ఆమోసు 5:1-27

  • ఇశ్రాయేలును పడిపోయిన కన్యగా పోల్చడం (1-3)

  • దేవుణ్ణి వెదకండి, ప్రాణాలతో ఉండండి (4-17)

    • చెడును ద్వేషించండి, మంచిని ప్రేమించండి (15)

  • యెహోవా రోజు చీకటి రోజు (18-27)

    • ఇశ్రాయేలు బలులు తిరస్కరించబడ్డాయి (22)

5  “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను మీ మీద పాడుతున్న ఈ శోకగీతం వినండి:   ‘కన్యయైన ఇశ్రాయేలు పడిపోయింది;ఆమె ఇక మళ్లీ లేవలేదు. తానున్న చోటే ఆమె వదిలేయబడింది;ఆమెను పైకి లేపేవాళ్లు ఎవరూ లేరు.’  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఒక నగరం నుండి వెయ్యిమంది ​యుద్ధానికి వెళ్తే వందమందే ​మిగులుతారు;వందమంది వెళ్తే పదిమందే ​మిగులుతారు, ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఇలాగే జరుగుతుంది.’+  “ఇశ్రాయేలు ఇంటివాళ్లకు యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నన్ను వెదకండి, ప్రాణాలతో ఉండండి.+   బేతేలును వెదకకండి,+గిల్గాలుకు గానీ బెయేర్షెబాకు+ గానీ ​వెళ్లకండి,+ఎందుకంటే, గిల్గాలు ఖచ్చితంగా చెరలోకి వెళ్తుంది,+బేతేలు నిర్మానుష్యం అవుతుంది.*   యెహోవాను వెదకండి, ప్రాణాలతో ఉండండి,+లేదంటే, ఆయన యోసేపు ఇంటివాళ్లమీద అగ్నిలా విరుచుకుపడతాడు,బేతేలును దహించేస్తాడు, ఆ మంటల్ని ఆర్పడానికి ఎవరూ ఉండరు.   మీరు న్యాయాన్ని మాచిపత్రిగా* మారుస్తున్నారు,నీతిని నేలపాలు చేస్తున్నారు.+   కిమా నక్షత్రరాశిని,* కెసిల్‌ నక్షత్ర​రాశిని* సృష్టించిన దేవుడు+కారుచీకటిని ఉదయకాంతిలా మార్చే దేవుడు,పగటిని రాత్రంత చీకటిగా చేసే దేవుడు,+భూమ్మీద కుమ్మరించడానికిసముద్ర జలాల్ని పిలిచే దేవుడు,+–ఆయన పేరు యెహోవా.   ఆయన బలవంతుల మీదికి నాశనం ముంచుకొచ్చేలా,బలమైన ప్రాకారాలుగల ప్రాంతాలు ​నాశనమయ్యేలా చేస్తాడు. 10  నగర ద్వారం దగ్గర గద్దింపు ఇచ్చేవాళ్లను వాళ్లు ద్వేషిస్తారు,నిజం చెప్పేవాళ్లను అసహ్యించుకుంటారు.+ 11  మీరు పేదవాళ్ల దగ్గర పొలం అద్దె* వసూలు చేస్తున్నారు,వాళ్ల ధాన్యాన్ని కప్పంగా తీసుకుంటున్నారు+ కాబట్టి,మీరిక చెక్కిన రాళ్లతో కట్టుకున్న ఇళ్లలో నివసించరు,+మీరు నాటుకున్న శ్రేష్ఠమైన ద్రాక్షతోటల ద్రాక్షారసాన్ని తాగరు.+ 12  మీరు ఎన్నిసార్లు తిరుగుబాటు* చేశారో,మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు.మీరు నీతిమంతుల్ని వేధిస్తారు,లంచాలు* తీసుకుంటారు,నగర ద్వారం దగ్గర పేదవాళ్ల హక్కుల్ని కాలరాస్తారు.+ 13  కాబట్టి లోతైన అవగాహన ఉన్నవాళ్లు ఆ సమయంలో మౌనంగా ఉంటారు,ఎందుకంటే అది విపత్తు సమయం.+ 14  మీరు ప్రాణాలతో ఉండేలా+మంచిని వెదకండి, చెడును కాదు.