అపొస్తలుల కార్యాలు 20:1-38

  • మాసిదోనియలో, గ్రీసులో పౌలు (1-6)

  • త్రోయలో ఐతుకు పునరుత్థానం (7-12)

  • త్రోయ నుండి మిలేతుకు (13-16)

  • ఎఫెసు పెద్దల్ని పౌలు కలవడం (17-38)

    • ఇంటింటా బోధించడం (20)

    • “ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం” (35)

20  అలజడి తగ్గిపోయాక పౌలు శిష్యుల్ని పిలిపించాడు. తర్వాత వాళ్లను ప్రోత్సహించి, వాళ్లకు వీడ్కోలు చెప్పి, మాసిదోనియకు ప్రయాణం మొదలుపెట్టాడు.  ఆ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ అక్కడి శిష్యుల్ని చాలా మాటలతో ప్రోత్సహించాక గ్రీసుకు చేరుకున్నాడు.  పౌలు అక్కడ మూడు నెలలు ఉన్నాడు. అతను ఓడలో సిరియాకు బయల్దేరుతుండగా, తనను చంపడానికి యూదులు కుట్ర పన్నారని+ తెలుసుకొని మాసిదోనియ మీదుగా తిరిగెళ్లాలని నిర్ణయించుకున్నాడు.  బెరయవాడైన పుర్రు కుమారుడు సోపత్రు; థెస్సలొనీక వాళ్లయిన అరిస్తార్కు,+ సెకుందు; దెర్బే వాడైన గాయియు; తిమోతి,+ అలాగే ఆసియా ప్రాంతానికి చెందిన తుకికు,+ త్రోఫిము+ అతనితో పాటు ఉన్నారు.  వీళ్లు మా కన్నా ముందే త్రోయకు వెళ్లి మా కోసం ఎదురుచూస్తున్నారు.  అయితే పులవని రొట్టెల పండుగ రోజుల+ తర్వాత మేము ఫిలిప్పీలో ఓడ ఎక్కి, ఐదు రోజుల్లో త్రోయకు చేరుకొని వాళ్లను కలుసుకున్నాం. అక్కడ మేము ఏడురోజులు ఉన్నాం.  వారం మొదటి రోజున* మేము భోజనం చేయడానికి* ఒకచోట కలుసుకున్నాం. అప్పుడు పౌలు అక్కడున్న వాళ్లను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తర్వాతి రోజు అతను అక్కడి నుండి బయల్దేరబోతున్నాడు. అతను మధ్యరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు.  మేము కలుసుకున్న మేడగదిలో చాలా దీపాలున్నాయి.  ఐతుకు అనే ఒక యువకుడు అక్కడ కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ ఉండగా అతనికి నిద్ర ముంచుకొచ్చింది. చివరికి అతను నిద్రపోయి, ఆ నిద్రలో మూడో అంతస్తు నుండి కింద పడిపోయాడు. వాళ్లు అతని దగ్గరికి వెళ్లేసరికి అతను చనిపోయి ఉన్నాడు. 10  అయితే పౌలు కిందికి వెళ్లి, అతని మీద పడుకొని, అతన్ని కౌగిలించుకొని,+ “కంగారుపడకండి, ఇతను బ్రతికే ఉన్నాడు”+ అని అన్నాడు. 11  తర్వాత పౌలు పైకి వెళ్లి, రొట్టె విరిచి, భోజనం చేయడం మొదలుపెట్టాడు. అతను చాలాసేపు, అంటే తెల్లారేవరకు మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత అక్కడి నుండి బయల్దేరాడు. 12  వాళ్లు ఆ యువకుణ్ణి తీసుకెళ్లారు. అతను తిరిగి బ్రతికించబడ్డాడని* చూసి చెప్పలేనంత సంతోషించారు. 13  అప్పుడు మేము ఓడ ఎక్కి అస్సుకు వెళ్లాం. పౌలు మాత్రం కాలినడకన అక్కడికి వచ్చాడు. అక్కడ పౌలును ఓడ ఎక్కించుకోవాలన్నది మా ఉద్దేశం. నిజానికి పౌలే అలా చేయమని మాకు చెప్పాడు. 14  అస్సులో పౌలు మమ్మల్ని కలుసుకున్నప్పుడు, మేము అతన్ని ఓడ ఎక్కించుకొని మితులేనేకు వెళ్లాం. 15  తర్వాతి రోజు మేము అక్కడి నుండి ఓడలో బయల్దేరి కీయొసు ద్వీపానికి కొంతదూరంలో ఆగాం. ఆ తర్వాతి రోజు సమొసులో కాసేపు ఆగాం. మరుసటి రోజు మిలేతుకు చేరుకున్నాం. 16  వీలైతే పెంతెకొస్తు పండుగ రోజున యెరూషలేములో ఉండాలని+ పౌలు హడావిడిగా వెళ్తున్నాడు కాబట్టి ఆసియా ప్రాంతంలో ఏమాత్రం సమయం గడపకూడదనే ఉద్దేశంతో ఎఫెసును+ దాటివెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 17  అయితే పౌలు మిలేతు నుండి ఎఫెసుకు కబురు పంపి అక్కడి సంఘ పెద్దల్ని పిలిపించుకున్నాడు. 18  వాళ్లు తన దగ్గరికి వచ్చినప్పుడు పౌలు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఆసియా ప్రాంతంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీకు బాగా తెలుసు.+ 19  నేను పూర్తి వినయంతో,*+ కన్నీళ్లతో, యూదులు పన్నిన కుట్రల వల్ల కష్టాలు పడుతూ ప్రభువుకు సేవ చేశాను. 