ఎఫెసీయులు 3:1-21

  • పవిత్ర రహస్యంలో అన్యజనులు కూడా చేరి ఉన్నారు (1-13)

    • అన్యజనులు క్రీస్తు తోటి వారసులౌతారు (6)

    • దేవుని నిత్య సంకల్పం (11)

  • ఎఫెసీయులు అవగాహన సంపాదించుకోవాలని ప్రార్థన (14-21)

3  అందుకే, పౌలు అనే నేను అన్యజనులైన మీకోసం క్రీస్తుయేసు ఖైదీగా+ ఉన్నాను.  మీరు దేవుని అపారదయ నుండి ప్రయోజనం పొందేలా మీకు సహాయం చేసే బాధ్యత*+ నాకు అప్పగించబడిందని మీరు వినే ఉంటారు.  అవును, దేవుడు పవిత్ర రహస్యాన్ని నాకు బయల్పర్చడం ద్వారా ఆ బాధ్యతను అప్పగించాడు. దీనిగురించి ఇంతకుముందే మీకు క్లుప్తంగా రాశాను.  కాబట్టి మీరు ఇది చదివినప్పుడు, క్రీస్తు గురించిన పవిత్ర రహస్యం+ మీద నాకెంత అవగాహన ఉందో మీకు తెలుస్తుంది.  దేవుడు పవిత్రశక్తి ద్వారా ఆ రహస్యాన్ని తన పవిత్ర అపొస్తలులకు, ప్రవక్తలకు ఇప్పుడు స్పష్టంగా బయల్పర్చాడు, అయితే వెనకటి తరాల వాళ్లకు దాన్ని అంత స్పష్టంగా తెలియజేయలేదు.+  ఆ రహస్యం ఏమిటంటే, క్రీస్తుయేసు శిష్యులైన అన్యజనులు మంచివార్త ద్వారా తోటి వారసులూ ఒకే శరీరంలో అవయవాలూ అవుతారు,+ దేవుడు వాగ్దానం చేసినవాటిని మాతోపాటు పంచుకుంటారు.  దేవుని అపారదయను బట్టి నేను ఈ రహస్యానికి పరిచారకుణ్ణి అయ్యాను. ఆయన తన శక్తిని ఉపయోగించి నాకు ఈ ఉచిత బహుమతిని ఇచ్చాడు.+  పవిత్రులందరిలో అల్పుడైనవాని కన్నా తక్కువవాడినైన నాకు+ దేవుడు ఆ అపారదయను అనుగ్రహించాడు.+ లెక్కకు అందని క్రీస్తు సంపదల గురించిన మంచివార్తను నేను అన్యజనులకు ప్రకటించాలని,  పవిత్ర రహస్యం ఎలా అమలులోకి తీసుకురాబడిందో గుర్తించేలా+ నేను ప్రతీ ఒక్కరికి సహాయం చేయాలని ఆయన నాకు ఆ అపారదయను అనుగ్రహించాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు ఆ రహస్యాన్ని ఎంతోకాలం దాచివుంచాడు. 10  ఎన్నో విధాల్లో కనిపించే దేవుని తెలివి ఇప్పుడు సంఘం+ ద్వారా పరలోకంలో ఉన్న ప్రభుత్వాలకు, అధికారాలకు తెలియజేయబడాలని ఆయన అలా చేశాడు.+ 11  ఇది మన ప్రభువైన క్రీస్తుయేసుకు సంబంధించి దేవుడు అనుకున్న నిత్య సంకల్పానికి అనుగుణంగా ఉంది.+ 12  క్రీస్తుయేసు వల్లే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, ఆయన మీద ఉన్న విశ్వాసం ద్వారానే దేవునికి నిర్భయంగా ప్రార్థించగలుగుతున్నాం.+ 13  కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమల్ని చూసి కృంగిపోకండి. ఎందుకంటే, అవి మీకు ఘనతను తెస్తాయి.+ 14  అందుకే నేను మోకరించి తండ్రికి ప్రార్థిస్తున్నాను. 15  పరలోకంలో, భూమ్మీద ఉన్న ప్రతీ కుటుంబం ఆయన వల్లే ఉనికిలో ఉంది. 16  ఆయన ఎంతో మహిమగల దేవుడు. ఆయన తన పవిత్రశక్తి ద్వారా మీకు శక్తినిచ్చి మీ హృదయాల్ని, మనసుల్ని బలపర్చాలని+ ప్రార్థిస్తున్నాను; 17  మీ విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో ప్రేమతోపాటు క్రీస్తు నివసించాలని,+ మీరు వేళ్లూనుకున్న చెట్టులా+ పునాది మీద స్థిరంగా ఉండాలని,+ 18  అలా మీరు పవిత్రులందరితో పాటు దేవుని విషయాల వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంత అనేది పూర్తిగా గ్రహించాలని, 19  జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను+ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను; అప్పుడు మీరు దేవుడు ఇచ్చే దైవిక లక్షణాలన్నిటినీ పూర్తిగా అలవర్చుకోగలుగుతారు. 20  మనలో పనిచేస్తున్న తన శక్తి+ ప్రకారం, దేవుడు మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు.+ 21  ఆయనకు సంఘం ద్వారా, క్రీస్తుయేసు ద్వారా తరతరాలు, యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్‌.

అధస్సూచీలు

లేదా “ఆ గృహనిర్వాహకత్వం.”