కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రసంగి పుస్తకంలోని ముఖ్యాంశాలు

ప్రసంగి పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

ప్రసంగి పుస్తకంలోని ముఖ్యాంశాలు

“స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని పితరుడైన యోబు అన్నాడు. (యోబు 14:⁠1) మన అల్పకాల జీవితాన్ని అనవసర చింతలతో, ప్రయత్నాలతో వృథా చేసుకోకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని వేటికి ఉపయోగించాలి? మనం వేటిని చేయకుండా ఉండాలి? బైబిలు పుస్తకమైన ప్రసంగిలోని జ్ఞానవంతమైన మాటలు వాటి విషయంలో మనకు సరైన మార్గనిర్దేశాన్నిస్తాయి. దానిలోని సందేశం “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించి,” మనం అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు సహాయం చేయగలదు.​—⁠హెబ్రీయులు 4:​12.

తన జ్ఞానానికి పేరుగాంచిన ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను వ్రాసిన ప్రసంగి పుస్తకంలో, మనకు జీవితంలో నిజంగా ఏది ప్రయోజనకరమో, ఏది విలువలేనిదో చూపించే ఉపయోగకరమైన ఉపదేశం ఉంది. సొలొమోను తాను చేపట్టిన కొన్ని నిర్మాణ పథకాల గురించి అందులో ప్రస్తావించాడు కాబట్టి, ఆయన వాటిని ముగించిన తర్వాత, తాను సత్యారాధన నుండి వైదొలగిపోవడానికి ముందు ప్రసంగి పుస్తకాన్ని వ్రాసి ఉండవచ్చు. (నెహెమ్యా 13:​26) దాన్నిబట్టి సొలొమోను తన 40 సంవత్సరాల పరిపాలన చివర్లో అంటే సా.శ.పూ 1000కు ముందు దాన్ని వ్రాశాడని చెప్పవచ్చు.

ఏది వ్యర్థంకాదు?

(ప్రసంగి 1:1-​6:​12)

“సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభమేమి?” అని అడిగే ప్రసంగి లేదా సమావేశకుడు “సమస్తము వ్యర్థమే” అని చెబుతున్నాడు. (ప్రసంగి 1:​2, 3) ప్రసంగి పుస్తకంలో “వ్యర్థము” “సూర్యునిక్రింద” అనే పదాలు చాలాసార్లు కనిపిస్తాయి. “వ్యర్థము” అని అనువదించబడిన హెబ్రీ పదానికి అక్షరార్థంగా “ఊపిరి” లేదా “ఆవిరి” అనే అర్థాలున్నాయి, అది నిస్సారమైనదాన్ని, శాశ్వత ప్రయోజనం లేదా విలువ లేనిదాన్ని సూచిస్తుంది. “సూర్యునిక్రింద” అనే పదానికి “ఈ భూమ్మీద” లేదా “ఈ లోకంలో” అని అర్థం. కాబట్టి, దేవుని చిత్తాన్ని లక్ష్యపెట్టకుండా చేసే ఎలాంటి మానవ ప్రయత్నమైనా వ్యర్థమే.

“నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము” అనీ, “సమీపించి ఆలకించుట శ్రేష్ఠము” అనీ సొలొమోను చెప్పాడు. (ప్రసంగి 5:⁠1) యెహోవా దేవుని సత్యారాధనలో పాల్గొనడం వ్యర్థం కాదు. నిజానికి, ఆయనతో మనకున్న సంబంధానికి శ్రద్ధనివ్వడమే అర్థవంతమైన జీవితానికి కీలకం.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​4-10​—⁠ప్రకృతి చక్రాలు ఎలా “ఎడతెరిపి లేకుండ” ఉన్నాయి? భూమిపై జీవం ఉనికిలో ఉండేందుకు దోహదపడే మూడు మౌలిక ప్రక్రియలను ప్రసంగి ప్రస్తావిస్తున్నాడు. అవి సూర్యుడు, గాలి వీసే విధానం, నీటి చక్రం. నిజానికి ప్రకృతి చక్రాలు చాలావున్నాయి, అవి ఎంతో సంక్లిష్టమైనవి కూడా. ఒక వ్యక్తి వాటి గురించి తన జీవితమంతా అధ్యయనం చేసినా వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. అది నిజంగానే ‘ఎడతెరిపి లేకుండా’ విసుగుపుట్టించేదని చెప్పవచ్చు. అంతేకాదు, ఆ చక్రాల నిరంతర పునరావర్తనంతో మన అల్పాయుష్షును పోల్చుకోవడం కూడా నిరాశ కలిగిస్తుంది. కొత్త విషయాల్ని కనుగొనడానికి చేసే ప్రయత్నాలు కూడా ఎడతెరపిలేని ఆయాసాన్ని పుట్టిస్తాయి. ఆ విషయానికొస్తే, కొత్త విషయాలు కనుక్కోవడం అంటే సత్య దేవుడు ఇప్పటికే స్థిరపరిచిన, సృష్టిలో ఉపయోగించిన సూత్రాలను అన్వయించడమే.