20  మీకు మంచి చేసే* దేన్నీ నేను మీకు చెప్పకుండా ఉండలేదు, మీకు బహిరంగంగా+ ఇంటింటా+ బోధించకుండా ఉండలేదు. 21  అయితే, పశ్చాత్తాపపడి+ దేవుని వైపు తిరగమని, మన ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచమని యూదులకు, గ్రీకువాళ్లకు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చాను.+ 22  ఇప్పుడు ఇదిగో! పవిత్రశక్తి* నిర్దేశం ప్రకారం నేను యెరూషలేముకు వెళ్తున్నాను. అయితే అక్కడ నాకు ఏమి జరుగుతుందో నాకు తెలీదు. 23  ఒకటి మాత్రం తెలుసు. నా కోసం సంకెళ్లు, శ్రమలు ఎదురుచూస్తున్నాయని పవిత్రశక్తి ప్రతీ నగరంలో నాకు మళ్లీమళ్లీ సాక్ష్యమిస్తోంది.+ 24  అయితే, నా ప్రాణం నాకు ఏమాత్రం ముఖ్యమైనదని* నేను అనుకోవట్లేదు. ఈ పరుగుపందాన్ని, ప్రభువైన యేసు నుండి నేను పొందిన పరిచర్యను పూర్తి చేయాలన్నదే నా కోరిక.+ ఆ పరిచర్య ఏమిటంటే, దేవుని అపారదయకు సంబంధించిన మంచివార్త గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వడమే. 25  “నేను మీ మధ్య రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చాను. అయితే ఇదిగో! మీలో ఎవ్వరూ మళ్లీ నా ముఖం చూడరు. 26  ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కానని+ సాక్ష్యమివ్వడానికి ఈ రోజు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. 27  నేను దేవుని ఇష్టమంతటినీ* మీకు చెప్పకుండా ఉండలేదు.+ 28  మీరు మీ విషయంలో,+ అలాగే దేవుని సంఘాన్ని కాయడం కోసం పవిత్రశక్తి మిమ్మల్ని ఎవరి మధ్య పర్యవేక్షకులుగా నియమించిందో+ ఆ మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి.+ దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.+ 29  నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల లాంటి వాళ్లు మీలో ప్రవేశిస్తారని,+ వాళ్లు మందతో మృదువుగా ప్రవర్తించరని నాకు తెలుసు. 30  అంతేకాదు, శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకెళ్లాలని తప్పుడు బోధలు బోధించే మనుషులు మీలో నుండే బయల్దేరతారు.+ 31  “కాబట్టి ఎప్పుడూ మెలకువగా ఉండండి. నేను మూడు సంవత్సరాల పాటు+ మానకుండా రాత్రింబగళ్లు మీలో ఒక్కొక్కరికి కన్నీళ్లతో ఉపదేశమిచ్చానని గుర్తుపెట్టుకోండి. 32  ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, ఆయన అపారదయ గురించిన వాక్యానికి అప్పగిస్తున్నాను. ఆ వాక్యం మిమ్మల్ని బలపర్చి, పవిత్రపర్చబడిన వాళ్లందరి మధ్య మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగలదు.+ 33  ఎవరి వెండిబంగారాల కోసం, వస్త్రాల కోసం నేను ఆశపడలేదు.+ 34  నేను నా అవసరాల కోసం, నాతోపాటు ఉన్నవాళ్ల అవసరాల కోసం ఈ చేతులతో పని చేశానని+ మీకు తెలుసు. 35  మీరు ఇలా కష్టపడి పనిచేస్తూ+ బలహీనంగా ఉన్నవాళ్లకు సహాయం చేయాలని, ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనసులో ఉంచుకోవాలని అన్ని విషయాల్లో మీకు చూపించాను. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: ‘తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే+ ఎక్కువ సంతోషం ఉంది.’ ” 36  పౌలు ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్లందరితో పాటు మోకరించి ప్రార్థించాడు. 37  వాళ్లంతా చాలా ఏడ్చి, పౌలును కౌగిలించుకొని,* ఆప్యాయంగా* ముద్దు పెట్టుకున్నారు. 38  ముఖ్యంగా, తన ముఖాన్ని ఇంకెప్పుడూ చూడరని పౌలు అన్న మాటకు+ వాళ్లు చాలా బాధపడ్డారు. తర్వాత వాళ్లు పౌలును ఓడ వరకు సాగనంపారు.

అధస్సూచీలు

మత్తయి 28:1 అధస్సూచి చూడండి.
అక్ష., “రొట్టె విరవడానికి.”
లేదా “పునరుత్థానం చేయబడ్డాడని.”
లేదా “దీనమనస్సుతో.”
లేదా “ప్రయోజనం చేకూర్చే.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “విలువైనదని.”
లేదా “సంకల్పమంతటినీ.”
అక్ష., “పౌలు మెడ మీద పడి.”
లేదా “మృదువుగా.”