లూకా సువార్త 14:1-35
14 ఇంకో సందర్భంలో యేసు విశ్రాంతి రోజున పరిసయ్యుల నాయకుల్లో ఒకరి ఇంటికి భోజనానికి వెళ్లాడు. అక్కడున్న వాళ్లు ఆయన్నే జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.
2 ఇదిగో! ఒంట్లో నీరు వచ్చి* బాధపడుతున్న ఒక వ్యక్తి యేసు ముందు ఉన్నాడు.
3 కాబట్టి యేసు ధర్మశాస్త్రంలో ఆరితేరినవాళ్లను, పరిసయ్యుల్ని, “విశ్రాంతి రోజున బాగుచేయడం సరైనదా, కాదా?” అని అడిగాడు.+
4 దానికి వాళ్లు నోరు తెరవలేదు. దాంతో ఆయన ఆ వ్యక్తిని పట్టుకొని, బాగుచేసి, పంపించేశాడు.
5 తర్వాత ఆయన, “మీ కుమారుడు గానీ, మీ ఎద్దు గానీ విశ్రాంతి రోజున బావిలో పడితే+ మీలో ఎవరైనా వెంటనే పైకి లాగకుండా ఉంటారా?” అని వాళ్లను అడిగాడు.+
6 దానికి వాళ్లు ఏమీ చెప్పలేకపోయారు.
7 అక్కడికి వచ్చిన అతిథులు అన్నిటికన్నా ముఖ్యమైన స్థానాలు ఎంచుకోవడం గమనించి+ యేసు వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు:
8 “ఎవరైనా నిన్ను పెళ్లి విందుకు ఆహ్వానిస్తే, అన్నిటికన్నా ముఖ్యమైన స్థానంలో కూర్చోవద్దు.+ బహుశా అతను నీ కన్నా ప్రముఖుణ్ణి ఆహ్వానించి ఉండొచ్చు.
9 అప్పుడతను నీ దగ్గరికి వచ్చి, ‘ఇతన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అంటాడు. అప్పుడు నువ్వు అవమానంతో అక్కడి నుండి లేచి, అన్నిటికన్నా తక్కువ స్థానంలో కూర్చోవాల్సి వస్తుంది.
10 కాబట్టి ఎవరైనా నిన్ను ఆహ్వానించినప్పుడు వెళ్లి అన్నిటికన్నా తక్కువ స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వ్యక్తి వచ్చి, ‘స్నేహితుడా, పై స్థానంలో కూర్చో’ అని నీతో అంటాడు. దానివల్ల అతిథులందరి ముందు నీకు ఘనత కలుగుతుంది.+
11 తనను తాను గొప్ప చేసుకునే ప్రతీ వ్యక్తి తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.”+
12 తర్వాత యేసు తనను ఆహ్వానించిన వ్యక్తితో ఇలా అన్నాడు: “మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు నీ స్నేహితుల్ని గానీ, సహోదరుల్ని గానీ, బంధువుల్ని గానీ, బాగా డబ్బున్న ఇరుగుపొరుగువాళ్లను గానీ పిలవద్దు. ఎందుకంటే, వాళ్లు కూడా నిన్ను భోజనానికి పిలుస్తారేమో; అది నువ్వు చేసినదానికి ప్రతిఫలం అవుతుంది.
13 కానీ నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు పేదవాళ్లను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను, వికలాంగుల్ని ఆహ్వానించు.+
14 అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే, నీకు తిరిగివ్వడానికి వాళ్ల దగ్గర ఏమీ ఉండదు. నీతిమంతుల పునరుత్థానంలో+ నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది.”
15 ఆ మాటలు విన్నప్పుడు అక్కడున్న అతిథుల్లో ఒకతను ఆయనతో ఇలా అన్నాడు: “దేవుని రాజ్యంలో విందు ఆరగించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”
16 యేసు అతనితో ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి గొప్ప విందు ఏర్పాటు చేస్తూ,+ చాలామందిని ఆహ్వానించాడు.
17 విందుకు సమయమైనప్పుడు ఆహ్వానించబడిన వాళ్లతో, ‘అంతా సిద్ధంగా ఉంది, రండి’ అని చెప్పడానికి ఆ యజమాని తన దాసుణ్ణి పంపించాడు.
18 కానీ వాళ్లంతా ఒకేలా సాకులు చెప్పడం మొదలుపెట్టారు.+ ఒక వ్యక్తి, ‘నేనొక పొలం కొన్నాను, వెళ్లి దాన్ని చూడాలి. కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించు’ అన్నాడు.
