కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిషనరీ సేవచేయాలనే నా కోరికను యెహోవా మెండుగా ఆశీర్వదించాడు

మిషనరీ సేవచేయాలనే నా కోరికను యెహోవా మెండుగా ఆశీర్వదించాడు

జీవిత కథ

మిషనరీ సేవచేయాలనే నా కోరికను యెహోవా మెండుగా ఆశీర్వదించాడు

షీలావిన్‌ఫీల్డ్‌ డా కోన్‌సేసావ్‌ చెప్పినది

ఆఫ్రికానుండి వచ్చిన ఒక మిషనరీ, తన ప్రకటనాపనిలో ప్రతి ఒక్కరూ తనను లోపలికి ఆహ్వానించి, దేవుని రాజ్య సువార్తను శ్రద్ధగా వినేవారని మాకు ఒకసారి చెప్పింది. ‘అలాంటి క్షేత్రంలో పనిచేయడం ఎంత బాగుంటుందో కదా!’ అని నేననుకున్నాను. ఆ సంభాషణ, అప్పటికి 13 సంవత్సరాల వయసున్న నాలో మిషనరీ సేవచేయాలనే కోరికను నాటింది.

అప్పటికి చాలాకాలం ముందే మా కుటుంబం యెహోవా గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. నీటుగా తయారైన ఇద్దరు యౌవనస్థులు 1939లో ఒక ఉదయం, ఇంగ్లాండ్‌లోని గ్రేటర్‌ లండన్‌ శివార్లలోవున్న హేమెల్‌ హెంప్‌స్టెడ్‌లోవున్న మా ఇంటి తలుపు తట్టారు. వాళ్ళు యెహోవాసాక్షులు. అంతకుముందు సంవత్సరమే నేను జన్మించాను కాబట్టి, వాళ్ళు రావడం నాకు గుర్తులేదు. వాళ్ళను పంపించేయాలన్న ఉద్దేశంతో మా అమ్మ వాళ్ళతో, నాన్నగారికి బహుశా ఆసక్తి ఉండవచ్చు కానీ రాత్రి 9 గంటల వరకు ఆయన ఇంటికి రారని చెప్పింది. అయితే ఆ రాత్రే వాళ్ళు మళ్ళీ రావడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. రాజకీయాల్లో, జాతిసంబంధ విషయాల్లో వారి వైఖరి ఏమిటో నిర్ధారించుకున్న తర్వాత, మా నాన్న హెన్రీ విన్‌ఫీల్డ్‌ వారిని లోపలికి ఆహ్వానించి బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. ఆయన త్వరితగతిన ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ కేథ్‌లీన్‌ కూడా అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఆమె 1946లో బాప్తిస్మం తీసుకుంది.

నేను 1948లో దేవుని రాజ్యసువార్తను ప్రకటించడంలో క్రమంగా భాగం వహించడం ప్రారంభించాను. నేను పరిచర్యలో గడిపిన సమయాన్ని ఖచ్చితంగా నివేదించాలంటే నాకు చేతిగడియారం అవసరం అనిపించింది. మేము చక్కగా ప్రవర్తిస్తే పిల్లలమైన మాకు ప్రతీ శనివారం సిక్స్‌పెన్స్‌ (ఆరుపెన్నీలకు సమానమైన నాణెం) పాకెట్‌ మనీగా ఇవ్వబడేది. నేను రెండు సంవత్సరాల వరకు ఆ సిక్స్‌పెన్స్‌ను దాచుకొని ఆ సమయంలో కారుచౌకగా దొరికే గడియారం కొనుక్కున్నాను. మా ఇద్దరు తమ్ముళ్ళలో ఒకడైన రే, నాన్నగారిని ఎప్పుడూ రెండు థ్రీపెన్స్‌ (మూడు పెన్నీలకు సమానమైన నాణెం) కావాలని అడిగేవాడు, సిక్స్‌పెన్స్‌ నాణెం మాత్రం తీసుకొనేవాడు కాదు. ఒకరోజు వాడు రెండు నాణేలు కావాలని ఎంత మొండిపట్టు పట్టాడంటే నాన్నగారికి కోపం వచ్చేసింది. నాకు రెండు నాణేలు కావాలి ఎందుకంటే అది నాకు యెహోవాకి మధ్య రహస్యం అని రే ఏడుస్తూ చెప్పాడు. చివరికి రే ఇలా వివరించాడు: “ఒక థ్రీపెన్స్‌ చందా పెట్టెలో వేయడానికి ఇంకొకటి నాకు.” అమ్మ కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి, నాన్నగారు ఆ వెంటనే రెండు నాణేల చిల్లరను సంపాదించారు, ఆ విధంగా నేను రాజ్య పనికి ఆర్థికంగా మద్దతునివ్వడంలోని ప్రాముఖ్యతను నేర్చుకున్నాను.

