యెషయా 6:1-13

  • యెహోవా తన ఆలయంలో ఉన్న దర్శనం (1-4)

    • “యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు” (3)

  • యెషయా పెదాలు శుద్ధి అయ్యాయి (5-7)

  • యెషయాకు నియామకం (8-10)

    • “నేనున్నాను! నన్ను పంపు!” (8)

  • “యెహోవా, ఎంతకాలం పాటు?” (11-13)

6  ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరంలో,+ యెహోవా ఒక ఉన్నతమైన గొప్ప సింహాసనం మీద కూర్చొని ఉండడం నేను చూశాను;+ ఆయన చొక్కా అంచులతో ఆలయం నిండిపోయింది.  ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు; వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాళ్లు రెండు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు, రెండు రెక్కలతో తమ పాదాల్ని కప్పుకున్నారు, మిగతా రెండు రెక్కలతో ఎగురుతారు.   వాళ్లు ఒకరితో ఒకరు, “సైన్యాలకు అధిపతైన యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.+ భూమంతా ఆయన మహిమతో నిండిపోయింది” అని బిగ్గరగా అంటూ ఉన్నారు.  ఆ ధ్వనికి* గడపల కమ్ములు కదిలాయి, మందిరం పొగతో నిండిపోయింది.+   అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, నాకు శ్రమ! నేను చచ్చినవాడితో సమానం.ఎందుకంటే, అపవిత్రమైన పెదాలుగల నేను,అపవిత్రమైన పెదాలుగల ప్రజల+ మధ్య నివసిస్తున్న నేనురాజూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాను కళ్లారా చూశాను!”  అప్పుడు ఒక సెరాపు నా దగ్గరికి ఎగురుకుంటూ వచ్చాడు, బలిపీఠం నుండి పట్టుకారుతో తీసిన ఒక నిప్పుకణిక+ అతని చేతిలో ఉంది.+  అతను దానితో నా నోటిని ముట్టి ఇలా అన్నాడు: “ఇదిగో! ఇది నీ పెదాల్ని తాకింది. కాబట్టి నీ దోషం పోయింది,నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది.”  అప్పుడు యెహోవా స్వరం, “నేను ఎవర్ని పంపాలి? మా కోసం+ ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను. దానికి నేను, “నేనున్నాను! నన్ను పంపు!”+ అన్నాను.   అప్పుడాయన ఇలా అన్నాడు: “వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: ‘మీరు మళ్లీమళ్లీ వింటారు,కానీ మీకు అర్థంకాదు;మీరు మళ్లీమళ్లీ చూస్తారు,కానీ ఏమీ నేర్చుకోరు.’+ 10  ఈ ప్రజలు తమ కళ్లతో చూసి,చెవులతో విని,హృదయంతో గ్రహించి,మనసు మార్చుకొని స్వస్థత పొందకుండా ఉండేలావాళ్ల హృదయాల్ని మొద్దుబారేలా చేయి,+వాళ్ల చెవుల్ని మందంగా చేయి,+వాళ్ల కళ్లను మూసేయి.”*+ 11  అందుకు నేను, “యెహోవా, ఎంతకాలం పాటు?” అని అడిగాను. దానికి ఆయన ఇలా అన్నాడు: “నివాసులు లేక నగరాలు పాడైపోయే వరకు,ఇళ్లలో ప్రజలు లేకుండాపోయే వరకు,దేశం పాడై నిర్మానుష్యంగా తయారయ్యే వరకు;+ 12  యెహోవా మనుషుల్ని దూరంగా తరిమేసే వరకు,+దేశంలో చాలా ప్రాంతాలు నిర్మానుష్యమయ్యే వరకు. 13  “అయితే దేశంలో పదోవంతు మంది మిగిలివుంటారు, అది మళ్లీ కాల్చేయబడుతుంది; వాళ్లు మహావృక్షంలా, సింధూర వృక్షంలా ఉంటారు; వాటిని నరికేసిన తర్వాత కూడా మొద్దు మిగిలివుంటుంది; ఆ మొద్దుకు ఒక పవిత్రమైన మొలక* వస్తుంది.”*

అధస్సూచీలు

అక్ష., “పిలుస్తున్న వ్యక్తి స్వరానికి.”
అక్ష., “అంటించు.”
లేదా “సంతానం.” అక్ష., “విత్తనం.”
అక్ష., “ఒక పవిత్రమైన విత్తనం దానికి మొద్దుగా ఉంటుంది.”