మత్తయి సువార్త 23:1-39
23 తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు:
2 “శాస్త్రులు, పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చున్నారు.
3 కాబట్టి వాళ్లు మీకు చెప్పేవన్నీ చేయండి, కానీ వాళ్లు చేసినట్టు చేయకండి. ఎందుకంటే వాళ్లు చెప్తారు కానీ చెప్పేవాటిని పాటించరు.+
4 వాళ్లు పెద్దపెద్ద బరువులు కట్టి ప్రజల భుజాల మీద పెడతారు+ కానీ తమ వేలితో కూడా వాటిని లేపడానికి ఇష్టపడరు.+
5 వాళ్లు చేసేవన్నీ మనుషులకు కనిపించాలనే చేస్తారు.+ ఉదాహరణకు, వాళ్లు రక్షరేకుల్లా ధరించే లేఖనాల పెట్టెల్ని పెద్దవి చేసుకుంటారు,+ తమ వస్త్రాల అంచుల్ని పొడుగ్గా చేస్తారు.+
6 వాళ్లకు విందుల్లో ప్రత్యేక స్థానాలు, సమాజమందిరాల్లో ముందువరుస* స్థానాలు కావాలి.+
7 సంతల్లో నమస్కారాలు పెట్టించుకోవడం, బోధకుడా* అని పిలిపించుకోవడం వాళ్లకు ఇష్టం.
8 మీరు మాత్రం బోధకులు అని పిలిపించుకోకూడదు, ఎందుకంటే ఒక్కడే మీ బోధకుడు,+ మీరంతా సహోదరులు.
9 అంతేకాదు భూమ్మీద ఎవర్నీ మీరు తండ్రీ అని పిలవద్దు.* ఒక్కడే మీ తండ్రి,+ ఆయన పరలోకంలో ఉన్నాడు.
10 అలాగే, మీరు నాయకులు అని కూడా పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు.
11 మీలో గొప్పవాడు మీకు సేవకుడిగా ఉండాలి.+
12 తనను తాను గొప్ప చేసుకునే వ్యక్తి తగ్గించబడతాడు.+ తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.+
13 “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మనుషులు ప్రవేశించకుండా మీరు పరలోక రాజ్యం తలుపులు మూసేస్తారు; మీరు లోపలికి వెళ్లరు, వెళ్లేవాళ్లను కూడా వెళ్లనివ్వరు.+
14 *——
15 “వేషధారులైన+ శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే ఒక వ్యక్తిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాన్ని, భూమిని చుట్టి వస్తారు. అతను మీ మతంలో చేరినప్పుడు, అతన్ని మీకన్నా రెండు రెట్లు ఎక్కువగా గెహెన్నాకు* అర్హునిగా చేస్తారు.
16 “గుడ్డి మార్గదర్శకులారా,+ మీకు శ్రమ! ఎందుకంటే మీరు, ‘ఎవరైనా ఆలయం మీద ఒట్టు పెట్టుకుంటే ఫర్లేదు కానీ, ఆలయంలోని బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే మాత్రం దాన్ని నిలబెట్టుకోవాలి’ అని చెప్తారు.+
17 తెలివితక్కువ మనుషులారా, గుడ్డివాళ్లారా! నిజానికి ఏది గొప్పది? బంగారమా? లేక దాన్ని పవిత్రపర్చిన ఆలయమా?
18 అంతేకాదు మీరు, ‘ఎవరైనా బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటే ఫర్లేదు కానీ, ఆ బలిపీఠంపై ఉన్న అర్పణ మీద ఒట్టు పెట్టుకుంటే మాత్రం దాన్ని నిలబెట్టుకోవాలి’ అని చెప్తారు.
19 గుడ్డివాళ్లారా! నిజానికి ఏది గొప్పది? అర్పణా? లేక ఆ అర్పణను పవిత్రపర్చే బలిపీఠమా?
20 కాబట్టి, ఎవరైనా బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటే అతను దానిమీద, అలాగే దానిమీదున్న వాటన్నిటి మీద ఒట్టు పెట్టుకున్నట్టే;
21 అలాగే, ఎవరైనా ఆలయం మీద ఒట్టు పెట్టుకుంటే అతను దానిమీద, దానిలో నివసించే దేవుని మీద ఒట్టు పెట్టుకున్నట్టే;+
22 అంతేకాదు, ఎవరైనా పరలోకం మీద ఒట్టు పెట్టుకుంటే అతను దేవుని సింహాసనం మీద, దానిపైన కూర్చున్న దేవుని మీద ఒట్టు పెట్టుకున్నట్టే.
