హెబ్రీయులు 9:1-28
9 ముందటి ఒప్పందం విషయానికొస్తే, పవిత్రసేవకు సంబంధించి దానికి కొన్ని నియమాలు, భూమ్మీద ఒక పవిత్ర స్థలం+ ఉండేవి.
2 గుడారం రెండు గదులుగా నిర్మించబడింది. మొదటి గదిలో దీపస్తంభం,+ బల్ల, సముఖపు రొట్టెలు*+ ఉండేవి. ఆ గదికి “పవిత్ర స్థలం” అని పేరు.+
3 అయితే, రెండో తెర*+ అవతల ఉన్న గదికి “అతి పవిత్ర స్థలం” అని పేరు.+
4 అందులో బంగారు ధూపపాత్ర,+ అన్నివైపులా బంగారు రేకు తొడిగిన+ ఒప్పంద మందసం*+ ఉండేవి. ఈ ఒప్పంద మందసంలో మన్నా ఉన్న బంగారు పాత్ర,+ చిగురించిన అహరోను కర్ర,+ ఒప్పందపు రాతి పలకలు+ ఉండేవి.
5 ఆ మందసం పైన మహిమగల కెరూబులు ఉండేవి, అవి ప్రాయశ్చిత్త మూతను* కప్పేవి.+ అయితే, ఈ విషయాల గురించి వివరంగా మాట్లాడడానికి ఇది సమయం కాదు.
6 అలా అన్నిటి నిర్మాణం పూర్తయ్యాక, యాజకులు పవిత్రసేవకు సంబంధించిన పనులు చేయడానికి ప్రతీరోజు గుడారంలోని మొదటి గదిలోకి వెళ్లేవాళ్లు;+
7 అయితే సంవత్సరానికి ఒకసారి ప్రధానయాజకుడు ఒక్కడే రెండో గదిలోకి వెళ్లేవాడు,+ కానీ రక్తం లేకుండా కాదు.+ ఆ రక్తాన్ని అతను తన కోసం,+ ప్రజలు తెలియక చేసిన పాపాల కోసం+ అర్పించేవాడు.
8 ఈ విధంగా, మొదటి గుడారం* ఉన్నంతకాలం అతి పవిత్ర స్థలంలోకి* వెళ్లే మార్గం తెరవబడలేదని* పవిత్రశక్తి స్పష్టం చేస్తోంది.+
9 ఈ గుడారం ప్రస్తుత కాలానికి ఒక ఉదాహరణగా* ఉంది;+ ఈ ఏర్పాటు ప్రకారమే కానుకలు, బలులు అర్పించబడుతున్నాయి.+ కానీ అవి పవిత్రసేవ చేసే వ్యక్తి మనస్సాక్షిని పరిపూర్ణం చేయలేవు.+
10 అవి కేవలం ఆహారపానీయాలకు, ఆచారబద్ధమైన రకరకాల శుద్ధీకరణలకు*+ సంబంధించినవి మాత్రమే. అవి శరీరానికి సంబంధించిన నియమాలు,+ అన్నిటినీ చక్కదిద్దే సమయం వచ్చేంతవరకే అవి అమలులో ఉంటాయి.
11 అయితే మనం ఇప్పటికే అనుభవిస్తున్న ఆశీర్వాదాలకు ప్రధానయాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మరింత గొప్పది, మరింత పరిపూర్ణమైనది అయిన గుడారంలో అడుగుపెట్టాడు. అది చేతులతో చేసింది కాదు, అంటే భూసంబంధమైన సృష్టికి చెందింది కాదు.
12 ఆయన మేకల రక్తంతోనో, కోడెదూడల రక్తంతోనో కాకుండా తన సొంత రక్తంతో అతి పవిత్ర స్థలంలో అడుగుపెట్టాడు.+ అలా ఆయన అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే అందులో అడుగుపెట్టి, మనకు శాశ్వతమైన విడుదలను* తీసుకొచ్చాడు.+
13 మేకల రక్తం, ఎద్దుల రక్తం,+ దహించిన ఆవుదూడ బూడిదను మైలపడినవాళ్ల మీద చల్లడం అనేవే శరీరాన్ని శుద్ధీకరించి పవిత్రుల్ని చేస్తే,+
14 క్రీస్తు రక్తం ఇంకెంత గొప్పగా శుద్ధి చేస్తుంది!+ ఎందుకంటే, ఆయన శాశ్వతమైన పవిత్రశక్తి ద్వారా తనను తాను ఏ కళంకం లేకుండా దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన రక్తం, మనం జీవంగల దేవునికి పవిత్రసేవ చేసేలా+ వ్యర్థమైన పనుల* నుండి మన మనస్సాక్షిని ఎంతో గొప్పగా శుద్ధి చేస్తుంది.+
15 అందుకే, పిలవబడినవాళ్లు శాశ్వత దీవెనలకు సంబంధించిన వాగ్దానాన్ని పొందాలని+ ఆయన ఒక కొత్త ఒప్పందానికి మధ్యవర్తి అయ్యాడు.+ ఇది ఆయన మరణం వల్లే సాధ్యమైంది; దానివల్ల వాళ్లు పాత ఒప్పందం కింద చేసిన పాపాల నుండి విమోచన క్రయధనం*+ ద్వారా విడుదల పొందారు.
