హెబ్రీయులు 8:1-13

  • పరలోక సంబంధమైన ప్రాముఖ్యతను కలిగివున్న గుడారం (1-6)

  • పాత ఒప్పందానికి, కొత్త ఒప్పందానికి మధ్య తేడా (7-13)

8  మేము చెప్తున్నవాటి ముఖ్యాంశం ఇదే: మనకు ఇలాంటి ప్రధానయాజకుడు ఉన్నాడు,+ ఆయన పరలోకంలో మహాదేవుని సింహాసనానికి కుడిపక్కన కూర్చున్నాడు.+  మనుషులు కాకుండా యెహోవాయే* స్థాపించిన నిజమైన గుడారంలోని అతి పవిత్ర స్థలానికి+ ఆయన పరిచారకుడు.*  ప్రతీ ప్రధానయాజకుడు కానుకలు, బలులు అర్పించడానికి నియమించబడతాడు; అలాగే, ఈయన దగ్గర కూడా అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి.+  ఆయన భూమ్మీద ఉంటే యాజకునిగా ఉండడు,+ ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కానుకలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు.  వాళ్లు చేసే పవిత్రసేవ పరలోక సంబంధమైన విషయాలకు ప్రతిబింబంగా, నీడగా ఉంది;+ ఎందుకంటే, గుడారాన్ని నిర్మించే ముందు దేవుడు మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “పర్వతం మీద నీకు చూపించిన నమూనా ప్రకారమే అన్నీ తయారుచేసేలా చూసుకో.”+  అయితే యేసు మరింత శ్రేష్ఠమైన పరిచర్యను* పొందాడు, ఎందుకంటే ఆయన మెరుగైన ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్నాడు.+ ఈ ఒప్పందం మెరుగైన వాగ్దానాల మీద చట్టబద్ధంగా స్థాపించబడింది.+  మొదటి ఒప్పందంలో లోపం లేకపోయుంటే, రెండో ఒప్పందం అవసరమయ్యేది కాదు.+  దేవుడు ఈ మాట అన్నప్పుడు ప్రజల్లో ఉన్న లోపం గురించి ప్రస్తావించాడు: “ ‘ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లతో, యూదా ఇంటివాళ్లతో ఒక కొత్త ఒప్పందం చేసే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా* అంటున్నాడు.  ‘అది, నేను వాళ్ల పూర్వీకుల చెయ్యి పట్టుకొని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు+ వాళ్లతో చేసిన ఒప్పందంలా ఉండదు. వాళ్లు నా ఒప్పందానికి కట్టుబడి ఉండలేదు, అందుకే నేను వాళ్లను పట్టించుకోవడం మానేశాను’ అని యెహోవా* అంటున్నాడు. 10  “ ‘ఆ రోజుల తర్వాత ఇశ్రాయేలు ఇంటివాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే: నేను నా నియమాల్ని వాళ్ల మనసుల్లో పెడతాను, వాళ్ల హృదయాల మీద వాటిని రాస్తాను.+ నేను వాళ్లకు దేవుణ్ణి అవుతాను, వాళ్లు నాకు ప్రజలౌతారు’ అని యెహోవా* అంటున్నాడు.+ 11  “ ‘ఇకమీదట వాళ్లలో ఎవ్వరూ, “యెహోవాను* తెలుసుకో!” అంటూ తమ సాటి పౌరునికి గానీ సహోదరునికి గానీ బోధించరు. ఎందుకంటే, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. 12  నేను వాళ్లను కరుణించి, వాళ్లు చేసిన అవినీతి పనుల్ని క్షమిస్తాను, వాళ్ల పాపాల్ని ఇక గుర్తుచేసుకోను’ అని ఆయన అంటున్నాడు.”+ 13  ఆయన “కొత్త ఒప్పందం” అనే మాట ఉపయోగించడం ద్వారా, ముందటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు.+ పాతదైపోయి, కాలం చెల్లిపోతున్నది త్వరలో అంతరించిపోతుంది.+

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
లేదా “ప్రజా సేవకుడు.”
లేదా “ప్రజాసేవను.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.