యోహానుకు ఇచ్చిన ప్రకటన 8:1-13
8 ఆయన+ ఏడో ముద్ర విప్పినప్పుడు,+ పరలోకంలో సుమారు అరగంటసేపు నిశ్శబ్దం అలుముకుంది.
2 అప్పుడు, దేవుని ముందు నిలబడి ఉండే ఏడుగురు దేవదూతల్ని+ నేను చూశాను, దేవుడు వాళ్లకు ఏడు బాకాలు ఇచ్చాడు.
3 బంగారు ధూపపాత్ర పట్టుకొని ఉన్న ఇంకొక దేవదూత వచ్చి బలిపీఠం+ దగ్గర నిలబడ్డాడు. పవిత్రులందరూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు సింహాసనం ముందున్న బంగారు బలిపీఠం+ మీద అర్పించడానికి ఆ దూతకు పెద్ద మొత్తంలో ధూపద్రవ్యం+ ఇవ్వబడింది.
4 పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవదూత చేతిలో నుండి ధూపం పొగ పైకి లేచి+ దేవుని సన్నిధికి చేరింది.
5 అయితే ఆ దూత వెంటనే ధూపపాత్రను తీసుకొని, బలిపీఠం మీదున్న నిప్పుల్లో కొన్నిటితో దాన్ని నింపి భూమ్మీద పడేశాడు. దానివల్ల ఉరుములు, మెరుపులు,+ భూకంపం వచ్చాయి; స్వరాలు వినిపించాయి.
6 ఏడు బాకాలు+ పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు వాటిని ఊదడానికి సిద్ధమయ్యారు.
7 మొదటి దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు రక్తంతో కలిసిన వడగండ్లు, అగ్ని భూమ్మీద కురిశాయి.+ దానివల్ల భూమిలో మూడోభాగం, చెట్లలో మూడోభాగం కాలిపోయింది; పచ్చని మొక్కలన్నీ కాలిపోయాయి.+
8 రెండో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు అగ్నితో మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పడేయబడింది.+ దాంతో సముద్రంలో మూడోభాగం రక్తంగా మారిపోయింది.+
9 దానివల్ల సముద్ర జీవుల్లో మూడోభాగం చనిపోయాయి,+ ఓడల్లో మూడోభాగం నాశనమయ్యాయి.
10 మూడో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, దీపంలా మండుతున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలింది. అది నదుల్లో మూడోభాగం మీద, నీటి ఊటల* మీద పడింది.+
11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి.* దానివల్ల నీళ్లలో మూడోభాగం చేదుగా మారిపోయాయి. నీళ్లు చేదుగా+ మారడంవల్ల చాలామంది చనిపోయారు.
12 నాలుగో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు సూర్యుడిలో,+ చంద్రుడిలో, నక్షత్రాల్లో మూడోభాగం చీకటిగా చేయబడ్డాయి.+ దానివల్ల పగటిలో మూడోభాగం, రాత్రిలో మూడోభాగం వెలుగు లేకుండా పోయింది.
13 నేను చూసినప్పుడు ఆకాశం మధ్యలో ఎగురుతున్న ఒక గద్ద కనిపించింది. అది పెద్ద స్వరంతో ఇలా అనడం విన్నాను: “బాకాలు ఊదడానికి సిద్ధంగా ఉన్న మిగతా ముగ్గురు దేవదూతలు తమ బాకాలు ఊదినప్పుడు+ భూమ్మీద జీవించేవాళ్లకు పెద్దపెద్ద కష్టాలు వస్తాయి!”+