ఈ సమయానికి నాన్నగారు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న చోటికి తరలివెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. ఆయన 1949లో వ్యవసాయక్షేత్రాన్ని, ఇసుక, కంకరరాళ్ళు కుప్పగా పోసే స్థలాన్ని అమ్మేసి పయినీరు సేవ ప్రారంభించారు. నేను 1950 సెప్టెంబరు 24వ తేదీన యెహోవాకు నా సమర్పణను సూచిస్తూ బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటినుండి, వేసవి సెలవలప్పుడు నేను సెలవు పయినీరు (ఇప్పుడు సహాయ పయినీరు అని పిలువబడుతుంది) సేవచేస్తూ, పరిచర్యలో 100 గంటలు వెచ్చించేదాన్ని. అయితే అది ప్రారంభం మాత్రమే. త్వరలోనే, స్వచ్ఛారాధనను వ్యాప్తిచేయడానికి ఇంకా ఎక్కువ చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది.

మిషనరీ సేవచేయాలనే నా కోరిక

నాన్నగారు 1951లో నార్త్‌ డీవన్‌లోని బైడ్‌ఫోర్డ్‌కి నియమించబడ్డారు. మేము అక్కడికి వెళ్ళిన కొద్దికాలానికే పైన ప్రస్తావించబడిన, ఆఫ్రికాలో సేవచేసిన మిషనరీ మా సంఘాన్ని సందర్శించింది. ఆ తర్వాత నా నిర్ణయాలన్నీ మిషనరీ సేవచేయాలనే నా కోరికను ప్రభావితం చేశాయి. పాఠశాలలో మా టీచర్స్‌కి కూడా నా లక్ష్యం తెలిసింది, దాంతో వారు నేను ఉద్యోగాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో నన్ను నిరుత్సాహపర్చడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. పాఠశాలలో చివరి రోజున థాంక్స్‌ చెప్పి వెళ్ళొస్తానని చెప్పడానికి మా టీచర్ల రూమ్‌కి వెళ్ళినప్పుడు ఒక టీచర్‌ ఇలా అంది: “కంగ్రాచ్యులేషన్స్‌! విద్యార్థులందరిలో నీకొక్కదానికే జీవితంలో గట్టి లక్ష్యం ఉంది, నీ లక్ష్యాన్ని చేరుకుంటావని మేము ఆశిస్తున్నాం.”

ఆలస్యం చేయకుండా నేను పార్ట్‌టైమ్‌ ఉద్యోగం వెతుక్కుని, 1955, డిసెంబరు 1 నుండి క్రమపయినీరు సేవ ప్రారంభించాను. ఆ తర్వాత అమ్మ, తమ్ముళ్ళు కూడా పయినీర్లయ్యారు. అలా చాలా సంవత్సరాలపాటు కుటుంబంలోనివారంతా పూర్తికాల పరిచర్యలో ఉన్నారు.

ఐర్లాండ్‌కు

సంవత్సరం తర్వాత ఐర్లాండ్‌లో సేవ చేసేందుకు నేను నియామకాన్ని అందుకున్నాను. మిషనరీ సేవచేయాలనే నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదొక ముందడుగు. జూన్‌ నెపియర్‌, బెరిల్‌ బార్కర్‌ అనే ఇద్దరు పయినీర్లతో కలిసి నేను 1957, ఫిబ్రవరిలో దక్షిణ ఐర్లాండ్‌లోని కార్క్‌కి వెళ్ళాను.

