రెండో తిమోతి 2:1-26

  • అర్హులైన పురుషులకు సందేశాన్ని అప్పగించు (1-7)

  • మంచివార్త కోసం బాధల్ని సహించడం (8-13)

  • దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించాలి (14-19)

  • యౌవన కోరికల నుండి పారిపో (20-22)

  • వ్యతిరేకులతో ఎలా వ్యవహరించాలి (23-26)

2  కాబట్టి నా కుమారుడా,+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల పొందిన అపారదయ ద్వారా నువ్వు శక్తి పొందుతూ ఉండు.  నువ్వు నా దగ్గర విన్న విషయాల్ని, అంటే ఎంతోమంది సాక్షులు ధృవీకరించిన విషయాల్ని+ నమ్మకమైన పురుషులకు అప్పగించు. దానివల్ల వాళ్లు కూడా ​ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు.  క్రీస్తుయేసుకు మంచి సైనికుడిగా,+ కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు.+  సైనికుడిగా సేవచేసే ఏ వ్యక్తీ వ్యాపారాల్లో* పాల్గొనడు.* ఎందుకంటే అతను, తనను సైనికుడిగా చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందాలనుకుంటాడు.  ఆటల పోటీల్లో కూడా, నియమాల ప్రకారం ఆడితేనే తప్ప ఎవ్వరూ బహుమతిని* గెల్చుకోలేరు.+  కష్టపడి పనిచేసే రైతు పంటను మొదట తినాలి.  నేను చెప్తున్న విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండు; ప్రభువు నీకు అన్ని విషయాల్లో అవగాహనను* అనుగ్రహిస్తాడు.  దావీదు సంతానమైన*+ యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని+ గుర్తుంచుకో; దాని గురించిన మంచివార్తనే నేను ప్రకటిస్తున్నాను.+  ఆ మంచివార్త కోసమే నేను బాధలు అనుభవిస్తున్నాను, నేరస్తుడిగా చెరసా​లలో ఉన్నాను.+ అయితే, దేవుని వాక్యం బంధిం​చబడి లేదు.+ 10  అందుకే, దేవుడు ఎంచుకున్నవాళ్ల కోసం నేను అన్నిటినీ సహిస్తూ ఉన్నాను.+ వాళ్లు కూడా క్రీస్తుయేసు ద్వారా కలిగే రక్షణను, శాశ్వతమైన మహిమను పొందాలన్నదే నా ఉద్దేశం. 11  ఈ మాట నమ్మదగినది: మనం ఆయనతో కలిసి చనిపోయి ఉంటే, ఆయనతో కలిసి బ్రతుకుతాం కూడా;+ 12  మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం;+ మనం ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన మనల్ని తిరస్కరిస్తాడు;+ 13  మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన మాత్రం నమ్మకంగానే ఉంటాడు; ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు. 14  ఈ విషయాలు వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు, పదాల గురించి పోట్లాడుకోవద్దని ఉపదేశిస్తూ* ఉండు. ఎందుకంటే దానివల్ల వినేవాళ్లకు హాని జరగడం* తప్ప ఒరిగేదేమీ ఉండదు. 15  దేవుని ఆమోదం పొందిన సేవకుడిగా, ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడిగా, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపయోగించేవాడిగా+ నిన్ను నువ్వు దేవునికి కనబర్చుకోవడానికి శాయశక్తులా కృషిచేయి. 16  పవిత్రమైనదాన్ని అగౌరవపర్చే పనికిరాని మాటల్ని తిరస్కరించు.+ ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు అంతకంతకూ దేవునికి దూరమౌతారు. 17  వాళ్ల మాటలు కొరుకుడు పుండులా వ్యాపిస్తాయి. హుమెనైయు, ఫిలేతు అలాంటివాళ్లే.+ 18  వాళ్లు, పునరుత్థానం ఇప్పటికే జరిగిపోయిందని చెప్తూ+ సత్యం నుండి తొలగిపోయారు, అలాగే కొందరి విశ్వాసాన్ని పాడుచేస్తున్నారు. 19  అయినా దేవుని గట్టి పునాది ఇంకా నిలిచే ఉంది, దానిమీద ఈ ముద్ర ఉంది: “తనవాళ్లు ఎవరో యెహోవాకు* తెలుసు,”+ “యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే+ ప్రతీ ఒక్కరు అవినీతిని వదిలేయాలి.” 20  ఒక గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలే కాకుండా చెక్క పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. కొన్నిటిని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు, కొన్నిటిని మామూలు పనులకు ఉపయోగిస్తారు. 21  ఎవరైనా ఈ రెండో రకం పాత్రలకు దూరంగా ఉంటే, అతను ముఖ్యమైన పనులకు ఉపయోగపడే పనిముట్టుగా* ఉంటాడు; అతను శుద్ధీకరించబడి, తన యజమానికి పనికొచ్చే పాత్రగా ఉంటాడు, ప్రతీ మంచిపనికి సిద్ధంగా ఉంటాడు. 22  అందుకే నువ్వు యౌవన కోరికల నుండి పారిపో; పవిత్రమైన హృదయంతో ప్రభువు పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లతో కలిసి నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అలవర్చుకోవడానికి గట్టిగా కృషిచేయి. 23  అంతేకాదు, గొడవల్ని రేపే ​మూర్ఖమైన, అర్థంపర్థంలేని వాదనల్ని తిరస్కరించు.+ 24  ఎందుకంటే, ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా* వ్యవహరించాలి,+ అతనికి బోధించే సామర్థ్యం ఉండాలి, అతనికి ఎవరైనా హాని చేస్తే నిగ్రహం చూపించాలి,+ 25  వ్యతిరేకించేవాళ్లకు సౌమ్యంగా ఉపదేశించాలి.+ బహుశా, దేవుడు వాళ్లలో పశ్చాత్తా​పాన్ని* కలిగించి, వాళ్లు సత్యం గురించిన సరైన జ్ఞానం పొందేలా చేయవచ్చు.+ 26  దానివల్ల వాళ్లు, అపవాది తన ఇష్టం నెరవేర్చేలా తమను సజీవంగా పట్టుకున్నాడని+ గుర్తించి, కళ్లు తెరిచి, అతని ఉచ్చులో నుండి తప్పించుకోవచ్చు.

అధస్సూచీలు

లేదా “రోజువారీ కార్యకలాపాల్లో” అయ్యుంటుంది.
అక్ష., “చిక్కుకోడు.”
అక్ష., “కిరీటాన్ని.”
లేదా “వివేచనను.”
అక్ష., “విత్తనం నుండి వచ్చిన.”
అక్ష., “పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ.”
లేదా “వాళ్లను నాశనం చేయడం; వాళ్లను తలక్రిందులు చేయడం.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “పాత్రగా.”
లేదా “యుక్తితో.”
లేదా “మారుమనసును.”