నిర్గమకాండం 28:1-43
28 “నాకు యాజకులుగా సేవచేసేలా నువ్వు ఇశ్రాయేలీయుల్లో నుండి నీ అన్న అహరోనును,+ అతని కుమారులైన+ నాదాబు, అబీహు,+ ఎలియాజరు, ఈతామారులను+ నీ దగ్గరికి పిలిపించాలి.+
2 నువ్వు నీ అన్న అహరోను కోసం పవిత్ర వస్త్రాలు తయారుచేయాలి; అవి అతనికి ఘనతను, అలంకారాన్ని తీసుకొస్తాయి.+
3 ఎవరికైతే పనిలో నైపుణ్యం ఉందో, ఎవరిలోనైతే నేను తెలివిని నింపానో+ వాళ్లందరితో నువ్వు మాట్లాడాలి; అహరోను నాకు యాజకుడిగా సేవచేసేలా, అతన్ని పవిత్రపర్చడం కోసం వాళ్లు అతని వస్త్రాల్ని తయారుచేస్తారు.
4 “వాళ్లు తయారు చేయాల్సినవి ఏమిటంటే: ఒక వక్షపతకం,+ ఒక ఏఫోదు,+ చేతుల్లేని నిలువుటంగీ,+ బుట్టాపనిగా* తయారుచేసిన చొక్కా, ఒక తలపాగా,+ ఒక దట్టీ;+ నీ అన్న అహరోను నాకు యాజకుడిగా సేవచేసేలా వాళ్లు అతని కోసం, అతని కుమారుల కోసం ఈ పవిత్ర వస్త్రాల్ని తయారుచేయాలి.
5 నైపుణ్యం ఉన్న పనివాళ్లు బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, సన్నని నార ఉపయోగించి వాటిని తయారుచేస్తారు.
6 “వాళ్లు ఏఫోదును బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి బుట్టాపనిగా తయారుచేయాలి.+
7 దానికి రెండు భుజం ముక్కలు చేసి వాటిని దాని రెండు అంచులకు జతచేయాలి.
8 ఏఫోదును దాని స్థానంలో కదలకుండా పట్టివుంచడం కోసం, దానికి జతచేసి కుట్టే దట్టీని*+ కూడా బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించే అల్లాలి.
9 “అలాగే నువ్వు రెండు సులిమాని రాళ్లు+ తీసుకొని, వాటిమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లను+ చెక్కాలి.
10 ఆరు పేర్లను ఒక రాయి మీద, మిగిలిన ఆరు పేర్లను ఇంకో రాయి మీద చెక్కాలి; వాళ్లు పుట్టిన క్రమంలో ఆ పేర్లను చెక్కాలి.
11 రాళ్లను చెక్కే పనివాడు, ముద్రమీద చెక్కినట్టుగా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఆ రెండు రాళ్ల మీద చెక్కాలి.+ తర్వాత వాటిని బంగారు జవల్లో పొదగాలి.
12 ఆ రెండు రాళ్లు ఇశ్రాయేలు కుమారులకు జ్ఞాపకార్థ రాళ్లుగా ఉండేలా వాటిని ఏఫోదు పైనున్న రెండు భుజం ముక్కల మీద పెట్టాలి.+ అహరోను యెహోవా ముందు తన రెండు భుజం ముక్కల మీద వాళ్ల పేర్లను జ్ఞాపకార్థంగా మోయాలి.
13 నువ్వు బంగారు జవలు తయారుచేయాలి,
14 అలాగే స్వచ్ఛమైన బంగారంతో, తాడును పేనినట్టు రెండు గొలుసుల్ని పేనాలి;+ తాడులా పేనిన ఆ గొలుసుల్ని జవలకు అంటించాలి.+
15 “న్యాయనిర్ణయ వక్షపతకాన్ని+ బుట్టా పనివాడితో తయారు చేయించాలి. ఏఫోదును చేసినట్టే బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నారతో దాన్ని తయారుచేయాలి.+
16 దాన్ని అడ్డంగా మడతపెట్టినప్పుడు, అది జేనడు* పొడవు, జేనడు వెడల్పు ఉన్న చతురస్రంలా ఉండాలి.
