దానియేలు 6:1-28

  • దానియేలు మీద పారసీక అధికారుల కుట్ర (1-9)

  • దానియేలు ప్రార్థించడం మానలేదు (10-15)

  • దానియేలును సింహాల గుహలో పడేయడం (16-24)

  • దర్యావేషు రాజు దానియేలు దేవుణ్ణి ఘనపర్చడం (25-28)

6  దర్యావేషుకు రాజ్యమంతటి మీద 120 మంది ప్రాంత పాలకుల్ని నియమించడం మంచిదని అనిపించింది.+  వాళ్ల మీద ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నారు, ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు;+ రాజుకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాంత పాలకులు+ అన్ని విషయాల గురించి ఆ ముగ్గురికి నివేదిక సమర్పించేవాళ్లు.  అయితే దానియేలుకు అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయి+ కాబట్టి అతను మిగతా ఉన్నతాధికారుల కన్నా, ప్రాంత పాలకుల కన్నా సమర్థుడని నిరూపించుకున్నాడు. కాబట్టి రాజు దానియేలును రాజ్యమంతటి మీద నియమించాలని అనుకున్నాడు.  అప్పుడు ఉన్నతాధికారులు, ప్రాంత పాలకులు రాజ్య పాలనకు సంబంధించిన విషయాల్లో దానియేలు మీద నింద మోపడానికి కారణాలు వెదుకుతున్నారు; అయితే వాళ్లు నింద మోపడానికి ఎలాంటి కారణాలు గానీ, ఎలాంటి అవినీతి గానీ కనుక్కోలేకపోయారు. ఎందుకంటే దానియేలు నమ్మకస్థుడు, అతను పనిలో అశ్రద్ధగా ఉండేవాడు కాదు, అవినీతికి పాల్పడేవాడు కాదు.  అప్పుడు ఆ మనుషులు ఇలా చెప్పుకున్నారు: “అతని దేవుని ఆరాధనకు సంబంధించిన విషయంలో తప్ప+ మరే విషయంలోనూ మనం ఈ దానియేలు మీద నింద మోపడానికి కారణాల్ని కనుక్కోలేం.”  దాంతో ఆ ఉన్నతాధికారులు, ప్రాంత పాలకులు గుంపుగా రాజు దగ్గరికి వచ్చి అతనితో ఇలా అన్నారు: “దర్యావేషు రాజా, నువ్వు కలకాలం జీవించాలి.  రాజ్యాధికారులు, ప్రభుత్వ అధికారులు,* ప్రాంత పాలకులు, రాజు ముఖ్య అధికారులు, అధిపతులు అందరూ కలిసి మాట్లాడుకుని, ఒక రాజ శాసనాన్ని స్థాపించాలని, ఒక నిషేధాన్ని విధించాలని అనుకున్నారు. అదేమిటంటే, రాజా, ఎవరైనా 30 రోజులపాటు నీ దగ్గర కాకుండా, ఏ దేవుని దగ్గరైనా మనిషి దగ్గరైనా విన్నపం చేస్తే అతను సింహాల గుహలో పడేయబడాలి.+  రాజా, ఈ విధంగా నువ్వు ఒక శాసనాన్ని స్థాపించి, మార్చడానికి వీల్లేకుండా దానిమీద సంతకం చేయి.+ ఎందుకంటే మాదీయుల, పారసీకుల చట్టాన్ని ఎవ్వరూ రద్దు చేయలేరు.”+  కాబట్టి దర్యావేషు రాజు ఆ నిషేధం ఉన్న శాసనం మీద సంతకం చేశాడు. 10  అయితే, రాజు ఆ శాసనం మీద సంతకం చేశాడని తెలియగానే దానియేలు తన ఇంటికి వెళ్లాడు, ఆ ఇంటి మేడగది కిటికీలు యెరూషలేము వైపుకు తెరిచివుంటాయి.+ అతను క్రమంగా ఎప్పుడూ చేస్తున్నట్టే, రోజుకు మూడుసార్లు మోకాళ్లూని తన దేవునికి ప్రార్థించి ఆయన్ని స్తుతించాడు. 11  అప్పుడు ఆ మనుషులు దానియేలు ఇంట్లోకి చొరబడి, అతను తన దేవునికి విన్నపాలు చేయడం, అనుగ్రహం కోసం వేడుకోవడం చూశారు. 12  దాంతో వాళ్లు రాజు దగ్గరికి వచ్చి, రాజు విధించిన నిషేధాన్ని అతనికి గుర్తు చేస్తూ, “రాజా, ఎవరైనా 30 రోజులపాటు నీ దగ్గర కాకుండా, ఏ దేవుని దగ్గరైనా మనిషి దగ్గరైనా విన్నపం చేస్తే అతను సింహాల గుహలో పడేయబడాలని నువ్వు ఒక నిషేధం మీద సంతకం చేశావు కదా?” అన్నారు. దానికి రాజు, “మాదీయుల, పారసీకుల చట్ట ప్రకారం అది స్థిరపర్చబడింది, దాన్ని ఎవ్వరూ రద్దు చేయలేరు”+ అన్నాడు. 13  వెంటనే వాళ్లు రాజుతో, “రాజా, యూదా నుండి బందీలుగా వచ్చినవాళ్లలో ఒకడైన దానియేలు+ నిన్ను గానీ, నువ్వు సంతకం చేసిన నిషేధాన్ని గానీ లెక్కచేయకుండా రోజుకు మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు”+ అని చెప్పారు. 