ప్రసంగి 5:1-20
5 నువ్వు సత్యదేవుని మందిరానికి వెళ్లే ప్రతీసారి జాగ్రత్తగా నడుచుకో;+ మూర్ఖుల్లా బలి అర్పించడానికి కాకుండా+ వినడానికి వెళ్లు,+ ఎందుకంటే తాము చెడ్డపనులు చేస్తున్నామనే సంగతి వాళ్లకు తెలీదు.
2 తొందరపడి మాట్లాడకు, సత్యదేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తొందరపడి మాట్లాడనివ్వకు;+ ఎందుకంటే సత్యదేవుడు పరలోకంలో ఉన్నాడు, నువ్వు భూమ్మీద ఉన్నావు. అందుకే నీ మాటలు తక్కువగా ఉండాలి.+
3 విస్తారమైన చింతల* వల్ల+ కలలు వస్తాయి, అలాగే అనేకమైన మాటల్లో మూర్ఖుడి స్వరం వినిపిస్తుంది.+
4 నువ్వు ఎప్పుడైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకు,+ ఎందుకంటే మూర్ఖుల్ని చూసి ఆయన సంతోషించడు. నువ్వు మొక్కుకున్నది చెల్లించు.+
5 నువ్వు మొక్కుబడి చేసుకొని చెల్లించకుండా ఉండడం కన్నా అసలు మొక్కుబడి చేసుకోకపోవడమే మంచిది.+
6 నీ నోటిని నీతో పాపం చేయించనివ్వకు,+ పొరపాటు అయ్యిందని దూత* ముందు చెప్పకు.+ సత్యదేవుడు నీ చేతి పనిని నాశనం చేసేలా నీ మాటలతో ఆయనకు కోపం తెప్పించడం దేనికి?+
7 విస్తారమైన చింతల వల్ల కలలు వస్తాయి, అలాగే అనేకమైన మాటలు వ్యర్థం. బదులుగా సత్యదేవునికి భయపడు.+
8 ఏ ప్రాంతంలోనైనా పేదవాళ్లు అణచివేయబడడం, నీతిన్యాయాలు జరగకపోవడం నువ్వు గమనిస్తే ఆశ్చర్యపోకు.+ ఎందుకంటే ఆ ఉన్నతాధికారి కన్నా పైస్థానంలో ఉన్న వ్యక్తి అతన్ని గమనిస్తున్నాడు, వాళ్లకన్నా పైస్థానంలో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
9 నేలనుండి వచ్చే రాబడిలో వాళ్లందరికీ వాటా ఉంటుంది. చివరికి రాజు తినే ఆహారం కూడా పొలం నుండే వస్తుంది.+
10 వెండిని ప్రేమించేవాళ్లు వెండితో, సిరిసంపదల్ని ప్రేమించేవాళ్లు ఆదాయంతో ఎప్పటికీ తృప్తిపడరు. ఇది కూడా వ్యర్థం.+
11 మంచి వస్తువులు ఎక్కువైనప్పుడు, వాటిని అనుభవించేవాళ్లు కూడా ఎక్కువౌతారు.+ కళ్లతో చూసుకోవడం తప్ప ఆ ఆస్తి వల్ల యజమానికి ప్రయోజనం ఏంటి?+
12 పని చేసేవాడు కొంచెం తిన్నా, ఎక్కువ తిన్నా హాయిగా నిద్రపోతాడు, కానీ ధనవంతుని సమృద్ధి అతన్ని నిద్రపోనివ్వదు.
13 సూర్యుని కింద నేను ఒక గొప్ప విషాదాన్ని చూశాను: ఒక వ్యక్తి కూడబెట్టుకున్న సంపదలు అతనికే హాని చేస్తున్నాయి.
14 కీడు సంభవించి అతని సంపదలు పోతాయి; అతనికి ఒక కుమారుడు పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు.+
15 ఒక వ్యక్తి తల్లి కడుపులో నుండి ఎలాగైతే దిగంబరంగా వచ్చాడో అలాగే వెళ్లిపోతాడు. తన కష్టార్జితంలో దేన్నీ తనతోపాటు తీసుకెళ్లలేడు.+
16 ఇది కూడా ఒక గొప్ప విషాదం: అతను ఎలా వచ్చాడో సరిగ్గా అలాగే వెళ్లిపోతాడు; గాలి కోసం ప్రయాసపడినట్టు కష్టపడడం వల్ల ఒక వ్యక్తికి వచ్చే ప్రయోజనం ఏంటి?+
17 అంతేకాదు ప్రతీరోజు అతను ఎంతో చిరాకుతో, అనారోగ్యంతో, కోపంతో చీకట్లో భోజనం చేస్తాడు.+
18 ఇది మంచిదని, సరైనదని నేను గమనించాను: సత్యదేవుడు తనకు ఇచ్చిన కొన్ని రోజుల జీవితంలో ఒక వ్యక్తి తింటూ తాగుతూ సూర్యుని కింద తాను చేసే కష్టమంతటిని బట్టి సుఖపడాలి,+ అదే అతని బహుమతి.*+
19 సత్యదేవుడు ఒక మనిషికి సిరిసంపదల్ని, వస్తువుల్ని, వాటిని అనుభవించే సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు,+ అతను తన భాగాన్ని* తీసుకోవాలి; తాను చేసిన కష్టాన్ని బట్టి సంతోషించాలి. ఇది దేవుడు ఇచ్చే బహుమతి.+
20 సత్యదేవుడు అతని హృదయాన్ని ఆనందంతో నింపుతున్నాడు+ కాబట్టి తన రోజులు ఎలా గడిచిపోతున్నాయో అతను అంతగా గమనించడు.*
అధస్సూచీలు
^ లేదా “పనుల.”
^ లేదా “సందేశకుని.”
^ లేదా “భాగం.”
^ లేదా “ప్రతిఫలాన్ని.”
^ లేదా “అతనికి గుర్తుండదు.”