సామెతలు 29:1-27

  • అదుపులో పెట్టని పిల్లవాడు తల్లికి అవమానం తెస్తాడు (15)

  • దర్శనం లేనిచోట ప్రజలు అదుపులేకుండా ప్రవర్తిస్తారు (18)

  • కోపిష్ఠి గొడవలు రేపుతాడు (22)

  • వినయ స్వభావం గలవాడు ఘనత పొందుతాడు (23)

  • మనుషుల భయం ఉరి (25)

29  ఎన్నిసార్లు గద్దించినా తలబిరుసుగా* ప్రవర్తించేవాడు+అకస్మాత్తుగా కూలిపోతాడు, మళ్లీ కోలుకోడు.+   నీతిమంతులు ఎక్కువైనప్పుడు ప్రజలు సంతోషిస్తారు,దుష్టుడు పరిపాలించినప్పుడు ప్రజలు నిట్టూరుస్తారు.+   తెలివిని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,వేశ్యలతో సహవాసం చేసేవాడు ఆస్తిని దుబారా చేస్తాడు.   న్యాయంతో రాజు దేశాన్ని సుస్థిరం చేస్తాడు,+లంచాలు తీసుకునేవాడు దాన్ని నాశనం చేస్తాడు.   తన పొరుగువాణ్ణి పొగడ్తలతో ముంచెత్తేవాడుఅతని పాదాల కోసం వల పరుస్తున్నాడు.+   చెడ్డవాడు తన అపరాధం వల్ల ఉరిలో చిక్కుకుంటాడు,నీతిమంతుడు సంతోషంతో కేకలు వేస్తూ ఆనందిస్తాడు.+   నీతిమంతుడు పేదవాళ్ల హక్కుల గురించి ఆలోచిస్తాడు,దుష్టుడికి అలాంటి పట్టింపు ఉండదు.+   గొప్పలు చెప్పుకునేవాళ్లు ఊరిని రెచ్చగొడతారు,+తెలివిగలవాళ్లు కోపాన్ని చల్లారుస్తారు.+   తెలివిగలవాడు తెలివితక్కువవాడితో వాదన పెట్టుకుంటేతిట్టుకోవడం, ఎగతాళి చేసుకోవడమే ఉంటాయి తప్ప మనశ్శాంతి ఉండదు. 10  రక్తదాహం గలవాళ్లకు నిర్దోషులంటే* అసహ్యం,+వాళ్లు నిజాయితీపరుల ప్రాణాలు తీయాలని చూస్తారు.* 11  మూర్ఖుడు తనకు అనిపించిందంతా* బయటికి కక్కేస్తాడు,+అయితే తెలివిగలవాడు ప్రశాంతంగా ఉంటాడు.+ 12  పరిపాలకుడు అబద్ధాల్ని పట్టించుకుంటేఅతని సేవకులంతా చెడ్డవాళ్లుగా ఉంటారు.+ 13  పేదవాడికి, అణచివేసేవాడికి మధ్య ఈ పోలిక ఉంది: ఆ ఇద్దరి కళ్లకూ యెహోవాయే వెలుగు ఇస్తున్నాడు.* 14  రాజు పేదవాళ్లకు న్యాయంగా తీర్పు తీరిస్తే+అతని సింహాసనం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది.+ 15  బెత్తం,* గద్దింపు తెలివిని కలిగిస్తాయి,+అదుపులో పెట్టని పిల్లవాడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు. 16  చెడ్డవాళ్లు ఎక్కువైతే, అపరాధం ఎక్కువౌతుంది,అయితే నీతిమంతులు వాళ్ల పతనాన్ని చూస్తారు.+ 17  నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెడితే, అతను నీకు విశ్రాంతినిస్తాడు;నీ ప్రాణానికి ఎంతో సంతోషం తీసుకొస్తాడు.+ 18  దర్శనం* లేని చోట ప్రజలు అదుపులేకుండా ప్రవర్తిస్తారు,+అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.+ 19  సేవకుడు మాటలకు లొంగడు,అతనికి అర్థమైనాసరే లోబడడు.+ 20  తొందరపడి మాట్లాడేవాణ్ణి చూశావా?+ అతనికన్నా తెలివితక్కువవాడు త్వరగా బాగుపడతాడు.+ 21  సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబం చేస్తేచివరికి అతను కృతజ్ఞతలేని వాడిగా తయారౌతాడు. 22  కోపిష్ఠి గొడవలు రేపుతాడు;ముక్కోపి చాలా అపరాధాలు చేస్తాడు.+ 23  మనిషి గర్వం అతన్ని అణచివేస్తుంది,+వినయ స్వభావం గలవాడు ఘనతను పొందుతాడు.+ 24  దొంగతో చేరేవాడు తన ప్రాణాన్ని ద్వేషిస్తున్నాడు. సాక్ష్యం చెప్పమనే పిలుపును* విన్నా అతను నోరు తెరవడు.+ 25  మనుషులకు భయపడడం ఉరి లాంటిది,+అయితే యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాడు రక్షించబడతాడు.+ 26  పరిపాలకుణ్ణి కలిసి మాట్లాడాలని* ప్రయత్నించేవాళ్లు చాలామంది ఉంటారు,అయితే ఒక వ్యక్తికి న్యాయం చేసేది యెహోవాయే.+ 27  అన్యాయస్థుడంటే నీతిమంతుడికి అసహ్యం,+నిజాయితీగా నడుచుకునేవాడంటే దుష్టుడికి అసహ్యం.+

అధస్సూచీలు

లేదా “మొండిగా.”
లేదా “నిందలేని వాళ్లంటే.”
లేదా “కానీ నిజాయితీపరులు తమ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తారు” అయ్యుంటుంది.
లేదా “తన కోపమంతా.”
అంటే, ఆయనే వాళ్లకు జీవాన్ని ఇస్తున్నాడు.
లేదా “క్రమశిక్షణ; శిక్ష.”
లేదా “ప్రవచనాత్మక సందేశం; దేవుని నిర్దేశం.”
లేదా “శాపంతో కూడిన ఒట్టును.”
లేదా “అనుగ్రహం పొందాలని” అయ్యుంటుంది.