14  ఆ మాట వినగానే రాజు చాలా బాధపడ్డాడు, అతను దానియేలును ఎలా రక్షించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు; సూర్యాస్తమయం వరకు రాజు దానియేలును కాపాడడానికి అన్నివిధాలా ప్రయత్నించాడు. 15  చివరికి వాళ్లు గుంపుగా రాజు దగ్గరికి వచ్చి, “రాజా, గుర్తుంచుకో, ఇది మాదీయుల, పారసీకుల చట్టం. రాజు స్థిరపర్చిన ఏ నిషేధాన్నీ, శాసనాన్నీ మార్చడం వీలుకాదు”+ అన్నారు. 16  కాబట్టి రాజు ఆజ్ఞ ఇవ్వడంతో, వాళ్లు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారు.+ అప్పుడు రాజు దానియేలుతో, “నువ్వు ఎల్లప్పుడూ సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు” అన్నాడు. 17  తర్వాత ఒక రాయిని తీసుకొచ్చి, దానితో ఆ గుహ ద్వారాన్ని మూసేశారు; దానియేలు విషయంలో ఎలాంటి మార్పూ జరగకుండా రాజు తన ఉంగరంతో, తన ప్రముఖుల ఉంగరంతో దానికి ముద్ర వేశాడు. 18  తర్వాత రాజు తన రాజభవనానికి వెళ్లాడు. ఆ రాత్రి అతను ఉపవాసం ఉన్నాడు, వినోద కార్యక్రమాల్ని వద్దన్నాడు,* అతనికి నిద్ర పట్టలేదు. 19  చివరికి, తెల్లవారుజామున కాస్త వెలుతురు రాగానే, రాజు లేచి త్వరత్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్లాడు. 20  అతను గుహ దగ్గరికి వస్తుండగా, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. రాజు దానియేలును, “జీవంగల దేవుని సేవకుడివైన దానియేలూ, నువ్వు ఎల్లప్పుడూ సేవించే నీ దేవుడు నిన్ను సింహాల నుండి రక్షించగలిగాడా?” అని అడిగాడు. 21  వెంటనే దానియేలు రాజుతో ఇలా అన్నాడు: “రాజా, నువ్వు కలకాలం జీవించాలి. 22  నేను నా దేవుని ముందు నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు,+ అవి నాకు హాని చేయలేదు;+ రాజా, నీ విషయంలో కూడా నేను ఏ తప్పూ చేయలేదు.” 23  అప్పుడు రాజు ఎంతో సంతోషించి, దానియేలును ఆ గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞాపించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీసి చూసినప్పుడు అతని శరీరం మీద ఎలాంటి గాయం కనిపించలేదు, ఎందుకంటే అతను తన దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు.+ 24  తర్వాత రాజు ఆజ్ఞాపించడంతో వాళ్లు దానియేలు మీద నింద మోపిన* మనుషుల్ని తీసుకొచ్చి, వాళ్లను వాళ్ల కుమారులతో, భార్యలతో పాటు సింహాల గుహలో పడేశారు. వాళ్లు గుహ అడుగుభాగానికి చేరుకోకముందే సింహాలు వాళ్ల మీద దాడిచేసి, వాళ్ల ఎముకలన్నిటినీ కొరికేశాయి.+ 25  అప్పుడు దర్యావేషు రాజు భూమంతటా నివసిస్తున్న అన్నిదేశాల, భాషల ప్రజలకు ఇలా రాశాడు:+ “మీకు ఎంతో క్షేమం కలగాలి! 26  నా రాజ్యంలోని ప్రతీ ప్రాంతంలో ప్రజలు దానియేలు సేవించే దేవునికి భయపడి, ఆయన్ని గౌరవించాలని నేను ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను.+ ఎందుకంటే ఆయన జీవంగల దేవుడు, ఆయన శాశ్వతకాలం ఉంటాడు. ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు, ఆయన పరిపాలన* నిరంతరం ఉంటుంది.+ 27  ఆయన తన ప్రజల్ని రక్షిస్తాడు,+ కాపాడతాడు; ఆయన ఆకాశంలో, భూమ్మీదా సూచనలు, అద్భుతాలు చేస్తాడు,+ ఆయన దానియేలును సింహాల పంజా నుండి కాపాడాడు.” 28  అలా ఈ దానియేలు దర్యావేషు రాజ్యంలో,+ అలాగే పారసీకుడైన కోరెషు రాజ్యంలో+ వర్ధిల్లాడు.

అధస్సూచీలు

వీళ్లు బబులోను ప్రభుత్వంలో, ప్రాంత పాలకులకన్నా కిందిస్థాయిలో ఉంటారు.
లేదా “సంగీతకారులు ఎవరూ అతని ముందుకు తీసుకురాబడలేదు” అయ్యుంటుంది.
లేదా “లేనిపోనివి కల్పించి చెప్పిన.”
లేదా “సర్వాధిపత్యం.”