కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 2

విజయవంతమయ్యే వివాహం కొరకు సిద్ధపడటం

విజయవంతమయ్యే వివాహం కొరకు సిద్ధపడటం

1, 2. (ఎ) పథకం వేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను యేసు ఎలా నొక్కిచెప్పాడు? (బి) ప్రత్యేకంగా ఏ రంగంలో పథకం వేసుకోవడం ఆవశ్యకం?

 ఓ భవంతిని నిర్మించాలంటే జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు అవసరం. పునాది వేయకముందే, భూమిని సంపాదించి నమూనాలను గీయాల్సివుంటుంది. అయితే, ఇంకా ఆవశ్యకమైనది ఉంది. యేసు ఇలా అన్నాడు: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?”—లూకా 14:28.

2 ఓ భవంతిని నిర్మించడంలో సత్యమైనది, ఒక విజయవంతమయ్యే వివాహాన్ని నిర్మించడానికి కూడా అన్వయిస్తుంది. “నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది” అని చాలామంది అంటారు. అయితే ఎంతమంది మొదట చెల్లించవలసిన ఆ మూల్యాన్ని లెక్కించుకుంటారు? బైబిలు వివాహాన్ని గురించి అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ, వివాహం అందించే సవాళ్ల వైపుకు కూడా అది అవధానాన్ని మళ్లిస్తుంది. (సామెతలు 18:22; 1 కొరింథీయులు 7:28) కాబట్టి, వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్న వారు, వివాహం చేసుకోవడం ద్వారా వచ్చే దీవెనల ఎడల మరియు దాని కొరకు చెల్లించాల్సిన వాటి ఎడల వాస్తవికమైన దృష్టిని కలిగివుండాల్సిన అవసరముంది.

3. వివాహం కొరకు పథకం వేసుకుంటున్న వారికి బైబిలు ఎందుకు ఒక విలువైన సహాయకం, మరి ఏ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు ఇది మనకు సహాయం చేస్తుంది?

3 బైబిలు సహాయం చేయగలదు. వివాహ ఆరంభకుడైన యెహోవా దేవుని చేత దానిలోని సలహాలు ప్రేరేపింపబడ్డాయి. (ఎఫెసీయులు 3:14; 2 తిమోతి 3:16, 17) ప్రాచీనమైనదైనప్పటికీ ఎంతో తాజాదైన ఈ నిర్దేశకపుస్తకంలోని సూత్రాలను ఉపయోగిస్తూ, (1) తాను వివాహానికి సిద్ధంగా ఉన్నానని అతడు ఎలా చెప్పగలడు లేక ఆమె ఎలా చెప్పగలదు? (2) జతలో దేనికొరకు వెదకాలి? మరియు (3) ప్రేమ యాచనను (కోర్ట్‌షిప్‌) ఎలా ఘనంగా ఉంచవచ్చు? అనే విషయాలను నిర్ధారించుకుందాం.

మీరు వివాహానికి సిద్ధంగా ఉన్నారా?

4. విజయవంతమయ్యే వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడంలోని ఆవశ్యకమైన కారకాంశం ఏది, మరియు ఎందుకు?

4 ఓ భవంతిని నిర్మించడం ఖరీదైన పని కావచ్చు, అయితే దాని దీర్ఘకాల నిర్వహణ విషయంలో శ్రద్ధ తీసుకోవడం కూడా ఖర్చుతో కూడినదై ఉంటుంది. వివాహం విషయంలో కూడా అంతే. వివాహం చేసుకోవడం సవాలుతో కూడినదిగా అనిపిస్తుంది; అయితే, సంవత్సరాలు గడిచే కొలది ఆ వైవాహిక సంబంధాన్ని కాపాడుకోవడాన్ని గురించి కూడా ఆలోచించాలి. అలాంటి బంధాన్ని కాపాడుకోవడంలో ఏమి ఇమిడివుంది? హృదయపూర్వకంగా కట్టుబడి ఉండటమే ఒక ఆవశ్యకమైన కారకాంశం. వివాహబంధాన్ని బైబిలు ఇలా వర్ణిస్తుంది: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24) “వ్యభిచారము,” అంటే దంపతుల మధ్య కాక ఇతరులతో నీచమైన అక్రమ లైంగిక సంబంధాన్ని కలిగివుండటమే తిరిగి వివాహం చేసుకొనే సాధ్యతతో విడాకులకుగల ఏకైక లేఖనాధారమని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 19:9) మీరు వివాహం చేసుకోవాలని అనుకుంటే, ఈ లేఖన ప్రమాణాలను మనస్సులో ఉంచుకోండి. ఇలా పూర్తిగా కట్టుబడి ఉండేందుకు మీరు సిద్ధంగా లేనట్లయితే, మీరు వివాహం కొరకు సిద్ధంగా లేరు.—ద్వితీయోపదేశకాండము 23:21; ప్రసంగి 5:4, 5.