2:​1, 2​—⁠నవ్వు “వెఱ్ఱిది” అని ఎందుకు పిలువబడింది? నవ్వు మన కష్టాలను ప్రస్తుతానికి మరచిపోయేలా చేయగలదు, సరదాగా సమయం గడపడం సమస్యలను తేలికగా తీసుకునేలా చేయగలదు. అయితే, నవ్వు మన బాధలను తొలగించదు. కాబట్టి, నవ్వడం ద్వారా సంతోషాన్ని పొందాలనుకోవడం ‘వెఱ్ఱితనంగా’ చెప్పబడింది.

3:⁠11​—⁠దేవుడు వేటిని “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు” చేశాడు? యెహోవా దేవుడు తగిన సమయంలో “చక్కగా” లేదా ప్రయోజనకరంగా ఉండేలా చేసిన కొన్ని విషయాలేమిటంటే, ఆదాముహవ్వలను సృష్టించడం, ఇంద్రధనస్సుకు సంబంధించిన నిబంధన, అబ్రాహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, మెస్సీయ రాకను ఏర్పర్చడం, దేవుని రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తును సింహాసనాసీనుణ్ణి చేయడం. అయితే, యెహోవా సమీప భవిష్యత్తులో “చక్కగా నుండునట్లు” మరో కార్యాన్ని చేయబోతున్నాడు. త్వరలోనే తగిన సమయంలో నీతియుక్తమైన నూతనలోకం నిజంగా వస్తుందని మనం నమ్మవచ్చు.​—⁠2 పేతురు 3:​13.

5:⁠9​—⁠“భూసంపద దేశంలో అందరికీ లాభకరం” ఎలా అవుతుంది? (పవిత్ర గ్రంథం​—⁠వ్యాఖ్యాన సహితం) భూనివాసులందరూ “భూసంపద”పై అంటే భూమి ఉత్పత్తి చేసేదానిపై ఆధారపడి జీవిస్తారు. రాజు కూడా దానికి అతీతుడు కాదు. భూసంపద నుండి ప్రయోజనం పొందాలంటే ఆయన కూడా భూమిని సాగు చేసే తన సేవకుల ప్రయాసపై ఆధారపడాలి.

మనకు పాఠాలు:

1:⁠15. మనం నేడు చూసే అణచివేతను, అన్యాయాన్ని సరిచేయడానికి సమయాన్ని, శక్తిని వినియోగించడం వ్యర్థం. కేవలం దేవుని రాజ్యమే దుష్టత్వాన్ని నిర్మూలిస్తుంది.​—⁠దానియేలు 2:⁠44.

2:​4-11. భవన నిర్మాణాలు, తోటపని, సంగీతంలాంటి సాంస్కృతిక అభిరుచులను అనుసరించడం, విలాసవంతంగా జీవించడం “గాలికి ప్రయాసపడినట్టే” అవుతుంది, ఎందుకంటే అవి జీవితాన్ని నిజంగా అర్థవంతంగా చేయలేవు లేదా చిరకాల సంతోషాన్ని తీసుకురాలేవు.

2:​12-16. మానవ జ్ఞానం కొన్ని సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది కాబట్టి అది బుద్ధిహీనతను జయిస్తుందని చెప్పవచ్చు. అయితే, మరణం విషయంలో మాత్రం మానవ జ్ఞానం ఏమీ చేయలేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి జ్ఞానంవల్ల పేరు గడించినా, అతని ఖ్యాతి త్వరలోనే మరుగునపడిపోతుంది.

2:​24; 3:​12, 13, 22. మీ కష్టానికి లభించే ప్రతిఫలాన్ని అనుభవించడంలో తప్పు లేదు.

