మొదటి తిమోతి 3:1-16

  • పర్యవేక్షకుల అర్హతలు (1-7)

  • సంఘ పరిచారకుల అర్హతలు (8-13)

  • దైవభక్తికి సంబంధించిన పవిత్ర రహస్యం (14-16)

3  ఈ మాట నమ్మదగినది: ఒక వ్యక్తి పర్యవేక్షకుడు+ అవ్వడానికి కృషిచేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.  కాబట్టి, పర్యవేక్షకుడు ఎలా ఉండాలంటే: అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, మంచి వివేచన ఉండాలి,+ పద్ధతిగా నడుచుకోవాలి, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి,+ బోధించే సామర్థ్యం ఉండాలి,+  అతను తాగుబోతు గానీ+ ఇతరుల్ని కొట్టేవాడు గానీ పట్టుబట్టేవాడు గానీ అయ్యుండకూడదు,*+ గొడవలు పెట్టుకునేవాడు గానీ+ డబ్బును ప్రేమించేవాడు గానీ అయ్యుండకూడదు,+  అతను తన ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై* ఉండాలి, అతనికి చక్కని ప్రవర్తన కలిగి లోబడివుండే పిల్లలు ఉండాలి+  (ఎందుకంటే తన ఇంటివాళ్లకు ఎలా నాయకత్వం వహించాలో తెలియని వ్యక్తి దేవుని సంఘాన్ని ఎలా చూసుకుంటాడు?),  అతను ఈ మధ్యే విశ్వాసిగా మారినవాడు అయ్యుండకూడదు,+ లేదంటే అతను గర్వంతో ఉప్పొంగిపోయి అపవాది పొందిన తీర్పునే పొందే అవకాశం ఉంది.  అంతేకాదు, అతనికి బయటివాళ్ల దగ్గర కూడా మంచిపేరు* ఉండాలి.+ అప్పుడే అతను నిందలపాలు* కాకుండా, అపవాది ఉరిలో చిక్కుకోకుండా ఉంటాడు.  అలాగే సంఘ పరిచారకులు కూడా బాధ్యతగా* నడుచుకునేవాళ్లు అయ్యుండాలి; వాళ్లకు రెండు నాలుకల ధోరణి* ఉండకూడదు; వాళ్లు మితిమీరి మద్యం సేవించేవాళ్లు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాళ్లు గానీ అయ్యుండకూడదు;+  వాళ్లు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసానికి సంబంధించిన పవిత్ర రహస్యాన్ని అంటిపెట్టుకునేవాళ్లు+ అయ్యుండాలి. 10  అంతేకాదు, వాళ్లు అర్హులో కాదో ముందుగా పరీక్షించబడాలి; వాళ్ల మీద ఏ నిందా లేకపోతే+ సంఘ పరిచారకులుగా సేవచేయవచ్చు. 11  అలాగే, స్త్రీలు కూడా బాధ్యతగా* నడుచుకునేవాళ్లు అయ్యుండాలి; లేనిపోనివి కల్పించి చెప్పే స్వభావం వాళ్లకు ఉండకూడదు;+ వాళ్లు అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి.+ 12  సంఘ పరిచారకుడికి ఒకే భార్య ఉండాలి; అతను తన పిల్లలకు, ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై ఉండాలి. 13  చక్కగా పరిచారం చేసే పురుషులు మంచిపేరు సంపాదించుకుంటారు, క్రీస్తుయేసుకు సంబంధించిన విశ్వాసం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. 14  నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తానని అనుకుంటున్నాను. అయినాసరే నీకు ఈ విషయాలు ఎందుకు రాస్తున్నానంటే, 15  ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా, దేవుని ఇంటివాళ్ల మధ్య,+ అంటే జీవంగల దేవుని సంఘం మధ్య ఎలా నడుచుకోవాలో నీకు తెలుస్తుంది. ఆ సంఘం సత్యానికి స్తంభం, పునాది. 16  దైవభక్తికి సంబంధించిన పవిత్ర రహస్యం చాలా గొప్పది: ‘ఆయన* మానవ శరీరంతో వెల్లడిచేయబడ్డాడు,+ పరలోక శరీరంతో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా తీర్పుతీర్చాడు,+ ఆయన దేవదూతలకు కనిపించాడు;+ అన్యజనుల మధ్య ఆయన గురించి ప్రకటించబడింది;+ లోకంలోని ప్రజలు ఆయన్ని నమ్మారు;+ ఆయన మహిమతో పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు.’

అధస్సూచీలు

లేదా “అర్థం చేసుకునేవాడై ఉండాలి; సహేతుకత గలవాడై ఉండాలి.”
లేదా “చక్కగా చూసుకునేవాడై.”
లేదా “అవమానాలపాలు.”
లేదా “మంచిసాక్ష్యం.”
లేదా “గౌరవంగా.”
లేదా “మోసపూరిత మాటలు మాట్లాడే గుణం.”
లేదా “గౌరవంగా.”
అంటే, యేసు.