హెబ్రీయులు 7:1-28

  • మెల్కీసెదెకు ప్రత్యేకమైన రాజు, యాజకుడు (1-10)

  • క్రీస్తు యాజకత్వానికున్న గొప్పతనం (11-28)

    • క్రీస్తు పూర్తిస్థాయిలో రక్షించగలడు (25)

7  షాలేము రాజూ సర్వోన్నత దేవుని యాజకుడూ అయిన ఈ మెల్కీసెదెకు, రాజుల్ని చంపి తిరిగొస్తున్న అబ్రాహామును కలిసి అతన్ని దీవించాడు.+  అప్పుడు అబ్రాహాము తన దగ్గరున్న ప్రతీదానిలో పదోవంతును* అతనికి ఇచ్చాడు. అతని పేరును అనువదిస్తే, “నీతికి రాజు” అనే అర్థం వస్తుంది. అంతేకాదు అతను షాలేముకు రాజు, అంటే “శాంతికి రాజు.”  అతని తల్లిదండ్రులెవరో తెలీదు, అతని వంశావళి తెలీదు; అతను ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు చనిపోయాడో తెలీదు. కానీ అతను దేవుని కుమారుడికి సాదృశ్యంగా చేయబడ్డాడు కాబట్టి ఎప్పటికీ యాజకునిగా ఉంటాడు.+  మన కుటుంబ పెద్ద* అబ్రాహాము, దోపుడుసొమ్ములో శ్రేష్ఠమైనవాటి నుండి పదోవంతును మెల్కీసెదెకుకు ఇచ్చాడంటే,+ ఈ మెల్కీసెదెకు ఎంత గొప్పవాడో ఆలోచించండి.  నిజమే, ధర్మశాస్త్రం ప్రకారం, యాజకులుగా నియమితులయ్యే లేవి కుమారులు+ ప్రజల దగ్గర, అంటే తమ సహోదరుల దగ్గర పదోవంతు సేకరించాలని ఆజ్ఞాపించబడ్డారు.+ ఆ సహోదరులు కూడా అబ్రాహాము సంతానమే అయినా, లేవీయులు వాళ్ల దగ్గర పదోవంతు సేకరించాలి.  అయితే, లేవి వంశస్థుడుకాని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు తీసుకొని, వాగ్దానాలు పొందిన అబ్రాహామును దీవించాడు.+  దీవెనలు అందుకునే వ్యక్తి కన్నా దీవించే వ్యక్తే గొప్పవాడన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.  పదోవంతు తీసుకునే లేవీయుల విషయానికొస్తే, వాళ్లకు చావు ఉంది; కానీ పదోవంతు తీసుకున్న ఆ ఇంకో వ్యక్తి విషయానికొస్తే, అతను బ్రతికే ఉన్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి.  ఒకవిధంగా చెప్పాలంటే, పదోవంతు తీసుకునే లేవి కూడా అబ్రాహాము ద్వారా అతనికి పదోవంతు చెల్లించాడు. 10  ఎలాగంటే, లేవి పూర్వీకుడైన అబ్రాహామును మెల్కీసెదెకు కలిసే సమయానికి+ లేవి ఇంకా అబ్రాహాములోనే* ఉన్నాడు. 11  లేవీయుల యాజకత్వంతోనే (ఎందుకంటే ఈ ఏర్పాటు, దేవుడు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక అంశం) మనం పరిపూర్ణులమైపోతే,+ మెల్కీసెదెకు లాంటి ఇంకో యాజకుడు+ మనకు అవసరమా? అహరోను లాంటి యాజకుడు సరిపోడా? 12  అయితే, యాజకత్వం మార్చబడుతోంది కాబట్టి, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి.+ 13  ఎందుకంటే, మనం ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి వేరే గోత్రానికి చెందినవాడు, ఆ గోత్రంలోని వాళ్లలో ఎవ్వరూ ఎప్పుడూ బలిపీఠం దగ్గర సేవ చేయలేదు.+ 14  మన ప్రభువు యూదా గోత్రం నుండి వచ్చాడని మనకు స్పష్టంగా తెలుసు,+ ఆ గోత్రం నుండి యాజకులు రావడం గురించి మోషే ఏమీ చెప్పలేదు. 