+ అప్పుడు ఆయన మీకు తోడుగా ఉన్నాడని మీరు అంటున్నట్టేసైన్యాలకు దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు.+ 15  చెడును ద్వేషించండి, మంచిని ​ప్రేమించండి;+నగర ద్వారం దగ్గర న్యాయాన్ని ​ఏలనివ్వండి.+ అప్పుడు యోసేపు ఇంటివాళ్లలో మిగిలినవాళ్ల మీదసైన్యాలకు దేవుడైన యెహోవా అనుగ్రహం చూపిస్తాడేమో.’+ 16  “యెహోవా, సైన్యాలకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘సంతవీధులన్నిట్లో ఏడ్పులు ​వినిపిస్తాయి,వీధులన్నిట్లో వాళ్లు “అయ్యో! అయ్యో!” అంటారు. ఏడ్వడానికి రైతుల్ని,డబ్బు తీసుకుని ఏడ్చేవాళ్లను పిలుస్తారు.’ 17  ‘ప్రతీ ద్రాక్షతోటలో ఏడ్పులు ​వినిపిస్తాయి;+ఎందుకంటే, నేను మీ మధ్య నుండి దాటి వెళ్తాను’ అని యెహోవా అంటున్నాడు. 18  ‘యెహోవా రోజు కోసం తపించే వాళ్లకు శ్రమ!+ యెహోవా రోజున ఏమి జరుగుతుందని మీరనుకుంటున్నారు?+ అది చీకటే కానీ వెలుగు కాదు.+ 19  ఆ రోజు ఇలా ఉంటుంది: సింహం నుండి పారిపోయిన వ్యక్తికి ఎలుగుబంటి ఎదురౌతుంది,అతను ఇంట్లోకి వెళ్లి గోడ మీద చెయ్యి చాపినప్పుడు పాము అతన్ని కాటేస్తుంది. 20  యెహోవా రోజు వెలుగు కాదు, చీకటే;అది తేజస్సు కాదు, అంధకారమే. 21  నేను మీ పండుగల్ని ద్వేషిస్తున్నాను, అసహ్యించుకుంటున్నాను;+మీ ప్రత్యేక సమావేశాల సువాసన నాకు అస్సలు ఇష్టం లేదు. 22  మీరు నాకు సంపూర్ణ దహనబలులు, కానుకలు అర్పించినా,నేను వాటిని ఏమాత్రం ఇష్టపడను;+కొవ్విన జంతువులతో మీరు అర్పించే సమాధాన బలుల్ని నేను ​ఆమోదించను.+ 23  చికాకు పుట్టించే మీ పాటల ధ్వనిని నాకు వినిపించకండి;మీ తంతివాద్యాల శ్రావ్యమైన సంగీతాన్ని నాకు వినిపించకండి.+ 24  న్యాయాన్ని నీళ్లలా పారనివ్వండి,+నీతిని నిరంతరం పారే సెలయేరులా ​ప్రవహించనివ్వండి. 25  ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఎడారిలో సంచరించిన ఆ 40 ఏళ్లుమీరు నాకు బలులు, కానుకలు ​తీసుకొచ్చారా?+ 26  ఇప్పుడు మీరు మీ రాజైన సక్కూతును, కైవానును,*మీ విగ్రహాల్ని, మీరు చేసుకున్న మీ దేవుని నక్షత్రాన్ని మీరు మోసుకెళ్లాల్సిందే. 27  నేను మిమ్మల్ని దమస్కు అవతల ఉన్న దేశానికి బందీలుగా పంపిస్తాను’+ అని ఆయన అంటున్నాడు, ఆయన పేరు సైన్యాలకు దేవుడైన యెహోవా.”+

అధస్సూచీలు

లేదా “దుష్టశక్తులకు నివాసమౌతుంది” ​అయ్యుంటుంది.
లేదా “చేదుగా.” పదకోశం చూడండి.
వృషభ నక్షత్రరాశిలోని సప్తఋషి నక్షత్రాలు కావచ్చు.
మృగశీర్ష నక్షత్రరాశి కావచ్చు.
లేదా “భూమి పన్ను.”
లేదా “ఎన్ని నేరాలు.”
లేదా “నోరు నొక్కేయడానికి లంచాలు.”
ఈ రెండూ, దేవునిగా పూజించబడిన శని గ్రహాన్ని సూచించవచ్చు.