వాళ్లను కలిసినప్పుడు వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు యెరూషలేమును విడిచి వెళ్లకండి.+ తండ్రి వాగ్దానం నెరవేరేవరకు ఎదురుచూస్తూ ఉండండి.+ ఆ వాగ్దానం గురించి మీరు నా దగ్గర విన్నారు.
5 యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. అయితే, కొన్ని రోజుల్లో మీరు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు.”+
6 కాబట్టి వాళ్లు మళ్లీ కలుసుకున్నప్పుడు, “ప్రభువా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?”+ అని ఆయన్ని అడిగారు.
7 దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “సమయాల్ని, కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు.+ వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
8 అయితే పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు;+ అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో,+ భూమంతటా+ మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”*+
9 ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, వాళ్లు చూస్తుండగానే పైకి ఎత్తబడ్డాడు. ఒక మేఘం ఆయన్ని కప్పేసింది, దాంతో వాళ్లిక ఆయన్ని చూడలేకపోయారు.+
10 ఆయన వెళ్తున్నప్పుడు వాళ్లు ఆకాశంలోకి అలాగే చూస్తూ ఉన్నారు. ఇంతలో తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు మనుషులు+ హఠాత్తుగా వాళ్ల పక్కన నిలబడి
11 ఇలా అన్నారు: “గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు? మీ దగ్గర నుండి ఆకాశంలోకి ఎత్తబడిన ఈ యేసు ఏ విధంగా ఆకాశంలోకి వెళ్లడం మీరు చూశారో అదేవిధంగా వస్తాడు.”
12 అప్పుడు వాళ్లు ఒలీవల కొండ నుండి యెరూషలేముకు తిరిగొచ్చారు.+ ఆ కొండ యెరూషలేముకు సుమారు ఒక కిలోమీటరు* దూరంలోనే ఉంది.
13 వాళ్లు వచ్చాక, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్లారు. వాళ్లెవరంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, ఉత్సాహవంతుడైన సీమోను, యాకోబు కుమారుడైన యూదా.+
14 వీళ్లందరూ, వీళ్లతోపాటు ఇంకొందరు స్త్రీలు,+ యేసు తమ్ముళ్లు,+ ఆయన తల్లి మరియ కలిసి ఏక మనసుతో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
15 అలాంటి ఒక రోజున పేతురు అక్కడున్న సహోదరుల (దాదాపు 120 మంది) మధ్య నిలబడి ఇలా అన్నాడు:
16 “సహోదరులారా,* యూదా గురించి పవిత్రశక్తి దావీదు ద్వారా చెప్పిన లేఖనం+ నెరవేరాల్సి ఉంది. ఈ యూదా యేసును బంధించినవాళ్లకు దారి చూపించాడు.+
17 అతను మాలో ఒకడిగా లెక్కించబడ్డాడు,+ మాలాగే పరిచర్య చేశాడు.
18 (అన్యాయంగా సంపాదించిన డబ్బుతో అతను ఒక పొలం కొన్నాడు.+ అతను తలకిందులుగా పడడంతో అతని శరీరం చీలిపోయి లోపలి అవయవాలన్నీ బయటికి వచ్చాయి.+
19 ఈ సంగతి యెరూషలేము ప్రజలందరికీ తెలిసింది. దాంతో ఆ పొలానికి వాళ్ల భాషలో అకెల్దమ అనే పేరు వచ్చింది. ఆ మాటకు “రక్తపు పొలం” అని అర్థం.)
20 ఎందుకంటే కీర్తనల పుస్తకంలో ఇలా రాయబడింది: ‘అతను నివసించే చోటు నిర్మానుష్యమైపోవాలి. అందులో ఒక్క నివాసి కూడా ఉండకూడదు.’+ ‘అతని స్థానాన్ని* వేరే వ్యక్తి తీసుకోవాలి.’+
21 కాబట్టి మనం ఒకర్ని ఎంచుకోవాలి. యేసు మన మధ్య పరిచర్య చేసిన* కాలమంతటిలో అతను మనతోపాటు ఉన్నవాడై ఉండాలి;
22 యేసు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పటి+ నుండి పరలోకానికి ఎత్తబడిన+ రోజు వరకు అతను మనతోపాటు ఉన్నవాడై ఉండాలి; అంతేకాదు, మనలాగే యేసు పునరుత్థానాన్ని+ చూసినవాడై ఉండాలి.”
23 కాబట్టి వాళ్లు ఇద్దరు వ్యక్తుల్ని సూచించారు. ఒకతను, బర్సబ్బా అని పిలవబడిన యోసేపు. ఇతన్ని యూస్తు అని కూడా పిలిచేవాళ్లు. ఇంకొకతను మత్తీయ.
24 తర్వాత వాళ్లు ప్రార్థన చేసి ఇలా అన్నారు: “యెహోవా,* నీకు అందరి హృదయాలు తెలుసు.+ ఈ ఇద్దరిలో నువ్వు ఎవర్ని ఎంచుకున్నావో దయచేసి మాకు చూపించు.
25 తన సొంత దారిలో వెళ్లడం కోసం యూదా వదిలేసిన ఈ పరిచర్యను, అపొస్తలత్వాన్ని పొందడానికి నువ్వు ఎవర్ని ఎంచుకున్నావో దయచేసి మాకు చూపించు.”+
26 కాబట్టి వాళ్లు ఆ ఇద్దరి గురించి చీట్లు* వేశారు,+ చీటి మత్తీయ పేరు మీద వచ్చింది. కాబట్టి అతను 11 మంది అపొస్తలులతో పాటు లెక్కించబడ్డాడు.*
అధస్సూచీలు
^ అక్ష., “నాకు సాక్షులుగా ఉంటారు.”
^ అక్ష., “విశ్రాంతి రోజు ప్రయాణమంత.” విశ్రాంతి రోజున ప్రయాణించేందుకు అనుమతించబడిన దూరం.
^ అక్ష., “పురుషులారా, సహోదరులారా.”
^ అంటే, పర్యవేక్షకునిగా అతని స్థానాన్ని.
^ లేదా “వస్తూ వెళ్తూ ఉన్న.”
^ అనుబంధం A5 చూడండి.
^ అంటే, మిగతా 11 మందిలాగే ఎంచబడ్డాడు.