16 ఎందుకంటే, ఒక ఒప్పందం జరిగినప్పుడు, ఒప్పందం చేసిన మనిషి* చనిపోవాలి.
17 ఒప్పందం చేసిన మనిషి చనిపోయాకే అది చెల్లుతుంది, ఎందుకంటే ఒప్పందం చేసిన మనిషి బ్రతికున్నంతకాలం అది అమల్లోకి రాదు.
18 అందుకే, పాత ఒప్పందం కూడా రక్తం లేకుండా అమల్లోకి రాలేదు.
19 ఎందుకంటే ధర్మశాస్త్రంలోని ప్రతీ ఆజ్ఞను మోషే ప్రజలందరికీ చెప్పినప్పుడు అతను కోడెదూడల రక్తాన్ని, మేకల రక్తాన్ని తీసుకొని, నీళ్లు కలిపి, ఎర్రని ఉన్ని కట్టిన హిస్సోపు* రెమ్మలతో ఆ గ్రంథపు చుట్ట మీద, ప్రజలందరి మీద దాన్ని చల్లుతూ
20 ఇలా అన్నాడు: “ఈ రక్తం, మీరు కట్టుబడి ఉండాలని దేవుడు మీతో చేసిన ఒప్పందాన్ని అమల్లోకి తెస్తుంది.”+
21 అతను ఆ రక్తాన్ని గుడారం మీద, పవిత్రసేవకు* వాడే పాత్రలన్నిటి మీద కూడా చల్లాడు.+
22 అవును, ధర్మశాస్త్రం ప్రకారం రక్తంతో దాదాపు అన్నీ శుద్ధి అవుతాయి,+ అంతేకాదు రక్తం చిందించబడకపోతే పాపక్షమాపణే ఉండదు.+
23 కాబట్టి, పరలోకంలోని వాటికి ప్రతిబింబాలుగా ఉన్నవాటిని+ జంతు బలుల ద్వారా శుద్ధి చేయడం+ అవసరమైంది. అయితే పరలోకంలోని వాటిని శుద్ధి చేయడానికి ఇంకా మెరుగైన బలులు అవసరం.
24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+
25 ప్రధానయాజకుడు తనదికాని రక్తంతో ప్రతీ సంవత్సరం అతి పవిత్ర స్థలంలోకి వెళ్లినట్టు,+ తనను తాను చాలాసార్లు అర్పించుకోవడానికి క్రీస్తు పరలోకానికి వెళ్లలేదు.
26 ఒకవేళ అలా అర్పించుకోవాల్సి వస్తే, ప్రపంచం పుట్టింది* మొదలుకొని ఆయన చాలాసార్లు వేదన అనుభవించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు, ఈ వ్యవస్థల* ముగింపులో తనను తాను అర్పించుకోవడం ద్వారా పాపాన్ని తీసేయడానికి ఆయన ఒక్కసారే తనను తాను కనబర్చుకున్నాడు.*+
27 ప్రతీ మనిషి ఒక్కసారే చనిపోతాడు, ఆ తర్వాత తీర్పు ఉంటుంది.
28 అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపాల్ని భరించడానికి ఒక్కసారే అర్పించబడ్డాడు;+ అయితే ఆయన రెండోసారి వచ్చేది పాపాన్ని తీసేయడానికి కాదుగానీ తనకోసం పట్టుదలగా ఎదురుచూస్తున్నవాళ్లను రక్షించడానికి.+
అధస్సూచీలు
^ లేదా “సన్నిధి రొట్టెలు.”
^ ఇది గుడారంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరుచేసే తెరను సూచిస్తోంది.
^ లేదా “పెద్దపెట్టె.”
^ లేదా “ప్రాయశ్చిత్త స్థలాన్ని.”
^ ఇది భూమ్మీది గుడారాన్ని సూచిస్తోంది.
^ ఇది పరలోకంలోని పవిత్ర స్థలాన్ని సూచిస్తుండవచ్చు.
^ లేదా “వెల్లడి చేయబడలేదని.”
^ లేదా “ఉపమానంగా.”
^ అక్ష., “బాప్తిస్మాలకు.”
^ అక్ష., “విమోచనను.”
^ లేదా “నిర్జీవ క్రియల.”
^ లేదా “ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న మనిషి.”
^ లేదా “ప్రజాసేవకు.”
^ అక్ష., “(విత్తనం) పడింది,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టింది.
^ లేదా “వెల్లడిచేసుకున్నాడు.”