మొదటి కొరింథీయులు 1:1-31

  • శుభాకాంక్షలు (1-3)

  • కొరింథీయుల విషయంలో పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం (4-9)

  • ఐక్యంగా ఉండమని ప్రోత్సహించడం (10-17)

  • క్రీస్తే దేవుని శక్తి, దేవుని తెలివి (18-25)

  • యెహోవాను బట్టే గొప్పలు చెప్పుకోవాలి (26-31)

1  దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడిగా ఉండడానికి పిలవబడిన+ పౌలు అనే నేను, అలాగే సహోదరుడు సొస్తెనేసు రాస్తున్న ఉత్తరం.  క్రీస్తుయేసు శిష్యులుగా పవిత్రపర్చబడి,+ పవిత్రులుగా ఉండడానికి పిలవబడిన కొరింథులోని+ దేవుని సంఘానికి, అలాగే మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన ఇతర ప్రాంతాల వాళ్లందరికి+ ఈ ఉత్తరం రాస్తున్నాం.  మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  క్రీస్తుయేసు ద్వారా దేవుడు మీకు అనుగ్రహించిన అపారదయను బట్టి నేను మీ కోసం ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను;  ఎందుకంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కావాల్సిన పూర్తి సామర్థ్యం, పూర్తి జ్ఞానంతో సహా ప్రతీది ఆయన ద్వారా మీరు సమృద్ధిగా పొందారు.+  క్రీస్తు గురించిన సాక్ష్యం+ మీలో బలంగా నాటుకుంది.  అందువల్ల, మన ప్రభువైన యేసుక్రీస్తు బయల్పర్చబడే సమయం+ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న మీకు ఏ విషయంలోనూ లోటు లేదు.  అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు రోజున+ మిమ్మల్ని నిందించే అవకాశం ఎవ్వరికీ ఉండకుండా, దేవుడు చివరివరకు మిమ్మల్ని బలపరుస్తాడు.  తన కుమారుడితో, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉండడానికి* మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు.+ 10  సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, మీరంతా ఒకే మాట మీద ఉండాలి; మీ మధ్య విభజనలు ఉండకూడదు;+ మీరు ఒకే మనసుతో, ఒకే ఆలోచనాతీరుతో పూర్తిస్థాయిలో ఐక్యంగా ఉండాలి.+ 11  సహోదరులారా, మీ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని క్లోయె ఇంటివాళ్ల ద్వారా నాకు తెలిసింది. 12  మీలో ఒకరు “నేను పౌలు శిష్యుణ్ణి” అనీ, ఇంకొకరు “నేను అపొల్లో+ శిష్యుణ్ణి” అనీ, మరొకరు “నేను కేఫా* శిష్యుణ్ణి” అనీ, ఇంకొకరు “నేను క్రీస్తు శిష్యుణ్ణి” అనీ అంటున్నారట. 13  క్రీస్తు విభజించబడ్డాడా? మీ కోసం కొయ్య మీద శిక్షకు గురైంది పౌలా? కాదు కదా. మీరు పౌలు పేరున బాప్తిస్మం తీసుకున్నారా? 14  నేను క్రిస్పుకు,+ గాయియుకు+ తప్ప ఎవ్వరికీ బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. 15  ఎందుకంటే, నా పేరున బాప్తిస్మం తీసుకున్నామని మీలో ఎవ్వరూ అనలేరు. 16  నిజమే, స్తెఫాను ఇంటివాళ్లకు+ కూడా నేను బాప్తిస్మం ఇచ్చాను. వాళ్లకు కాకుండా ఇంకెవరికైనా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. 