5. వివాహంలో పూర్తిగా కట్టుబడివుండటం అంటే చాలామంది కలవరపడ్డప్పటికీ, వివాహం చేసుకోవాలని ఇష్టపడే వారు దాన్ని ఎందుకు ఎంతో విలువైనదిగా ఎంచాలి?

5 పూర్తిగా కట్టుబడివుండటమనే తలంపే అనేకమందిని కలవరపెడుతుంది. “మేమిక జీవితాంతం కలిసేవుంటామని తెలుసుకోవడంతో నేను ఒక మూలకు నెట్టివేయబడినట్లు, దేంట్లోనో మూసివేయబడినట్లు, పూర్తిగా బంధింపబడినట్లు భావించానని” ఒక యౌవనపురుషుడు చెబుతున్నాడు. అయితే మీరు వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్న వ్యక్తిని మీరు నిజంగా ప్రేమిస్తే, కట్టుబడివుండటమనేది ఒక భారంలా అనిపించదు. బదులుగా, అది భద్రతనిచ్చే మూలంవలె దృష్టించబడుతుంది. వివాహంలో అన్వయింపబడిన కట్టుబడివుండాలనే భావం, దంపతులు మంచి సమయాల్లోనేకాక కష్టకాలాల్లోనూ కలిసివుండేందుకు ఇష్టపడేలా చేస్తుంది మరియు ఏది సంభవించినా ఒకరికొకరు మద్దతునిచ్చుకునేలా చేస్తుంది. నిజమైన ప్రేమ “అన్నిటికి తాళుకొనును” మరియు “అన్నిటిని ఓర్చును” అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 13:4, 7) “వివాహంలో కట్టుబడివుండటం నేను ఎక్కువ భద్రంగా ఉన్నట్లు భావించేలా చేస్తుంది. మేము కలిసివుండాలని తీర్మానించుకున్నామని మనకు మనం, లోకానికి చెప్పుకోవడంవలన వచ్చే ఆదరణంటే నాకెంతో ఇష్టమని” ఒక స్త్రీ చెబుతుంది.—ప్రసంగి 4:9-12.

6. చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవాలని త్వరపడటం ఎందుకు మంచిది కాదు?

6 అలా కట్టుబడివుండి దానికి తగినట్లు జీవించాలంటే పరిపక్వత అవసరం. అందుకే, లైంగిక భావాలు బలీయంగావుండి, ఒకరి ఆలోచనాసామర్థ్యాన్ని అస్తవ్యస్తం చేయగల “నవ యౌవనం దాటిపోవువరకు” వివాహం చేసుకోకుండా ఉంటే క్రైస్తవులు మంచిపని చేస్తున్నారని పౌలు సలహా ఇచ్చాడు. (1 కొరింథీయులు 7:36, NW) యౌవనస్థులు ఎదుగుతున్నప్పుడు త్వరగా మారుతుంటారు. చిన్న వయస్సులో వివాహం చేసుకున్న వారు, కేవలం కొన్ని సంవత్సరాల తర్వాత తన యొక్క అలాగే తన జత యొక్క అవసరతలు మరియు కోర్కెలు మారిపోయాయని కనుగొంటారు. వివాహం చేసుకునే యౌవనస్థులు, వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్న వారికంటే ఎక్కువ అసంతోషంగావుండే సాధ్యత మరియు విడాకుల కొరకు ప్రయత్నించే సాధ్యతవుందని గణాంకాలు బయల్పరుస్తున్నాయి. కాబట్టి వివాహం చేసుకోడానికి ఉరకలు వేయకండి. యౌవనులుగా, ఒంటరి వారిగా గడిపిన కొన్ని సంవత్సరాలు, మీరు మరింత పరిణతిగల వారిగా, సరైన జతగా ఉండడానికి తగినంత యోగ్యతగల వారిగా తయారయ్యేందుకు కావలసిన అమూల్యమైన అనుభవాన్నివ్వగలవు. వివాహం విషయంలో వేచియుండటం, మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోడానికి కూడా మీకు సహాయం చేయగలదు, మీ వివాహంలో విజయవంతమైన సంబంధాన్ని వృద్ధిపర్చుకోవాలంటే అది అత్యవసరం.

