హెబ్రీయులు 4:1-16

  • దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టకపోవడమనే ప్రమాదం (1-10)

  • దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టమనే ప్రోత్సాహం (11-13)

    • దేవుని వాక్యం సజీవమైనది (12)

  • యేసు గొప్ప ప్రధానయాజకుడు (14-16)

4  దేవుని విశ్రాంతిలోకి అడుగుపెట్టడానికి సంబంధించిన వాగ్దానం ఇప్పటికీ వర్తి​స్తుంది, కాబట్టి మనలో ఎవరమూ ​అందులోకి అడుగుపెట్టే అర్హత కోల్పోకుండా జాగ్రత్తగా* ఉందాం.+  మన పూర్వీకుల్లాగే మనకూ మంచివార్త ప్రకటించబడింది;+ అయితే వాళ్లు, తాము విన్న వాక్యం నుండి ప్రయోజనం పొందలేదు. ఎందుకంటే, విధేయత చూపించినవాళ్లకు ఉన్నంత బలమైన విశ్వాసం వాళ్లకు లేదు.  కానీ మనం విశ్వాసం చూపించాం, ఆయన విశ్రాంతిలోకి అడుగుపెడతాం. వాళ్ల గురించైతే ఆయన ఇలా అన్నాడు: “కాబట్టి నేను కోపంతో, ‘వీళ్లు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు’ అని ప్రమాణం చేశాను.”+ నిజానికి, ఆయన తన పనులు ముగించుకొని ప్రపంచం పుట్టిన దగ్గర నుండి విశ్రాంతి తీసుకుంటున్నాడు.+  ఎందుకంటే, ఏడో రోజు గురించి ఒక లేఖనంలో ఇలా ఉంది: “దేవుడు తన పనులన్నిటి నుండి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడు.”+  ఇక్కడ ఆయన మళ్లీ ఇలా అంటున్నాడు: “వీళ్లు నా ​విశ్రాంతిలోకి ప్రవేశించరు.”+  మంచివార్త మొదట విన్నవాళ్లు తమ అవిధేయత కారణంగా ఆ విశ్రాంతిలోకి అడుగుపెట్టలేదు.+ అయితే, కొందరు అందులోకి అడుగుపెట్టే అవకాశం ఇంకా ఉంది కాబట్టి,  చాలాకాలం గడిచిన తర్వాత దావీదు రాసిన కీర్తనలో “ఈ రోజు” అనే మాట ఉపయోగించడం ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన రోజు గురించి చెప్పాడు; పైన ప్రస్తావించినట్టు, “ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే” “మీ హృదయాల్ని కఠినపర్చు​కోకండి” అని అన్నాడు.+  యెహోషువ+ వాళ్లను విశ్రాంతిలోకి నడిపించివుంటే, దేవుడు ఆ తర్వాత ఇంకో రోజు గురించి చెప్పుండేవాడు కాదు.  కాబట్టి విశ్రాంతి రోజులో* అడుగుపెట్టే అవకాశం దేవుని ప్రజలకు ఇంకా ఉంది.+ 10  దేవుని విశ్రాంతిలోకి అడుగుపెట్టిన వ్యక్తి, ఆయనలాగే తన సొంత పనుల నుండి విశ్రాంతి తీసుకున్నాడు.+ 11  కాబట్టి, మనలో ఏ ఒక్కరం వాళ్ల అవిధేయతను అనుసరించకుండా ఉండేలా, ఆ విశ్రాంతిలోకి అడుగుపెట్టడానికి శాయశక్తులా కృషిచేద్దాం.+ 12  ఎందుకంటే, దేవుని వాక్యం* సజీవమైనది, చాలా శక్తివంతమైనది.*+ రెండు​వైపులా పదునున్న ఎలాంటి ఖడ్గం కన్నా పదునైనది.+ అది ఎంత లోతుగా దూసుకెళ్తుందంటే, ఒక మనిషి పైకి కనిపించేదానికీ* అతని ​అంతరంగానికీ* మధ్యవున్న తేడాను బయట​పెడుతుంది; కీళ్లలోకి, మూలుగలోకి దూసుకె​ళ్తుంది; హృదయంలోని ఆలోచనల్ని, ఉద్దేశాల్ని వెల్లడిచేస్తుంది. 13  ఈ సృష్టిలో దేవునికి కనిపించనిదంటూ ఏదీ లేదు.+ మనం ఎవరికి లెక్క అప్పజెప్పాలో ఆ దేవుని కళ్లకు అన్నీ స్పష్టంగా, తేటతెల్లంగా కనిపిస్తున్నాయి.+ 14  పరలోకానికి వెళ్లిన దేవుని కుమారుడైన యేసు+ అనే గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి, ఆయన గురించి మనం ప్రకటిస్తూనే ఉందాం.+ 15  మన ప్రధానయాజకుడు మన బలహీనతల్ని అర్థంచేసుకో​లేనివాడు కాదు;+ మనలాగే ఆయనకు అన్నిరకాల పరీక్షలు ఎదురయ్యాయి, కానీ ఆయన ఏ పాపం చేయలేదు.+ 16  కాబట్టి, మనకు సహాయం అవసరమైనప్పుడు* కరుణను, ​అపారదయను పొందగలిగేలా మనం ఆ అపారదయను అనుగ్రహించే దేవుని సింహాసనం దగ్గరికి వెళ్లి ధైర్యంగా ప్రార్థిద్దాం.+

అధస్సూచీలు

అక్ష., “భయంతో.”
లేదా “సబ్బాతులో.”
లేదా “మాట.”
లేదా “శక్తివంతంగా పనిచేస్తుంది.”
పదకోశంలో “ప్రాణం” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “సరిగ్గా అవసరమైనప్పుడు.”