సామెతలు 4:1-27
4 నా కుమారులారా, తండ్రి క్రమశిక్షణను స్వీకరించండి;+శ్రద్ధగా ఆలకించి అవగాహనను సంపాదించుకోండి.
2 ఎందుకంటే, నేను మంచి ఉపదేశం ఇస్తాను;నేను బోధించేవాటిని విడిచిపెట్టకండి.+
3 నేను మా నాన్నకు మంచి* కుమారుణ్ణి,మా అమ్మకు ఎంతో ఇష్టమైనవాణ్ణి.+
4 మా నాన్న నాకు బోధించి, ఇలా అన్నాడు: “నీ హృదయం నా మాటల్ని గట్టిగా పట్టుకోవాలి.+
నా ఆజ్ఞల్ని పాటిస్తే నువ్వు ఎక్కువకాలం జీవిస్తావు.+
5 తెలివిని, అవగాహనను సంపాదించు.+
నా నోటి మాటల్ని మర్చిపోకు, వాటి నుండి పక్కకు తిరగకు.
6 తెలివిని విడిచిపెట్టకు, అది నిన్ను సంరక్షిస్తుంది.
దాన్ని ప్రేమించు, అది నిన్ను భద్రంగా కాపాడుతుంది.
7 తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది,+ అందుకే తెలివిని సంపాదించు,నువ్వు ఏం సంపాదించినా, వాటితోపాటు అవగాహనను సంపాదించు.+
8 దాన్ని చాలా విలువైనదిగా ఎంచు, అప్పుడది నిన్ను హెచ్చిస్తుంది.+
నువ్వు దాన్ని హత్తుకున్నావు కాబట్టి అది నిన్ను ఘనపరుస్తుంది.
9 అది నీ తలమీద అందమైన పూలదండను ఉంచుతుంది,సొగసైన కిరీటంతో నిన్ను అలంకరిస్తుంది.”
10 నా కుమారుడా, నా మాటల్ని విను, వాటిని అంగీకరించు,అప్పుడు నువ్వు ఎక్కువకాలం జీవిస్తావు.+
11 జ్ఞాన* మార్గంలో నడవడం నీకు నేర్పిస్తాను,+నిజాయితీగల దారుల్లో నిన్ను నడిపిస్తాను.+
12 నువ్వు నడుస్తున్నప్పుడు నీ అడుగులకు ఏదీ అడ్డు రాదు;నువ్వు పరుగెత్తినప్పుడు తడబడి పడిపోవు.
13 క్రమశిక్షణను గట్టిగా పట్టుకో, దాన్ని విడిచిపెట్టకు.+
అది నీకు జీవం కాబట్టి దాన్ని భద్రంగా కాపాడుకో.+
14 దుష్టుల మార్గంలో అడుగుపెట్టకు,చెడ్డవాళ్ల దారిలో నడవకు.+
15 దానికి దూరంగా ఉండు, అందులో నడవకు;+పక్కకు తప్పుకుని, దాన్ని దాటి వెళ్లిపో.+
16 ఎందుకంటే, చెడు చేయనిదే వాళ్లకు నిద్రపట్టదు.
ఎవరో ఒకర్ని నాశనం చేయనిదే వాళ్లకు నిద్రరాదు.
17 వాళ్లకు దుష్టత్వం రొట్టె లాంటిది,దౌర్జన్యం ద్రాక్షారసం లాంటిది.
18 అయితే, నీతిమంతుల దారి వేకువ వెలుగు లాంటిది,మిట్టమధ్యాహ్నం అయ్యేవరకు ఆ వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది.+
19 దుష్టుల మార్గం చీకటిలా ఉంటుంది;వాళ్లు దేనికి తట్టుకుని పడిపోతున్నారో వాళ్లకు తెలీదు.
20 నా కుమారుడా, నా మాటల్ని శ్రద్ధగా ఆలకించు;నేను చెప్పేది జాగ్రత్తగా విను.
21 వాటిని నీ కళ్లముందు నుండి తొలగిపోనివ్వకు;వాటిని నీ హృదయంలో ఉంచుకో,+
22 ఎందుకంటే, వాటిని కనుగొనేవాళ్లకు అవి జీవాన్ని,వాళ్ల శరీరమంతటికీ ఆరోగ్యాన్ని ఇస్తాయి.+
23 అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో,+ఎందుకంటే దానిలో నుండే జీవపు ఊటలు బయల్దేరతాయి.
24 వంకర మాటల్ని నీకు దూరంగా ఉంచు,+కపటమైన మాటల్ని చాలా దూరంగా ఉంచు.
25 నీ కళ్లు అటూఇటూ చూడకుండాతిన్నగా ముందుకు చూడాలి.+
26 నీ దారిని చదును చేసుకో,*+అప్పుడు నీ మార్గాలన్నీ సుస్థిరం అవుతాయి.
27 కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తిరగకు.+
చెడు నుండి పక్కకు తప్పుకో.