మొదట మిమ్మల్ని మీరు తెలుసుకోండి

7. వివాహం చేసుకోవాలని ఇష్టపడే వారు మొదట తమనుతాము ఎందుకు పరీక్షించుకోవాలి?

7 మీ జతలో ఉండాలని మీరు ఇష్టపడే లక్షణాలను లెక్కించడం మీకు సులభమేనా? అది చాలామందికి సులభం. అయితే, మీ స్వంత లక్షణాల సంగతేమిటి? విజయవంతమయ్యే వివాహానికి దోహదపడేందుకు మీకు సహాయం చేయగల ఏ గుణాలు మీలో ఉన్నాయి? మీరు ఎలాంటి భర్త లేక భార్య కాగలరు? ఉదాహరణకు, మీరు మీ తప్పిదాలను స్వేచ్ఛగా ఒప్పుకుని సలహాలను అంగీకరిస్తారా లేక మిమ్మల్ని సరిదిద్దినప్పుడు ఎల్లప్పుడూ ప్రతిరోధిస్తారా? మీరు సాధారణంగా చిరునవ్వు నవ్వుతూ, ఆశావాదిగా ఉంటారా, లేక ముఖం వ్రేలాడేసుకుని, తరచూ ఫిర్యాదు చేస్తుంటారా? (సామెతలు 8:33; 15:15) వివాహం మీ వ్యక్తిత్వాన్ని మార్చదని మాత్రం జ్ఞాపకముంచుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అహంకారంగా, అతి సున్నితంగా లేక ఎక్కువ నిరాశతో ఉంటే, మీకు వివాహమైనప్పుడు కూడా మీరు అలాగే ఉంటారు. ఇతరులు మనల్ని చూసే విధంగా మనల్నిమనం చూసుకోవడం కష్టం గనుక, సూటియైన వ్యాఖ్యానాలు మరియు సూచనల కొరకు మీ తలిదండ్రులలో ఒకరినో లేక ఒక నమ్మకమైన స్నేహితున్నో లేక స్నేహితురాలినో ఎందుకు అడుగకూడదు? మీరు మార్చుకోవలసిన వాటిగురించి తెలుసుకుంటే, వివాహం చేసుకోడానికి చర్యలు తీసుకోకముందే వాటి విషయమై కృషి చేయండి.

ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడే, వివాహంలో మీకు బాగా సహాయం చేసే లక్షణాలను అలవాట్లను మరియు సామర్థ్యాలను వృద్ధి చేసుకోండి

8-10. ఒక వ్యక్తి వివాహం చేసుకునేందుకు సిద్ధపడటానికి సహాయం చేసే ఏ సలహాలను బైబిలిస్తుంది?

8 “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి లక్షణాలను ఉత్పన్నం చేయడానికి, దేవుని పరిశుద్ధాత్మ మనలో పని చేసేందుకు మనం అనుమతించాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. మనము “చిత్తవృత్తియందు నూతనపరచబడిన [వారమై] నీతియు యథార్థమైన భక్తియుగల [వారమై], దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను” అని కూడా అది మనకు చెబుతుంది. (గలతీయులు 5:22, 23; ఎఫెసీయులు 4:23, 24) మీరు ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడే ఈ సలహాలను అన్వయించుకోవడం, డబ్బును బ్యాంకులో జమ చేసినట్లు ఉంటుంది—భవిష్యత్తులో మీరు వివాహం చేసుకున్నప్పుడు ఎంతో విలువైనదానిగా అది నిరూపించబడుతుంది.

9 ఉదాహరణకు, మీరు ఒక స్త్రీ అయితే, మీ శారీరక రూపానికంటే “హృదయపు అంతరంగ స్వభావము”నకు ఎక్కువ అవధానాన్నివ్వండి. (1 పేతురు 3:3, 4) వాస్తవంగా “ప్రకాశమానమైన కిరీటమ”గు జ్ఞానమును పొందేందుకు అణుకువ మరియు స్వస్థబుద్ధి మీకు సహాయపడతాయి. (సామెతలు 4:9; 31:10, 30; 1 తిమోతి 2:9, 10) మీరు పురుషుడైతే, స్త్రీల ఎడల కనికరంతో, గౌరవపూర్వకంగా ప్రవర్తించడాన్ని నేర్చుకోండి. (1 తిమోతి 5:1, 2) నిర్ణయాలు తీసుకుని, బాధ్యతవహించడం నేర్చుకుంటుండగా, మీరు అణుకువగా దీనంగా ఉండటాన్ని కూడా నేర్చుకోండి. అణచివేసే స్వభావం వివాహంలో కష్టాలకు కారణమౌతుంది.—సామెతలు 29:23; మీకా 6:8; ఎఫెసీయులు 5:28-30.