2:⁠26. ‘యెహోవా దృష్టికి మంచివాడుగా ఉండేవానికి’ సంతోషాన్ని తీసుకొచ్చే దైవిక జ్ఞానం అనుగ్రహించబడుతుంది. దేవునితో మంచి సంబంధం లేకుండా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం అసాధ్యం.

3:​16, 17. ప్రతీ సందర్భంలో న్యాయం జరగాలనుకోవడం సమంజసం కాదు. నేడు లోకంలో జరుగుతున్న వాటినిబట్టి ఆందోళన చెందే బదులు, పరిస్థితులను చక్కదిద్దేందుకు మనం యెహోవా కోసం ఎదురుచూడాలి.

4:⁠4. నైపుణ్యంతో చేసిన పనులు సంతృప్తినిస్తాయి. అయితే ఇతరులకన్నా సర్వాతిశయంగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తే మాత్రం అది పోటీతత్వాన్ని పురికొల్పి, ఇతరులకు హాని చేయాలనే తలంపులను, మత్సరాన్ని పెంపొందిస్తుంది. క్రైస్తవ పరిచర్యలో కష్టపడి పనిచేయాలనేది మంచి ఉద్దేశాలనుండి పుట్టుకురావాలి.

4:​7-12. వస్తుసంపదలకన్నా మానవ సంబంధాలు మరెంతో ప్రాముఖ్యమైనవి, వాటిని సంపదల వేటలో చేజార్చుకోకూడదు.

4:⁠13. వయసు, పదవి ఎల్లప్పుడూ గౌరవాన్ని తీసుకురావు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి.

4:​15, 16. ‘సజీవులందరూ’ మొదట్లో రాజుకు వంశోద్ధారకుడైన ఆ “చిన్నవాని” ‘పక్షమున ఉంటారు,’ కానీ “తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు.” అవును, ప్రజామోదం క్షణప్రాయమే.

5:⁠2. మన ప్రార్థనలు ధ్యానంతో కూడుకొన్నవిగా, భక్తిపూర్వకంగా ఉండాలే తప్ప అవి అనేక మాటలను వల్లించేవిగా ఉండకూడదు.

5:​3-7. వస్తుసంపదలను ఆర్జించడంలో మునిగిపోవడం ఒక వ్యక్తి స్వార్థపూరిత కోరికల గురించి పగటి కలలు కనేలా చేస్తుంది. అది వారికి మనశ్శాంతి లేకుండా చేసి, రాత్రుల్లో కంటినిండా నిద్ర లేకుండా చేస్తుంది. ఒకరు అతిగా మాట్లాడడంవల్ల ఇతరుల ఎదుట చులకనవుతారు లేదా వారు అనాలోచితంగా దేవునికి మొక్కుబడిని చెల్లిస్తామని వాగ్దానం చేసే ప్రమాదముంది. “దేవునియందు భయభక్తులు” కలిగివుండడం ఈ రెంటిలో దేనినీ చేయకుండా మనల్ని అడ్డుకుంటుంది.

6:​1-9. మనకు సిరిసంపద, ఖ్యాతి, దీర్ఘాయుష్షు, చివరకు పెద్ద కుటుంబం ఉన్నా వాటిని ఆస్వాదించేందుకు మన పరిస్థితులు అనుకూలించకపోతే వాటివల్ల లాభమేమిటి? “మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్నా” అంటే తీరని ఆశల కోసం ప్రయాసపడడంకన్నా “ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు” లేదా వాస్తవాలను ఎదుర్కోవడం శ్రేయస్కరం. కాబట్టి, ‘అన్నవస్త్రములతో’ సంతృప్తి చెంది, జీవితంలోని మంచి విషయాలను ఆనందిస్తూ యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోవడమే అత్యంత శ్రేష్ఠమైన జీవితం.​—⁠1 తిమోతి 6:​7-8.

