ఎఫెసీయులు 2:1-22
2 అంతేకాదు మీ తప్పుల వల్ల, పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు.+
2 అంతకుముందు మీరు ఈ లోక వ్యవస్థకు* అనుగుణంగా, ఈ లోక వైఖరిని పాలించేవాడి+ ఇష్టానుసారంగా నడుచుకున్నారు.+ ఆ వైఖరి+ గాలిలా అంతటా వ్యాపించి, అవిధేయుల* మీద ప్రభావం చూపిస్తోంది.
3 అవును, ఒకప్పుడు మనందరం వాళ్లలాగే మన శరీర కోరికల ప్రకారం నడుచుకునేవాళ్లం;+ శరీరం కోరుకున్నవాటిని, మనసుకు నచ్చినవాటిని చేసేవాళ్లం,+ వాళ్లలాగే మనం కూడా పుట్టుకతోనే దేవుని ఆగ్రహానికి గురవ్వాల్సినవాళ్లం.+
4 అయితే దేవుడు అత్యంత కరుణామయుడు,+ ఆయనకు మనమీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పది+ కాబట్టి,
5 పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతోపాటు బ్రతికించాడు.+ దేవుని అపారదయ వల్లే మీరు రక్షణ పొందారు.
6 అంతేకాదు, క్రీస్తుయేసు శిష్యులమైన మనల్ని దేవుడు క్రీస్తుతోపాటు బ్రతికించి, ఆయనతోపాటు పరలోకంలో కూర్చోబెట్టాడు.+
7 క్రీస్తుయేసు శిష్యులమైన మనమీద దేవుడు తన మంచితనంతో* రానున్న కొత్తలోకంలో* గొప్ప అపారదయను చూపించాలని అలా చేశాడు.
8 ఆ అపారదయ వల్లే, విశ్వాసం ద్వారా మీరు రక్షణ పొందారు.+ అది మీ అంతట మీరు పొందింది కాదు, దేవుడు ఇచ్చిన బహుమతి.
9 అది మనం చేసే పనుల వల్ల పొందేది కాదు+ కాబట్టి దాని విషయంలో గొప్పలు చెప్పుకునే అవకాశం ఎవరికీ ఉండదు.
10 మనం దేవుని చేతి పని; ఆయన క్రీస్తుయేసు శిష్యులమైన మనల్ని+ మంచిపనులు చేయడానికి సృష్టించాడు.+ ఆ మంచిపనుల్ని దేవుడు మన కోసం ముందే ఏర్పాటుచేశాడు.
11 కాబట్టి పుట్టుకతో అన్యజనులైన మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఒకప్పుడు, మనుషులచేత సున్నతి పొందినవాళ్లు మిమ్మల్ని సున్నతి పొందనివాళ్లు అని పిలిచేవాళ్లు.
12 అప్పట్లో మీకు క్రీస్తు తెలీదు, మీరు ఇశ్రాయేలు ప్రజలకు దూరంగా ఉండేవాళ్లు, వాగ్దానం మీద ఆధారపడిన ఒప్పందాల్లో* మీకు వంతు ఉండేది కాదు;+ మీరు ఈ లోకంలో ఏ నిరీక్షణా లేకుండా జీవించేవాళ్లు, మీకు దేవుడు తెలీదు.+
13 ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తుయేసు శిష్యులుగా, ఆయన రక్తం వల్ల దేవునికి దగ్గరయ్యారు.
14 ఎందుకంటే ఆయనే మనకు శాంతిని తెచ్చాడు,+ రెండు గుంపుల ప్రజల్ని ఒక్కటి చేశాడు,+ వాళ్ల మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టాడు.+
15 ఆయన తన శరీరాన్ని అర్పించడం ద్వారా ఆ రెండు గుంపుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తీసేశాడు; అంటే ఆజ్ఞలు, నియమాలు ఉన్న ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. ఆ రెండు గుంపుల్లో ఉన్న తన శిష్యుల్ని ఒకే కొత్త గుంపుగా* చేయాలని,+ శాంతిని తేవాలని అలా చేశాడు;
16 అంతేకాదు, హింసాకొయ్య* మీద తన మరణం ద్వారా+ అప్పటికే శత్రుత్వాన్ని తీసేశాడు+ కాబట్టి, ఆ రెండు గుంపుల ప్రజలకు, దేవునికి మధ్య శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పి వాళ్లను ఒక్క గుంపుగా* చేయాలని అలా చేశాడు.
17 ఆయన వచ్చి, దేవునికి దూరంగా ఉన్న మీకు, దేవునికి దగ్గరగా ఉన్నవాళ్లకు శాంతి సువార్తను ప్రకటించాడు.
18 ఎందుకంటే, ఆయన ద్వారా రెండు గుంపుల వాళ్లం ఒకే పవిత్రశక్తిని పొంది, ఏ ఆటంకం లేకుండా తండ్రికి ప్రార్థించగలుగుతున్నాం.
19 కాబట్టి మీరిక అపరిచితులు, పరదేశులు కాదు.+ బదులుగా, మీరు పవిత్రుల తోటి పౌరులు,+ దేవుని ఇంటివాళ్లు;+
20 మీరు అపొస్తలులు, ప్రవక్తలు+ అనే పునాది మీద ఒక భవనంగా నిర్మించబడ్డారు. ఆ పునాదికి ముఖ్యమైన మూలరాయి క్రీస్తుయేసే.+
21 క్రీస్తుతో ఐక్యంగా ఉండడం వల్ల ఆ భవనం భాగాలన్నీ ఒకదానితో ఒకటి చక్కగా అమర్చబడుతూ,+ భవనమంతా యెహోవాకు* పవిత్ర ఆలయంగా రూపొందుతోంది.+
22 ఆయనతో ఐక్యంగా ఉన్న మీరు కూడా దేవుని కోసం ఒక ఆలయంగా నిర్మించబడుతున్నారు. అది దేవుడు తన పవిత్రశక్తి ద్వారా నివసించే ఆలయం.+
అధస్సూచీలు
^ లేదా “పోకడలకు.”
^ లేదా “అవిధేయత పుత్రుల.”
^ లేదా “అనుగ్రహంతో.”
^ లేదా “నిబంధనల్లో.”
^ అక్ష., “కొత్త వ్యక్తిగా.”
^ అక్ష., “ఒక్క శరీరంగా.”
^ అనుబంధం A5 చూడండి.