10 ఈ విషయాల్లో మనస్సు మార్చుకోవడం సులభం కాకపోయినప్పటికీ, క్రైస్తవులందరూ ఈ విషయమై కృషి చెయ్యాలి. ఒక మంచి వివాహ భాగస్వామిగా ఉండేందుకు ఇది మీకు సహాయపడుతుంది.

ఒక జతలో దేనికొరకు వెదకాలి

11, 12. తాము సహజీవన సామర్థ్యాన్ని కలిగివున్నామా లేదా అని ఇద్దరు వ్యక్తులు ఎలా కనుగొనగలరు?

11 మీరు నివసించే ప్రాంతంలో ఒక వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని తానే ఎన్నుకోవడం సాంప్రదాయమా? అలాగైతే, వ్యతిరేక లింగ వ్యక్తులు మీకు ఆకర్షణీయంగా కనిపిస్తే మీరెలా ముందుకు కొనసాగాలి? మొదట, ‘నేను నిజంగా వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అబద్ధపు ఆశలు రేపడం ద్వారా ఎదుటి వ్యక్తి భావోద్రేకాలతో ఆడుకోవడం కిరాతకం. (సామెతలు 13:12) తర్వాత, ‘నేను వివాహం చేసుకునే స్థితిలో ఉన్నానా?’ అని ప్రశ్నించుకోండి. ఈ రెండు ప్రశ్నల సమాధానం అనుకూలమైనదైతే, తర్వాత మీరు తీసుకునే చర్యలు ప్రాంతీయ ఆచారాల ఆధారంగా వేరు వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో, కొంతకాలం గమనించిన తర్వాత, మీరా వ్యక్తిని సమీపించి తనను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న మీ కోరికను తెలుపవచ్చు. ప్రతికూలమైన ప్రతిస్పందన వస్తే, తాను మిమ్మల్ని అక్షేపించేంత వరకూ పట్టుపట్టకండి. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఎదుటి వ్యక్తికి కూడా ఉందని జ్ఞాపకముంచుకోండి. అయితే, ప్రతిస్పందన అనుకూలంగా ఉంటే, ఆరోగ్యకరమైన కార్యకలాపాలలో మీరిద్దరూ కలిసి కొంత సమయాన్ని గడిపేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వ్యక్తిని వివాహం చేసుకోవడం జ్ఞానయుక్తంగా ఉంటుందో లేదో చూసేందుకు ఇది మీకు అవకాశాన్నిస్తుంది. a ఈ స్థితిలో మీరు దేని కొరకు వెదకాలి?

12 ఆ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు రెండు వాద్య సాధనాలను, బహుశా ఒక పియానోను ఒక గిటార్‌నూ ఊహించుకోండి. వాటికి సరిగ్గా శృతి కూర్చితే, రెండూ కూడా రమ్యమైన సోలో సంగీతాన్ని ఉత్పన్నం చేయగలవు. అయితే, ఈ రెండు పరికరాలనూ కలిపి వాయిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు అవి ఒకదానితో మరొకటి శృతికూర్చబడి ఉండాలి. మీ విషయంలో మరియు మీ జత విషయంలో కూడా ఇది వాస్తవమే. మీరు ఆయా వ్యక్తులుగా మీ వ్యక్తిత్వాన్ని “శృతికూర్చుకోడానికి” మీరిద్దరూ కష్టపడి పని చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ప్రశ్నేమిటంటే: మీరు ఒకరితో ఒకరు సరిగ్గా శృతికూర్చుకోగల్గుతున్నారా? వేరే మాటల్లో చెప్పాలంటే, మీరు సహజీవనసామర్థ్యాన్ని కలిగివున్నారా?

13. మీవంటి విశ్వాసాన్ని కలిగిలేని వ్యక్తితో ప్రేమయాచన చేయడం ఎందుకు ఎంతో అజ్ఞానం?

13 మీరిద్దరూ ఒకేలాంటి నమ్మకాలను సూత్రాలను కలిగివుండాలన్నది ప్రాముఖ్యం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.” (2 కొరింథీయులు 6:14; 1 కొరింథీయులు 7:39) దేవునియందు మీకున్నటువంటి విశ్వాసంలేని వారిని వివాహం చేసుకోవడం, మీమధ్య సామరస్యం లోపించేందుకు కారణం కాగలదు. మరో వైపు, యెహోవా దేవుని ఎడల ఇద్దరికీ భక్తివుండటమే ఐక్యతకు అతి దృఢమైన ఆధారం. మీరు సంతోషంగా ఉండాలని, మీరు వివాహం చేసుకునే వ్యక్తితో అతిసన్నిహిత బంధాన్ని కలిగివుండి ఆనందించాలని యెహోవా కోరుతున్నాడు. మూడుపేటల ప్రేమ బంధంలో మీరు ఆయనతో, అలాగే పరస్పరం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు.—ప్రసంగి 4:12.