జ్ఞానులకు ఉపదేశం

(ప్రసంగి 7:⁠1-12:⁠8)

మనం మంచి పేరును, గౌరవాన్ని ఎలా కాపాడుకోవచ్చు? మానవ అధికారుల విషయంలో, మన కళ్ళముందు జరిగే అన్యాయం విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి? చనిపోయినవారు ఏమీ ఎరుగరు కాబట్టి, మనమిప్పుడు మన జీవితాన్ని ఎలా ఉపయోగించాలి? యౌవనులు తమ సమయాన్ని, శక్తిని ఎలా జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవచ్చు? ఆ విషయాల గురించి, మరితర విషయాల గురించి ప్రసంగి ఇచ్చిన ఆచరణయోగ్యమైన ఉపదేశం మన కోసం ప్రసంగి పుస్తకంలో 7 నుండి 12 అధ్యాయాల్లో నమోదు చేయబడింది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

7:⁠19​—⁠“పదిమంది అధికారులకంటె” జ్ఞానం ఎలా శక్తిమంతమైంది? బైబిల్లో పది అనే సంఖ్య సూచనార్థకంగా ఉపయోగించబడినప్పుడు అది సంపూర్ణతను సూచిస్తుంది. పట్టణానికి కాపలా కాస్తున్న సమగ్ర సంఖ్యలోవున్న యుద్ధశూరులైన అధికారులందరికన్నా జ్ఞానానికున్న సంరక్షణా విలువ అధికమని సొలొమోను చెబుతున్నాడు.

10:⁠2​—⁠ఒకరి హృదయం “కుడిచేతిని ఆడించును” లేదా “ఎడమ చేతిని ఆడించును” అన్నప్పుడు దాని భావమేమిటి? కుడి చేయి సాధారణంగా ఆమోదించబడిన స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి, ఒకరి హృదయం కుడిచేతిని ఆడించును అంటే ఆయన హృదయం ఆయనను మంచి చేయడానికి పురికొల్పుతుంది అని అర్థం. అది ఒకరిని చెడు మార్గంలో నడిచేలా పురికొల్పితే ఆయన హృదయం ఎడమ చేతిని ఆడిస్తుందని భావం.

10:⁠15​—⁠“బుద్ధిహీనులు తమ ప్రయాసచేత” ఎలా “ఆయాస పడుదురు”? ఒక వ్యక్తికి వివేచన లేకపోతే కష్టపడి పనిచేసినా మంచి ఫలితాలుండవు. ఆయనకు దాని విషయంలో సంతృప్తి ఉండదు. అలాంటి వృథా ప్రయాస కేవలం ఆయనను ఆయాసపరుస్తుంది.

11:​7, 8​—⁠“వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది” అనే వాక్యానికి అర్థమేమిటి? వెలుగు, సూర్యుడు జీవితాన్ని ఆహ్లాదకరం చేస్తాయి. చీకటి దినములు లేదా వృద్ధాప్యం అలాంటి ఆహ్లాదాన్ని దోచుకోకముందే మనం జీవితాన్ని ఆనందించాలని, దాని విషయంలో “సంతోషముగా ఉండవలెను” అని సొలొమోను చెబుతున్నాడు.

11:⁠10​—⁠“లేతవయస్సును నడిప్రాయమును” ఎందుకు వ్యర్థమైనవి? యౌవనప్రాయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే యౌవన దినాలు ఆవిరిలాగే త్వరగా గడిచిపోతాయి.

మనకు పాఠాలు:

7:⁠6. బానక్రింద మండుతూ చిటపటలాడే చితుకుల మంట ఎలా చిరాకు పుట్టించేదిగా, వ్యర్థమైనదిగా ఉంటుందో, అనవసరంగా నవ్వడం కూడా అలాంటిదే. మనమలా అకారణంగా నవ్వకుండా ఉండడం మంచిది.

7:​21, 22. ఇతరులు అనే మాటల గురించి మనం అతిగా పట్టించుకోకూడదు.

8:​2, 3; 10:⁠4. పై ఉద్యోగి లేదా అధికారి మనల్ని విమర్శించినప్పుడు లేదా సరిచేసినప్పుడు ప్రశాంతంగా ఉండడం జ్ఞానయుక్తం. “రాజుల సముఖమునుండి అనాలోచనగా” వెళ్లడం అంటే తొందరపడి రాజీనామా చేయడంకన్నా అలా ప్రశాంతంగా ఉండడమే మేలు.

8:⁠8; 9:​5-10, 12. చేపలు వలలో చిక్కుకున్నట్లుగా లేదా పిట్టలు వలలో పట్టుబడినట్లుగా మన జీవితం హఠాత్తుగా ముగిసిపోగలదు. అంతేకాదు, మరణాన్ని ఎవరూ ఆపలేరు లేదా మానవులు మృత్యుఒడిని చేరుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కాబట్టి మనం సమయాన్ని వృథా చేయకూడదు. మనం జీవితాన్ని అమూల్యంగా ఎంచి, దాన్ని ప్రయోజనకరంగా, సంతోషంగా గడపాలని యెహోవా కోరుతున్నాడు. అలా చేయాలంటే, మనం మన జీవితంలో యెహోవా సేవకు ప్రథమస్థానమివ్వాలి.