ఐర్లాండ్‌లో క్షేత్ర పరిచర్య చేయడం చాలా కష్టం. రోమన్‌ క్యాథలిక్‌ చర్చినుండి చాలా వ్యతిరేకత వచ్చేది. అపార్ట్‌మెంట్‌లోనుండి గానీ, హౌసింగ్‌ కాలనీలోనుండి గానీ వెంటనే బయటపడే మార్గమేమిటో మేము నేర్చుకున్నాం. మా సైకిళ్ళను ఎక్కడో దూరంగా దాచిపెట్టి వచ్చేవాళ్ళం, అయినప్పటికీ చాలాసార్లు ఎవరో ఒకళ్ళు వాటిని కనుగొని టైర్లు కత్తిరించేసేవాళ్ళు లేకపోతే వాటిలో గాలి తీసేసేవాళ్ళు.

ఒకసారి నేను, బెరిల్‌, పెద్ద హౌసింగ్‌ కాలనీకి వెళ్ళినప్పుడు, పిల్లల గుంపొకటి మమ్మల్ని తిడుతూ, మాపై రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. దానితో మేము ఒకరి ఇంటిని ఆనుకొని ఉన్న పాలు అమ్మే షాపులోకి వెళ్ళాం. బయట ఒక మూక గుమికూడింది. బెరిల్‌కి పాలంటే చాలా ఇష్టం, అందుకే ఆ మూక అక్కడనుండి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో రెండో మూడో గ్లాసుల పాలు చాలా మెల్లగా తాగింది. అయితే ఆ మూక అక్కడనుండి కదల్లేదు. అప్పుడు ఒక యువ ప్రీస్టు ఆ దుకాణంలోకి వచ్చాడు. ఆయన మేము టూరిస్ట్‌లమనుకొని మాకు అక్కడి ప్రదేశాలు చూపించడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. అయితే ఆయన మమ్మల్ని మొదట ఆ ఇంట్లోవున్న వేరొకగదిలోకి తీసుకువెళ్ళాడు, మేము మౌనంగా కూర్చునివుండగా, ఆయన కొన ఊపిరితోవున్న ఒక ముసలాయనకు మతాచారం ప్రకారం చివరిసారిగా రొట్టె, ద్రాక్షారసం ఇచ్చాడు. ఆ తర్వాత మేము ఆ ప్రీస్టుతోపాటు ఆ ఇంటినుండి బయటికి వచ్చాము. అతనితో మాట్లాడుతూ వెళ్లడం చూసి ఆ మూక అక్కడినుండి వెళ్ళిపోయింది.

గిలియడ్‌కి

న్యూయార్క్‌లో 1958లో, దేవుని చిత్తం అనే అంతర్జాతీయ సమావేశం జరగబోతుంది. నాన్నగారు వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలనుంది కానీ నా దగ్గర డబ్బులేదు. అయితే హఠాత్తుగా మా నానమ్మ చనిపోయింది, ఆమె నా కోసం 100 పౌండ్లు (280 అమెరికన్‌ డాలర్లు) దాచి ఉంచింది. సమావేశానికి వెళ్ళి రావడానికి 96 పౌండ్లు మాత్రమే అవుతాయి, అందుకే నేను వెంటనే ఫ్లైట్‌కి టికెట్‌ బుక్‌ చేసుకున్నాను.

ఆ తర్వాత, బ్రిటన్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి ఆఫీసు నుండి ఒక ప్రతినిధి మమ్మల్ని సందర్శించడానికి వచ్చి, మిషనరీ ట్రైనింగ్‌ కోసం దరఖాస్తు పెట్టడానికి సమావేశానికి వెళ్తున్న ప్రత్యేక పయినీర్లందరినీ పిలిచాడు. నా చెవులను నేను నమ్మలేకపోయాను! ఆయన నాకు తప్ప అక్కడున్న వారందరికీ దరఖాస్తులు ఇచ్చారు. నేను చాలా చిన్నదాన్ని. నేను అప్పటికే నా స్వదేశాన్ని విడిచిపెట్టానని, నిజానికి మిషనరీ నియామకంలోనే ఉన్నానని వివరిస్తూ నాక్కూడా దరఖాస్తు ఇమ్మని అడిగాను. నా దృఢ సంకల్పం చూసి ఆయన నాకు దరఖాస్తు ఇచ్చారు. నా దరఖాస్తు అంగీకరించబడాలని నేనెంతగా ప్రార్థించానో! నాకు వెంటనే జవాబు లభించింది, నేను గిలియడ్‌కి ఆహ్వానించబడ్డాను.