14, 15. ఒకే విశ్వాసాన్ని కలిగివుండటం వివాహంలో ఐక్యతకు ఏకైక అంశమా? వివరించండి.

14 దేవున్ని కలిసి సేవించడం ఐక్యతకుగల అత్యంత ప్రాముఖ్యమైన అంశమైనప్పటికీ, ఇంకా ఎక్కువే ఇమిడివుంది. ఒకరితో ఒకరు శృతికూర్చబడేందుకు, మీకూ మీ కాబోయే జతకు ఒకే విధమైన లక్ష్యాలుండాలి. మీ లక్ష్యాలేమిటి? ఉదాహరణకు, పిల్లల్ని కనే విషయంలో మీరు ఇరువురూ ఎలా భావిస్తున్నారు? మీ జీవితంలో ఏ విషయాలకు మొదటి స్థానముంది? b (మత్తయి 6:33) వాస్తవంగా విజయవంతమయ్యే వివాహంలో, దంపతులు మంచి స్నేహితులైవుండి ఒకరి సాన్నిధ్యంలో మరొకరు ఆనందాన్ని పొందుతారు. (సామెతలు 17:17) అందుకొరకు, వారు ఒకే విధమైన విషయాల ఎడల ఆసక్తి కలిగివుండాల్సిన అవసరతవుంది. పరిస్థితి అలా గనుక లేకపోతే, ఒక స్నేహబంధాన్ని కాపాడుకోవడమే కష్టం, మరి వివాహాన్ని కాపాడుకోవడం మరీ కష్టం. అయినప్పటికీ, మీ కాబోయే జతకు హైకింగ్‌ వంటి ఏదైనా ప్రత్యేక కార్యకలాపం ఇష్టం, అయితే అది మీకు మాత్రం ఇష్టం లేదనుకోండి, అప్పుడు మీరిద్దరూ వివాహం చేసుకోకూడదని దానర్థమా? అలా కానవసరం లేదు. బహుశా మీరిద్దరూ ఇతర, ఎక్కువ ప్రాముఖ్యమైన విషయాల్లో ఆసక్తిని కలిగివుంటారేమో. అంతేకాక, ఎదుటి వ్యక్తికి ఇష్టం గనుక మంచి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీరు మీ కాబోయే జతకు సంతోషాన్నివ్వగలరు.—అపొస్తలుల కార్యములు 20:35.

15 వాస్తవానికి, చాలావరకూ, మీరిద్దరూ ఎంత అభిన్నంగా ఉన్నారనేదానిపై కాక మీరిద్దరూ ఎంతమేరకు సర్దుకుపోతారు అనేదానిపై సహజీవన సమర్థత నిర్ధారించబడుతుంది. “మేము అన్ని విషయాల్లో ఏకాభిప్రాయాన్ని కలిగివున్నామా?” అని ప్రశ్నించుకునే బదులు, “మాలో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? ఒకరికొకరం గౌరవాన్ని, మర్యాదను ఇచ్చుకుని, విషయాలను మేము ప్రశాంతంగా చర్చించుకోగలమా? లేక చర్చలు తరచూ కోపోద్రేకపూరితమైన వాదనలుగా మారుతాయా?” అని ప్రశ్నించుకోవడం మంచిది. (ఎఫెసీయులు 4:29, 31) మీరు వివాహం చేసుకోవాలనుకుంటే, రాజీపడేందుకు ఇష్టపడని లేక తన పద్ధతినే జరిగించేందుకు అహంకారంగా పట్టుబట్టే లేక ఎత్తులు వేసే, తన అభిప్రాయమే సరైనదనే గర్విష్ఠులనుండి అప్రమత్తంగా ఉండండి.

ముందే తెలుసుకోండి

16, 17. కాబోయే వివాహ జతను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఒక పురుషుడు లేక స్త్రీ దేని కొరకు చూడాలి?