17 నువ్వు దానిలో నాలుగు వరుసల్లో రాళ్లను పొదగాలి. మొదటి వరుసలో మాణిక్యం, పుష్యరాగం, మరకతం ఉండాలి;
18 రెండో వరుసలో లేత నీలం రాయి, నీలం రాయి, సూర్యకాంతపు రాయి ఉండాలి;
19 మూడో వరుసలో లెషెము రాయి,* మలచబడిన రాయి,* ఊదారంగు రాయి ఉండాలి;
20 నాలుగో వరుసలో లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చ రాయి ఉండాలి. వాటిని బంగారు జవల్లో పొదగాలి.
21 ఇశ్రాయేలు 12 మంది కుమారుల్లో ఒక్కొక్కరి పేరుకు ఒక్కో రాయి. ప్రతీ రాయి పైన ముద్రమీద చెక్కినట్టు ఒక పేరును చెక్కాలి, ఒక్కో పేరు 12 గోత్రాల్లో ఒకదాన్ని సూచిస్తుంది.
22 “నువ్వు వక్షపతకం పైన స్వచ్ఛమైన బంగారంతో చేసిన తాళ్లలాంటి గొలుసుల్ని పేనాలి.+
23 అలాగే వక్షపతకం కోసం రెండు బంగారు ఉంగరాలు చేసి, వక్షపతకం రెండు చివర్లలో వాటిని ఉంచాలి.
24 నువ్వు ఆ రెండు బంగారు తాళ్లను వక్షపతకం చివర్లలో ఉన్న రెండు ఉంగరాల గుండా దూర్చాలి.
25 ఆ రెండు తాళ్ల రెండు చివర్లను ఏఫోదు ముందుభాగంలో భుజం ముక్కల మీదున్న రెండు జవల గుండా దూర్చాలి.
26 అలాగే రెండు బంగారు ఉంగరాలు చేసి వాటిని వక్షపతకం లోపలి అంచు రెండు చివర్లలో తగిలించాలి, అవి ఏఫోదుకు ఎదురుగా ఉండాలి.+
27 నువ్వు ఏఫోదు ముందుభాగంలో ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేయాలి. వాటిని రెండు భుజం ముక్కల కింద, దట్టీ ఏఫోదును అంటుకునే చోటుకు దగ్గర్లో, దట్టీకి కాస్త పైన పెట్టాలి.+
28 వక్షపతకం కదలకుండా దాని స్థానంలో ఉండేలా, ఒక నీలంరంగు తాడుతో వక్షపతకం ఉంగరాల్ని ఏఫోదు ఉంగరాలకు కట్టాలి. అప్పుడు వక్షపతకం ఏఫోదు మీద, దట్టీ పైన కదలకుండా ఉంటుంది.
29 “అహరోను పవిత్ర స్థలంలోకి వచ్చేటప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా ముందు జ్ఞాపకార్థంగా ఉండేలా తన ఛాతి* పైనున్న న్యాయనిర్ణయ వక్షపతకం మీద ఇశ్రాయేలు కుమారుల పేర్లను మోయాలి.
30 అలాగే నువ్వు ఊరీము, తుమ్మీము*+ అనేవాటిని న్యాయనిర్ణయ వక్షపతకంలో పెట్టాలి; అహరోను యెహోవా ముందుకు వచ్చేటప్పుడు అవి అతని ఛాతి మీద ఉండాలి; ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చే ఈ సాధనాలను అహరోను ఎల్లప్పుడూ యెహోవా ముందు తన ఛాతి పైన మోయాలి.
31 “ఏఫోదు లోపల వేసుకునే చేతుల్లేని నిలువుటంగీని పూర్తిగా నీలంరంగు దారంతో చేయాలి.+
32 తలను దూర్చడం కోసం దాని పైభాగం మధ్యలో ఒక రంధ్రం చేయాలి. ఆ రంధ్రం కవచానికి ఉండే రంధ్రంలా ఉండాలి. దాని చుట్టూ మగ్గం పనివాడు అంచును తయారుచేయాలి; అప్పుడది చిరిగిపోకుండా ఉంటుంది.