గిలియడ్‌ 33వ తరగతి కోసం 14 దేశాల నుండి వచ్చిన 81 మంది ఇతర పయినీర్లతోపాటు నా పేరు కూడా నమోదవ్వడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఐదు నెలల శిక్షణ ఇట్టే గడిచిపోయింది. చివర్లో, సహోదరుడైన నేథన్‌ హెచ్‌. నార్‌ మా కోసం 4 గంటలపాటు ఉత్తేజకరమైన ప్రసంగమిచ్చారు. అవివాహితులుగా ఉండాలనుకునేవారు అలాగే ఉండాలని ఆయన ప్రోత్సహించారు. (1 కొరింథీయులు 7:​37, 38) అయితే మాలో ఏదోక రోజు వివాహం చేసుకోవాలనుకునేవారికి, తగిన వివాహ భాగస్వామికి ఉండాలనుకున్న లక్షణాలకు సంబంధించి మా వ్యక్తిగత అభిరుచుల పట్టిక వేసుకోమని ఆయన సలహానిచ్చారు. ఒకవేళ అలాంటి భాగస్వామి తారసపడితే, ఆ పట్టికలోవున్న నిర్దేశాల ప్రకారం మేము ఆ వ్యక్తిని పరిశీలించవచ్చు.

నాక్కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల్లో ఈ క్రిందివి ఉన్నాయి: ఆయన కూడా తోటి మిషనరీగావుండి, యెహోవాను ప్రేమించాలి, నాకంటే ఎక్కువగా బైబిలు సత్యం తెలిసివుండాలి, పూర్తికాల పరిచర్యలో కొనసాగడానికి వీలుగా అర్మగిద్దోనుకు ముందు పిల్లలు వద్దు అనుకోవాలి, అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడాలి, నాకంటే పెద్దవాడై ఉండాలి. ఆ పట్టిక, 20 ఏళ్ళ ప్రాయంలో, దూర ప్రాంతంలో నియామకాన్ని పొందబోతున్న నాకు చాలా సహాయకరంగా అనిపించింది.

బ్రెజిల్‌కు

ఆదివారం, 1959 ఆగస్టు 2న మేము పట్టభద్రులమై మా నియామకాల గురించి తెలుసుకున్నాము. వేనూష్‌ యాజెడ్‌జియాన్‌, సారా గ్రీకో, రే, ఐనెర్‌ హేట్‌ఫీల్డ్‌, సోనియా స్ప్రింగేట్‌, డొరీన్‌ హింజ్‌, నేను బ్రెజిల్‌కి నియమించబడ్డాం. మేము పులకరించిపోయాము. నేను అడవులను, పాములను, రబ్బరు చెట్లను, స్థానిక ఇండియన్లను ఊహించుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళేసరికి నాకెంతో ఆశ్చర్యం వేసింది! అమెజాన్‌ వర్షారణ్యానికి బదులు మేము ఎండకాసే, ఆధునిక పట్టణమైన అప్పటి దేశరాజధానియైన రియో డి జనీరోకు చేరుకున్నాం.

ఇప్పుడు మా ముందున్న సవాలు పోర్చుగీస్‌ నేర్చుకోవడం. మొదటినెలలో మేము ప్రతీరోజు 11 గంటలు అధ్యయనం చేసేవాళ్ళం. రియోలో ప్రకటిస్తూ, అక్కడున్న యెహోవాసాక్షుల బ్రాంచి ఆఫీసులో కొంతకాలం ఉన్నతర్వాత, నేను సావోపౌలోలోని పిరాసికాబాలోవున్న మిషనరీ గృహానికి, ఆ తర్వాత రియో గ్రాండె డొ సల్‌ స్టేట్‌లోని పొర్టో అలెగ్రెలోవున్న మిషనరీ గృహానికి పంపించబడ్డాను.