16 క్రైస్తవ సంఘంలో, బాధ్యత అప్పగింపబడిన వారు “మొదట పరీక్షింపబడవలెను.” (1 తిమోతి 3:10) మీరు కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, ఒక స్త్రీ ఇలా ప్రశ్నించుకోవచ్చు, “ఈ వ్యక్తికి ఎలాంటి ప్రతిష్ఠ ఉంది? ఆయన స్నేహితులెవరు? ఆయన ఆశానిగ్రహాన్ని కనపరుస్తాడా? పెద్దవయస్సుగల వారితో ఆయన ఎలా వ్యవహరిస్తాడు? ఆయనది ఎలాంటి కుటుంబం? ఆయన వారితో ఎలా వ్యవహరిస్తాడు? డబ్బు ఎడల ఆయన దృక్పథమేంటి? ఆయన మద్యం అతిగా సేవిస్తాడా? ఆయన విసుగు చెందుతాడా, దౌర్జన్యపూరితంగా కూడా ప్రవర్తిస్తాడా? ఆయనకు ఎలాంటి సంఘ బాధ్యతలున్నాయి, ఆయన వాటినెలా నిర్వహిస్తాడు? నేను ఆయనను ప్రగాఢంగా గౌరవించగలనా?”—లేవీయకాండము 19:32; సామెతలు 22:29; 31:23; ఎఫెసీయులు 5:3-5, 33; 1 తిమోతి 5:8; 6:10; తీతు 2:6, 7.

17 ఒక పురుషుడు ఇలా ప్రశ్నించుకోవచ్చు, “ఈ స్త్రీ దేవుని ఎడల ప్రేమను గౌరవాన్ని కనపరుస్తుందా? ఆమె గృహ నిర్వహణకు సమర్థురాలా? ఆమె కుటుంబం మానుండి ఏమి అపేక్షిస్తుంది? ఆమె జ్ఞానవంతురాలు, కష్టించి పనిచేసేది, పొదుపు చేసేదా? ఆమె ఏ విషయాలను గూర్చి మాట్లాడుతుంది? ఆమెకు ఇతరుల యోగక్షేమాల ఎడల నిజమైన శ్రద్ధవుందా లేక ఆమె స్వార్థపరురాలు, పరులజోలికి పోయేదా? ఆమె నమ్మదగినదా? ఆమె శిరస్సత్వానికి లోబడేందుకు సుముఖత కలిగివుందా, లేక మొండిది తిరుగుబాటు చేసేది కూడానా?”—సామెతలు 31:10-31; లూకా 6:45; ఎఫెసీయులు 5:22, 23; 1 తిమోతి 5:13; 1 పేతురు 4:15.

18. ప్రేమయాచన సమయంలో చిన్న బలహీనతలను గమనించినప్పుడు, దేనిని మనస్సులో ఉంచుకోవాలి?

18 మీరు ఆదాము యొక్క అసంపూర్ణ సంతానంతో వ్యవహరిస్తున్నారు గానీ ఏదో ప్రేమగాథలోని ఊహాత్మక కథానాయకునితో లేక కథానాయికతో కాదనే విషయాన్ని మర్చిపోకండి. అందరిలో లోపాలు ఉంటాయి, వాటిలో కొన్నింటిని చూసీ చూడనట్లు ఊరుకోవడం మంచిది—బహుశా అవి మీలోవైనా కావచ్చు లేక మీ కాబోయే జతలోవైనా కావచ్చు. (రోమీయులు 3:23; యాకోబు 3:2) అంతేకాక, గుర్తించబడిన ఒక బలహీనత, మీరు అభివృద్ధి చెందేందుకు మీకొక అవకాశాన్ని అందించగలదు. ఉదాహరణకు, మీరు ప్రేమయాచన చేస్తున్నప్పుడు మీలో ఓ వివాదం తలెత్తిందనుకోండి. ఈ విషయాన్ని గురించి ఆలోచించండి: ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకునే ప్రజలకు కూడా కొన్నిసార్లు అభిప్రాయభేదాలు వస్తాయి. (ఆదికాండము 30:2; అపొస్తలుల కార్యములు 15:39 పోల్చండి.) మీరిద్దరూ కూడా మీ ‘మనస్సును మరింత అణచుకొని,’ విషయాలను శాంతియుతంగా ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకోవలసిన అవసరముందని దాని అర్థమయ్యుండవచ్చా? (సామెతలు 25:28) మీ కాబోయే జత మెరుగుపడాలన్న కోర్కెను చూపిస్తున్నాడా లేక చూపిస్తున్నదా? మీరు చూపుతున్నారా? మీరు అంత సున్నితంగా, సూక్ష్మంగా ఉండటాన్ని మానుకోవడం నేర్చుకోగలరా? (ప్రసంగి 7:9) సమస్యలను పరిష్కరించుకోడాన్ని నేర్చుకోవడం, మీరిద్దరూ గనుక వివాహం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైన యథార్థ సంభాషణా ప్రక్రియను స్థాపించగలదు.—కొలొస్సయులు 3:13.