33 నిలువుటంగీ అంచు చుట్టూ నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో దానిమ్మ పండ్లను తయారుచేయాలి; అలాగే వాటి మధ్యలో బంగారంతో గంటలు చేయాలి.
34 ఒక బంగారు గంట, ఒక దానిమ్మ పండు; ఒక బంగారు గంట, ఒక దానిమ్మ పండు అలా నిలువుటంగీ అంచు చుట్టూ చేయాలి.
35 అహరోను సేవ చేసే సమయంలో, అతను పవిత్రమైన స్థలంలో యెహోవా ముందుకు వెళ్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు దాని శబ్దం వినిపించి అతను చనిపోకుండా ఉండేలా+ అతను దాన్ని వేసుకోవాలి.
36 “నువ్వు స్వచ్ఛమైన బంగారంతో మెరిసే రేకు తయారుచేసి, ముద్రమీద చెక్కినట్టు దానిపైన ఈ మాటలు చెక్కాలి: ‘పవిత్రత యెహోవాకు చెందుతుంది.’+
37 నువ్వు ఒక నీలంరంగు దారంతో దాన్ని తలపాగాకు కట్టాలి;+ అది తలపాగా ముందుభాగంలో ఎప్పటికీ అలా ఉండాలి.
38 అది అహరోను నుదుటి మీద ఉంటుంది. పవిత్రమైన వాటి విషయంలో, అంటే ఇశ్రాయేలీయులు పవిత్రమైన కానుకలుగా అర్పించడానికి పక్కకు తీసిన వాటి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే అహరోను ఆ బాధ్యతను భరిస్తాడు.+ వాళ్లు యెహోవా ముందు ఆమోదం పొందేలా, అది ఎప్పటికీ అతని నుదుటి మీద ఉండాలి.
39 “నువ్వు సన్నని నారతో బుట్టాపనిగా ఒక చొక్కాను, అలాగే సన్నని నారతో ఒక తలపాగాను చేయాలి; అంతేకాదు ఒక దట్టీని అల్లాలి.+
40 “అలాగే నువ్వు అహరోను కుమారుల కోసం చొక్కాలను, దట్టీలను, తలపాగాలను చేయాలి.+ అవి వాళ్లకు ఘనతను, అలంకారాన్ని తీసుకొస్తాయి.+
41 నువ్వు నీ అన్న అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగి, వాళ్లను అభిషేకించి,+ ప్రతిష్ఠించి,*+ పవిత్రపర్చాలి. అప్పుడు వాళ్లు నాకు యాజకులుగా సేవచేస్తారు.
42 అలాగే వాళ్ల మర్మాంగాల్ని కప్పడానికి వాళ్లకోసం నారతో లాగుల్ని* తయారుచేయాలి.+ అవి తుంటి దగ్గర నుండి తొడల వరకు ఉండాలి.
43 ప్రత్యక్ష గుడారంలోకి వస్తున్నప్పుడు లేదా పవిత్ర స్థలంలో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తున్నప్పుడు అపరాధులై చనిపోకుండా ఉండేలా అహరోను, అతని కుమారులు వాటిని వేసుకోవాలి. ఇది అతను, అతని తర్వాత అతని సంతానం* ఎప్పటికీ పాటించాల్సిన శాసనం.
అధస్సూచీలు
^ అంటే, ఎంబ్రాయిడరీ.
^ లేదా “అల్లిన దట్టీని.”
^ దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
^ ఇది గుర్తుతెలియని ఒక మణి.
^ లేదా “అగేటు.”
^ అక్ష., “గుండె.”
^ లేదా “వాళ్ల చేతుల్ని అధికారంతో నింపి.”
^ లేదా “లోదుస్తుల్ని.”
^ అక్ష., “విత్తనం.”