ఆ తర్వాత 1963 ప్రారంభంలో బ్రాంచిలోవున్న అనువాద విభాగంలో పనిచేయాలనే ఆహ్వానాన్ని అందుకున్నాను. మేము వచ్చిన మొదట్లో మాకు పోర్చుగీసు నేర్పించిన ఫ్లోరియానో ఇగ్నాజ్‌ డా కోన్‌సికావ్‌ ఆ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. బ్రెజిల్‌లో 1944లో దాదాపు 300 మందే సాక్షులు ఉన్న సమయంలో ఆయన సత్యం నేర్చుకొని, గిలియడ్‌ పాఠశాల 22వ తరగతికి హాజరయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం బ్రదర్‌ కోన్‌సికావ్‌ నాతో మాట్లాడాలి ఉండమని చెప్పాడు. మొదట నాకు భయం వేసింది. నేనేమైనా తప్పు చేశానా? భోజనానికి వెళ్ళడానికి బెల్‌ మ్రోగినప్పుడు ఆయన నాకు ఏమి చెప్పాలనుకుంటున్నాడని అడిగాను. అందుకాయన “నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగాడు. నేను అవాక్కయ్యాను. ఈ విషయాన్ని గురించి ఆలోచించడానికి కొంత సమయం కావాలని అడిగి భోజనానికి వెళ్ళిపోయాను.

నన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆసక్తి ప్రదర్శించిన సహోదరుల్లో ఫ్లోరియానో మొదటివాడేమీ కాదు. అయితే అప్పటివరకు తగిన వివాహ భాగస్వామికి ఉండాలని నేను వేసుకున్న పట్టికలోని అర్హతలున్న వారెవరూ తారసపడలేదు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నా పట్టిక నాకు సహాయం చేసిందని నేను నమ్ముతున్నాను. ఈ సారి పరిస్థితి వేరుగా ఉంది. ఫ్లోరియానోలో నాక్కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి! దానితో 1965 మే 15న మేము పెళ్ళి చేసుకున్నాము.

అనారోగ్య సవాలును ఎదుర్కోవడం

మాకెన్నో సవాళ్లు ఎదురైనా, నాకు, ఫ్లోరియానోకు, పెళ్ళి ఒక సంతోషభరితమైన అనుభవం. ఆ సవాళ్ళలో ఒకటి, మా పెళ్ళికి కొద్దికాలంముందు ప్రారంభమైన ఫ్లోరియానో ఆరోగ్య సమస్యలు. కొన్ని సంవత్సరాల క్రితం, ఆయన ఎడమ ఊపిరితిత్తి పాడయ్యింది, ఆ తర్వాతి పరిణామాలు ఆయనను మరింత బాధకు గురిచేశాయి. ఫలితంగా మేము బెతెల్‌ సేవను విడిచిపెట్టి, రియోడిజనీరో రాష్ట్రంలోని పర్వత ప్రాంతమైన టెరెసొపొలిస్‌ పట్టణానికి ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డాం. అక్కడి వాతావరణం ఆయన ఆరోగ్యం మెరుగయ్యేలా సహాయపడవచ్చని ఆశించాం.

దానికితోడు, డిసెంబరు 1965లో మా అమ్మ క్యాన్సర్‌తో అనారోగ్యంగా ఉందన్న వార్త నాకు తెలిసింది. మేము క్రమంగా ఉత్తరాలు వ్రాసుకునేవాళ్లం, అయితే నేను మా అమ్మను ఏడు సంవత్సరాలుగా అసలు చూడలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ వెళ్ళి ఆమెను చూసి వచ్చే ఖర్చులు ఆమే భరించింది. అమ్మకు ఆపరేషన్‌ అయ్యింది, కానీ డాక్టర్లు క్యాన్సర్‌ను నయం చేయలేకపోయారు. ఆమె మంచంపట్టి, ఎంతో అనారోగ్యానికి గురైనా, ప్రకటనాపనిలో భాగం వహించాలనే కోరికను ఆమె వదులుకోలేదు. ఆమె పడకగదిలో టైప్‌ రైటర్‌ ఉండడంతో ఉత్తరాలు టైప్‌ చేయడానికి వీలుగా ఆమె విషయాల్ని నోటితో చెబుతూవుండేది. అలాగే ఆమె తనను సందర్శించడానికి వచ్చినవారికి క్లుప్తంగా సాక్ష్యమిచ్చేది. ఆమె 1966 నవంబరు 27వ తేదీన మరణించింది. ఆ నెలలో ఆమె క్షేత్ర పరిచర్యలో 10 గంటలు రిపోర్టు చేసింది! మా నాన్నగారు 1979లో మరణించేంతవరకు పయినీరు సేవలో విశ్వసనీయంగా కొనసాగారు.