19. ప్రేమయాచన సమయంలో గంభీరమైన సమస్యలు తలెత్తినప్పుడు, ఏ చర్య జ్ఞానవంతమైనదైవుంటుంది?

19 అయితే, మీరు బాగా కలతచెందే విషయాలను మీరు గమనిస్తే అప్పుడేమిటి? అలాంటి సందేహాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. మీరెంత భావోద్రేకంగా ఇమిడిపోయినట్లు భావించినా లేక వివాహం చేసుకోవాలని మీరెంతగా ఆశపడినా, గంభీరమైన లోపాలను అలక్ష్యం చేయకండి. (సామెతలు 22:3; ప్రసంగి 2:14) మీకు తీవ్రమైన అక్షేపణలున్న వ్యక్తితో మీరు బహుశా సంబంధాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడం, శాశ్వత ఒప్పందాలను చేయకుండా ఉండటం జ్ఞానయుక్తం.

మీ ప్రేమయాచనను ఘనంగా ఉంచండి

20. ప్రేమయాచన చేస్తున్న జంట తమ నైతిక ప్రవర్తనను నిందారహితంగా ఎలా ఉంచుకోగలరు?

20 మీ ప్రేమయాచనను మీరెలా ఘనంగా ఉంచగలరు? మొదట, మీ నైతిక ప్రవర్తన నిందింపలేనిదిగా ఉండేలా చూసుకోండి. మీరు నివసించే ప్రాంతంలో, అవివాహిత జంటలు చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేక కౌగిలించుకోవడం సరైన ప్రవర్తనగా పరిగణించబడుతుందా? ఆప్యాయతను చూపే అలాంటి వ్యక్తీకరణలు నీచమైనవిగా పరిగణింపబడనప్పటికీ, వివాహం నిశ్చయమయ్యేంతగా ఆ సంబంధం పెరిగిన తర్వాతనే వాటిని అనుమతించాలి. ఆప్యాయతను చూపడమనేది అశుద్ధప్రవర్తనకు లేక చివరకు వ్యభిచారానికి దారి తీసేందుకు అనుమతించకుండా జాగ్రత్తపడండి. (ఎఫెసీయులు 4:18, 19; పరమగీతము 1:2; 2:6; 8:5, 9, 10 పోల్చండి.) హృదయం మోసకరమైనది గనుక, ఒక ఇంట్లోనో అపార్ట్‌మెంట్‌లోనో, నిలిపి ఉంచబడిన వాహనంలోనో లేక చెడు ప్రవర్తనకు అవకాశాన్ని ఇవ్వగల మరే ఇతర స్థలంలోనో మీరిద్దరూ కూడా ఒంటరిగా ఉండకుండా చూసుకోవడం జ్ఞానయుక్తం. (యిర్మీయా 17:9) మీ ప్రేమయాచనను నైతికంగా శుద్ధంగా ఉంచుకోవడం, మీకు ఆశానిగ్రహం ఉందని మరియు ఎదుటి వ్యక్తి యోగక్షేమాన్ని మీరు నిస్వార్థ శ్రద్ధతో మీ స్వంత కోరికల కంటే ముందుంచుతున్నారని స్పష్టమైన సాక్ష్యాన్నిస్తుంది. ఇంకా ప్రాముఖ్యంగా శుద్ధమైన ప్రేమయాచన, అశుద్ధతను మరియు వ్యభిచారాన్ని విసర్జించమని తన సేవకులకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా దేవున్ని కూడా ప్రీతిపరుస్తుంది.—గలతీయులు 5:19-21.

21. ప్రేమయాచనను ఘనంగా ఉంచేందుకు ఏ యథార్థమైన సంభాషణ అవసరం కావచ్చు?

