మొదటి పేతురు 3:1-22

  • భార్యలు, భర్తలు (1-7)

  • సహానుభూతిని చూపించండి, శాంతిని వెదకండి (8-12)

  • నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడడం (13-22)

    • మీ నిరీక్షణ గురించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి (15)

    • బాప్తిస్మం, మంచి మనస్సాక్షి (21)

3  అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడివుండండి.+ అప్పుడు, భర్త ఒకవేళ వాక్యానికి లోబడని వ్యక్తయితే, అతను భార్య మంచి ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే విశ్వాసంలోకి వచ్చే అవకాశం ఉంది.+  ఎందుకంటే మీరు చూపించే ప్రగాఢ గౌరవాన్ని, మీ పవిత్ర ప్రవర్తనను అతను కళ్లారా చూస్తాడు.+  మీరు పైకి కనిపించే అలంకరణ మీద, అంటే జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం+ లేదా ఖరీదైన దుస్తులు వేసుకోవడం మీద దృష్టిపెట్టకండి.  బదులుగా మీ హృదయ అలంకరణ మీద దృష్టిపెట్టండి. ప్రశాంతత, సౌమ్యత అనే లక్షణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి.+ ఈ అలంకరణ చెరిగిపోనిది, దేవుని దృష్టిలో చాలా విలువైనది.  గతంలో దేవుని మీద నిరీక్షణ ఉంచిన భక్తిగల స్త్రీలు తమ భర్తలకు లోబడివుంటూ తమను తాము అలాగే అలంకరించుకునేవాళ్లు.  శారా కూడా అబ్రాహామును, “నా ప్రభువు” అని పిలుస్తూ అతనికి లోబడింది.+ మీరు కూడా మంచి చేస్తూ, భయానికి చోటివ్వకుండా ఉంటే+ ఆమె పిల్లలుగా ఉంటారు.  అలాగే భర్తలారా, మీరు మీ భార్యల్ని అర్థంచేసుకుంటూ* కాపురం చేయండి. స్త్రీలు మీకన్నా బలహీనమైనవాళ్లు, సున్నితమైన పాత్ర లాంటివాళ్లు; అంతేకాదు దేవుడు అపారదయతో ఇచ్చే జీవాన్ని పొందే విషయంలో వాళ్లు మీ తోటి వారసులు.+ కాబట్టి వాళ్లకు గౌరవం ఇవ్వండి.+ అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉంటుంది.  చివరిగా, మీరందరూ ఏకమనస్సు కలిగివుండండి;*+ సహానుభూతిని, సహోదర అనురాగాన్ని, కనికరాన్ని,+ వినయాన్ని చూపించండి.+  మీకు ఎవరైనా హానిచేస్తే తిరిగి వాళ్లకు హానిచేయకండి,+ ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే తిరిగి వాళ్లను అవమానించకండి.+ బదులుగా వాళ్లను దీవించండి,+ ఇందుకోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు మీరు దీవెన పొందుతారు.* 10  ఎందుకంటే లేఖనం ఇలా చెప్తోంది: “జీవాన్ని ప్రేమిస్తూ, ఎన్నో మంచి రోజులు చూడాలనుకునే వ్యక్తి, చెడ్డమాటలు మాట్లాడకుండా నాలుకను, కపటంతో మాట్లాడకుండా పెదాల్ని అదుపులో పెట్టుకోవాలి.+ 11  అతను చెడుకు దూరంగా ఉండాలి,+ మంచి చేయాలి; శాంతిని వెదికి, దాన్ని వెంటాడాలి.+ 12  ఎందుకంటే యెహోవా* కళ్లు నీతిమంతుల్ని చూస్తూ ఉంటాయి, ఆయన చెవులు వాళ్ల ప్రార్థనల్ని* వింటాయి. అయితే యెహోవా* ముఖం చెడ్డపనులు చేసేవాళ్లకు వ్యతిరేకంగా ఉంది.”+ 13  నిజానికి, మీరు మంచిపనుల విషయంలో ఉత్సాహం చూపిస్తే మీకు ఎవరు హానిచేస్తారు?+ 14  మీరు నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడాల్సి వచ్చినా, మీరు సంతోషంగా ఉంటారు.+ అయితే, వాళ్లు భయపడేదానికి మీరు భయపడకండి,* ఆందోళనపడకండి. 15  కానీ మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా, పవిత్రుడిగా స్వీకరించండి. మీ నిరీక్షణ గురించి అడిగే ప్రతీ ఒక్కరికి జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. అయితే, అలా జవాబు ఇస్తున్నప్పుడు సౌమ్యంగా,+ ప్రగాఢ గౌరవంతో మాట్లాడండి.+ 16  మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.+ అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ రకంగానైనా నిందిస్తే, క్రీస్తు శిష్యులుగా మీరు చూపించే మంచి ప్రవర్తన వల్ల+ వాళ్లు సిగ్గుపడతారు. 17  మీరు చెడు చేస్తున్నందుకు బాధలుపడడం కన్నా, మంచి చేస్తున్నందుకు బాధలుపడడం మేలు+ (ఒకవేళ ఆ బాధల్ని దేవుడు అనుమతిస్తే). 18  ఎందుకంటే అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు+ అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే చనిపోయాడు. పాపాల్ని తీసేయడానికి, మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన అలా చనిపోయాడు.+ ఆయన మానవ శరీరంతో చనిపోయాడు, కానీ పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడ్డాడు.+ 19  క్రీస్తు పరలోక సంబంధమైన శరీరంతోనే వెళ్లి, బంధించబడివున్న దేవదూతలకు+ ప్రకటించాడు. 20  ఆ దేవదూతలు నోవహు కాలంలో అవిధేయులయ్యారు. ఆ కాలంలో ఓడ నిర్మించబడుతుండగా+ దేవుడు ఓర్పుతో వేచిచూస్తూ ఉన్నాడు.+ ఆ ఓడలో కొందరే, అంటే ఎనిమిది మంది* మాత్రమే నీటి ద్వారా రక్షించబడ్డారు.+ 21  దానికి పోలికగా ఉన్న బాప్తిస్మం కూడా యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది (బాప్తిస్మం అంటే శరీర మలినాన్ని తీసేసుకోవడం కాదుగానీ, మంచి మనస్సాక్షి+ కోసం దేవునికి చేసుకునే విన్నపం). 22  యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లాడు, దేవుని కుడిపక్కన ఉన్నాడు.+ దేవుడు దేవదూతల్ని, అధికారాల్ని ఆయనకు లోబర్చాడు.+

అధస్సూచీలు

లేదా “మీ భార్యలతో జ్ఞానం ప్రకారం.”
లేదా “ఒకేలా ఆలోచించండి.”
లేదా “దీవెనను స్వాస్థ్యంగా పొందుతారు.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “అభ్యర్థనల్ని.”
లేదా “వాళ్ల బెదిరింపులకు భయపడకండి” అయ్యుంటుంది.
లేదా “ప్రాణాలు.”