8:​16, 17. దేవుడు చేసిన కార్యాలన్నింటిని, ఆయన మానవుల మధ్య అనుమతించిన వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా, చివరకు నిద్ర పాడుచేసుకున్నా మనం వాటిని పూర్తిగా గ్రహించలేం. మన చుట్టూ జరుగుతున్న చెడును గురించి చింతించడం కేవలం మన ఆనందాన్ని పాడుచేస్తుంది.

9:​16-18. అందరి మెప్పును పొందకపోయినా జ్ఞానాన్ని మనం విలువైనదిగా పరిగణించాలి. బుద్ధిహీనుడి అరుపులకన్నా మెల్లగా పలికిన జ్ఞానవంతుల మాటలే మరింత కోరదగినవి.

10:⁠1. మనం మన మాటల, చేతల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కోపంతో గట్టిగా అరవడం, తప్పత్రాగడం లేదా అపవిత్రతతో అనైతికంగా ప్రవర్తించడం వంటి అనాలోచిత పనిని కేవలం ఒకసారి చేసినా గౌరవనీయుడైన వ్యక్తి మంచిపేరు మట్టిపాలౌతుంది.

10:​5-11. సామర్థ్యం లేని వ్యక్తి ఉన్నత పదవిలో ఉన్నందుకు అసూయపడకూడదు. చిన్న పనులనైనా అశ్రద్ధతో చేస్తే అవి హానికర పర్యవసానాలకు దారితీయవచ్చు. బదులుగా, ‘కార్యసిద్ధికి జ్ఞానాన్ని’ ఉపయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ప్రయోజనకరం. మనం చేసే రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసే పనిలో సమర్థులుగా తయారవడం ఎంత ప్రాముఖ్యమో కదా!

11:​1, 2. మనం హృదయపూర్వక ఔదార్యాన్ని ప్రదర్శించాలి. అలా చేస్తే ఇతరులు కూడా మనపట్ల ఔదార్యం చూపిస్తారు.​—⁠లూకా 6:​38.

11:​3-6. జీవితపు అనిశ్చితత్వం మనల్ని ఎటూ తేల్చుకోలేనివారిగా చేయకూడదు.

11:⁠9; 12:​1-7. యౌవనస్థులు యెహోవాకు జవాబుదారులు. కాబట్టి వృద్ధాప్యం వారి సత్తువను తగ్గించకముందే వారు తమ సమయాన్ని శక్తిని దేవుని సేవలో ఉపయోగించాలి.

“జ్ఞానులు చెప్పు మాటలు” మనకు నడిపింపునిస్తాయి

(ప్రసంగి 12:​9-14)

ప్రసంగి ఆలోచించి వ్రాసేందుకు పూనుకొన్న “యింపైన మాటలను” మనం ఎలా దృష్టించాలి? మానవ జ్ఞానంతో వ్రాయబడే “పుస్తకములు అధికము,” అయితే వాటికి భిన్నంగా “జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.” (ప్రసంగి 12:​10-12) “ఒక్క కాపరి” అయిన యెహోవా నుండి వచ్చే జ్ఞానపు మాటలు మన జీవితానికి స్థిరత్వాన్నిస్తాయి.

ప్రసంగి పుస్తకంలోని జ్ఞానవంతమైన ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా మనం అర్థవంతమైన సంతోషకరమైన జీవితాన్ని జీవించగలం. అంతేకాదు, మనకు ఈ హామీ ఇవ్వబడింది: “దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు.” కాబట్టి మనం “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను” అనే కృతనిశ్చయతతో ఉందాం.​—⁠ప్రసంగి 8:​12; 12:​13.

[15వ పేజీలోని చిత్రం]

తగిన సమయంలో దేవుని అతి చక్కని కార్యాల్లో ఒకటి నిజం కాబోతోంది

[16వ పేజీలోని చిత్రం]

ఆహారపానీయాలు, మన కష్టానికి తగిన ఫలితాలు దేవుని బహుమానాల్లో ఇమిడివున్నాయి