సామెతలు 30:1-33
30 ఇది యాకె కుమారుడైన ఆగూరు మాటల్లోని ముఖ్య సందేశం; ఈ మాటలు అతను ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పాడు.
2 నేను అందరికన్నా అజ్ఞానిని,+మనుషులకు ఉండాల్సిన అవగాహన నాకు లేదు.
3 నేను తెలివిని నేర్చుకోలేదు,అతి పవిత్రుడైన దేవుని జ్ఞానం నాకు లేదు.
4 ఆకాశానికి ఎక్కి కిందికి దిగింది ఎవరు?+
అరచేతులతో గాలిని పోగుచేసింది ఎవరు?
తన వస్త్రంలో నీళ్లను మూట కట్టింది ఎవరు?+
భూమి అంచుల్ని స్థిరపర్చింది ఎవరు?+
అతని పేరేంటో, అతని కుమారుడి పేరేంటో నీకు తెలిస్తే చెప్పు.
5 దేవుని ప్రతీ మాట స్వచ్ఛమైనది.*+
తనను ఆశ్రయించే వాళ్లకు ఆయన డాలు.+
6 ఆయన మాటలకు ఏదీ కలపకు,+లేదంటే ఆయన నిన్ను గద్దిస్తాడు,అప్పుడు నువ్వు అబద్ధాలకోరువని రుజువౌతుంది.
7 దేవా, నేను రెండు విషయాలు నిన్ను కోరుకుంటున్నాను.
నేను బ్రతికున్నంత కాలం వాటిని నాకు దయచేయి చాలు.
8 అసత్యాన్ని, అబద్ధాల్ని నాకు దూరంగా ఉంచు.+
పేదరికాన్ని గానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వకు.
నాకు అవసరమైనంత ఆహారం నాకు దయచేయి చాలు.+
9 లేదంటే నేను తృప్తిచెంది, నిన్ను తిరస్కరించి, “యెహోవా ఎవరు?” అని అంటానేమో.+
అలాగే, నన్ను పేదవాణ్ణి కానివ్వకు; లేదంటే దొంగతనం చేసి నా దేవుని పేరుకు అపకీర్తి తెస్తానేమో.
10 సేవకుడి గురించి అతని యజమానికి లేనిపోనివి కల్పించి చెప్పకు,*అలా చెప్తే అతను నిన్ను శపిస్తాడు, అప్పుడు నువ్వు దోషివి అవుతావు.+
11 తమ తండ్రిని శపిస్తూ, తల్లిని దీవించని తరం ఉంది.+
12 తమ దృష్టికి తామే శుద్ధులమని అనుకుంటూ,+తమ మురికి* కడిగేయబడని తరం ఉంది.
13 గర్వంతో నిండిన కళ్లు,అహంకార చూపులు+ కలిగిన తరం ఉంది.
14 ఖడ్గాల లాంటి పళ్లు,వధించే కత్తుల లాంటి దవడలు గల తరం ఉంది;వాళ్లు భూమ్మీది దీనుల్ని,మనుషుల్లో పేదవాళ్లను మింగేస్తారు.+
15 జలగకు, “ఇవ్వు! ఇవ్వు!” అని అరిచే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తృప్తి చెందనివి మూడు ఉన్నాయి,“చాలు!” అని ఎన్నడూ అననివి నాలుగు ఉన్నాయి. అవేంటంటే:
16 సమాధి,*+ కనని గర్భం,నీళ్లులేని భూమి,“చాలు!” అని ఎన్నడూ అనని నిప్పు.
17 తండ్రిని వెక్కిరించి, తల్లికి లోబడనివాడి కళ్లను+లోయ* కాకులు పీకుతాయి,గద్ద పిల్లలు వాటిని తినేస్తాయి.+
18 నాకు అంతుపట్టని విషయాలు మూడు ఉన్నాయి,నాకు అర్థంకానివి నాలుగు ఉన్నాయి. అవేంటంటే:
19 ఆకాశంలో గద్ద జాడ,బండ మీద పాము జాడ,నడి సముద్రంలో ఓడ జాడ,యువతితో పురుషుడి జాడ.
20 వ్యభిచార స్త్రీ పద్ధతి ఇలా ఉంటుంది:ఆమె తిని, నోరు తుడుచుకుని,
ఆ తర్వాత, “నేను ఏ తప్పూ చేయలేదు” అంటుంది.+
21 భూమిని వణికించే విషయాలు మూడు ఉన్నాయి,అది భరించలేని విషయాలు నాలుగు ఉన్నాయి, అవేంటంటే:
22 దాసుడు రాజులా ఏలడం,+మూర్ఖుడికి కడుపునిండా ఆహారం ఉండడం,
23 ద్వేషించబడే* స్త్రీ భార్య అవ్వడం,సేవకురాలు తన యజమానురాలి స్థానంలోకి రావడం.*+
24 భూమ్మీది నాలుగు ప్రాణులు చాలా చిన్నవైనాస్వాభావికంగా తెలివిగలవి.* అవేంటంటే:+
25 చీమలు బలమైన ప్రాణులు* కాదు,అయినా అవి ఎండాకాలంలో ఆహారం సిద్ధం చేసుకుంటాయి.+
26 పొట్టి కుందేళ్లు*+ శక్తిగల ప్రాణులు* కాదు,అయినా అవి బండల సందుల్లో నివాసాలు ఏర్పర్చుకుంటాయి.+
27 మిడతలకు+ రాజు ఉండడు,అయినా అవన్నీ బారులు తీరి* ముందుకు సాగుతాయి.+
28 గెకో బల్లి+ పడిపోకుండా గోడల మీద పాకగలదు,అది రాజభవనంలోకి కూడా వెళ్తుంది.
29 గంభీరంగా అడుగులు వేసేవి మూడు ఉన్నాయి,ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి. అవేంటంటే:
30 ఎవ్వరికీ భయపడి వెనక్కి వెళ్లనిఅత్యంత శక్తిగల జంతువైన సింహం;+
31 వేటకుక్క;* మేకపోతు;తన సైన్యంతో ఉన్న రాజు.
32 తెలివితక్కువగా నిన్ను నువ్వు హెచ్చించుకొని ఉంటే,+లేదా అందుకోసం పథకం వేసుకొని ఉంటే,నీ నోటి మీద చెయ్యి పెట్టుకో.+
33 ఎందుకంటే, పాలను చిలికితే వెన్న వచ్చినట్టు,ముక్కును పిండితే రక్తం వచ్చినట్టు,కోపాన్ని రెచ్చగొడితే గొడవలు వస్తాయి.+
అధస్సూచీలు
^ లేదా “అగ్నిలో పరీక్షించబడినది.”
^ ఇక్కడి నుండి ఆగూరు ఈతీయేలుతో, ఉక్కాలుతో మాట్లాడుతున్నాడు.
^ అక్ష., “మలం.”
^ లేదా “వాగు.”
^ లేదా “ప్రేమించబడని.”
^ లేదా “స్థానాన్ని కాజేయడం.”
^ లేదా “చాలాచాలా తెలివిగలవి.”
^ అక్ష., “బలమైన జనం.”
^ అక్ష., “శక్తిగల జనం.”
^ అంటే, రాక్ బ్యాడ్జర్‌లు.
^ లేదా “గుంపులుగా విడిపోయి.”
^ అంటే, గ్రేహౌండ్.