ఫిలిప్పీయులు 2:1-30

  • క్రైస్తవ వినయం (1-4)

  • క్రీస్తు వినయం, ఆయన హెచ్చించబడడం (5-11)

  • మీ సొంత రక్షణ కోసం కృషి చేయండి (12-18)

    • జ్యోతుల్లా ప్రకాశిస్తున్నారు (15)

  • తిమోతిని, ఎపఫ్రొదితును పంపడం (19-30)

2  మీరు క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారు, ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రేమతో ఊరటనిస్తున్నారు, శ్రద్ధ, వాత్సల్యం, కనికరం చూపిస్తున్నారు; కాబట్టి  మీకందరికీ ఒకే ఆలోచన ఉందని, ఒకే రకమైన ప్రేమ ఉందని, మీరు పూర్తిస్థాయిలో ఐక్యంగా ఉన్నారని, మీకు ఒకే మనసు ఉందని చూపిస్తూ+ నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.  గొడవలకు దిగే మనస్తత్వాన్ని,+ అహాన్ని చూపించకండి; బదులుగా వినయంతో* ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి;+  మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా+ ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.+  క్రీస్తుయేసుకు ఉన్న ఈ మనస్తత్వాన్నే మీరూ కలిగివుండండి.+  ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాసరే,+ దేవుని స్థానాన్ని చేజిక్కించుకోవాలనే, ఆయనతో సమానంగా ఉండాలనే ఆలోచన కూడా రానివ్వలేదు.+  బదులుగా ఆయన అన్నీ వదులుకుని, దాసునిలా మారి,+ మనిషిలా అయ్యాడు.+  అంతేకాదు, ఆయన మనిషిగా వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని, చనిపోయేంతగా విధేయత చూపించాడు;+ అవును, హింసాకొయ్య* మీద చనిపోయేంతగా విధేయుడయ్యాడు.+  ఈ కారణం వల్లే దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు,+ దయతో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును ఆయనకు ఇచ్చాడు.+ 10  పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్న ప్రతీ ఒక్కరు యేసు పేరున మోకరించాలని, 11  తండ్రైన దేవునికి మహిమ కలిగేలా ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తే ప్రభువని బహిరంగంగా ఒప్పుకోవాలని+ దేవుడు అలా చేశాడు. 12  నా ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడూ లోబడుతూ ఉన్నారు, నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ సమయంలో ఇంకా ఎక్కువగా లోబడుతున్నారు. అదేవిధంగా మీరు భయంతో, వణుకుతో మీ సొంత రక్షణ కోసం కృషిచేస్తూ ఉండండి. 13  ఎందుకంటే తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని ఇచ్చి దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. అలా చేయడం ఆయనకు ఇష్టం. 14  మీరు ఏమి చేసినా సణగకుండా,+ వాదించుకోకుండా+ చేయండి; 15  అప్పుడే మీరు ఏ నిందా లేకుండా నిర్దోషంగా ఉండగలుగుతారు; లోకంలో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న మీరు,+ ఈ చెడ్డ* తరం+ మధ్య ఏ మచ్చా లేకుండా దేవుని పిల్లలుగా ఉండగలుగుతారు. 16  మీరు జీవ వాక్యాన్ని+ గట్టిగా పట్టుకొని ఉండండి. దానివల్ల, నేను అనవసరంగా పరుగెత్తలేదని, వృథాగా కష్టపడలేదని తెలుసుకుని క్రీస్తు రోజున నాకు సంతోషం కలుగుతుంది. 17  మీ విశ్వాసం వల్ల మీరు చేసే పవిత్రసేవ* అనే బలి+ మీద నేను పానీయార్పణగా పోయబడుతున్నా+ సరే నాకు ఆనందమే, మీ అందరితో పాటు నేనూ సంతోషిస్తాను. 18  అలాగే మీరు కూడా ఆనందించాలి, నాతో పాటు సంతోషించాలి. 19  యేసు ప్రభువుకు ఇష్టమైతే, త్వరలోనే తిమోతిని మీ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను.+ అతను మీ గురించిన విశేషాలు నాకు చెప్తే, నాకు ప్రోత్సాహం కలుగుతుంది. 20  అతనిలాంటి మనస్తత్వం కలిగి మీ విషయంలో నిజమైన శ్రద్ధ చూపించేవాళ్లు ఇంకెవ్వరూ నా దగ్గర లేరు. 21  మిగతావాళ్లంతా ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారే తప్ప యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు చూడట్లేదు. 22  కానీ తిమోతి తానేంటో నిరూపించుకున్నాడని మీకు తెలుసు. ఒక పిల్లవాడు+ తన తండ్రితో కలిసి పనిచేసినట్టు, మంచివార్తను వ్యాప్తిచేయడానికి అతను నాతో కలిసి సేవచేశాడు. 23  అందుకని, అతన్నే మీ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను. నా విషయంలో పరిస్థితులు ఎలా మారతాయో తెలియగానే అతన్ని పంపిస్తాను. 24  నిజానికి, ప్రభువుకు ఇష్టమైతే త్వరలో నేను కూడా వస్తాననే నమ్మకం నాకుంది.+ 25  ప్రస్తుతానికి, ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపించడం అవసరమని నాకు అనిపిస్తోంది. అతను నా సహోదరుడు, నా తోటి పనివాడు, నా తోటి సైనికుడు, నా అవసరాలు చూసుకోవడానికి మీరు పంపిన ప్రతినిధి.+ 26  అతను మిమ్మల్ని చూడాలని పరితపిస్తున్నాడు, అతనికి జబ్బుచేసిన సంగతి మీకు తెలిసిందని అతను కృంగిపోయాడు. 27  నిజమే, అనారోగ్యం వల్ల అతను చనిపోయేవాడే; కానీ దేవుడు అతని మీద కరుణ చూపించాడు, అతని మీదే కాదు నా మీద కూడా కరుణ చూపించాడు. ఇప్పటికే దుఃఖంలో ఉన్న నాకు ఇంకా ఎక్కువ దుఃఖం కలగకూడదని అలా చేశాడు. 28  కాబట్టి, వీలైనంత త్వరగా అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు మీరు అతన్ని చూసి మళ్లీ సంతోషిస్తారు, నా ఆందోళన కూడా కాస్త తగ్గుతుంది. 29  మీరు ప్రభువు శిష్యుల్ని ఎప్పుడూ ఆహ్వానించే విధంగా పూర్తి సంతోషంతో అతన్ని ఆహ్వానించండి, అలాంటి సహోదరుల్ని విలువైనవాళ్లుగా చూడండి.+ 30  ఎందుకంటే, క్రీస్తు పనికోసం* అతను దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చింది, మీ స్థానంలో నాకు సేవచేయడానికి అతను తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు.+

అధస్సూచీలు

లేదా “దీనమనస్సుతో.”
పదకోశం చూడండి.
లేదా “కుటిలమైన, వక్ర.”
లేదా “ప్రజాసేవ.”
లేదా “ప్రభువు పనికోసం” అయ్యుంటుంది.