15  మెల్కీసెదెకు లాంటి ఇంకో యాజకుడు+ వచ్చాడు కాబట్టి ఆ విషయం మరింత స్పష్టమైంది. 16  ఆయన, ధర్మశాస్త్రం ప్రకారం ఫలానా గోత్రం నుండి రావడం వల్ల కాదుగానీ, నాశనం అవ్వని జీవాన్ని ఇచ్చే శక్తి+ వల్ల యాజకుడయ్యాడు. 17  ఎందుకంటే ఆయన గురించి లేఖనంలో ఇలా ఉంది: “నువ్వు మెల్కీసెదెకు లాంటి యాజకుడివి, నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు.”+ 18  కాబట్టి, మనకు సహాయం చేయలేని బలహీనమైన ధర్మశాస్త్రాన్ని* దేవుడు రద్దుచేశాడు.+ 19  ఎందుకంటే, ధర్మశాస్త్రం దేన్నీ పరిపూర్ణం చేయలేకపోయింది,+ కానీ దేవుడు పరిచయం చేసిన మెరుగైన నిరీక్షణ+ ఆ పని చేసింది. దానివల్లే మనం దేవుణ్ణి సమీపించగలుగుతున్నాం.+ 20  అంతేకాదు, దేవుడు దాన్ని ఒట్టేయకుండా చెప్పలేదు కాబట్టి 21  (నిజానికి, దేవుడు ఒట్టు వేయకుండానే యాజకులైనవాళ్లు ఉన్నారు, కానీ ఈయన మాత్రం దేవుడు వేసిన ఒట్టు ద్వారా యాజకుడు అయ్యాడు. ఎందుకంటే, ఈయన గురించి దేవుడు ఇలా అన్నాడు: “ ‘నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు’ అని యెహోవా* ప్రమాణం చేశాడు, ఆయన తన మనసు మార్చుకోడు”*),+ 22  ఈ విధంగా యేసు మెరుగైన ఒప్పందానికి* హామీ అయ్యాడు.+ 23  అంతేకాదు, మరణం కారణంగా ఆ యాజకులు సేవలో కొనసాగలేకపోయేవాళ్లు, అందుకే ఒకరి తర్వాత ఒకరు అలా చాలామంది ఆ స్థానంలో సేవ చేయాల్సి వచ్చింది.+ 24  కానీ ఈ యాజకుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు+ కాబట్టి ఆయన స్థానంలో ఇంకొకరు సేవ చేయాల్సిన అవసరం రాదు. 25  కాబట్టి తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవాళ్లను ఆయన పూర్తిస్థాయిలో రక్షించగలడు, ఎందుకంటే వాళ్ల తరఫున వేడుకోవడానికి ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు.+ 26  విశ్వసనీయుడు, నిర్దోషి, కళంకం లేనివాడు,+ పాపులకు భిన్నంగా ఉన్నవాడు, ఆకాశం కన్నా ఎత్తుగా హెచ్చించబడినవాడు+ అయిన ఇలాంటి ప్రధానయాజకుడు మనకు అవసరమే. 27  ఆ ప్రధానయాజకుల్లా ఆయన ప్రతీరోజు బలులు అర్పించాల్సిన అవసరం లేదు,+ వాళ్లలా ముందు తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం లేదు.+ ఎందుకంటే, ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు, అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే ఆ పని చేశాడు.+ 28  ధర్మశాస్త్రం బలహీనతలున్న మనుషుల్ని ప్రధానయాజకులుగా నియమిస్తుంది;+ కానీ దాని తర్వాత దేవుడు ఒట్టేసి చేసిన ప్రమాణం,+ శాశ్వతకాలం కోసం పరిపూర్ణుడిగా చేయబడిన+ కుమారుణ్ణి నియమించింది.

అధస్సూచీలు

లేదా “దశమభాగాన్ని.”
లేదా “మూలపురుషుడు.”
అక్ష., “అబ్రాహాము గర్భవాసంలోనే.”
లేదా “ముందటి ఆజ్ఞను.”
అనుబంధం A5 చూడండి.
లేదా “విచారపడడు.”
లేదా “నిబంధనకు.”