23 “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మీరు పుదీనలో, సోపులో, జీలకర్రలో పదోవంతు ఇస్తారు;+ కానీ ధర్మశాస్త్రంలోని మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే న్యాయాన్ని,+ కరుణను,+ నమ్మకత్వాన్ని పట్టించుకోరు. పదోవంతు ఇవ్వడం అవసరమే కానీ, వేరే విషయాల్ని అశ్రద్ధ చేయకూడదు.+
24 గుడ్డి మార్గదర్శకులారా!+ మీరు దోమను+ వడగడతారు, కానీ ఒంటెను+ మింగేస్తారు.
25 “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మీరు బయటికి శుభ్రంగా కనిపించి లోపల మురికిగా ఉన్న గిన్నెల్లాంటివాళ్లు.+ లోపల మీరు అత్యాశతో*+ నిండివున్నారు, అదుపులేని కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయారు.+
26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నెల్ని ముందు లోపల శుభ్రం చేయి, అప్పుడు అవి బయట కూడా శుభ్రమౌతాయి.
27 “వేషధారులైన+ శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మీరు సున్నం కొట్టిన సమాధుల లాంటివాళ్లు.+ అవి బయటికి అందంగా కనిపిస్తాయి కానీ లోపల చనిపోయినవాళ్ల ఎముకలతో, అన్నిరకాల అపవిత్రతతో నిండివుంటాయి.
28 అలాగే మీరు కూడా బయటికి నీతిమంతుల్లా కనిపిస్తారు కానీ లోపల వేషధారణతో, అక్రమంతో నిండివున్నారు.+
29 “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మీరు ప్రవక్తల సమాధులు కడుతూ, నీతిమంతుల సమాధుల్ని* అలంకరిస్తూ,
30 ‘మేము మా పూర్వీకుల కాలంలో జీవించివుంటే, ప్రవక్తల రక్తం చిందించడంలో వాళ్లతో చెయ్యి కలిపేవాళ్లం కాదు’ అని అంటారు.
31 అలా అనడం ద్వారా, మీరు ప్రవక్తల్ని చంపినవాళ్ల పిల్లలని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు.+
32 సరే, మీ పూర్వీకులు మిగిల్చిన పాపాల్ని మీరు పూర్తిచేయండి.
33 “సర్పాల్లారా, విషసర్పాల పిల్లలారా,+ గెహెన్నా* తీర్పును తప్పించుకొని మీరు ఎక్కడికి పారిపోతారు?+
34 అందుకే నేను మీ దగ్గరికి ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, ఉపదేశకుల్ని+ పంపిస్తున్నాను.+ మీరు వాళ్లలో కొంతమందిని చంపి,+ కొయ్యలకు వేలాడదీస్తారు; ఇంకొంతమందిని మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొడతారు,+ ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తరుముతూ హింసిస్తారు.+
35 దానివల్ల, నీతిమంతుడైన హేబెలు రక్తంతో+ మొదలుపెట్టి, ఆలయానికీ బలిపీఠానికీ మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం+ వరకు, భూమ్మీద చిందించబడిన నీతిమంతులందరి రక్తం మీ మీదికి వస్తుంది.
36 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ ఈ తరంవాళ్ల మీదికి వస్తాయి.
37 “యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు ప్రవక్తల్ని చంపుతూ, నీ దగ్గరికి పంపబడినవాళ్లను రాళ్లతో కొడుతూ ఉన్నావు.+ కోడి తన పిల్లల్ని రెక్కల చాటున చేర్చుకున్నట్టు, నేను ఎన్నోసార్లు నీ పిల్లల్ని చేర్చుకోవాలని అనుకున్నాను! కానీ అది నీకు ఇష్టంలేదు.+
38 ఇదిగో! నీ ఇల్లు* నీకే వదిలేయబడింది.*+
39 నేను నీతో చెప్తున్నాను, ‘యెహోవా* పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!’+ అని నువ్వు చెప్పే వరకు ఇక నన్ను చూడవు.”
అధస్సూచీలు
^ లేదా “శ్రేష్ఠమైన.”
^ అక్ష., “రబ్బీ.”
^ ఇక్కడ “తండ్రి” అనే పదాన్ని ఒక మతపరమైన బిరుదుగా మనుషులకు ఉపయోగించడాన్ని యేసు ఖండించాడు.
^ అనుబంధం A3 చూడండి.
^ లేదా “దోపుడుసొమ్ముతో.”
^ లేదా “స్మారక సమాధుల్ని.”
^ అంటే, ఆలయం.
^ లేదా “నిర్మానుష్యంగా వదిలేయబడింది” అయ్యుంటుంది.
^ అనుబంధం A5 చూడండి.