19 ఇంకో వ్యక్తి, ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. కాబట్టి రాలేను, నన్ను క్షమించు’ అన్నాడు.+
20 మరో వ్యక్తి, ‘నాకు ఈమధ్యే పెళ్లయింది, కాబట్టి నేను రాలేను’ అన్నాడు.
21 ఆ దాసుడు వచ్చి ఆ మాటలన్నిటినీ ఇంటి యజమానికి చెప్పాడు. అప్పుడు ఆ యజమానికి కోపమొచ్చి తన దాసునితో, ‘నువ్వు వెంటనే నగర ముఖ్య వీధుల్లోకి, సందుల్లోకి వెళ్లి పేదవాళ్లను, గుడ్డివాళ్లను, కుంటివాళ్లను, వికలాంగుల్ని ఇక్కడికి తీసుకురా’ అన్నాడు.
22 కాసేపటి తర్వాత ఆ దాసుడు వచ్చి, ‘అయ్యా, నువ్వు చెప్పినట్టు చేశాను. కానీ ఇంకా ఖాళీ ఉంది’ అన్నాడు.
23 కాబట్టి యజమాని ఆ దాసునికి ఇలా చెప్పాడు: ‘నువ్వు నగరం బయట, అలాగే పొలాల మధ్య ఉన్న దారుల్లోకి వెళ్లి అక్కడున్న వాళ్లను రమ్మని బలవంతం చేయి. నా ఇల్లంతా నిండిపోవాలి.+
24 ఎందుకంటే, నేను ముందు ఆహ్వానించిన వాళ్లలో ఏ ఒక్కరూ నా విందును రుచి చూడరని నేను నీతో చెప్తున్నాను.’ ”+
25 ఒకసారి, చాలామంది ప్రజలు యేసుతో పాటు ప్రయాణిస్తున్నారు. ఆయన వాళ్ల వైపు తిరిగి వాళ్లతో ఇలా అన్నాడు:
26 “నా దగ్గరికి వచ్చే వాళ్లెవరైనా సరే తమ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లల్ని, తోబుట్టువుల్ని, చివరికి తమ ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే*+ వాళ్లు నా శిష్యులు కాలేరు.+
27 ఒక వ్యక్తి తన హింసాకొయ్యను* మోస్తూ నన్ను అనుసరించకపోతే అతను నా శిష్యుడు కాలేడు.+
28 ఉదాహరణకు, మీలో ఒక వ్యక్తి భవనం* కట్టాలనుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోడా?
29 అలా లెక్కలు వేసుకోకపోతే, అతను పునాది వేసినా దాన్ని పూర్తి చేయలేకపోవచ్చు. అప్పుడు చూసేవాళ్లందరూ అతన్ని ఎగతాళి చేస్తూ,
30 ‘ఇతను కట్టడం మొదలుపెట్టాడు కానీ పూర్తి చేయలేకపోయాడు’ అంటారు.
31 అలాగే ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధానికి వెళ్తున్నాడనుకోండి. అప్పుడు అతను 20,000 మంది సైన్యంతో తన మీదికి వస్తున్న రాజును తన దగ్గరున్న 10,000 మంది సైన్యంతో ఎదుర్కోగలడా లేదా అని ముందు కూర్చొని సలహా తీసుకోడా?
32 ఒకవేళ ఎదుర్కోలేడంటే, అవతలి రాజు చాలా దూరంలో ఉన్నప్పుడే ఇతను రాయబారుల్ని పంపి ఆ రాజుతో సంధి చేసుకుంటాడు.
33 అదేవిధంగా, మీలో ఎవరైనా తనకు ఉన్నవన్నీ వదులుకోకపోతే అతను నా శిష్యుడు కాలేడు.+
34 “నిజంగానే ఉప్పు చాలా మంచిది. కానీ ఉప్పు దాని రుచి* కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది?+
35 అది మట్టిలో కలపడానికి గానీ, ఎరువుగా గానీ పనికిరాదు. ప్రజలు దాన్ని పారేస్తారు. చెవులు ఉన్నవాడు వినాలి.”+
అధస్సూచీలు
^ లేదా “వాపుతో.”
^ లేదా “ఉపమానం.”
^ లేదా “నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే.”
^ అక్ష., “గోపురం.”
^ లేదా “సారం.”