అమ్మ చనిపోయిన తర్వాత, ఫ్లోరియానో నేను బ్రెజిల్‌కి తిరిగివచ్చాము, అప్పటినుండి మేము రియోడిజనీరో రాష్ట్రంలోనే సేవచేశాము. మొదట్లో మేము రాష్ట్ర రాజధానిలో ప్రాంతీయసేవకు నియమించబడ్డాం, కానీ ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు, ఎందుకంటే ఫ్లోరియానో ఆరోగ్యం మళ్లీ పాడయ్యింది. ఆ తర్వాత మేము ప్రత్యేక పయినీర్లుగా టెరెసొపొలిస్‌కి తిరిగివచ్చాం.

అనేక సంవత్సరాలపాటు చేసిన బాధాకరమైన చికిత్స తర్వాత, 1974లో డాక్టర్లు ఫ్లోరియానో ఎడమ ఊపిరితిత్తిని తొలగించారు. ఆ సమయంలో ఆయన సంఘ పైవిచారణకర్తగా గానీ ప్రత్యేక పయినీరుగా గానీ సేవ చేయలేకపోయారు, అయితే ఆసుపత్రిలో రోగులను సందర్శించే సమయాల్లో బైబిలు అధ్యయనాలు నిర్వహించేవారు, అలాంటి అధ్యయనాల్లో ఒకటి అమెరికా వాసియైన బాబ్‌తో ఇంగ్లీషులో చేసేవారు. బాబ్‌ సత్యాన్ని అంగీకరించి ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఫ్లోరియానో క్రమేణా కోలుకొని అప్పటినుండి క్రమ పయినీరు సేవ చేశారు.

యెహోవా నా పరిచర్యను ఆశీర్వదించాడు

సంవత్సరాలుగా నేను ప్రత్యేక పయినీరు సేవలో కొనసాగాను, యెహోవా నా పరిచర్యను ఆశీర్వదించాడు. టెరెసొపొలిస్‌లో 60 కంటే ఎక్కువమంది తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకొనేలా సహాయం చేసే అద్భుతమైన ఆధిక్యత నాకు లభించింది. అలాంటి వాళ్ళలో జుపీరా అనే పేరుగల స్త్రీవుంది, ఆమెకు నేను చదవడం కూడా నేర్పించాను. ఆ తర్వాత నేను ఆమె 8 మంది ఎదిగిన పిల్లలతో అధ్యయనం చేశాను. ఫలితంగా జుపీరాతోపాటు, 20 మంది కుటుంబసభ్యులు, బంధువులు నేడు యెహోవాను క్రియాశీలంగా సేవిస్తున్నారు. వారిలో ఒకరు పెద్ద, ముగ్గురు పరిచర్య సేవకులు, ఇద్దరు పయినీర్లు.

ప్రజలు సత్యం తెలుసుకోవడం విషయంలో నేను అనుకూల వైఖరిని కాపాడుకోవడం నేర్చుకున్నాను. ఒక సందర్భంలో అల్జీమీరా అనే ఒక స్త్రీతో నేను బైబిలు అధ్యయనం చేస్తుండగా ఆమె భర్త ఆంటోన్యూ తక్షణం నేను ఆ ఇంటిని విడిచివెళ్ళకపోతే రెండు పెద్ద కుక్కల్ని నా మీదకు విడిచిపెడతానని నన్ను బెదిరించాడు. ఆ తర్వాత అల్జీమీరాతో తిరిగి అధ్యయనం ప్రారంభించేలా ఆమె భర్త ఆంటోన్యూ అనుమతి తీసుకోగలిగినంతవరకు, ఏడు సంవత్సరాలపాటు ఆమెను అప్పుడప్పుడు మాత్రమే కలుస్తుండేదాన్ని. అయినా నేను అతనితో బైబిలు గురించి మాట్లాడేందుకు మాత్రం అతను ఇష్టపడలేదు. ఒకసారి వర్షం వస్తున్నప్పుడు మాతోపాటు అధ్యయనంలో కూర్చొమ్మని ఆంటోన్యూను ఆహ్వానించాను. అప్పుడు అతని సమస్యేమిటో నేను గ్రహించాను, అతను నిరక్ష్యరాసి. అప్పటినుండి, ఫ్లోరియానో, ఇతరులు అతనితో అధ్యయనం చేసి, అతనికి చదవడం నేర్పించారు. నేడు అల్జీమీరా, ఆంటోన్యూ బాప్తిస్మం తీసుకున్నవారిగా ఉన్నారు. అనేకమంది యౌవనులకు పరిచర్యలో సహాయపడుతూ అతను సంఘంలో గొప్ప సహాయకంగా ఉన్నాడు.

