సామెతలు 20:1-30
20 ద్రాక్షారసం నవ్వులపాలు చేస్తుంది,+ మద్యం అదుపుతప్పేలా చేస్తుంది;+వాటివల్ల దారితప్పేవాళ్లు తెలివిగలవాళ్లు కాదు.+
2 రాజు వల్ల కలిగే భయం సింహగర్జన లాంటిది;+రాజుకు కోపం తెప్పించేవాడు తన ప్రాణానికి హాని తెచ్చుకుంటాడు.+
3 గొడవలకు దూరంగా ఉండడం మనిషికి గౌరవం,+అయితే తెలివితక్కువ వాళ్లంతా వాటిలో తలదూరుస్తారు.+
4 సోమరి చలికాలంలో పొలం దున్నడు,కాబట్టి కోతకాలంలో తన దగ్గర ఏమీ లేకపోవడంతో అతను బిచ్చం ఎత్తుకుంటాడు.*+
5 మనిషి హృదయంలోని ఆలోచనలు* లోతైన నీళ్లలాంటివి,వివేచన గలవాడు వాటిని పైకి చేదుతాడు.
6 తాము విశ్వసనీయ ప్రేమ గలవాళ్లమని చాలామంది చెప్పుకుంటారు,అయితే నమ్మకమైన మనిషి ఎక్కడ దొరుకుతాడు?
7 నీతిమంతుడు యథార్థంగా నడుచుకుంటాడు.+
అతని తర్వాత వచ్చే అతని పిల్లలు* సంతోషంగా ఉంటారు.+
8 రాజు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు,+తన కళ్లతో చెడుతనమంతటినీ జల్లెడ పడతాడు.+
9 “నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను;నాలో ఇక ఏ పాపం లేదు” అని ఎవరైనా అనగలరా?+
10 తప్పుడు తూకంరాళ్లు, తప్పుడు కొలతలు*ఈ రెండూ యెహోవాకు అసహ్యం.+
11 పిల్లవాడు కూడా తన ప్రవర్తన పవిత్రంగా, సరిగ్గా ఉందో లేదోతన పనుల ద్వారా తెలియజేస్తాడు.+
12 వినే చెవి, చూసే కన్నురెండిటినీ యెహోవాయే చేశాడు.+
13 నిద్రను ప్రేమించకు, లేదంటే నువ్వు పేదవాడివౌతావు.
మేల్కొని ఉండు, అప్పుడే నువ్వు కడుపునిండా తింటావు.+
14 కొనేవాడు, “బాలేదు, బాలేదు!” అంటాడు;తర్వాత పక్కకు వెళ్లి తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు.+
15 బంగారం ఉంది, విస్తారంగా పగడాలు* కూడా ఉన్నాయి;అయితే జ్ఞానంగల పెదాలు వాటికన్నా అమూల్యమైనవి.+
16 పరిచయంలేని వాడికి హామీగా ఉన్న వ్యక్తి వస్త్రాన్ని తీసుకో,+ఒకవేళ అతను హామీగా ఉన్నది అనైతిక* స్త్రీకైతే, అతను హామీగా పెట్టినదాన్ని లాక్కో.
17 మోసం చేసి సంపాదించిన ఆహారం మనిషికి రుచిగా అనిపిస్తుంది,కానీ తర్వాత అతని నోరు ఇసుకతో నిండిపోతుంది.+
18 సంప్రదించుకోవడం* వల్ల ప్రణాళికలు సఫలమౌతాయి,*+తెలివిగల* నిర్దేశంతో యుద్ధం చేయి.+
19 లేనిపోనివి కల్పించి చెప్పేవాడు రహస్యాలు బయటపెడుతుంటాడు;+పుకార్లు చెప్పడాన్ని ఇష్టపడేవాళ్లతో* సహవాసం చేయకు.
20 తండ్రిని గానీ తల్లిని గానీ శపించేవాడి దీపంచీకటి పడినప్పుడు ఆరిపోతుంది.+
21 మొదట్లో అత్యాశతో సంపాదించిన ఆస్తిచివరికి దీవెనగా ఉండదు.+
22 “నాకు హాని చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను!” అని అనకు,+
యెహోవా కోసం కనిపెట్టుకో,+ ఆయనే నిన్ను కాపాడతాడు.+
23 తప్పుడు* తూకంరాళ్లు యెహోవాకు అసహ్యం,దొంగ త్రాసు మంచిదికాదు.
24 మనిషి అడుగుల్ని యెహోవాయే నిర్దేశిస్తాడు;+తాను వెళ్లాల్సిన దారిని మనిషి ఎలా తెలుసుకోగలడు?
25 ఒక వ్యక్తి తొందరపడి, “ప్రతిష్ఠితం” అని చెప్పి,+
ఆ తర్వాత తన మొక్కుబడి గురించి మళ్లీ ఆలోచించడం అతనికి ఉరిలా ఉంటుంది.+
26 తెలివిగల రాజు దుష్టుల్ని జల్లెడ పడతాడు,+నూర్చే చక్రాన్ని వాళ్ల మీద నుండి పోనిస్తాడు.+
27 మనిషి ఊపిరి యెహోవా దీపం,అది అతని అంతరంగాన్ని పరిశోధిస్తుంది.
28 విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం రాజును కాపాడతాయి;+విశ్వసనీయ ప్రేమతో అతను తన సింహాసనాన్ని స్థిరపర్చుకుంటాడు.+
29 యౌవనుల బలమే వాళ్లకు అలంకారం,*+నెరిసిన తలే వృద్ధులకు వైభవం.+
30 దెబ్బలు, గాయాలు చెడును తొలగిస్తాయి,*+దెబ్బలు అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి.
అధస్సూచీలు
^ లేదా “అతను కోతకాలంలో వెదుకుతాడు కానీ ఏమీ దొరకదు” అయ్యుంటుంది.
^ లేదా “ఉద్దేశాలు.”
^ అక్ష., “కుమారులు.”
^ లేదా “రెండు రకాల తూకంరాళ్లు, రెండు రకాల కొలపాత్రలు.”
^ లేదా “విదేశీ.”
^ లేదా “ఆలోచన.”
^ లేదా “స్థిరపడతాయి.”
^ లేదా “నేర్పుగల.”
^ లేదా “తమ పెదాలతో ఇతరుల్ని ప్రలోభపెట్టేవాళ్లతో.”
^ లేదా “రెండు రకాల.”
^ లేదా “అందం.”
^ లేదా “శుభ్రం చేస్తాయి.”