21 రెండవది, ఘనమైన ప్రేమయాచనలో యథార్థమైన సంభాషణ కూడా ఇమిడివుంది. మీ ప్రేమయాచన వివాహం వైపుకు పురోగమిస్తుండగా, కొన్ని విషయాలను బాహాటంగా చర్చించవలసిన అవసరముంది. మీరెక్కడ నివసిస్తారు? మీరిద్దరూ కూడా ఉద్యోగం చేస్తారా? మీరు పిల్లలు కావాలనుకుంటున్నారా? ఇంకా, వివాహాన్ని ప్రభావితం చేయగల కొన్ని సంగతులను, బహుశా ఒకరి గతంలో జరిగినవాటిని కూడా బయల్పర్చడమే మంచిది. పెద్ద అప్పులు లేక బాధ్యతలు లేక మీకున్న ఏదైనా గంభీరమైన వ్యాధి లేక అలాంటి పరిస్థితి వంటి ఆరోగ్య విషయాలు కూడా అందులో ఇమిడివుంటాయి. హెచ్‌.ఐ.వి. (ఎయిడ్స్‌ను కలిగించే వైరస్‌) సోకిన వారిలో ఎలాంటి రోగలక్షణాలు త్వరగా కనిపించవు గనుక, గతంలో నరాల ద్వారా మాదకద్రవ్యాలను తీసుకున్న లేక లైంగిక అశ్లీల ప్రవర్తనను కలిగివున్న వారిని ఎయిడ్స్‌ రక్తపరీక్ష చేయించుకోమని, వారిని వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి లేక ఆ వ్యక్తి ఎడల శ్రద్ధగల తలిదండ్రులు కోరడంలో తప్పేమీ లేదు. పరీక్షల ద్వారా రోగనిర్ధారణ జరిగితే, వివాహం చేసుకోవాలని అపేక్షించిన జత ఇప్పుడు ఆ సంబంధాన్ని త్రుంచేయాలని కోరుకుంటుండగా, వ్యాధి సోకిన వ్యక్తి ఆ సంబంధాన్ని కొనసాగించమని ఒత్తిడి చేయకూడదు. వాస్తవానికి, విచ్ఛలవిడిగా జీవించిన వారు, ప్రేమయాచన ప్రారంభించక ముందే స్వచ్ఛందంగా ఎయిడ్స్‌ రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది.

వివాహదినానంతర కాలాన్ని చూడటం

22, 23. (ఎ) వివాహదినం కొరకు సిద్ధపడేటప్పుడు సమతుల్య దృష్టిని ఒకరు ఎలా పోగొట్టుకొనగలరు? (బి) వివాహ దినాన్ని మరియు వివాహాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఏ సమతుల్య దృష్టిని కలిగివుండాలి?

22 వివాహానికి ముందున్న చివరి కొన్ని నెలల్లో, మీరిరువురూ కూడా వివాహ ఏర్పాట్లలో పూర్తిగా మునిగిపోయి ఉండవచ్చు. నిరాడంబరంగా చేసుకోవడం ద్వారా మీరు ఎంతో కంగారును తగ్గించుకోగలరు. విస్తారమైన ఏర్పాట్లుగల వివాహం బంధువులకు సమాజానికి నచ్చవచ్చు, అయితే అది క్రొత్తగా వివాహం చేసుకున్న వారికి వారి కుటుంబాలకు శారీరక అలసట మరియు ఆర్థిక క్షౌరం అవుతుంది. కొన్ని ప్రాంతీయ ఆచారాలను పాటించడం సహేతుకమే, అయితే అర్థరహితమైన, బహుశా పోటీ తత్వంగల ప్రవర్తన ఆ సందర్భం యొక్క అర్థాన్ని మరుగుపర్చవచ్చు మరియు మీరు అనుభవించాల్సినంత ఆనందాన్ని మీకివ్వక పోవచ్చు. ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ, వివాహ ఉత్సవంలో ఏమి జరగాలనే దాన్ని నిర్ణయించే బాధ్యత ముఖ్యంగా వరునిదే.—యోహాను 2:9.

23 మీ వివాహదినం ఒక రోజే ఉంటుంది, అయితే మీ వివాహం జీవితాంతం ఉంటుంది. వివాహం చేసుకునే ప్రక్రియపై ఎక్కువ అవధానముంచకండి. బదులుగా, నడిపింపు కొరకు యెహోవా దేవుని వైపు చూసి, వైవాహిక జీవితం కొరకు ముందు పథకం వేసుకోండి. అప్పుడు మీరు ఒక విజయవంతమయ్యే వివాహం కొరకు చక్కగా సిద్ధపడి ఉంటారు.

a క్రైస్తవులు కలిసి మెలిసి తిరగడం (డేటింగ్‌) సరైనదిగా భావించే దేశాలకు ఇది అన్వయిస్తుంది.

b క్రైస్తవ సంఘంలో కూడా, కొందరు నామమాత్రంగా క్రైస్తవులుగా ఉండగలరు. దేవున్ని హృదయపూర్వకంగా సేవించే వారి వలె ఉండకుండా, వారు లోకపు దృక్పథాలు మరియు ప్రవర్తన ద్వారా ప్రభావితం చెందివుండవచ్చు.—యోహాను 17:16; యాకోబు 4:4.