టెరెసొపొలిస్‌లో 20 సంవత్సరాలకన్నా ఎక్కువ సంవత్సరాలు సేవచేసిన కాలంలో మాకు ఎదురైన అనుభవాల్లో ఇవి కొన్ని మాత్రమే. మేము 1988 ప్రారంభంలో నిటెరోయ్‌ పట్టణంలో సేవచేసే కొత్త నియామకాన్ని పొందాం, అక్కడనుండి సాంటూ అలాషూకి వెళ్ళడానికి ముందు మేము నిటెరోయ్‌లో ఐదు సంవత్సరాలపాటు సేవచేశాం. ఆ తర్వాత మేము రియోడిజనీరోకు మధ్యలోవున్న జుపీబా సంఘానికి వెళ్ళాం, ఆ తర్వాత రైబారె సంఘాన్ని నెలకొల్పే ఆధిక్యత మాకు లభించింది.

నిరాడంబరమైనదే అయినా ఆశీర్వాదకరమైన జీవితం

గడచిన సంవత్సరాలన్నింటిలో 300 కన్నా ఎక్కువమంది తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకునేలా సహాయం చేసే ఆధిక్యత ఫ్లోరియోనోకు, నాకు లభించింది. ప్రస్తుతం కొంతమంది బ్రాంచి కార్యాలయంలో, కొంతమంది పయినీర్లుగా, పెద్దలుగా, పరిచర్య సేవకులుగా సేవ చేస్తున్నారు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అనేకమందికి సహాయం చేసేలా మమ్మల్ని వాడుకున్నందుకు నేనెంతో కృతజ్ఞురాలిని!​—⁠మార్కు 10:​29, 30.

నిజమే, ఫ్లోరియోనో చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసివచ్చింది. అయినా, అలాంటి పరిస్థితుల్లోకూడా ఆయన స్థిరంగా, ఆనందంగా, యెహోవాపై నమ్మకాన్ని ఉంచారు. “సమస్యలు లేని జీవితం సాగించినంత మాత్రాన నేడు సంతోషమనేది రాదు. మన సమస్యలతో వ్యవహరించడానికి యెహోవా నుండి లభించే సహాయంవల్లే అది వస్తుంది” అని ఆయన ఎప్పుడూ అంటుంటారు.​—⁠కీర్తన 34:​19.

నాకు 2003లో ఎడమ కంటికి క్యాన్సర్‌ సోకింది. దానికి శస్త్రచికిత్స చేసి కృత్రిమ కన్ను అమర్చారు, దానిని రోజులో చాలాసార్లు శుభ్రం చేయాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ, ప్రత్యేక పయినీరుగా సేవచేయడంలో కొనసాగేలా యెహోవా నాకు శక్తినిచ్చాడు.

వస్తుపరమైన సంగతుల విషయంలో నేను నిరాడంబరంగా జీవించాను. అయినా నా నియామకంలో యెహోవా నన్ను ఆశీర్వదించి, ఆధ్యాత్మికంగా నన్ను సంపన్నురాల్ని చేశాడు. ఆఫ్రికాలోని ప్రకటనాపని విషయంలో ఆ మిషనరీ సహోదరి చేసిన వ్యాఖ్యానం, బ్రెజిల్‌లో మా నియామకానికి చక్కగా సరిపోయిందని నిరూపించుకుంది. యెహోవా నిజంగా మిషనరీ సేవచేయాలనే నా కోరికను మెండుగా ఆశీర్వదించాడు!

[9వ పేజీలోని చిత్రం]

నా కుటుంబంతో 1953లో

[9వ పేజీలోని చిత్రం]

ఐర్లాండ్‌లో 1957లో సాక్ష్యమిస్తుండడం

[10వ పేజీలోని చిత్రం]

తోటి మిషనరీలతో 1959లో బ్రెజిల్‌లో. ఎడమనుండి కుడికి: నేను, ఐనెర్‌ హేట్‌ఫీల్డ్‌, డొరీన్‌ హింజ్‌, సోనియా స్ప్రింగేట్‌

[10వ పేజీలోని చిత్రం]

నా భర్తతో