తీతు 2:1-15

  • యౌవనులకు, వృద్ధులకు మంచి బోధ (1-15)

    • భక్తిహీన ప్రవర్తనకు దూరంగా ఉండు (12)

    • మంచిపనుల విషయంలో ఉత్సాహం (14)

2  నువ్వైతే మంచి* బోధకు అనుగుణంగా ఉన్నవాటినే బోధిస్తూ ఉండు.+  వృద్ధ పురుషులు అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, బాధ్యతగా* నడుచుకోవాలి, మంచి వివేచన చూపించాలి; విశ్వాసం, ప్రేమ, సహనం విషయంలో దృఢంగా* ఉండాలి.  అలాగే వృద్ధ స్త్రీలు భయభక్తులతో నడుచుకోవాలి, లేనిపోనివి కల్పించి చెప్పకూడదు, మద్యానికి బానిసలు కాకూడదు, మంచి విషయాలు బోధించాలి.  వాళ్లు అలా ఉంటే భర్తల్ని, పిల్లల్ని ప్రేమించమని తమకన్నా చిన్నవయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు.*  అంతేకాదు మంచి ​వివేచన చూపించమని, పవిత్రంగా ఉండమని, ఇంట్లో పనులు చేసుకోమని, మంచిపనులు చేయమని, భర్తలకు లోబడివుండమని+ సలహా ఇవ్వగలుగుతారు. అప్పుడు దేవుని వాక్యం గురించి చెడ్డగా మాట్లాడే అవకాశం ఎవ్వరికీ ఉండదు.  అలాగే, యువకుల్ని మంచి వివేచన చూపించమని+ ప్రోత్సహిస్తూ* ఉండు.  నువ్వు అన్ని విషయాల్లో మంచిపనులకు ఆదర్శంగా ఉంటూ అలా చేయి. స్వచ్ఛమైన విషయాల్ని* పూర్తి పట్టుదలతో బోధించు,+  విమర్శించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా మంచి* మాటలతో బోధించు.+ అప్పుడు వ్యతిరేకులు, ఏ విషయంలోనూ మన గురించి చెడ్డగా* మాట్లాడే అవకాశం దొరకక సిగ్గుపడతారు.+  దాసులు అన్ని విషయాల్లో తమ యజమానులకు లోబడివుండాలి,+ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి, వాళ్లకు ఎదురు మాట్లాడకూడదు, 10  వాళ్లవేవీ దొంగిలించకూడదు; బదులుగా పూర్తి నమ్మకస్థులుగా ఉండాలి. అలా వాళ్లు, ప్రతీ విషయంలో మన రక్షకుడైన దేవుని బోధను ​అలంకరిస్తారు.+ 11  ఎందుకంటే, అన్నిరకాల ప్రజలకు రక్షణ తీసుకొచ్చే దేవుని అపారదయ వెల్లడైంది. 12  ఆ అపారదయ మనం భక్తిహీన ప్రవర్తనను, లోక సంబంధమైన కోరికల్ని+ తిరస్కరించేలా, ఈ వ్యవస్థలో* మంచి వివేచనతో, నీతితో, దైవభక్తితో జీవించేలా మనకు శిక్షణ ఇస్తుంది. 13  అదే సమయంలో మనం, మన అద్భుతమైన నిరీక్షణ నిజమవ్వాలని,+ మహాదేవుని మహిమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ వెల్లడవ్వాలని ఎదురుచూస్తూ ఉందాం. 14  మనం తనకు ప్రత్యేకమైన సొత్తు అయ్యేలా, మంచిపనుల విషయంలో ఉత్సాహం చూపించే ప్రజలుగా ఉండేలా,+ మనల్ని అన్నిరకాల చెడుతనం నుండి విడుదల చేసి*+ శుద్ధి చేయడానికి ఆయన తనను తాను అర్పించుకున్నాడు.+ 15  నువ్వు పూర్తి అధికారంతో ఈ విషయాలు బోధిస్తూ, ప్రోత్సహిస్తూ, గద్దిస్తూ ఉండు.+ నిన్ను చిన్నచూపు చూసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకు.

అధస్సూచీలు

లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
లేదా “గౌరవంగా.”
అక్ష., “ఆరోగ్యంగా.”
లేదా “బుద్ధి చెప్పగలుగుతారు.”
లేదా “వేడుకుంటూ.”
లేదా “స్వచ్ఛతతో” అయ్యుంటుంది.
లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
లేదా “నీచంగా.”
లేదా “యుగంలో.” పదకోశం చూడండి.
అక్ష., “విమోచించి; విడిపించి.”