గలతీయులు 5:1-26

  • క్రైస్తవ స్వాతంత్ర్యం (1-15)

  • పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకోవడం (16-26)

    • శరీర కార్యాలు (19-21)

    • పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు (22, 23)

5  అలాంటి స్వాతంత్ర్యాన్ని పొందడానికే క్రీస్తు మనల్ని విడిపించాడు. కాబట్టి స్థిరంగా ఉండండి,+ మళ్లీ దాస్యం అనే కాడి కిందికి వెళ్లకండి.+  చూడండి! నేనే, పౌలును చెప్తున్నాను, మీరు సున్నతి చేయించుకుంటే క్రీస్తువల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు.  సున్నతి చేయించుకునే ప్రతీ ఒక్కరికి నేను మళ్లీ గుర్తుచేస్తున్నాను, వాళ్లు సున్నతి చేయించుకుంటే, మొత్తం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సి ఉంటుంది.+  ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతులుగా తీర్పు పొందాలని ప్రయత్నించేవాళ్లు+ క్రీస్తును వదిలేశారు, ఆయన అపారదయ నుండి దూరమైపోయారు.  మనమైతే విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్పు పొందాలని నిరీక్షిస్తూ పవిత్రశక్తి ద్వారా దానికోసం ఆశగా ఎదురుచూస్తున్నాం.  ఎందుకంటే, క్రీస్తుయేసు శిష్యులకు సున్నతి చేయించుకోవడంలో గానీ చేయించుకోకపోవడంలో గానీ ఏమీలేదు,+ కానీ ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం.  చక్కగా పరుగెత్తుతున్న మిమ్మల్ని+ సత్యం అనుసరించకుండా అడ్డుకున్నది ఎవరు?  సున్నతి అవసరమని మిమ్మల్ని ఒప్పించింది ఎవరు? మిమ్మల్ని పిలిచిన దేవుడు అలా చేయడు.  పులిసిన పిండి కొంచెం కలిసినా, దానివల్ల పిండి మొత్తం పులిసిపోతుంది.+ 10  ప్రభువు శిష్యులుగా ఉన్న మీరు నాతో అంగీకరిస్తారని నా నమ్మకం. అయితే మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న వాళ్లు,+ వాళ్లు ఎవరైనాసరే, తగిన తీర్పు పొందుతారు. 11  సహోదరులారా, నా విషయానికొస్తే, నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తుంటే గనుక ఇప్పటికీ నాకు హింసలు ఎందుకు ఎదురౌతున్నాయి? ఇప్పటికీ నేను సున్నతి గురించి ప్రకటిస్తుంటే గనుక హింసాకొయ్య* గురించిన అడ్డంకి+ ఉండేది కాదు. 12  సున్నతి పేరుతో మిమ్మల్ని అయోమయంలో పడేయడానికి ప్రయత్నించేవాళ్లు అంగచ్ఛేదన చేసుకోవడం* మంచిది. 13  సహోదరులారా, మీరు స్వేచ్ఛగా ఉండడానికి పిలవబడ్డారు. అయితే, ఆ స్వేచ్ఛను శరీర కోరికలు తీర్చుకోవడానికి అవకాశంగా ఉపయోగించకండి, బదులుగా ప్రేమతో ఒకరికొకరు దాసులుగా సేవ చేసుకోండి.+ 14  ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఈ ఒక్క ఆజ్ఞతో నెరవేరుతుంది:* “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని* ప్రేమించాలి.”+ 15  కానీ మీరు ఒకరినొకరు కరుచుకుంటూ మింగేసుకుంటూ ఉంటే,+ ఒకరి వల్ల ఒకరు పూర్తిగా నాశనమైపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి!+ 16  అందుకే నేను చెప్పేదేమిటంటే, మీరు పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకోండి,+ అప్పుడు మీరు శరీర కోరికల ప్రకారం ప్రవర్తించరు.+ 17  ఎందుకంటే, శరీరం దాని కోరికల వల్ల పవిత్రశక్తికి విరుద్ధంగా ఉంటుంది, పవిత్రశక్తి శరీరానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం, కాబట్టి మీరు ఏవైతే చేయాలనుకుంటారో అవి చేయరు.+ 18  అంతేకాదు, మీరు పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకుంటే, ఇక మీరు ధర్మశాస్త్రం కింద ఉండరు. 19  శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే: లైంగిక పాపం,*+ అపవిత్రత, లెక్కలేనితనం,*+ 20  విగ్రహపూజ, మంత్రవిద్య,*+ శత్రుత్వం, గొడవలు, అసూయ, విపరీతమైన కోపం, విభేదాలు, విభజనలు, తెగలు, 21  ఈర్ష్య, తాగుబోతుతనం,+ విచ్చలవిడి విందులు* మొదలైనవి.+ నేను వీటి గురించి గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్టే ఇప్పుడూ హెచ్చరిస్తున్నాను, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.+ 22  మరోవైపున, పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు* ఏమిటంటే: ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు,* దయ, మంచితనం,+ విశ్వాసం, 23  సౌమ్యత, ఆత్మనిగ్రహం.+ ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేదీ లేదు. 24  అంతేకాదు, క్రీస్తుయేసు అనుచరులు శరీరాన్ని దాని తీవ్రవాంఛలతో, కోరికలతో సహా కొయ్యకు దిగగొట్టేశారు.+ 25  మనం పవిత్రశక్తి ప్రకారం జీవిస్తుంటే, ఇకముందు కూడా పవిత్రశక్తి నిర్దేశం ప్రకారమే సక్రమంగా నడుచుకుంటూ ఉందాం.+ 26  అహంకారంతో+ ఎదుటివాళ్లలో పోటీతత్వాన్ని కలిగించకుండా,+ ఒకరి మీద ఒకరం ఈర్ష్య పడకుండా ఉందాం.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “నపుంసకులు అవ్వడం.” అలా వాళ్లు, ఏ నియమాన్నైతే పాటించమని పట్టుబడుతున్నారో అదే నియమాన్ని పాటించడానికి అనర్హులౌతారు.
లేదా “మొత్తం ధర్మశాస్త్ర సారాంశం ఈ ఒక్క ఆజ్ఞలో ఉంది” అయ్యుంటుంది.
లేదా “పొరుగువాణ్ణి.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
లేదా “సిగ్గులేని ప్రవర్తన.” గ్రీకులో అసెల్జీయ. పదకోశం చూడండి.
లేదా “క్షుద్రవిద్య; మాదకద్రవ్యాల ఉపయోగం.”
లేదా “అల్లరి విందులు.”
అక్ష., “పవిత్రశక్తి ఫలం.”
లేదా “దీర్ఘశాంతం.”