17  క్రీస్తు నన్ను పంపించింది బాప్తిస్మం ఇవ్వడానికి కాదు, మంచివార్త ప్రకటించడానికి;+ మేధావిలా* మాట్లాడుతూ ప్రకటించడానికి ఆయన నన్ను పంపలేదు, ఒకవేళ నేను అలా ప్రకటిస్తే క్రీస్తు హింసాకొయ్య* వ్యర్థమైపోతుంది. 18  హింసాకొయ్య* గురించిన సందేశం నాశనమౌతున్నవాళ్లకు మూర్ఖత్వంలా కనిపిస్తుంది,+ కానీ రక్షణ పొందుతున్న మనకైతే అది దేవుని శక్తి.+ 19  లేఖనాల్లో ఇలా రాసివుంది: “నేను జ్ఞానుల తెలివిని నాశనం చేస్తాను, మేధావుల బుద్ధిని తిరస్కరిస్తాను.”*+ 20  ఈ వ్యవస్థలోని* తెలివిగలవాడు ఎక్కడ? శాస్త్రి* ఎక్కడ? తర్కవాది ఎక్కడ? ఈ లోకపు తెలివి మూర్ఖత్వమని దేవుడు నిరూపించలేదా? 21  లోకం తన సొంత తెలివిని+ నమ్ముకుని దేవుణ్ణి తెలుసుకోలేదు+ కాబట్టి, ఈ లోకం మూర్ఖత్వంగా భావించే ప్రకటనా సందేశం ద్వారా నమ్మినవాళ్లను రక్షించడం దేవునికి నచ్చింది.+ ఇందులో దేవుని తెలివి కనిపిస్తుంది. 22  యూదులు అద్భుతాలు కావాలని అడుగుతారు,+ గ్రీకువాళ్లు తెలివి కోసం వెతుకుతారు; 23  మనమైతే కొయ్య మీద శిక్షకు గురై చనిపోయిన క్రీస్తు గురించి ప్రకటిస్తాం. అది యూదులకు అడ్డురాయిగా, అన్యజనులకు మూర్ఖత్వంగా ఉంది.+ 24  అయితే పిలవబడినవాళ్లకు, అది యూదులైనా సరే, గ్రీకువాళ్లయినా సరే క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని తెలివిగా ఉన్నాడు.+ 25  దేవుని మూర్ఖత్వం మనుషుల తెలివి కన్నా తెలివిగలది; దేవుని బలహీనత మనుషుల బలం కన్నా బలమైనది.+ 26  సహోదరులారా, మీ విషయమే చూడండి. దేవుని పిలుపు అందుకున్న మీలో చాలామంది, మనుషుల దృష్టిలో* తెలివిగలవాళ్లు కాదు,+ శక్తిమంతులు కాదు, గొప్ప వంశాల్లో* పుట్టినవాళ్లు కాదు.+ 27  అయితే, జ్ఞానుల్ని అవమానపర్చడానికి దేవుడు లోకంలోని మూర్ఖుల్ని ఎంచుకున్నాడు; బలవంతుల్ని అవమానపర్చడానికి లోకంలోని బలహీనుల్ని ఎంచుకున్నాడు;+ 28  ప్రాముఖ్యమైన వాటిని నాశనం చేయడానికి+ లోకంలో ప్రాముఖ్యంకాని వాటిని, ప్రజలు చిన్నచూపు చూసే వాటిని, లెక్కచేయని వాటిని దేవుడు ఎంచుకున్నాడు. 29  తన ముందు గొప్పలు చెప్పుకునే అవకాశం ఎవ్వరికీ ఉండకూడదని దేవుడు అలా చేశాడు. 30  అయితే, దేవుని వల్లే మీరు క్రీస్తుయేసు శిష్యులుగా ఉన్నారు. క్రీస్తుయేసు మనకు దేవుని తెలివిని, దేవుని నీతిని+ వెల్లడిచేశాడు. ఆయన ద్వారానే మనం పవిత్రులమౌతున్నాం,+ ఆయన విమోచన క్రయధనం* వల్లే మనం విడుదల పొందుతున్నాం.+ 31  కాబట్టి లేఖనాల్లో రాయబడినట్టు, “గొప్పలు చెప్పుకునేవాడు, యెహోవాను* బట్టే గొప్పలు చెప్పుకోవాలి.”+

అధస్సూచీలు

లేదా “సహవాసంలోకి.”
పేతురు అని కూడా పిలవబడ్డాడు.
లేదా “తెలివిగా.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “పక్కకు నెట్టేస్తాను.”
లేదా “యుగంలోని.” పదకోశం చూడండి.
అంటే, ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు.
లేదా “ప్రమాణాల ప్రకారం.”
లేదా “ప్రముఖ కుటుంబాల్లో.”
పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.